అంతర్జాలంలోని అన్నిరకాల ముఖ్యమైన సమాచారాన్ని ఈ సైట్ లో నిక్షిప్తం చేసి, అందరికీ ఉపయోగపడే ఒక వేదికగా ఈ సైట్ ఉండాలనే ఉద్దేశ్యంతో ప్రారంభించడమైంది. ఏ సైట్ నుండి సమాచారం తీసుకున్నా వారి పేరుతోనే ఇందులో వుంచుతాను. సహృదయంతో సహకరించగలరు.
ఎవరికైనా అభ్యంతరముంటే వారి సైటుకు సంబంధించిన సమాచారం తొలగించడం జరుగుతుంది. - ధన్యవాదములతో...

Thursday, April 16, 2015

కలిసికట్టుగా నష్టనివారణ (హైదరాబాద్ శివార్లలో 'బర్డ్‌ ఫ్లూ'పై)


భాగ్యనగర శివార్లలో 'బర్డ్‌ ఫ్లూ' ఆనవాళ్లు బయటపడటం రెండు తెలుగు రాష్ట్రాల్నీ కలవరపరుస్తోంది. రంగారెడ్డి జిల్లా హయత్‌నగర్‌ ప్రాంతాన రెండు రోజుల్లోనే 18వేల కోళ్లు 'బర్డ్‌ ఫ్లూ' వల్ల మృత్యువాత పడ్డట్లు వైద్య పరీక్షల్లో నిర్ధారణ కాగానే, తెలంగాణ ప్రభుత్వం రంగంలోకి దూకింది. తక్షణం ఆంధ్రప్రదేశ్‌నూ అప్రమత్తం చేసింది. కోళ్లు, బాతుల వంటి వాటి ద్వారా మనుషులకూ సంక్రమించే ఎవియన్‌ ఇన్‌ఫ్లుయెంజా(హెచ్‌5ఎన్‌1) వ్యాప్తిని అరికట్టే యత్నాలు వెంటనే మొదలయ్యాయి. వైరస్‌ సోకిన పౌల్ట్రీ క్షేత్రం చుట్టూ కిలోమీటరు పరిధిలోని దాదాపు రెండులక్షల కోళ్లను, గుడ్లను సైతం పూడ్చిపెట్టి షెడ్లను పరిశుద్ధీకరించే పని యుద్ధప్రాతిపదికన పట్టాలకు ఎక్కింది. ప్రతినెలా సుమారు నాలుగు కోట్ల కిలోల కోడిమాంసం, 90కోట్ల గుడ్ల పౌల్ట్రీ వ్యాపారం జరిగే తెలంగాణలో- 18గ్రామాల పరిధిలోనే దిద్దుబాటు చర్యలు సరిపోవు. రెండు తెలుగు రాష్ట్రాల్లోనూ కలిపి ఏటా రూ.20వేల కోట్ల మేర పౌల్ట్రీ వ్యాపారం సాగుతున్నదని అంచనా. హైదరాబాద్‌, రంగారెడ్డి జిల్లాలే తెలంగాణ పౌల్ట్రీ రాబడిలో 50శాతానికి పైగా సమకూరుస్తుండగా- కృష్ణా, గుంటూరు, చిత్తూరు, ఉభయ గోదావరి జిల్లాలు ఆంధ్రప్రదేశ్‌కు ఆ పద్దులో మూడొంతులకు పైగా ఆర్జిస్తున్నాయి. తెలంగాణ పౌల్ట్రీ ఉత్పత్తుల్ని ఆంధ్రప్రదేశ్‌ మీదుగా ఈశాన్య రాష్ట్రాలకు తరలిస్తుంటారు. 'బర్డ్‌ ఫ్లూ' ఉత్పాతం నేపథ్యంలో వైరస్‌ వ్యాప్తిని కట్టడి చేసే నిమిత్తం నెల్లాళ్లపాటు రవాణాపై ఆంక్షలు అమలుపరుస్తామంటున్నారు. క్షేత్రస్థాయి సిబ్బందికి మందుల పంపిణీ, శిక్షణ, ప్రభావిత ప్రాంతాల్లో విస్తృత జనచేతన కార్యక్రమాలు తదితరాలన్నింటా పరస్పర సమన్వయంతో తెలుగు రాష్ట్రాలు ముందడుగేయాలి! 'బర్డ్‌ ఫ్లూ' భయాందోళనలు ఇంతలంతలై లోగడ కాంబోడియా, ఇండొనేసియా, లావోస్‌, దక్షిణ కొరియా, తైవాన్‌, వియత్నాం, థాయ్‌లాండ్‌ లాంటిచోట్ల పౌల్ట్రీ వ్యాపారం కకావికలమైంది. భారీయెత్తున నష్టాలపాలైంది. దేశీయంగానూ మునుపటి చేదు అనుభవాల దృష్ట్యా 'ఎవియన్‌ ఇన్‌ఫ్లుయెంజా' పేరెత్తితేనే ఎందరో హడలెత్తిపోతున్నారు. వైద్యశాస్త్ర పరిశోధనల ప్రకారం, బర్డ్‌ ఫ్లూ వైరస్‌లో ఎకాయెకి 128 వర్గీకరణలున్నాయి. ఈజిప్ట్‌, కాంబోడియా, ఇండొనేసియా ప్రభృత దేశాల్లో ఆ వైరస్‌ మనుషుల ప్రాణాల్నీ కర్కశంగా తోడేసింది. పదేళ్లక్రితం బర్డ్‌ ఫ్లూ ముప్పును గుర్తించగానే బీజింగ్‌ అంతటా పౌల్ట్రీ వ్యాపారంపై ఆంక్షలు ప్రకటించి, సత్వరమే పరిస్థితిని అదుపులోకి తెచ్చిన చైనా- నష్టాన్ని కనిష్ఠ స్థాయికి పరిమితం చేయగలిగింది. అటువంటిచోటా హెచ్‌7ఎన్‌9 రకం వైరస్‌ మూడు నెలలక్రితం ఇద్దరు చైనీయుల్ని బలిగొంది. బర్డ్‌ ఫ్లూ పోరులో అనుక్షణం అప్రమత్తంగా ఉండాల్సిందేనని చైనా అనుభవం చాటుతోంది. మన దేశంలో ఆ తరహా జననష్ట ఉత్పాతాలు సంభవించే అవకాశాలు అతిస్వల్పమనడానికి, భారతీయుల ఆహారపుటలవాట్లే కారణం. 70 సెంటీగ్రేడ్‌ డిగ్రీల ఉష్ణోగ్రత వద్ద ఉడికించిన ఏ పదార్థంలోనూ వ్యాధికారక వైరస్‌ మనలేదని ప్రపంచ ఆరోగ్య సంస్థ ధ్రువీకరించింది. వ్యాధి సోకిన కోళ్లను, వైరస్‌ ప్రభావితమయ్యే అవకాశమున్నట్లు అనుమానించిన వాటిని ప్రభుత్వ యంత్రాంగం పూడ్చిపెట్టేస్తోంది. మాంసాన్ని, గుడ్లను ఉడకబెట్టి తింటే ఏ ప్రమాదమూ ఉండదంటున్న నిపుణుల సూచనలను విస్తృతంగా ప్రచారం చేయాల్సిన బాధ్యతనూ ప్రభుత్వాలు గుర్తించాలి. కల్పిత భయాలు, అనవసర ఆందోళనలతో బెంబేలెత్తిపోవడం సామాజికంగా మరిన్ని సమస్యలు తెచ్చిపెడుతుంది. శాస్త్రీయ కార్యాచరణతో బర్డ్‌ ఫ్లూ నియంత్రణ, పౌల్ట్రీ పరిశ్రమకు సాంత్వన సాకారమయ్యేందుకు పాలకులు స్థిమితంగా వ్యవహరించాల్సిన తరుణమిది!
అయిదు నెలలక్రితం కేరళలోని అలప్పు ఝా, కొట్టాయం జిల్లాల్లో 'బర్డ్‌ ఫ్లూ' కోర సాచినప్పుడు వైరస్‌ సోకిన బాతులు, కోళ్లను పెద్దయెత్తున మట్టుపెట్టారు. పొరుగున కర్ణాటకా, వైరస్‌ వ్యాప్తి చెందకుండా సకల జాగ్రత్తలు తీసుకోవడం భారీ ముప్పును నివారించింది. గత నెలలో యూపీ, అమేథీ జిల్లాలో హెచ్‌5ఎన్‌1 కేసు నమోదు కావడంతోనే, కేంద్రప్రభుత్వం స్థానిక యంత్రాంగాన్ని ఉరకలెత్తించింది. అటువంటి సన్నద్ధతే, సాంక్రామిక సంక్షోభాన్ని వెన్నంటి దాపురించే ఎన్నో ఇక్కట్లను సమర్థంగా అడ్డుకోగలుగుతుంది! కోళ్ల పరిశ్రమ అమాంతం నష్టాల వూబిలో కూరుకుపోవడం తాలూకు దుష్పరిణామాలు వూహించనలవి కాదు. కోడిమాంసం, గుడ్ల వ్యాపారులతోపాటు రవాణారంగం; సజ్జ, జొన్న, మొక్కజొన్న రైతాంగం, దాణా ఉత్పత్తిదారులు- కష్టనష్టాలపాలు కాక తప్పదు. పౌల్ట్రీ యజమానులకు నష్టపరిహారం అందజేత ఒక్కటే వీటికి విరుగుడు కాదు. ఆ మధ్య ఎబోలా వైరస్‌ దేశంలో చొరబడకుండా విమానాశ్రయాలు, నౌకాశ్రయాల్లో తనిఖీ, గస్తీలను చైనా ముమ్మరం చేయడం సత్ఫలితాలిచ్చింది. విస్తృత జనచేతన కార్యక్రమాలు వడివడిగా అమలుపరచిన సెనెగల్‌, నైజీరియాల్లోనూ ఆ వైరస్‌ తోక ముడిచింది. బర్డ్‌ ఫ్లూ విజృంభణను అరికట్టడంలోనూ అటువంటి ప్రణాళికబద్ధ వ్యూహమే కావాలిప్పుడు. ఇతర ఆసియా దేశాలు వేటితో పోల్చినా కోళ్ల పరిశ్రమ నిర్వహణలో భారత్‌ ఎంతో ముందుంది. దేశీయంగా తక్కిన రాష్ట్రాలతో పోలిస్తే ఆంధ్రప్రదేశ్‌, తెలంగాణ సమధికంగా పౌల్ట్రీ లాభాలు రాబడుతున్నాయి. బర్డ్‌ ఫ్లూ దాడిని కాచుకోవడంలోనూ రెండు తెలుగు రాష్ట్రాలూ తెగువ కనబరచాలి. భయం గుప్పిట్లో పౌల్ట్రీ రంగం విలవిల్లాడే దురవస్థను, అవి ఉమ్మడి కార్యాచరణతో తప్పించాలి!

No comments:

Post a Comment