అంతర్జాలంలోని అన్నిరకాల ముఖ్యమైన సమాచారాన్ని ఈ సైట్ లో నిక్షిప్తం చేసి, అందరికీ ఉపయోగపడే ఒక వేదికగా ఈ సైట్ ఉండాలనే ఉద్దేశ్యంతో ప్రారంభించడమైంది. ఏ సైట్ నుండి సమాచారం తీసుకున్నా వారి పేరుతోనే ఇందులో వుంచుతాను. సహృదయంతో సహకరించగలరు.
ఎవరికైనా అభ్యంతరముంటే వారి సైటుకు సంబంధించిన సమాచారం తొలగించడం జరుగుతుంది. - ధన్యవాదములతో...

Monday, January 23, 2012

మిరప రైతు కంట నీరు


పడిపోయిన మిర్చి, పసుపు పంట ధరలు 
అప్పుల వూబిలో వ్యవసాయదారులు 
గత ఏడాది అధిక ధరలతో రైతులను ఊరించిన మిర్చి, పసుపు పంటలు ఈ ఏడాది వారిని నిలువునా ముంచాయి. లాభాల మాట దేవుడెరుగు పంటల కోసం వెచ్చించిన ఖర్చులు సైతం తిరిగిరాని పరిస్థితుల్లో సాగుదారులు విలవిలలాడుతున్నాడు. ఇవి వాణిజ్య పంటలన్న సాకుతో సాయం అందించేందుకు ప్రభుత్వమూ ముందుకురావడం లేదు. గతేడాది ఇదే సమయంలో క్వింటా ఎండు మిరపకాయల ధర రూ.10 వేలకు పైగా ఉంది. ఇప్పుడు పంట
రకాలను బట్టి రూ.5800 నుంచి రూ.8 వేలకు మించి ధర పలకడం లేదు. దేశంలోనే మిరప క్రయవిక్రయాలకు వరంగల్‌, గుంటూరు మార్కెట్లు ప్రసిద్ధి. ఇక్కడ గతేడాది పలికిన ధరలు చూసి ఈసారి మధ్యప్రదేశ్‌ రైతులూ పెద్ద ఎత్తున మిర్చీ సాగు చేపట్టారు. పైగా ఆంధ్రప్రదేశ్‌లో పండించే రకాలనే అక్కడా వేయడంతో మార్కెట్‌లో ఈసారి రాష్ట్ర రైతులకు గడ్డు పరిస్థితి నెలకొంది. ఇటీవలి అకాల వర్షాలకు కొంత నష్టపోయిన మిరప రైతుకు ఇప్పుడు ధర కూడా పలకకపోవడంతో ఎటూ పాలుపోని పరిస్థితి ఏర్పడింది. ఆదిలాబాద్‌, కరీంనగర్‌, వరంగల్‌, ఖమ్మం జిల్లాల్లో గోదావరి నది తీర నల్లరేగడి భూముల్లో, గుంటూరు జిల్లాలో పండే మిరపకు దేశవ్యాప్తంగా అధిక డిమాండు ఉంటుంది. గతేడాది మంచి ధర లభించటంతో మిర్చీ సాగుకు ఈ సారి రైతులు పోటీ పడ్డారు. ఫలితంగా ఎకరం పొలం కౌలు రూ.10వేల నుంచి రూ.20వేలకు పెరిగింది. ఇతర ఖర్చులూ తడిచిమోపెడయ్యాయి. గుంటూరు జిల్లా తుళ్లూరు మండలం దొండపాడు రైతు రామచంద్రయ్య 'న్యూస్‌టుడే'తో మాట్లాడుతూ ఎకరం రూ.18 వేల చొప్పున కౌలు చెల్లించి 3.50 ఎకరాలు మిరప వేస్తే పెట్టుబడి ఇప్పటికే రూ.2.50 లక్షలు దాటిందన్నారు. కౌలు సొమ్ము సైతం సీజన్‌కు ముందే అప్పుతెచ్చి చెల్లించామన్నారు. ఇప్పుడు ధర చూస్తే కనీసం పెట్టుబడైనా తిరిగి వస్తుందన్న నమ్మకం లేదని ఆందోళన వ్యక్తం చేశారు.
రాయితీ ఆపేసిన ఉద్యానశాఖ 
మిరప పంట ఉద్యానశాఖ పరిధిలో ఉంది. పండు మిరపకాయలుకోసిన తరవాత పరదాలపై ఎండబెట్టి అమ్మకానికి తీసుకెళితే మంచిధర వస్తుంది. ఈ పరదాలను గతంలో రాయితీపై ఇచ్చేవారు. ఇప్పుడు అది కూడా ఆపేశారు. రైతులకు ఈ శాఖ నుంచి ఎలాంటి సాయం లేదు.
పసుపుపై పలకని కేంద్రం.. 
పసుపు సాగుచేసిన రైతుల పరిస్థితీ ఇదే. గతేడాది పసుపు క్వింటా ధర రూ. 16 వేల వరకూ వెళ్లింది. ఇప్పుడు రూ. 3 వేలకు పడిపోయింది. ప్రభుత్వం జోక్యం చేసుకొని గిట్టుబాటు ధరలకు పసుపును కొనాలని రైతులు కోరుతున్నా ప్రభుత్వం మీనమీషాలు లెక్కిస్తోంది. గిట్టుబాటు ధర (క్వింటాల్‌ రూ.5500) కన్నా మార్కెట్‌ ధర పడిపోతే కలిగే నష్టంలో సగం ఇవ్వాలంటూ కేంద్రానికి ముఖ్యమంత్రి లేఖ రాశారు. దీనిపై సమాధానం కోసం ప్రభుత్వం ఎదురుచూస్తోంది. ఈలోగా రైతులు తీవ్రంగా నష్టపోతున్నారు.

No comments:

Post a Comment