అంతర్జాలంలోని అన్నిరకాల ముఖ్యమైన సమాచారాన్ని ఈ సైట్ లో నిక్షిప్తం చేసి, అందరికీ ఉపయోగపడే ఒక వేదికగా ఈ సైట్ ఉండాలనే ఉద్దేశ్యంతో ప్రారంభించడమైంది. ఏ సైట్ నుండి సమాచారం తీసుకున్నా వారి పేరుతోనే ఇందులో వుంచుతాను. సహృదయంతో సహకరించగలరు.
ఎవరికైనా అభ్యంతరముంటే వారి సైటుకు సంబంధించిన సమాచారం తొలగించడం జరుగుతుంది. - ధన్యవాదములతో...

Monday, January 23, 2012

పత్తి విత్తనాలకు పాత ధరే!

సర్కారుకు ప్రతిపాదించిన వ్యవసాయ శాఖ - నెలాఖరులోగా ప్రభుత్వ నిర్ణయం

రానున్న ఖరీఫ్‌లో రైతులకు విక్రయించే పత్తి విత్తనాల ధరలు పెంచకూడదని పేర్కొంటూ వ్యవసాయ శాఖ రాష్ట్ర ప్రభుత్వానికి ప్రతిపాదనలు పంపించింది. పత్తి విత్తనాలపై కంపెనీలు ఇచ్చిన ఉత్పత్తి ఖర్చులు, రైతు సంఘాల విజ్ఞప్తులు, వ్యవసాయ వర్సిటీ శాస్త్రవేత్తల అభిప్రాయాలతో వ్యవసాయ శాఖ ప్రతిపాదనలను రూపొందించింది. గత
ఖరీఫ్‌లో ఉన్నట్లుగానే బీటీ2 పత్తి విత్తనాల ప్యాకెట్ గరిష్ట చిల్లర అమ్మకం(ఎంఆర్‌పీ) రూ.930, బీటీ1 విత్తనాల ధర రూ.830 ఉండాలని పేర్కొంది. కరువుతో ఎక్కువగా నష్టపోయింది పత్తి రైతులే కాబట్టి విత్తన ధరలను పెంచి వారిపై మరింత భారం వేయకూడదనే ఉద్దేశంతో ఈ ప్రతిపాదనలు చేసినట్లు తెలిసింది.

‘పత్తి విత్తనాలకు సంబంధించి 450 గ్రాముల బీటీ విత్తనాలతోపాటు తెగుళ్ల నియంత్రణ కోసం 150 గ్రాముల(చిన్న ప్యాకెట్) నాన్ బీటీ పత్తి విత్తనాలు ఇవ్వాలనేది నిబంధన. ఈ నాన్‌బీటీ విత్తనాల ధర రూ.90 ఉంటోంది. రెండు రకాల విత్తనాలను కలిపే వ్యవసాయ శాఖ ఎంఆర్‌పీ నిర్ధారిస్తుంటుంది. అయితే చాలా విత్తన కంపెనీలు రూ.90 విలువైన నాన్ బీటీ పత్తి విత్తనాలకు బదులుగా రూ.20 విలువ చేసే కంది విత్తనాలను ఇస్తున్నాయి. కంది విత్తనాలను ఇచ్చే కంపెనీలకు విత్తన ప్యాకెట్ ధరను రూ.70 తగ్గించాలి’ అని వ్యవసాయ శాఖ ప్రతిపాదనల్లో వివరించింది. ఈ ప్రతిపాదనలపై ప్రభుత్వం ఈ నెలాఖరులోగా నిర్ణయం తీసుకునే అవకాశం ఉంది.

సర్కారు ఏం చేస్తుందో: వ్యవసాయ శాఖ ప్రతిపాదనలు తమకు వ్యతిరేకంగా ఉండడంతో గత ఏడాదిలాగే ఇప్పుడూ ప్రభుత్వ పెద్దలను మచ్చిక చేసుకునే దిశగా విత్తన కంపెనీలు ప్రయత్నిస్తున్నాయి. గత ఖరీఫ్‌లోనూ విత్తన కంపెనీలు ప్రభుత్వ పెద్దలను ఒప్పించే విత్తన ధరలను పెంచుకున్నాయి. కంపెనీల ఒత్తిడితోనే రాష్ట్రంలో ఆరేళ్ల తర్వాత కిరణ్‌కుమార్‌రెడ్డి ప్రభుత్వం గత ఖరీఫ్‌లో బీటీ విత్తనాల ధరలను పెంచింది. అంతకుముందు రూ.750 ఉన్న బీటీ2 పత్తి విత్తనాల ధరను రూ.930కి, రూ.650 ఉన్న బీటీ1 విత్తనాల ధరను రూ.830కి పెంచింది. దీంతో పత్తి రైతులపై ఒక్క ఏడాదిలోనే ఏకంగా రూ.180 కోట్ల భారం పడింది. ఇప్పుడు సర్కారు తీరు ఎలా ఉంటుందోనని రాష్ట్రంలో పత్తి పంటను సాగు చేసే 70 లక్షల మంది రైతుల్లో ఆందోళన మొదలైంది.

No comments:

Post a Comment