అంతర్జాలంలోని అన్నిరకాల ముఖ్యమైన సమాచారాన్ని ఈ సైట్ లో నిక్షిప్తం చేసి, అందరికీ ఉపయోగపడే ఒక వేదికగా ఈ సైట్ ఉండాలనే ఉద్దేశ్యంతో ప్రారంభించడమైంది. ఏ సైట్ నుండి సమాచారం తీసుకున్నా వారి పేరుతోనే ఇందులో వుంచుతాను. సహృదయంతో సహకరించగలరు.
ఎవరికైనా అభ్యంతరముంటే వారి సైటుకు సంబంధించిన సమాచారం తొలగించడం జరుగుతుంది. - ధన్యవాదములతో...

Friday, January 20, 2012

నేనూ, చాసో, మా విజయనగరం


నేనూ, చాసో, మా విజయనగరం

'ఎ షార్ట్ స్టోరీ డీల్స్ విత్ ఎ సింగిల్ సిట్యుయేషన్' అంటూ ఏ మేరకు వస్తువును స్వీకరించాలో ఓ రెండు గంటల పాటు చెప్పుకొచ్చారు చాసో. తను రాసిన పరబ్రహ్మం, కుక్కుటేశ్వరం కథల గురించి వివరించారు. కరెక్టేననిపించింది. ఆయన చెప్పినట్టుగానే, ఆయన రాసినట్టుగానే కథ రాసి ఓ చల్లచల్లని సాయంత్రం వేళ వినిపించానతనికి.
"ఎలా ఉంది? అచ్చు మీరు రాసినట్టుగా లేదూ!'' అన్నాను.
"నేను రాసినట్టుగా మీరెందుకు రాయడం? నా కథలేవో నేనేడుస్తాను. మీ కథలు మీరేడవండి.'' అన్నారు.





ఇంటర్మీడియట్ పాసయ్యాను. డిగ్రీలో జాయినవ్వాలి. ఎక్కడ? ఇటు శ్రీకాకుళంలోనా? అటు విజయనగరంలోనా? ఎక్కడ జాయినయితే బాగుంటుందని చర్చోపచర్చలు ప్రారంభించారు ఇంట్లో.
"నేను డిగ్రీలో జాయినవ్వను.'' అన్నాను.
"మరేం చేస్తావు?'' అడిగారు.
"భాషాప్రవీణ చదువుతాను. విజయనగరం సంస్కృత కాలేజీలో జాయినవుతాను.'' అన్నాను.
"తెలుగు మాస్టర్ అవుతానంటావు.'' అన్నారు.
"కాదు, తెలుగు బాగా నేర్చుకుని, రచయితనవుతాను. కథలు రాస్తాను.'' అన్నాను. నవ్వారంతా. రచయిత కావాలంటే తెలుగు బాగా నేర్చుకోవాలా? కథలు రాయాలంటే భాషాప్రవీణ చదవాలా? అన్న ధ్వని వాళ్ళ నవ్వులో నాకు వినిపించింది.
"సరే! నీ ఇష్టం'' అన్నారు. మర్నాడే విజయనగరం ప్రయాణం అన్నారు. ఆనందంతో ఆ రాత్రి నాకు నిద్దరపట్టలేదు. విజయనగరం అంటే చాసో. చాసోని చూడొచ్చు. విజయనగరం అంటే పతంజలి. పతంజలిని చూడొచ్చు. విజయనగరం అంటే కొడవంటి కాశీపతిరావు, దాట్ల నారాయణమూర్తి రాజు. వాళ్ళను చూడొచ్చు. హిమాంశు బుక్ డిపో ఉందక్కడ. అక్కడ న్ని పుస్తకాలూ దొరుకుతాయి. కథా సంకలనాలూ, కవితా సంకలనాలూ, నవలలూ దొరుకుతాయి. కొని చదువుకోవచ్చు. అవన్నీ చదివి మంచి మంచి కథలు రాయొచ్చని పొంగిపోయాను. తెల్లారింది. విజయనగరం బయల్దేరాం. కాలేజీలో సీటొచ్చింది. భాషాప్రవీణలో జాయినయిపోయాను. నా ఈడు పిల్లలు ఎవరూ లేరు. అంతా నత్తా నావలా చిన్న చిన్న పిల్లలే ఉన్నారు క్లాసులో. వాళ్ళంతా ఏడో తరగతి చదివి, ఎంట్రన్స్ రాసి వచ్చారట! నేనే ఇంటర్ చదివి జాయినయినానట! తర్వాత దాట్లరాజు చెప్పాడు.

మా మూడో అన్నయ్య నాగేశ్వరరావుగారింట్లో మకాం. అక్కడుండి నేను భాషాప్రవీణ చదువుకోవాలి. పిచ్చి పిచ్చి తిరుగుళ్ళు తిరగకూడదు. పిచ్చి పిచ్చి రాతలు రాసి, చదువు పాడు చేసుకోకూడదు. సవాలక్ష కండిషన్లు పెట్టారు. వింటానా! "వింటే జగన్నాథశర్మవి ఎందుకవుతావు?'' అని పగలబడి నవ్వారు చాసో. ఆయనలా అంత చనువుగా నాతో మాట్లాడడానికీ, పగలబడి నవ్వడానికీ నాకార్నెళ్ల శిష్యరికం అవసరమయింది. విజయనగరం చేరుకున్న మొదటి వారం రోజులూ, ఆదిభట్ల నారాయణదాసుగారిల్లూ, గురజాడ అప్పారావుగారిల్లూ, బొంకుల్దిబ్బ, రాజుగారి కోట, మూడులాంతర్లు, పైడితల్లమ్మ గుడి, గంటస్తంభం ఇవన్నీ చుట్టబెట్టేశాను.

తర్వాత వారం రోజులూ చిన్నిపిల్లివారి వీధిలో చాసో ఇంటి చుట్టూ తిరిగాను. కథా రచయిత చాసోని చూడాలి. ఆయన్ని కలసి మాట్లాడాలి. చెప్పకేం! నేను రాసిన కథలు నా దగ్గరో రెండున్నాయి. వాటిని ఆయనకి చదివి వినిపించాలి. వినిపించి ఆయన 'శభాషో' అంటే పత్రికలకి పంపాలి. వారం రోజులు తిరిగినా ఆయన దర్శనం కాలేదు. ఓ రోజు పొద్దున వెళ్ళాను. "ఇప్పుడే బయటికెళ్ళారండీ! చూడండి, ఆ సుబ్రహ్మణ్యం విలాస్ దగ్గరో, బొంకుల్దిబ్బ దగ్గరో కనపడతారు'' అన్నారు. చూశాను. కనబళ్ళే! మరో రోజు సాయంత్రం వెళ్ళి అడిగాను.

"చూడండి, ఆ పెద్ద చెరువు గట్టు మీదో అక్కడో ఎక్కడో ఉంటార''న్నారు. వెళ్ళి చూశాను. కనబళ్ళే! ఇంకో రోజు ఓ మధ్యాహ్నం పూట వెళ్ళాను. అడిగాను. "ఇప్పుడే విజయవాడ వెళ్ళారు. నాలుగయిదు రోజులక్కానీ రారు'' అన్నారు. నాలుగయిదు రోజులు గడిచాయి. ఆ రోజు వర్షం. హిమాంశు బుక్ డిపోలో 'తిలక్ కథలు' కొనుక్కుని, వర్షంలో ఆ పుస్తకం తడిసిపోకుండా, చొక్కా వెనుక దాచుకుని పరుగుదీస్తోంటే... అదిగో... అక్కడ... సుబ్రహ్మణ్యం విలాస్ కిళ్ళీబడ్డీ దగ్గర గుప్ గుప్‌న పొగ వదుల్తూ చాసో కనిపించారు. దగ్గరగా వెళ్ళాను. "నమస్కారం సార్!'' అన్నాను.
"ముందుకు రండి'' అని, వర్షంలో తడుస్తున్న నన్ను పక్కకి లాగారు.
"ఎవరు మీరు?'' అడిగారు. నా గురించి అంతా 'ఏకరువు' పెట్టాను.
"ఓహో మీరేనా, నా కోసం మా ఇంటి చుట్టూ తిరుగుతోంది'' అన్నారు చాసో. అవునన్నట్టుగా నవ్వాను.
"మిమ్మల్నిలా చూడ్డం చాలా ఆనందంగా ఉంది సార్!'' అన్నాను.
"ఏదీ? వర్షంలో తడుస్తూ చుట్ట తాగుతూన్న నన్ను చూడ్డం. బాగుంది'' అని నవ్వారు.
"ఏంటది, గుండెల్లో దాస్తున్నారు?'' ప్రశ్నించారు.
"తిలక్ కథలు సార్, ఇప్పుడే కొన్నాను'' అన్నాను.
"చదవండి. కాని, కథకుడిగా తిలక్ ఫెయిల్ అయ్యాడు. అది గ్రహించండి'' అన్నారు. ఆ మాటలకి నాకు చాలా కోపం వచ్చింది. తిలక్ కథలంటే నాకు చాలా ఇష్టం. ఆ ఇష్టాన్నీ, కోపాన్నీ వ్యక్తం చేయలేకపోయాను. "వెళ్ళొస్తాన్సార్'' అన్నాను.


అలా అలా చాసోతో పరిచయం పెరిగి 'ఇదిగో జగన్నాథశర్మ' అనేంత వరకూ వచ్చారాయన. వారి గౌరవానికి భంగం కలిగించనని నమ్మకం ఏర్పడిందప్పటికి. మా స్నేహానికి ఆర్నెళ్ల వయసొచ్చింది. ఆర్నెళ్లలో వారు వీరవుతారని అంటారు. అలా కాకపోయినా చాసోకి నేను శిష్యుణ్ణయ్యాను.. ఇప్పుడు చాసో లేరు. రాజూ లేడు. నేనున్నాను. నాకు చాసో అవార్డు ఇస్తున్నారు. అందుకుంటున్నందుకు ఆనందంగా ఉంది కాని, చాసో లేని విజయనగరాన్నీ, రాజు లేని విజయనగరాన్నీ, పతంజలి లేని విజయనగరాన్నీ ఊహించలేకపోతున్నాను.
"వర్షం. తడిసిపోతారు'' అన్నారు చాసో. అయినా వినిపించుకోలేదు. పారిపోయాను అతని దగ్గర్నుంచి. ఆ రోజుల్లో, ఆ వయసులో నన్ను తిలక్ కథలు కుదేపేశాయి. చాసో కథలు, తిలక్ కథల ముందు పెద్ద గొప్పవనిపించలేదు. ఆ మాటే అన్నాను, ఓ నెల రోజు ల తర్వాత. ఏదో స్కూల్లో, సాహితీసభలో చాసో కలిసినప్పుడు. కోపం తీర్చుకున్నాను. నేనీ మాట అతనితో అన్నట్టుగా ఆ నోటా ఈ నోటా పతంజలికి తెలిసింది. కలిసినప్పుడు "తప్పు. మీరలా పెద్దాయనతో మాట్లాడకూడదు'' అన్నాడు. ఎందుకు మాట్లాకూడదు అని నేను ఎదురు ప్రశ్నించలేదు. పతంజలి చెప్పాడు. వినాలి. అంతే! విన్నాను. చాసోకి సారీ చెప్పాలని వాళ్ళింటికి వెళ్తోంటే, ఆయనే ఇంటిగేటు తీసుకుని వస్తూ ఎదురయ్యారు.

"పదండి! బయట పడదాం'' అన్నారు.
"ముత్యాలముగ్గు సినిమా చూశారా'' అడిగారు.
"చూడలేదు'' అన్నాను.
"బాగుందట! రండి, వెళ్దాం'' అంటూ లక్ష్మీ సరస్వతి టాకీసుకి తీసుకుని వెళ్ళారు.
"నేలక్లాసు టిక్కెట్లు తీస్తాను. మీకేం నామోషీ లేదు కదా'' అడిగారు.
"నేలా'' అన్నాను.
"అక్కడ కూర్చుని చూస్తేనే ఎందుకు బాగున్నదీ తెలుస్తుంది. కుర్చీలో కూర్చుంటే తెలీదు. నేలంటే కటిక నేల కాదు, బెంచీలే'' అన్నారు నవ్వుతూ. అప్పుడు ఆయన రాసిన 'బబ్బబ్బా' కథ గుర్తొచ్చింది. సినిమా పూర్తయింది.
"బాగుంది కదా! కమర్షియల్ క్లాసిక్'' అన్నారు. బాపుని మెచ్చుకున్నారని సంబరపడ్డాను. కొద్దిరోజులు గడిచాయి. ఓ రోజు 'సీతాలు సింగారం, మాలచ్చి బంగారం, సీతామాలచ్చిమంటే శ్రీలక్ష్మి అవతారం' పాట వినవచ్చింది.
"ఎవరు రాశారండీ ఆ పాట'' అడిగారు చాసో.
"వేటూరి సుందర్రామ్మూర్తి'' అన్నాను.
"దుంప తెంచీశాడయితే! ఈ పెద్దమనిషి సినిమా రంగాన్ని ఏలేస్తాడు'' అన్నారు.
"ఎలా చెప్పగలరు?'' అడిగాన్నేను.
"చిన్న చిన్న పదాల్లో, మామూలు మాటల్లో పాట రాయడం కష్టం. రాసి మెప్పించడం మరీ కష్టం. మా మనవరాలు పాడుతోందీ పాట. దాని వయసు నాలుగేళ్ళు. దాని నోటికే ఈ పాట వచ్చిందంటే, ఇంకేం ఉందీ, వేటూరికి తిరుగులేదు'' అన్నారు. బాగుంటే ఈయన మెచ్చుకుంటారన్నమాట! బాగాలేకపోతేనే ఒప్పుకోరనిపించింది.

ఆ బాగులేనితనం ఏదో తిలక్ కథల్లో ఉందనుకున్నాను. మా అన్నయ్య మిత్రులు కొందరు, 'నవయువక్ మిత్ర మండల్' అని ఓ సంస్థ స్థాపించారు. అందులో సభ్యులంతా మార్వాడీలు. వాళ్ళంతా చదువుకునేందుకు ఓ లైబ్రరీ పెట్టి, దానికి లైబ్రరేరియన్‌గా నన్ను నియమించారు. నెలకు అరవై రూపాయలు జీతం కూడా ఇస్తామన్నారు.

"ఇంకేం! హాయిగా జాయిన్ అయిపొండి '' అన్నారు చాసో.
"నన్ను పదే పదే అండీ గిండీ అనకండి సార్!'' అన్నాను.
"నన్ను నేను గౌరవించుకోవాలంటే మిమ్మల్ని 'అండీ' అనక తప్పదు. మీ ఊపు చూస్తోంటే మీకు ఆవగింజంత చనువిస్తే చాలు, 'ఏఁవయ్యా చాసో' అనేట్టున్నారు. అందుకని భయపడుతున్నాను'' అన్నారు.
ఆలస్యం దేనికని లైబ్రరీలో జాయినయిపోయాం. 'పోయాను' అనాలి కాని, 'పోయాం' అంటాడేమిటంటూ అనుమానంగా ఉందా? జాయినవ్వాల్సింది నేనొక్కణ్ణే కాని, నాతో పాటు చాసో కూడా ఠంచన్‌గా సాయంత్రం నాలుగయితే చాలు! లైబ్రరీకి వచ్చేసేవారు. అందుకు జాయినయి పోయాం అంటున్నాను. ఇంటి నుంచి రకరకాల పుస్తకాలు తెచ్చుకునేవారు చాసో. చుట్ట తాగుతూ హాయిగా ఆనందంగా చదువుకునే వారు. తను చదవడం అయిపోగానే ఆ పుస్తకాన్ని నాకిచ్చి చదివించేవారు.

"బాగా ఇంగ్లీషు చదవండి! తెలుగులో వాక్యం ఎలా రాయాలో తెలుస్తుంది'' అనేవారు. ఆ రోజుల్లోనే నేను ముందు చెప్పేనే నావో రెండు కథలున్నాయి, ఆయన ముందు చదవడానికని. అవి ఓ రోజు చదివి వినిపించాను.

"ఎలా ఉన్నాయి'' అనడిగాను.
"బాగోలేవు. మీకు కథలు రాయడం తెలీదు'' అన్నారు.
"కథకి అంతంత వస్తువు అవసరమా?'' అన్నారు.
'ఎ షార్ట్ స్టోరీ డీల్స్ విత్ ఎ సింగిల్ సిట్యుయేషన్' అంటూ ఏ మేరకు వస్తువును స్వీకరించాలో ఓ రెండు గంటల పాటు చెప్పుకొచ్చారు. తను రాసిన పరబ్రహ్మం, కుక్కుటేశ్వరం కథల గురించి వివరించారు. కరెక్టేననిపించింది. ఆయన చెప్పినట్టుగానే, ఆయన రాసినట్టుగానే కథ రాసి ఓ చల్లచల్లని సాయంత్రం వేళ వినిపించానతనికి. "ఎలా ఉంది? అచ్చు మీరు రాసినట్టుగా లేదూ!'' అన్నాను.

"నేను రాసినట్టుగా మీరెందుకు రాయడం? నా కథలేవో నేనేడుస్తాను. మీ కథలు మీరేడవండి'' అన్నారు. బాధపడ్డాను. "మీ కథలో మీ గొంతు వినిపించాలి. నా గొంతు వినిపించడం ఏమిటి, డబ్బింగ్ చెప్తున్నట్టు అసహ్యంగా'' అని నవ్వారు. అప్పట్నించీ కథల్లో వాళ్ళనీ వీళ్ళనీ మిమిక్రీ చేయడం మానుకున్నాను. "కొత్తపుస్తకాలు తెగొస్తున్నాయి. విజయవాడ వెళ్దావాఁ?'' అన్నారోసారి.

"వెళ్దాం. దాందేముంది'' అన్నాను. లైబ్రరీకి కొత్తపుస్తకాలు కొనాలని, ఓ పాతిక వేలు కావాలని చెప్పాను మిత్రమండల్‌కి. పదివేలిచ్చారు. హిందీ పుస్తకాలు, రాజ్‌వంశ్, గుల్షన్‌నందా నవలలు కొని తీసుకురమ్మన్నారు. అలాగేనని, నేనూ చాసో విజయవాడ వెళ్ళి మా ఇద్దరికీ నచ్చిన పుస్తకాలు, ఇంద్రగంటి 'ద్రాక్షారామం' దగ్గర్నుంచీ శంకరమంచి 'అమరావతి కథలు' వరకూ అన్నీ కొని తెచ్చుకున్నాం. వాటికి అట్టలు వేశాం. చదువుకోసాగాం. "హిందీ పుస్తకాలు కొనమన్నాం కదా!'' అన్నారు మిత్రమండలి.

"ఇవన్నీ హిందీ పుస్తకాలే! కాకపోతే తెలుగు అనువాదాలు'' అన్నారు చాసో. చాటుకి వెళ్ళి చుట్ట ముట్టించి తెగ నవ్వుకున్నారు. అలా అలా చాసోతో పరిచయం పెరిగి 'ఇదిగో జగన్నాథశర్మ' అనేంత వరకూ వచ్చారాయన. వారి గౌరవానికి భంగం కలిగించనని నమ్మకం ఏర్పడిందప్పటికి. మా స్నేహానికి ఆర్నెళ్ల వయసొచ్చింది. ఆర్నెళ్లలో వారు వీరవుతారని అంటారు. అలా కాకపోయినా చాసోకి నేను శిష్యుణ్ణయ్యాను. పెద్ద చెరువు గట్టు మీద చుట్ట తాగడం ప్రయత్నించాను. అబ్బో! నా వల్ల కాలేదది. కళ్ళు తిరిగి పోయాయి.

"సిగరెట్లుతో సరిపెట్టుకో'' అన్నారు చాసో. సిగరెట్లు తాగుతూ కథలు రాయసాగాను. చాలా కథలు ప్రచురణయ్యాయి. కొన్ని కథలకి బహుమతులు కూడా వచ్చాయి. అయితే ఇన్ని కథలు రాసినా ఒక్కనాడూ 'ఈ కథ బాగుంది' అంటూ నన్ను మెచ్చుకోలేదు చాసో. పాపం! దాట్ల రాజుని కూడా మెచ్చుకోలేదాయన.

ఆయన చేత మెప్పు పొందాలి. ఎలా? ఇద్దరికీ అద్భుతమయిన ఆలోచన తట్టింది. పెద్ద చెరువు గట్టు మీద కూర్చున్నప్పుడు ఆ కబురూ, ఈ కబురూ చెబుతూ- "గురువుగారూ! ఈ మధ్య రాస్తున్న యువరచయితల్లో మీకు నచ్చిన రచయితలెవరు?'' అనడి గాం. నా పేరు చెబుతారని ఆశించా ను. నాతో పాటు తన పేరు కూడా చెబుతారని దాట్లరాజూ మోజు పడ్డాడు. మా ఇద్దరి పేర్లూ ఆయన చెప్పలేదు సరికదా, "నాకు నచ్చిన యువరచయితలు ఇద్దరేనయ్యా! ఒకరు చాగంటి తులసి, ఇంకొకరు చాగంటి శంకర్'' అన్నారు. ఒకరేమో వాళ్ళమ్మాయి. ఇంకొకరేమో వాళ్ళబ్బాయి. నాకూ, రాజుకీ ఏం మాట్లాడాలో అంతుచిక్కలేదు. ఒకొర్నొకరు చూసుకుంటూ కూర్చున్నాం. అది గమనించారు చాసో. నవ్వుతూ ఇలా అన్నారు.

"పిల్లల్ని పొగిడినా పర్వాలేదయ్యా! శిష్యుల్ని పొగడకూడదు. ఆయుక్షీణం'' అన్నారు. ఊపిరి పీల్చుకున్నాం నేనూ, రాజూ. ఇప్పుడు చాసో లేరు. రాజూ లేడు. నేనున్నాను. నాకు చాసో అవార్డు ఇస్తున్నారు. అందుకుంటున్నందుకు ఆనందంగా ఉంది కాని, చాసో లేని విజయనగరాన్నీ, రాజు లేని విజయనగరాన్నీ, పతంజలి లేని విజయనగరాన్నీ ఊహించలేకపోతున్నాను.

ఏదయినా విజయనగరం అంటే నాకు చాలా ఇష్టం. ఎంతిష్టం అంటే...సత్యం శంకరమంచికి అమరావతి అంటే ఎంతిష్టమో నాకంతిష్టం. అలాగే ఇంద్రగంటి వారికి గౌతమి అంటే ఎంతిష్టమో నాకంత ఇష్టం. ఆకాశాన్ని ఆకాశంతోనే పోల్చాలి. సముద్రాన్ని సముద్రంతోనే పోల్చాలి. అలాగే విజయనగరాన్ని విజయనగరంతోనే పోల్చాలి. అంత గొప్పదా ఊరు.
- జగన్నాథశర్మ
(ఈ నెల 17న విజయనగరంలో చాసో అవార్డు అందుకుంటున్న సందర్భంగా..)

No comments:

Post a Comment