అంతర్జాలంలోని అన్నిరకాల ముఖ్యమైన సమాచారాన్ని ఈ సైట్ లో నిక్షిప్తం చేసి, అందరికీ ఉపయోగపడే ఒక వేదికగా ఈ సైట్ ఉండాలనే ఉద్దేశ్యంతో ప్రారంభించడమైంది. ఏ సైట్ నుండి సమాచారం తీసుకున్నా వారి పేరుతోనే ఇందులో వుంచుతాను. సహృదయంతో సహకరించగలరు.
ఎవరికైనా అభ్యంతరముంటే వారి సైటుకు సంబంధించిన సమాచారం తొలగించడం జరుగుతుంది. - ధన్యవాదములతో...

Friday, January 27, 2012

‘ఉపాధి’లో శ్రమదోపిడీ

* పొరుగు రాష్ట్రాలకంటే మన రాష్ట్రంలో ఉపాధి వేతనం అతి తక్కువ 
* సగటు కూలీ రోజుకు 80 రూపాయలే!
* దాదాపు వెయ్యి పంచాయతీల పరిధిలో రూ.50 నుంచి రూ.70 మాత్రమే
* కర్ణాటకలో లభిస్తున్న కూలీ రూ.124
* పలు రాష్ట్రాల్లో రూ.100కు పైనే
* నెరవేరని సీఎం అదనపు వేతనం హామీ
* డిసెంబర్‌లో అతి తక్కువగా రూ.68 మాత్రమే లభించిన కూలీ
* ఎస్సీ, ఎస్టీలకు పనుల కల్పనలో వివక్ష

హైదరాబాద్, న్యూస్‌లైన్: రాష్ట్రంలోని ఉపాధి హామీ కూలీలకు వేతనాల్లో అన్యాయం జరుగుతోంది. మిగిలిన రాష్ట్రాలతో పోలిస్తే రాష్ట్రంలోని కూలీలకు తక్కువ వేతనం అందుతోంది. కేంద్ర ప్రభుత్వం నిర్దేశించిన వేతనం కంటే కూడా
అతి తక్కువ వేతనం అందుతుండటం శోచనీయం. గత నెలలో ఇది మరీ తక్కువ ఉన్నట్లు అధికారిక లెక్కలే వెల్లడిస్తున్నాయి. డిసెంబర్ నుంచి కూలీలకు అదనంగా వేతనం చెల్లిస్తామని ముఖ్యమంత్రి ప్రకటించారు. అదనపు వేతనం మాట అలా ఉంచితే కేంద్రం నిర్దేశించిన దానికంటే, ఇతర రాష్ట్రాల్లో లభిస్తున్న వేతనం కంటే తక్కువ వేతనం అందుతోందనే వాస్తవం విస్మయానికి గురిచేస్తోంది. రాష్ట్రంలోని ఉపాధి కూలీలకు సగటున రోజుకు 80 రూపాయలు మాత్రమే లభిస్తోంది. అదే కర్ణాటక, తమిళనాడు, పంజాబ్, గుజరాత్, మధ్యప్రదేశ్, మహారాష్ట్ర, బీహార్ వంటి రాష్ట్రాల్లో సగటు రోజు కూలీ రూ.110కు పైనే ఉంటోంది. కేంద్ర ప్రభుత్వం ఉపాధి కూలీలకు రోజు కూలీ రూ.121గా నిర్ణయించిన సంగతి తెలిసిందే. 

వర్షాలు లేక కరువు పరిస్థితుల నేపథ్యంలో భూమి గట్టిగా ఉంటుందని, కూలీలు పనిచేయడం కష్టమని.. అందువల్ల వారికి అదనంగా వేతనం చెల్లిస్తామని ముఖ్యమంత్రి కిరణ్‌కుమార్‌రెడ్డి ప్రక టించారు. డిసెంబర్, జనవరి నెలల్లో 10% శాతం, ఫిబ్రవరిలో 20%, మార్చి, ఏప్రిల్, మే మాసాల్లో 25% అదనపు వేతనం చెల్లిస్తామని చెప్పారు. ఇది రాష్ట్రంలోని ఉపాధి కూలీలందరికీ వర్తిస్తుందని తెలిపారు. కానీ ఇది అమలుకు నోచుకోలేదని అధికారిక లెక్కలు చూస్తే అర్థమవుతోంది. గత డిసెంబర్‌లో రూ.68.02, జనవరిలో రూ.80.5 కూలీ మాత్రమే లభించడం గమనార్హం. అదే పొరుగున ఉన్న కర్ణాటకలో ఆయా నెలల్లో రూ.124.89, 124.88 చొప్పున కూలీ లభించడాన్ని బట్టి మన కూలీలెంత శ్రమదోపిడీకి గురవుతున్నారో అర్థమవుతుంది. 

రాష్ట్రంలోని పలు పంచాయతీల్లో వేతనాలు ఏ విధంగా లభిస్తున్నాయన్నదానిపై ఆ శాఖ అధికారి ఒకరు వివరాలు వెల్లడించారు. రూ.30 నుంచి రూ.50లోపు 94 పంచాయతీలు, రూ.50 నుంచి రూ.70లోపు 969 పంచాయతీలు, రూ.70 కంటే అధికంగా ఇరవై వేల పంచాయతీల్లో వేతనాలు లభిస్తున్నాయి. వేతనాలు తగ్గడానికి కూలీలు చేసిన పనుల కొలతలు సక్రమంగా తీసుకోకపోవడం, లేదా కంప్యూటర్లలో అప్‌లోడ్ చేసే సమయంలో తక్కువ చూపెట్టడం లాంటి సంఘటనలు కారణం అనే అభిప్రాయం వ్యక్తం అవుతోంది. 

కొనసాగుతున్న వివక్ష
మరోపక్క శ్రమశక్తి సంఘాలుగా ఏర్పాటైన ఎస్సీ/ ఎస్టీ సంఘాలకు పనుల కేటాయింపులోనూ తీవ్ర వివక్ష కొనసాగుతున్నట్లు వెల్లడైంది. ఎస్సీ/ఎస్టీ కూలీలకు 50 రోజుల పనిదినాలు కూడా కల్పించలేదని తేలింది. ముందుగానే గుర్తించిన పనుల (షెల్ఫ్ వర్క్స్) నుంచి శ్రమశక్తి సంఘాలకు పనులు అప్పగించాల్సి ఉన్నా.. ఆ మేరకు జరగడం లేదు. ఇటీవల ఎస్సీ/ఎస్టీ సంఘాలకు పని కేటాయింపుపై నిర్వహించిన ఓ సర్వేలో ఈ విషయం బయటపడింది. పనుల కేటాయింపులో వివక్ష ప్రదర్శించిన క్షేత్రస్థాయిలోని సిబ్బంది, అధికారులపై ప్రభుత్వం ఇప్పటివరకు చర్యలు తీసుకోకపోవడం గమనార్హం.

No comments:

Post a Comment