అంతర్జాలంలోని అన్నిరకాల ముఖ్యమైన సమాచారాన్ని ఈ సైట్ లో నిక్షిప్తం చేసి, అందరికీ ఉపయోగపడే ఒక వేదికగా ఈ సైట్ ఉండాలనే ఉద్దేశ్యంతో ప్రారంభించడమైంది. ఏ సైట్ నుండి సమాచారం తీసుకున్నా వారి పేరుతోనే ఇందులో వుంచుతాను. సహృదయంతో సహకరించగలరు.
ఎవరికైనా అభ్యంతరముంటే వారి సైటుకు సంబంధించిన సమాచారం తొలగించడం జరుగుతుంది. - ధన్యవాదములతో...

Friday, January 27, 2012

పత్తికి దళారే తలారి

* నిలిచిన సీసీఐ కొనుగోళ్లు, పట్టించుకోని సర్కారు.. దళారుల ఇష్టారాజ్యం
* 75 కేంద్రాలు ఏర్పాటు చేస్తామన్న సీసీఐ తెరిచింది 16 కేంద్రాలే
* ఉత్పత్తి ఎక్కువగా ఉండే వరంగల్, ఖమ్మం, కర్నూలు, కృష్ణా జిల్లాల్లో ఒక్క కేంద్రం కూడా తెరవలేదు
* ఇప్పటికి కొనుగోలు చేసిన పత్తి 47 వేల క్వింటాళ్లే

హైదరాబాద్, న్యూస్‌లైన్: దళారుల దెబ్బకు పత్తి రైతు చిత్తయిపోతున్నాడు. వ్యాపారుల సిండికేట్ మాయాజాలంలో చిక్కుకుని విలవిల్లాడుతున్నాడు. అంతర్జాతీయ మార్కెట్‌లో పత్తికి డిమాండ్ పెరుగుతున్నా రైతులకు మాత్రం గిట్టుబాటు ధర దక్కడం లేదు. డిమాండ్ పెరుగుతున్నప్పుడు ధర పెరగాల్సి ఉండగా అందుకు విరుద్ధంగా
జరుగుతోంది. పత్తి ధర రోజురోజుకూ తగ్గిపోతోంది. పత్తి మార్కెట్‌కు ప్రసిద్ధి చెందిన వరంగల్ ఎనుమాము ల మార్కెట్‌లో ఈ నెల 23న క్వింటాల్ పత్తి గరిష్ట ధర రూ.4100గా ఉండగా.. రెండురోజుల్లోనే అది రూ.4 వేలకు పడిపోయింది. ఈ ధర కూడా ఎవరో ఒకరిద్దరికి తప్ప అందరికీ దక్కడం లేదు. నాణ్యత లేదని, నల్లగా ఉందంటూ రైతుల్ని నిలువునా ముంచుతున్నారు. కరువు, కరెంటు కోతల నేపథ్యంలో సగం పంటపోయి అసలే దిగులుతో ఉన్న పత్తి రైతుల పరిస్థితి వ్యాపారుల దోపిడీతో దయనీయంగా మారుతోంది. ఇంత జరుగుతున్నా.. మార్కెటింగ్ శాఖ చోద్యం చూస్తోందే తప్ప కనీస చర్యలు తీసుకోవడం లేదు. రైతులను నష్టాలపాలు చేస్తున్న వ్యాపారులకే మేలు చేసేలా సీసీఐ వ్యవహరిస్తోంది.

పేరు గొప్ప.. సీసీఐ!
పత్తి కొనుగోలు కోసం ఈ ఏడాది రాష్ట్ర వ్యాప్తంగా 75 కేంద్రాలు ఏర్పాటు చేస్తామని, సంక్రాంతి తర్వాత పెద్ద ఎత్తున పత్తి కొనుగోలు చేస్తామని ఆర్భాటంగా చెప్పిన కాటన్ కార్పొరేషన్ ఆఫ్ ఇండియా (సీసీఐ) మొక్కుబడిగా 16 కేంద్రాలు మాత్రమే తెరిచింది. పత్తి ఎక్కువగా ఉత్పత్తి అయ్యే వరంగల్, ఖమ్మం, మెదక్, కర్నూలు, కృష్ణా, ప్రకాశం జిల్లాల్లో ఒక్క కేంద్రం కూడా తెరవలేదు. పత్తి రైతులకు గిట్టుబాటు ధర కల్పించడం లక్ష్యంగా పని చేయాల్సిన ఈ సంస్థ రాష్ట్రంలో ఇప్పటికీ రాష్ట్ర వ్యాప్తంగా కేవలం 47 వేల క్వింటాళ్ల పత్తి మాత్రమే కొనుగోలు చేసింది. రైతులకు క్వింటాల్‌కు రూ.7 వేలు వరకు దక్కిన గత ఏడాది ఇదే సమయానికి సీసీఐ ఏకంగా 11.89 లక్షల క్వింటాళ్ల పత్తి కొనుగోలు చేయడం గమనార్హం. 

ఈ ఏడాది మాత్రం వ్యాపారులు దోచుకునేందుకు వీలుగా కొనుగోలు కేంద్రాలు ఏర్పాటు చేయకుండా చోద్యం చూస్తోంది. మరోవైపు వ్యాపారులు మార్కెట్‌కు వచ్చిన దాదాపు మొత్తం 60.31 లక్షల క్వింటాళ్ల పత్తిని కొనుగోలు చేశారు. వ్యాపారులకు సీసీఐ లాంటి సంస్థల పోటీ లేకపోవడంతో రైతులకు గిట్టుబాటు ధర రావడం లేదు. సీసీఐ కేంద్రాలు ఏర్పాటు కాకమునుపు రూ.3,900 పలికిన క్వింటాల్ పత్తి ఆ తర్వాత రూ.4,300 వరకు చేరడం గమనార్హం. పత్తి బాగా మార్కెట్‌కు రావడం మొదలైన తర్వాత.. సీసీఐ కొనుగోళ్లు నిలిపివేయడంతో మళ్లీ ధర తగ్గడం మొదలైంది. పత్తి రైతులకు కనీస మద్దతు ధర కల్పించడం కోసం ప్రభుత్వం ఏర్పాటు చేసిన రాష్ట్ర, జిల్లా స్థాయి కమిటీలు ఉన్నాయో, లేవో కూడా తెలియని పరిస్థితి ఉంది. 

ఉత్పత్తి తగ్గినా...
రాష్ట్రంలో పత్తి సాధారణ విస్తీర్ణం 30 లక్షల ఎకరాలు. గత ఏడాది రికార్డు స్థాయిలో క్వింటాల్‌కు రూ.7 వేల వరకు ధర రావడంతో ఈ ఏడాది పత్తి విస్తీర్ణం బాగా పెరిగింది. 47 లక్షల ఎకరాల్లో ఈ పంటను సాగు చేశారు. ఇంత విస్తీర్ణంలో పత్తి పంట వేయడం రాష్ట్ర చరిత్రలో ఇదే మొదటిసారి. ఇదే అదనుగా ప్రభుత్వం విత్తన కంపెనీలకు లాభం చేకూర్చేలా విత్తనాల ధరను రూ.750 నుంచి రూ.930కి పెంచింది. ఆ తర్వాత పరోక్షంగా బ్లాక్ మార్కెట్‌ను ప్రోత్సహించింది. దీంతో రైతులు రూ.2 వేలు పెట్టి మరీ విత్తనాలు కొనుగోలు చేసి పత్తిని సాగు చేశారు. సరిగ్గా పత్తి పూత, కాత సమయంలో సర్కారు కరెంటు కోతలు విధించడం, తీవ్ర వర్షాభావంతో 34.12 లక్షల ఎకరాల్లో పంట దెబ్బతింది. 

కరువు దెబ్బతో రాష్ట్రంలో పత్తి పంట ఉత్పత్తి 10.23 లక్షల టన్నులు తగ్గి 70 లక్షల టన్నులుగా నమోదైంది. దీంతో పత్తి రైతులు రూ.3 వేల కోట్లు నష్టపోయారు. తీవ్ర వర్షాభావానికి తోడు బీటీ పత్తికి కూడా తెగుళ్లు సోకడంతో మిగిలిన పత్తి పంటలోనూ దిగుబడి బాగా తగ్గింది. గత ఏడాదికి ఎకరాకు సగటున 10 క్వింటాళ్ల పత్తి ఉత్పత్తి కాగా ఈ ఏడాది ఇది నాలుగు క్వింటాళ్లకు పడిపోయింది. గత ఏడాది రాష్ట్రంలో 90 లక్షల క్వింటాళ్ల ఉత్పత్తి కాగా ఇప్పుడు 70 లక్షల క్వింటాళ్లకు పడిపోయింది. ఏ పంటలైనా సరే ఉత్పత్తి తగ్గితే ధర పెరుగుతుంది. కానీ గత ఏడాది కంటే ఉత్పత్తి బాగా తగ్గినా ధరలూ తగ్గడం పత్తి రైతులను ఆందోళనకు గురిచేస్తోంది.

No comments:

Post a Comment