prajasakti Tue, 31 Jan 2012, IST
- ప్రభుత్వ ఉద్యోగాల్లో ఆరు శాతమే
- చట్టాలను కచ్చితంగా అమలు చేయాలి
- ప్రజాశక్తితో కె స్వరూపరాణి
సరళీకరణ విధానాలతో మహిళలపై భారాలు పెరుగుతున్నాయని సిపిఎం రాష్ట్ర కమిటీ సభ్యురాలు, ఐద్వా రాష్ట్ర ప్రధాన కార్యదర్శి కె స్వరూపరాణి అన్నారు. మహిళాభివృద్ధి కోసం ప్రత్యేక పథకాలు ప్రవేశ పెడుతున్నామంటూ కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు ఉదరగొడుతున్నా క్షేత్రస్థాయిలో మాత్రం మహిళాభివృద్ధి అంతంతమాత్రంగానే ఉంది. రాష్ట్రంలో,
కేంద్రంలో మహిళలు సారధ్యం వహిస్తున్నా మహిళా శిశుసంక్షేమ శాఖకు నిధులు కూడా సవ్యంగా వెచ్చించడం లేదు. ప్రభుత్వ పథకాలు కింది స్థాయి వరకు మహిళలకు అందేలా అవగాహన కార్యక్రమాలు చేపట్టి ప్రచారం కల్పించాల్సిన అవసరం ఉందని ఆమె అన్నారు. రాష్ట్రంలో మహిళలు ఎదుర్కొంటున్న సమస్యలపై స్వరూపరాణి ప్రజాశక్తికి ఇంటర్వ్యూ ఇచ్చారు. ఆ వివరాలు....
రాష్ట్రంలో మహిళాభివృద్ది ఎలా ఉంది?
మహిళా కోణంలో చూస్తే సాధికారత అనేది అవాస్తవం, ఈ నాటికీ మహిళలు ద్వితీయ శ్రేణి పౌరులుగానే ఉన్నారు. సామాజికంగా, ఆర్థికంగా, మహిళలు అభివృద్ధి చెందినప్పుడే మహిళాభివృద్ది సాధ్యమౌతుంది. సరళీకరణ విధానాల తర్వాత మహిళలపై భారాలు పెరుగుతున్నాయి. వ్యవసాయ రంగం సంక్షోభంలోకి కూరుకుపోవడం, వాణిజ్య పంటలపై ఎక్కువగా ఆసక్తిని కనబరుస్తుండటంతో మహిళల పనిదినాలు తగ్గుముఖం పట్టాయి. ప్రభుత్వం మద్యాన్ని ఆదాయ వనరుగా భావించి విచ్చల విడిగా మద్యాన్ని ప్రోత్సహిస్తుండడంతో అనేక కుటుంబాలు తీవ్రంగా నష్టపోతున్నాయి.
మహిళలు విద్యా, ఉద్యోగ పరంగా ఎలాంటి అభివృద్ధి సాధించారు?
మహిళలు ఉద్యమాలు చేపట్టి విద్యా, ఉద్యోగాల్లో 33 శాతం రిజర్వేషన్ సాధించుకున్నారు. కాని ప్రభుత్వ పాఠశాలలను మూసి వేసే దిశగా సర్కారు కార్పొరేట్ విద్యను ప్రోత్సహిస్తుంది. ఫలితంగా పేద, బడుగు, బలహీన వర్గాల విద్యార్థులు, ముఖ్యంగా మహిళలు విద్యకు దూరమవుతున్నారు. ఆర్థిక కారణాల వల్ల ఎంతో మంది ఉన్నత చదువులను మధ్యలోనే అపేస్తున్నారు. ఇక ఉద్యోగ విషయానికి వస్తే ప్రభుత్వ రంగంలో ఆరు శాతం మంది మహిళలు మాత్రమే పనిచేస్తున్నారు. మిగితా 94 శాతం మంది మహిళలు అసంఘటిత రంగంలోనే ఉన్నారు. ఉద్యోగ భద్రత, కనీస వేతనాలు కూడా అమలు చేయని రంగాలలో పని చేస్తూ అనేక అవస్థలు పడుతున్నారు. పిఎఫ్, ఇఎస్ఐ, ప్రసూతి సెలవులు కూడా ఆయా సంస్థలు కల్పించడం లేదు.
పార్లమెంట్లో మహిళా బిల్లు ఒక్క అడుగు ముందుకు, ఆరడుగులు వెనక్కి నడుస్తోంది. దీనికి కారణం?
బిల్లు ఆమోదం పొందితే చట్ట సభల్లో మహిళలకు 181 సీట్లు కేటాయించాల్సి వస్తుంది. వామపక్షాలు మాత్రం నిలకడగా మహిళాబిల్లు కోసం పోరాడుతున్నాయి. అయితే పురుషుల పలుకుబడి తగ్గిపోతుందన్న భయంతో అధికార పార్టీ, కొన్ని విపక్ష పార్టీలు బిల్లును అడ్డుకుంటున్నాయి. బిల్లు ఆమోదం కోసం ఏకాభిప్రాయ సాధన అంటూ కాంగ్రెస్ నేతృత్వంలోని యుపిఎ కాలయాపన చేస్తోంది. అణు ఒప్పందం చేసుకోవడానికి మాత్రం ప్రభుత్వానికి ఏకాభిప్రాయం అవసరం రాలేదు. ఈ బిల్లును అడ్డుకోవడానికే కొన్ని పార్టీలు సాకులు చెప్పి తప్పించుకుంటున్నాయి. బిల్లు ఆమోదం కోసం పార్లమెంట్లో ఓటింగ్ పెట్టాలి. అప్పుడే అసలు రంగు బయటపడుతుంది.
స్త్రీనిధి రుణాలు, స్వయం సహాక గ్రూపుల వల్ల మహిళలు ఏ మేరకు అభివృద్ధి చెందారు?
రాష్ట్ర ప్రభుత్వం ఓట్ల కోసమే బూటకపు మాటలు చెబుతోంది. మహిళా రుణాల కోసం రూ. 850 కోట్లు అవసరం కాగా రాష్ట్ర ప్రభుత్వం కేవలం రూ. 200 కోట్ల నిధులు మాత్రమే కేటాయిస్తోంది. రుణాలు మంజూరుకు ప్రభుత్వం షరతులు విధిస్తోంది. దీంతో రుణాలు కొద్ది మందికే దక్కుతున్నాయి. బెడ్జెట్లో తగిన నిధులు కేటాయించకుండా స్త్రీనిధి రుణాలు ఎలా ఇస్తారు? మహిళలను మోసం చేయడానికే ప్రభుత్వం అసత్య ప్రచారం చేస్తోంది. ఒకో సంఘానికి రుణాలు మంజూరు చేసేందుకు పదివేలు డిపాజిట్ చేయాలంటూ నిబంధనలు విధిస్తున్నారు. దీని వల్ల ఎస్సీ, ఎస్టీ మహిళలకు రుణాలు అందడం లేదు. డ్వాక్రా పథకం ఫలితాలూ పెద్దగా లేవు.
రాష్ట్రంలో మహిళలపై అత్యాచారాలు, హత్యలు అధికమయ్యాయి. దీనిని ఎదుర్కోవడం ఎలా?
ప్రపంచీకరణతో మహిళలపై అత్యాచారాలు అధికమయ్యాయి. ప్రేమ పేరిట ఉన్మాద దాడులు, పనిచేసే ప్రదేశాల్లో లైంగిక వేధింపులకు మహిళలు గురవుతున్నారు. మహిళను ఒక వస్తువులా చూస్తుండటం వల్లనే వరకట్న తదితర సమస్యలు తలెత్తుతున్నాయి. వ్యాపార ప్రకటనల్లో మహిళలను అశ్లీలంగా చూపడం లాంటి వాటిని అరికట్టాలి. సెల్ ఫోన్, ఇంటర్నెట్ లాంటివాటితో జరిగే సైబర్ నేరాలపై పోలీసుల నిఘా పెరగాలి. ప్రభుత్వం ఉన్న చట్టాలను నీరు గారుస్తోంది. 498ఏ లాంటి చట్టాలను నీర్విర్యం చేయలని న్యాయశాఖ ఆలోచిస్తోంది. మహిళలపై దాడులను అరికట్టేందుకు కఠినమైన చట్టాలను తీసుకురావాలి. సినిమాల్లో అసభ్యకర సన్ని వేశాలను చూపించకుండా సెన్సార్ను మరింత కట్టుదిట్టం చేయాలి. చట్టాలు పకడ్బందిగా అమలైతే మహిళలపై దాడులను కొంతవరకు అరికట్టవచ్చు.
మహిళా రక్షణకు ఎలాంటి చర్యలు తీసుకోవాలి?
ముందుగా మహిళల్లో ఆత్మస్థైర్యం నింపేటటువంటి చర్యలను చేపట్టాలి. స్వీయరక్షణకు కరాటే తదితర మార్షల్ ఆర్ట్స్లో మహిళలకు అవగాహన కల్పించాలి. ప్రతి కళాశాలలో వయస్సులో వచ్చే మార్పులను అర్థం చేసుకునేలా మానిసిక నిపుణుల చేత కౌన్సిలింగ్ ఇప్పించాలి. పాశ్చాత్య సంస్కృతి ప్రభావాల బారిన పడకుండా తల్లిదండ్రులూ చొరవ చూపాలి. సినిమాల్లో స్త్రీలను కించపర్చే సన్నివేశాలను అరికట్టాలి.
మహిళా ఉద్యమాలకు స్పందన ఎలా ఉంది?
నిత్యం మహిళలపై ఎక్కడో ఓ చోట వేధింపులు కొనసాగుతూనే ఉన్నాయి. సంఘటన జరిగిన వెంటనే నిందితులపై కఠిన చర్యలు తీసుకోకుండా ప్రభుత్వ యంత్రాంగం ఉదాసీన వైఖరిని ప్రదర్శిస్తుండడం వల్ల మహిళలపై వేదింపులు, దాడులు జరుగుతూనే ఉన్నాయి. వీటన్నింటికి వ్యతిరేకంగా ఐద్వా పెద్ద ఎత్తున ఉద్య మిస్తూనే ఉంది. కేవలం మహిళలు ఉద్యమించినంత మాత్రానే సరిపోదు. ప్రజలు, సంఘాలు, పార్టీలు మహిళా సంఘాల పోరాటాలకు మద్దతుగా ముందుకు రావాలి.
మహిళా సమస్యలపై రాబోయే మహాసభల్లో ఏయే అంశాలను చర్చించబోతున్నారు?
రాష్ట్రంలో హోంశాఖామాత్యులుగా ఒక మహిళ ఉన్నప్పటికీ మహిళలు, విద్యార్థులపై వేధింపులు, దాడులు కొనసాగుతూనే ఉన్నాయి. ముఖ్యమంత్రులు మారుతున్నా మహిళల స్థితిగతుల్లో మార్పులేదు. రుణాల పేరిట ఊరిస్తున్నా రతప్ప మహిళలకు దక్కింది నామమాత్రం. మహిళా సమస్యలను చర్చించి వారి హక్కుల రక్షణకు చేపట్టవలసిన ఉద్యమాలకు రూపకల్పన చేస్తాం. అయితే మహిళా విముక్తి మొత్తం వ్యవస్థలో మార్పు ద్వారానే సాధ్యం అన్నది మరువరాదు.
No comments:
Post a Comment