అంతర్జాలంలోని అన్నిరకాల ముఖ్యమైన సమాచారాన్ని ఈ సైట్ లో నిక్షిప్తం చేసి, అందరికీ ఉపయోగపడే ఒక వేదికగా ఈ సైట్ ఉండాలనే ఉద్దేశ్యంతో ప్రారంభించడమైంది. ఏ సైట్ నుండి సమాచారం తీసుకున్నా వారి పేరుతోనే ఇందులో వుంచుతాను. సహృదయంతో సహకరించగలరు.
ఎవరికైనా అభ్యంతరముంటే వారి సైటుకు సంబంధించిన సమాచారం తొలగించడం జరుగుతుంది. - ధన్యవాదములతో...

Tuesday, January 31, 2012

జారుతున్న 'పట్టు'


Tue, 3 Jan 2012, IST  

(ప్రజాశక్తి- అనంతపురం ప్రతినిధి)   

దేశ ఆర్థికాభివృద్ధికి పట్టుగొమ్మయిన వ్వవసాయం ఆటుపోటుల్ని ఎదుర్కొంటోంది. దాని అనుబంధ రంగాలు కూడా సంక్షోభంలో కొట్టు మిట్టాడుతున్నాయి. ఒకప్పుడు రైతుల జీవితాల్లో వెలుగులు నింపిన పట్టు పరిశ్రమ ఇప్పుడు చీకట్లను నింపుతోంది. ప్రభుత్వం విదేశీ శిల్కు దిగుమతికిస్తున్న అనుమతులు ఇక్కడి రైతుల జీవితాల్లో కుంపటి అవుతోంది. దిగుమతి సుంకాలను తగ్గించడం ఇక్కడి రైతుల పట్టు ఉత్పత్తిని గుదిబండగా మారుస్తోంది.


అత్యంత కరువు ప్రాంతంగా చెప్పుకునే అనంతపురం జిల్లాలో ఒకప్పుడు పట్టు పరిశ్రమ దేదిప్యమానంగా వెలిగింది. దేశంలోనే కర్నాటక తరువాత అత్యధికంగా పట్టు ఉత్పత్తి చేసే ప్రాంతంగా అనంతపురం జిల్లా ఉండేది. జిల్లాలో 1993 సంవత్సరంలో 80 వేల ఎకరాల్లో మల్బరీ పంట సాగవుతూ ఉంటే 2007 నాటికి 12 వేల ఎకరాలకే పడిపోయింది. దీనికి ప్రభుత్వ విధానాలే కారణం. దేశంలో విదేశీ శిల్కును దిగుమతి చేసుకునే అవకాశం కల్పించడమే ప్రధాన కారణమవుతోంది. విదేశీ పట్టు దిగుమతిని అనుమతించరాదని రైతుసంఘాలు చేస్తున్న విజ్ఞాపనన ప్రభుత్వ చెవికెక్కడం లేదు.
విదేశీ పట్టుతో పోటీపడగలమా...?
ప్రపంచ వ్యాప్తంగా ఏటా 1,23,000 టన్నుల వరకు పట్టు ఉత్పత్తి అవుతోంది. అందులో 80 శాతం వరకు ఒక్క చైనా దేశంలోనే ఉత్పత్తి జరుగుతోంది. 15 శాతం వరకు ఉత్పత్తి అవుతూ రెండవ స్థానంలో భారతదేశం ఉంది. జపాన్‌, రష్యా, దక్షిణ కొరియా, బ్రెజిల్‌ దేశాలు కూడా పట్టు ఉత్పత్తి చేస్తున్నాయి. దేశీయంగా ఈ రంగంలో కర్నాటక అగ్రస్థానంలో ఆంధ్రప్రదేశ్‌ ద్వితీయ స్థానంలో ఉంది. పశ్చిమ బెంగాల్‌, తమిళనాడు, జమ్మూ, కాశ్మీరుల్లో కూడా పట్టు గూళ్ల పెంపకం సాగుతోంది. ఆంధ్రప్రదేశ్‌లో మాత్రం అనంతపురం, చిత్తూరు జిల్లాలో ప్రధానంగా మల్బరీపంట సాగవుతోంది. అయితే దేశంలోనూ రాష్ట్రంలోను ఉత్పతవుతున్న పట్టు గూళ్లకు తగిన విధంగా మద్దతు ధర లభించడం లేదు. ఒకసారి ఉన్న ధర మరోసారి మార్కెట్‌లో ఉండడం లేదు. విదేశీ పట్టు ముఖ్యంగా చైనాలో ఉత్పత్తయ్యే పట్టు ఎ1 గ్రేడుగా ఉంటోంది. దానికి లభించనంత ధర దేశంలో ఉత్పత్తి అవుతున్న పట్టుకు లభించడం లేదు. దీంతో ఈ పట్టు దిగుమతులను నిలిపేయాలని గతంలో రైతు సంఘాల ఆధ్వర్యంలో పెద్దఎత్తున ఉద్యమాలు జరిగాయి. ఈ ఉద్యమాల్లో అప్పుడు ప్రతిపక్షంలో ఉండగా ఇప్పటి రెవెన్యూశాఖ మంత్రి (గతంలో వ్వవసాయశాఖ మంత్రి) ఎన్‌.రఘువీరారెడ్డి కూడా పాల్గొని మద్దతు తెలిపారు. మార్కెట్‌లో ధరల నిలకడలేమితో సాగు విస్తీర్ణం రానురాను తగ్గుతూ వచ్చింది. ఉదాహరణకు అనంతపురం జిల్లాలో 1993లో 80 వేల ఎకరాల్లో మల్బరీ సాగవుతుంటే 2007 నాటికి 12 వేల ఎకరాల్లోపు పడిపోయింది. రైతు సంఘాల పోరాటాల ఫలితంగా 2005లో ప్రభుత్వం పట్టు గూళ్ల దిగుమతులపై 31 శాతం విదేశీ సుంకాన్ని విధించింది. దీంతో దేశంలో ఉత్పత్తి అవుతున్న పట్టుగూళ్లకు ధరలు క్రమక్రమంగా పెరుగుతూ వచ్చాయి. దేశీ పట్టుగూళ్ల ధరలు కిలో రూ.280 వరకు పలుకుతుండగా విదేశీ పట్టుగూళ్ల ధరలు రూ.300 వరకు ఉంటూ వచ్చాయి. తగిన మద్దతు ధర లభించడంతో రైతులు ఇటీవలి కాలంలో మల్బరీసాగుపై మక్కువ చూపుతున్నారు. ఈ ఏడాది కాలంలోనే ఒక్క అనంతపురం జిల్లాలోనే 15 వేల ఎకరాల వరకు మల్బరీసాగు పెరిగింది.
దిగుమతి సుంకం తొలగింపుతో దేశీపట్టుకు దెబ్బ...
ఇంతకాలం దేశ అవసరాలకు తగ్గట్టు పట్టుగూళ్ల ఉత్పత్తి లేకపోవడంతో విదేశీ పట్టు దిగుమతి చేసుకోవాల్సి వచ్చేంది. 25 వేల మెట్రిక్‌ టన్నుల పట్టు దేశంలో అవసరముండగా ఇప్పటి వరకు 17 వేల మెట్రిక్‌ టన్నుల వరకు మాత్రమే ఉత్పత్తి అయ్యేది. దీంతో పదివేల మెట్రిక్‌ టన్నుల వరకు విదేశీ శిల్కును దిగుమతి చేసుకోవాల్సి వచ్చేది. దీనిపై దిగుమతి సుంకం 31 శాతం ఉండటంతో ఇక్కడి రైతులకు ఎటువంటి సమస్య లేకుండా ఉండేది. ఇక్కడి పట్టుకూ మంచి ధరే లభిస్తూ వచ్చింది. దీంతో గత కొంత కాలంగా రైతులు విరివిగా మల్బరీ సాగుపై దృష్టి సారించారు. మూడు, నాలుగు నెలలో ఇక విదేశీ శిల్కుపై ఏ మాత్రం ఆధారపడకుండా లోటు పూరించవచ్చునను కుంటున్నతరుణంలో ప్రభుత్వం దిగుమతి సుంకాన్ని 26 శాతం తగ్గించడం పట్టు రైతుల పాలిట శాపంగా మారింది. దిగుమతి సుంకం ఐదు శాతం తగ్గించిన వలన నిన్న మొన్నటి వరకు క్వింటాలు రూ.3000లు పలికిన విదేశీ శిల్కు ధర ఉన్నఫలంగా రూ.2200లకే దేశీ మార్కెట్‌లో లభిస్తోంది. ఎ1 గ్రేడు అయిన విదేశీ శిల్కు ధర ఇంత తక్కువకు లభించడంతో దేశీయంగా ఉత్పత్తి అవుతున్న పట్టు ధర కూడా కిలో రూ.2000లోపుకు పడిపోనుంది. ఇది రైతుకు ఏ మాత్రం గిట్టుబాటు లభించదు.
కొండనాలుకకు మందు వేస్తే...
'ఉన్న నాలుకకు మందుపెట్టమంటే కొండనాలుకకు మందేసిన' చందంగా తయారయింది ప్రభుత్వ విధానాలు. దేశీ అవసరాలకు సరిపడ పట్టు ఉత్పత్తి లేకపోతే రైతులను మరిన్ని ప్రోత్సాహకాలు అందించి ప్రోత్సహించాలి. అలా చేయకుండా మొత్తం పట్టు పరిశ్రమనే దెబ్బతిసే విధానాలను ప్రభుత్వం అనుసరిస్తోందన్న విమర్శలు వ్యక్తమవుతున్నాయి. చేనేత పరిశ్రమను ఆదుకునే పేరుతో విదేశీ పట్టు దిగుమతులపై సుంకాన్ని ఎత్తివేస్తున్నామనడం సరైంది కాదని రైతు సంఘాల నాయకులు మండిపడుతున్నారు. సుంకాన్ని ఎత్తేయడం ద్వారా ప్రయోజనం చేకూరేది చేనేత కార్మికులకు కాదని ట్రేడర్లకేనని అంటున్నారు. సూరత్‌, అహ్మదాబాద్‌ తదితర ప్రాంతాల్లోనున్న ట్రెడర్ల ఒత్తిళ్లకు తలొగ్గే ప్రభుత్వం ఈ నిర్ణయం తీసుకుందని రైతుసంఘాల నాయకులు ఆరోపిస్తున్నారు. ఒకవేళ చేనేత కార్మికులకే లబ్ధి చేకూర్చాలనుకుంటే ప్రభుత్వమే కొనుగోలు చేసి సబ్సిడీ ధరకు ముడిసరుకు అందివ్వొచ్చని సూచిస్తున్నారు.

No comments:

Post a Comment