అంతర్జాలంలోని అన్నిరకాల ముఖ్యమైన సమాచారాన్ని ఈ సైట్ లో నిక్షిప్తం చేసి, అందరికీ ఉపయోగపడే ఒక వేదికగా ఈ సైట్ ఉండాలనే ఉద్దేశ్యంతో ప్రారంభించడమైంది. ఏ సైట్ నుండి సమాచారం తీసుకున్నా వారి పేరుతోనే ఇందులో వుంచుతాను. సహృదయంతో సహకరించగలరు.
ఎవరికైనా అభ్యంతరముంటే వారి సైటుకు సంబంధించిన సమాచారం తొలగించడం జరుగుతుంది. - ధన్యవాదములతో...

Sunday, January 29, 2012

అక్షర యంత్రుడు గూటెన్‌బర్గ్

ఇవాళ ‘ఇండియన్ న్యూస్ పేపర్ డే’!
1780లో సరిగ్గా ఇదే రోజు...
భారతదేశపు మొట్టమొదటి వార్తాపత్రిక
‘హక్కీస్ బెంగాల్ గెజిట్’ మార్కెట్‌లోకి వచ్చింది.
అప్పుడింత ప్రింటింగ్ టెక్నాలజీ లేదు.
అంతమాత్రాన అసలు టెక్నాలజీనే లేకపోలేదు!
అప్పటికి మూడు వందల ఏళ్ల క్రితమే
గూటెన్‌బర్గ్ అనే జర్మనీ దేశస్థుడు కనిపెట్టిన మోనో టైప్ సెట్టింగ్‌తో ప్రింటింగ్ పద్ధతిని ఒక్కో దేశం అవలంబిస్తున్న క్రమంలో...


భారత్ కాస్త ఆలస్యంగానే అయినా
అచ్చు యంత్రాల యుగంలోకి వచ్చేసింది.
ఇప్పుడు ఆఫ్‌సెట్ తరంలో ఉన్నాం.
అయినప్పటికీ ‘అచ్చు’ ఆలోచనకు ఆద్యుడు గూటన్‌బర్గే!
అందుకే ఆయన్ని స్మరించుకోవాలి.
అందుకే ఇది ఆయన బయోగ్రఫీ.


ఉప్పెన ఊళ్లను ముంచెత్తుతుంది.
అయితే ఊపు ఉన్నంత వరకే.
ప్రకంపన భూమిని వణికిస్తుంది.
అయితే తీవ్రత ఉన్నత వరకే.
పెనుమేఘం ఉరిమి కురుస్తుంది.
అయితే కమ్ముకొచ్చిన మేరకే.
అగ్ని చురచుర ఆరగిస్తుంది.
అయితే వాయువు వీచినంత వరకే.
కానీ అక్షరం! 
తరతరాల నిరంతరం.
అనంత కాలాల దావానలం!
అక్షరం... ఖండాలను ముంచెత్తుతుంది.
రాజ్యాలను వణికిస్తుంది. భావధారలను కురిపిస్తుంది.
అజ్ఞానాన్ని ఆరగిస్తుంది.
అక్షరం ఐరోపాఖండాన్ని పొదిగితే ఊపిరిపోసుకున్నదే పదిహేనో శతాబ్దపు ‘రినాయిసెన్స్’! పునరుజ్జీవనం! 
అంతకుముందు కూడా ఐరోపాలో ఆర్ట్ ఉంది.
ఒకళ్లిద్దరి దగ్గరే ఉంది!
లిటరేచర్ ఉంది.
ఒకట్రెండు తాళపత్రాలలోనే ఉంది.
ఐడియాలు ఉన్నాయి.
ఎవరి ఐడియాలు వాళ్లదగ్గరే ఉన్నాయి.
అక్షరం వచ్చి ఐరోపాను షేక్ చేసింది! ఆర్ట్‌ని, లిటరేచర్‌ని, ఐడియాలను ఇంటింటికీ వెళ్లి తలుపులపై అతికించింది. ఐరోపాతో పాటు తక్కిన ఖండాలూ హఠాత్తుగా న్యూ బార్న్ బేబీస్ అయ్యాయి.
పదహారో శతాబ్దపు ఐరోపా ‘రిఫార్మేషన్’ కూడా అక్షరం వల్లే జరిగింది! ఆనాటి కేథలిక్ చర్చి మత విశ్వాసాలకు అక్షరమే పదును పెట్టింది. ప్రొటెస్టెంట్ చర్చి కుదుళ్లను అక్షరమే బిగదీసి కట్టింది. మార్టిన్ లూథర్ సీనియర్, జాన్ కాల్విన్ ప్రబోధాలను అక్షరమే నిచ్చెనెక్కించింది. ఐరోపా మత సంస్కరణల ఉద్యమమైన ‘రిఫార్మేషన్’కు అక్షరమే ఆజ్యం! 
ఇక్కడితో పూర్తి కాలేదు. 
జ్ఞానోదయ యుగం (ఏజ్ ఆఫ్ ఎన్‌లెటైన్‌మెంట్), శాస్త్రవిజ్ఞాన విప్లవం (సైంటిఫిక్ రివల్యూషన్)... ఇవి కూడా అక్షరం రగిలించిన భావావేశాలే! అక్షరం వెలిగించిన జీవన కాంతులే. పద్దెనిమిదో శతాబ్దపు జ్ఞానోదయ యుగంలో మనిషి రీజన్ అడగడం మొదలైంది! బారుచ్ స్పినోజా, జాన్ లాక్, పియరీ బేల్, ఐజక్ న్యూటన్, వోల్టేర్‌లు రీజనింగ్‌ని కరపత్రాలలో పొట్లంలా చుట్టి పౌరులకు వీధులలో పంచిపెట్టారు. ప్రశ్నించడమే విజ్ఞానం అన్నారు. తెలుసుకోవడమే కైవల్యం అన్నారు. 
పదహారు, పదిహేడో శతాబ్దాలలో ఫిజిక్స్, కెమిస్ట్రీ, బయాలజీ, ఆస్ట్రానమీ, మెడిసిన్‌లకు అక్షరం పాదులు తీసింది. నారై, నీరై, ఎరువై సకల శాస్త్రాల వ్యవసాయం చేసింది! సైంటిఫిక్ రివల్యూషన్ తెచ్చింది.
అక్షరానికి ఇంత శక్తి ఎలా వచ్చింది?! 
ఇన్ని సంస్కరణలను, ఇన్ని విప్లవాలను అక్షరం ఎలా తేగలిగింది? మహామహుల, మహనీయుల ఆలోచనలను అక్షరం ఎలా విశ్వవాప్తం చేయగలింది? 
ఈ ప్రశ్నలన్నిటికీ సమాధానం... గూటెన్‌బర్గ్. 
గూటెన్‌బర్గ్ అచ్చుయంత్రాన్ని కనిపెట్టాకే అక్షరం హైలీ ఇన్‌ఫ్లేమబుల్ అయింది! 

******* 

ప్రపంచం కొత్త మిలీనియంలోకి ప్రవేశించే ముందు 1999లో అమెరికాలోని ఎ అండ్ టి (ఆర్ట్స్ అండ్ ఎంటర్‌టైన్‌మెంట్) నెట్‌వర్క్.. ‘‘100 మోస్ట్ ఇన్‌ఫ్లూయెన్షియల్ పీపుల్ ఆఫ్ ది మిలీనియం’ అంటూ ఒక జాబితాను విడుదల చేసింది. అందులోని మొదటి పేరు జోహాన్నెస్ గూటెన్‌బర్గ్! ఆయన తర్వాతే న్యూటను, డార్విను, ఇంకా తక్కినవారు.
వెయ్యేళ్ల చరిత్రలో మానవాళి తలుచుకోవలసిన మొదటి వ్యక్తి అంటే ఎన్ని కొండల బంగారాన్ని కరగదీసి కుమ్మరిస్తే ఆ వ్యక్తి బరువుకు తూగుతుంది?! అంతటి ‘వెయిట్’ గూటెన్ బర్గ్‌కి మాత్రమే దక్కింది. ఎ అండ్ టి ఒక్కటే కాదు, ప్రతిష్టాత్మకమైన అనేక ఎంపికల్లో గూటెన్‌బర్గ్ చరిత్రాత్మక వ్యక్తిగా నిలిచారు! నిలిచారు కానీ, తన జీవిత చరిత్ర గురించి ఒక్క ఆనవాలునైనా మిగల్చకుండా వెళ్లిపోయారు. 
‘‘గూటెన్‌బర్గ్ తొలినాళ్ల జీవితమంతా ఒక మిస్టరీ’’ అని టెక్నాలజీ హిస్టారియన్ జాన్ లియన్‌హార్డ్ రాశారు. ఆ మాట నిజమేనని మరో చరిత్రకారుడు హెయిన్‌రిచ్ వల్లా సమర్థించారు.
గూటెన్‌బర్గ్ జర్మనీలోని మెయింట్స్ పట్టణంలో జన్మించిన ఆధారాలు రూఢీగా ఉన్నాయి కానీ, ఏ ఏడాది, ఏ రోజు పుట్టారో కచ్చితమైన వివరాలు లేవు. ఆ లెక్కా ఈ లెక్కా సరిచూసుకుని 1398లో ఆయన పుట్టి ఉండొచ్చని చరిత్రకారులు సర్దుకుపోయారు. చనిపో యింది మాత్రం డెబ్బయ్ ఏళ్ల వయసులో 1468 ఫిబ్రవరి 3న. 
గూటెన్‌బర్గ్ జీవితం ఇంత అజ్ఞాతంగా ఎందుకు ఉండిపోయింది? అక్షరంగా, అచ్చుయంత్రంగా మాత్రమే ఆయన ఎందుకు మిగిలిపోయారు? జీవితంలోని సమస్యలు, జీవన సంకల్పం గూటెన్‌బర్గ్‌ను తన గురించి తను ఆలోచించుకోకుండా చేశాయా? తను ముద్రించిన ఒక్క పుస్తకంలోనూ ఆయన తన బయోగ్రఫీ రాసుకోలేదంటే, తననొక ముఖ్యమైన వ్యక్తిగా ఆయన భావించుకోలేదా? ఇవి మరికొన్ని ప్రశ్నలు.
గూటెన్‌బర్గ్ గురించి తెలుసుకోవాలంటే ఆయనను ఎరిగినవారి నుంచి ఒక్కో అక్షరం ఏరుకుని, వాక్యాలు గుదిగుచ్చినట్లు... వేల వాక్యాలతో ఒక జీవిత చరిత్రను సమకూర్చుకోవాలి. అంతే మార్గం. 

******* 

జర్మనీలోని మెయింట్స్ పట్టణంలో పేరున్న వ్యాపారి ఫ్రియలీ జెన్స్‌ఫ్లెయిష్ జుర్ లాడెన్. ఆయన రెండో భార్య ఎల్స్ వైరిచ్. వాళ్ల కుమారుడే గూటెన్‌బర్గ్. ఇంట్లో ఆఖరి పిల్లవాడు. (ఇకనుంచి ఇతడిని కథన సౌలభ్యం కోసం బర్గ్ అందాం. అలాగే బర్గ్ తండ్రిని ఫ్రియలీ అందాం).
ఫ్రియలీ ఒక వ్యాపారమే చేయలేదు. ఒక వ్యాపకంలోనే ఉండిపోలేదు. బట్టలు అమ్మారు. బిషప్ దగ్గర స్వర్ణకారుడిగా పని చేశారు. 
అప్పట్లో మెయింట్స్‌లో చలామణిలో ఉన్న బంగారు నాణేలు, అధికార ఫలకాలు చాలావరకు ఫ్రియలీ చేత బిషప్ చేయించినవే. బంగారాన్ని చెక్కి అచ్చులు పొయ్యడంలో ఎక్స్‌పర్ట్ అతడు. తండ్రి చేస్తున్నప్పుడు చూసి, ఆ పని కొద్దిగా నేర్చుకున్నాడు బర్గ్.
ఫ్రియలీ ఇంకొక పని కూడా చేసేవారు. నాణేల ఫోర్జరీ కేసుల్లో బిషప్ దూతగా వెళ్లి తీర్పులు చెప్పేవాడు. అలా ఆయనకు పేరొచ్చింది. డబ్బొచ్చింది. పట్టణంలో ప్రముఖుడన్న గౌరవం వచ్చింది.

ఫ్రియలీ పేరులోని ‘జు లాడెన్, జు గూటెన్‌బర్గ్’ అనేవి అతడికి తన తండ్రి పూర్వీకుల నుంచి లంకెబిందెల్లా తగులుకున్న పేర్లు! జెన్‌ఫ్లెయిష్ అనేది ఇంటిపేరు. ఫ్రియలీ పూర్వీకులు నివసించిన ఇంటిపేరే జెన్‌ఫ్లెయిష్. అప్పట్లో ఎవరు ఎక్కడ స్థిర నివాసం ఉంటే అది వాళ్ల ఇంటి పేరు అయ్యేది. అలా అతడు ఫ్రియలీ జెన్స్‌ఫ్లెయిష్ జుర్ లాడెన్ అయ్యాడు. ఇందులో ఫ్రియలీ అన్నదొక్కటే అసలు పేరు. అలాగే జొహాన్నెస్ జెన్‌ఫ్లయిష్ జున్ లాడెన్ జుర్ గూటెన్‌బర్గ్‌లో ‘జొహాన్నెస్’ అనేదొక్కటే అసలు పేరు. అయితే బర్గ్.. జోహన్నెస్ అనే పేరుతో కాకుండా, గూటెన్‌బర్గ్ అనే పేరుతో ప్రసిద్ధుడయ్యాడు.

జెన్‌ఫ్లెయిష్ అనే ఇంటిపేరు పదమూడో శతాబ్దంనాటి నుంచి పరంపరగా వస్తోంది. జెన్‌ఫ్లెయిష్‌లు సమాజంలో పేరున్నవాళ్లు. వారిని పెట్రీషియన్‌లు అనేవారు. చదువు సంస్కారం, డబ్బు, హోదా ఉన్న వారిదంతా అప్పట్లో పెట్రీషియన్ కేటగిరీ.
మెయింట్స్‌లోని పెట్రీషియన్‌లలోమళ్లీ రెండు వర్గాలున్నాయి. ఒకదానికొకటి వ్యతిరేక వర్గం. వారికీ వీరికీ వర్గ వైరం. ఆ గొడవల్లో 1411లో వందకు పైగా పెట్రీషియన్ కుటుంబాలు మెయింట్స్‌ను వదిలి వెళ్లవలసి వచ్చింది. వాటిల్లో ఫ్రియలీది కూడా ఒక కుటుంబం! బర్గ్ తల్లికి అక్కడి దగ్గర్లోని ఆల్టావిల్లాలో వారసత్వంగా సంక్రమించిన ఒక ఎస్టేట్ ఉంది. అక్కడికి వెళ్లారు. అప్పుడు బర్గ్ వయసు పదమూడేళ్లు. తర్వాతి ఇరవై ఏళ్లు బర్గ్ ఎక్కడ చదువుకున్నాడు? ఏం చేశాడు అన్న వివరాల్లేవు. స్ట్రాస్‌బర్గ్‌లో బర్గ్ కుటుంబానికి బంధువులున్నారు. ఉపాధిని వెదుక్కుంటూ బర్గ్ అక్కడికి వెళ్లి ఉంటాడని చరిత్రకారుల భావన. యూనివర్శిటీ ఆఫ్ ఎర్‌ఫర్ట్‌లోని 1418 రిజిష్టర్‌లో ఈ చరిత్రకారులు జెహాన్నెస్ డె ఆల్టావిల్లా అనే పేరు కనిపెట్టారు. బహుశా అతడే గూటెన్‌బర్గ్ అయి ఉంటాడని వారి నమ్మకం. 1434 మార్చిలో బర్గ్ రాసిన ఉత్తరం ఒకటి చరిత్రకారులకు దొరికింది. దాన్ని బట్టి చరిత్రకారులకు మరికొన్ని విషయాలు తెలిశాయి. 

స్ట్రాస్‌బర్గ్‌లో బర్గ్‌కు తల్లివైపు బంధువులున్నారు. అతడు కొన్నాళ్లు అక్కడ ఉన్నాడు. స్ట్రాస్‌బర్గ్ సైన్యంలో ‘గోల్డ్‌స్మిత్ మెంబర్’గా పేరు నమోదు చేయించుకున్నాడు. సైన్యం కోసం ప్రత్యేక లోహపు పరికరాలను, సామగ్రిని తయారు చెయ్యడం బర్గ్ పని. అదే సమయంలో - ధనవంతుడైన ఒక రత్నాల వ్యాపారికి బర్గ్ సలహాదారుడిగా ఉన్నారు. రత్నాలకు మెరుపు తెప్పించడం ఎలాగో ఆ ధనవంతుడికి చెప్పేవాడు బర్గ్. అయితే బర్గ్‌కి ఈ విద్య ఎలా అబ్బిందో తెలీదు!
1436-37 మధ్య కాలంలో బర్గ్ మీద స్ట్రాస్‌బర్గ్‌లో ఉండే ఒక అమ్మాయి కేసు పెట్టింది - పెళ్లి చేసుకుంటానని మాటిచ్చి మోసం చేశాడని!! తర్వాత ఏమయిందో తెలీదు. అతడు తన నేరాన్ని అంగీకరించాడా? అ అమ్మాయినే పెళ్లి చేసుకున్నాడా లేక ఇంకెవరితోనైనా అతడి వివాహం జరిగిందా? ఇలాంటి వివరాలేవీ చరిత్రలో లేవు. భార్య పేరు మాత్రం ఎల్స్ విరిక్.
లోహాలను బంగారంలా మార్చే విద్య ఆల్కెమీ.
రసవాదం!
పన్నెండు పదహారు శతాబ్దాల మధ్య కాలంలో ప్రపంచమంతటా రసవాదులు రహస్యంగా ఎన్నో ప్రయోగాలు చేశారు. గూటెన్‌బర్గ్ అచ్చు అక్షరాల ఆవిర్భావం కూడా అంతే రహస్యంగా జరిగింది. వాటిని ముద్రించే అచ్చుయంత్రం ఫార్ములాను కూడా ఆయన మూడో కంటికి తెలియకుండా తయారుచేసి పెట్టుకున్నారు. ఇక కావలసింది డబ్బు.
అయితే అప్పటికే అప్పులవాళ్లు బర్గ్ నెత్తిమీద కూర్చుని ఉన్నారు! ఎటూ కదలలేని పరిస్థితి.

అసలు గూటెన్‌బర్గ్‌కు ఇన్ని అప్పులు ఎందుకయ్యాయి?!
అఛెన్ పట్టణంలో ఉన్నప్పుడు అతడొక ఆర్థిక దుస్సాహసం చేశాడు. 1439లో ఆ పట్టణంలో జరగబోతున్న కళా వస్తు ప్రదర్శనకు వచ్చే వీక్షకులను ఆకర్షించి, వారి చేత కొనిపించడం కోసం చక్కగా మెరుగుపట్టిన లోహపు దర్పణాలను తయారుచేసి పెట్టుకున్నాడు బర్గ్. ప్రాచీన మత గ్రంథాలలోని పరిశుద్ధ కాంతిని ఆ దర్పణాలు సంగ్రహించి సకల సంపదలను సంప్రాప్తింపజేస్తాయని చాటింపు వేయించాడు. జనంలో ఆసక్తి మొదలైంది. ప్రదర్శనలో ఉంచబోయే చార్ల్‌మేన్ చక్రవర్తి కాలంనాటి పవిత్ర స్మారక చిహ్నాల నుంచి ‘గూటెన్‌బర్గ్ దర్పణాలతో’ కాంతిని రాబట్టుకోవడం కోసం వారు ఎదురుచూస్తున్నారు. 
మరోవైపు బర్గ్ కూడా ప్రదర్శన ప్రారంభం అవడం కోసం వేచి ఉన్నాడు. దర్పణాల తయారీకి అయ్యే ఖర్చును పెద్దపెద్ద వ్యాపారుల నుంచి భారీ మొత్తంలో పెట్టుబడులుగా సేకరించాడు. వాటిని వడ్డీతో సహా తీర్చాలంటే ప్రదర్శన మొదలు కావాలి. 
కానీ దురదృష్టం! ఏవో కారణాలవల్ల ప్రదర్శన ఏడాదిపాటు వాయిదా పడింది! అప్పులవాళ్లు బర్గ్ మీద పడ్డారు. ఇప్పటికప్పుడు తీర్చలేను కానీ, ఒక అమోఘమైన ఐడియా చెప్తానని బేరం పెట్టాడు బర్గ్. వాళ్లు శాంతించారు.
ఇంతకీ బర్గ్ ఇచ్చిన ఐడియా ఏమిటి? 

‘‘చర్చి సందేశాలను, కరపత్రాలను, పుస్తకాలను ఇకముందు చేత్తో రాసే పని లేదు. ఎన్ని ప్రతులనైనా అచ్చు గుద్దే ఐడియా నా దగ్గరుంది. దాంతో డబ్బులే డబ్బులు’’ అన్నాడు బర్గ్. తన ప్రింటింగ్ ఫార్ములా సక్సెస్ అయి అప్పులన్నీ తీరిపోగా ఇంకా తన దగ్గర లక్షల ‘గిల్డర్స్’ మిగులుతాయని బర్గ్ లెక్క. గిల్డర్స్ ఆనాటి కరెన్సీ. 
మరో ఐదేళ్లు స్ట్రాస్‌బర్గ్‌లోనే గడిపాడు గూటెన్‌బర్గ్. అక్కడి సెయింట్ అర్బోగస్ట్ ప్రార్థనాలయ ప్రాంగణంలోని ఒక గదిలో అతడి నివాసం. అక్కడే అతడు అత్యంత రహస్యంగా లక్షలు లక్షల అక్షరాల అచ్చులను (టైప్‌లను) సీసపు లోహంతో రివర్సులో తయారు చేసి పెట్టుకున్నాడని, అక్కడే ముద్రణాయంత్రం కూడా రెడీ అయివుండొచ్చని చరిత్రకారుల నమ్మకం. వీటన్నిటికీ డబ్బును సమకూర్చింది మెయింట్స్ పట్టణంలో ఉన్న బెర్గ్ బావమరిది ఆర్నాల్డ్ గెల్తస్ అని ఇంకో నమ్మకం.
మొత్తానికైతే గూటెన్‌బర్గ్ శ్రమ ఫలించింది. ప్రింటింగ్ మొదలైంది!

1450లో తొలిసారిగా గూటెన్‌బర్గ్ ట్రయల్స్ వేశారు. ఒక జర్మన్ కవితను కాగితంపై అచ్చొత్తారు! సక్సెస్. సూపర్ సక్సెస్. అక్షరాలు అందంగా, పొందిగ్గా ఉన్నాయి. ఒకదాని వెంట ఒకటి ప్రింట్ అవుతూ కాగితాలు బయటికి వస్తున్నాయి. అచ్చు యంత్రం చరిత్రలో తొలి ముద్రిత జర్మనీ కవిత. తొలి ముద్రాపకుడు గూటెన్‌బర్గ్!
పెద్దపెద్దవాళ్లు మళ్లీ అప్పివ్వడానికి బర్గ్ దగ్గరికి పరుగెత్తుకొచ్చారు. అప్పు తీర్చొద్దు, భాగస్వామిగా చేర్చుకొమ్మని అడిగారు. జాన్ ఫస్ట్ అనే ఆయన 800 గిల్డర్స్ క్యాష్ డౌన్ చేశారు. జాన్ ఫస్ట్ అల్లుడు పీటర్ షోఫర్ కూడా తనకొక వాటా ఇమ్మన్నాడు. అందుకతడు పెట్టిన పెట్టుబడి... అక్షరాల అచ్చును (టైప్) డిజైన్ చేసి పెట్టడం! 
గూటెన్‌బర్గ్ వర్క్‌షాప్ మొదలైంది. హాఫ్ హంబ్రెట్ ప్రాంతంలో దూరపు బంధువు ఒకాయన ఉదారంగా ఇచ్చిన స్థలంలో ప్రింటింగ్ మిషన్ ఏర్పాటు చేసుకున్నాడు బర్గ్. మరికొన్ని గిల్డర్స్ ఫస్ట్ దగ్గరే అప్పు చేసి ఇంకో ప్రింటర్ అమర్చుకున్నాడు. ఒకదాంట్లో వందలకొద్దీ కరపత్రాలు, మతపెద్దల ప్రబోధాలు, గ్రామర్ పుస్తకాలు ప్రింట్ అయ్యేవి. రెండో మిషన్‌లో బైబిల్ ప్రింట్ అయ్యేది! 
తొలి బైబిల్‌ను పూర్తిగా ముద్రించడానికి బర్గ్‌కు మూడేళ్లు పట్టింది. 1452 నుంచి 1455 వరకు. అదే ‘గూటెన్‌బర్గ్ బైబిల్’. దానికే ఇంకో పేరు ‘42 లైన్ బైబిల్’. పేజీకి నలభై రెండు లైన్ల చొప్పున 1272 పేజీలతో లాటిన్ భాషలో 180 కాపీలు వేశారు బర్గ్. ప్రస్తుతం ఇవి ప్రపంచం మొత్తం మీద 48 కాపీలే మిగిలి ఉన్నాయి. 

*******

గూటెన్‌బర్గ్ ప్రింటింగ్ టెక్నాలజీ మెయింట్స్ పట్టణాన్ని ఒక కుదుపు కుదిపింది. ఆ ప్రకంపనలు జర్మనీలోని మిగతా ముఖ్య పట్టణాలకు వ్యాపించాయి. బర్గ్ భాగస్వాముల కన్ను కుట్టింది!
‘‘నా డబ్బు నాకు ఇచ్చెయ్’’ అన్నాడు ఫస్ట్.
‘‘ఇప్పుడా?!’’ అన్నాడు బర్గ్. 
‘‘అవును ఇప్పుడే’’ అన్నాడు ఫస్ట్.
మొత్తం బాకీ తీర్చాలంటే బర్గ్ దగ్గర ఇరవై వేల గిల్డర్స్ ఉండాలి. అంత డబ్బు కాదు కదా, కొంత డబ్బైనా బర్గ్ దగ్గర లేదు. ఉన్నదంతా సిరాలకు, కాగితాలకు పెట్టేశాడు. 
గూటెన్‌బర్గ్ బైబిల్ బయటికి వచ్చిన ఏడాదే ఆయన మీద ఆర్చిబిషప్ కోర్టులో కేసు వేశాడు ఫస్ట్. భాగస్వామ్య నిధులను దుర్వినియోగం చేశాడన్నది బర్గ్‌పై అతడు మోపిన ప్రధాన ఆరోపణ. బర్గ్‌కు వ్యతిరేకంగా తీర్పు వచ్చింది. అప్పటి వరకు ప్రింట్ అయిన పుస్తకాలు, ముద్రణ సామగ్రి అన్నీ ఫస్ట్ పరం అయ్యాయి. బర్గ్ ఒంటరిగా, వట్టి చేతులతో నిలబడ్డాడు. 
కొన్నాళ్ల తర్వాత - మెయింట్స్ నుంచి బాంబెర్గ్ పట్టణానికి వెళ్లి చిన్న ప్రింటింగ్ ప్రెస్ పెట్టుకున్నాడు. మళ్లీ మొదటి నుంచి జీవితం మొదలైంది. మళ్లీ అచ్చుగుద్దుడు అక్షరాలు తయారు చేసుకోవడం, మళ్లీ ప్రింటింగ్ మిషన్ బిగించుకోవడం! ఈ పనులకు రెండేళ్లు పట్టింది. కుప్పకూలిన ఒక మహాసౌధాన్ని ఇటుక ఇటుక పేర్చి మళ్లీ కట్టుకున్నట్లుంది బర్గ్‌కి. కట్టుకున్నాడు కానీ ఎక్కడా తన పేరు చెక్కుకోలేదు. అంటే.. ఏ పేజీలోనూ బర్గ్ తన వివరాలు ముద్రించుకోలేదు.

మెయింట్స్, బాంబెర్గ్ పట్టణాల మధ్య గూటెన్‌బర్గ్ జీవితం గడుస్తోంది. కాస్త సాఫీగా గడుస్తున్నదని అనుకుంటున్న సమయంలో మళ్లీ ఒక దెబ్బ! 1462లో ఇద్దరు ఆర్చిబిషప్‌ల మధ్య మొదలైన వివాదంలో వారిలో ఒకరికి సన్నిహితంగా ఉన్న బర్గ్... మెయింట్స్ నుంచి బహిష్కరణకు గురయ్యాడు. మెయింట్స్‌ని వదిలి ఎల్ట్‌విల్లే చేరుకున్నాడు. 
బర్గ్ వెళ్లిపోయాక విలువ తెలిసివచ్చిందో ఏమో మూడేళ్ల తర్వాత ముఖ్య బిషప్ వాన్ నాసా అతడికి ‘హోఫ్‌మాన్ (జెంటిల్మన్ ఆఫ్ ది కోర్ట్) అవార్డు ప్రకటించారు! నెలనెలా ఉపకార వేతనం, ఏడాదికోసారి యూనిఫాం, 2,180 కుంచాల ధాన్యం, పన్ను లేని రెండువేల లీటర్ల ద్రాక్షసారాయి... ఈ అవార్డు గ్రహీతలకు లభిస్తాయి. అలా గూటెన్‌బర్గ్‌కు అదృష్టం కలిసి వచ్చింది. అదృష్టం అంటే వేరే ఏమీ లేదు. తినడానికి తిండి, ఉండడానికి ఇల్లు. నమ్మక ద్రోహాలను మర్చిపోడానికి కొంత మద్యం!
తర్వాత మూడేళ్లకు గూటెన్‌బర్గ్ చనిపోయారు. ఆయన భౌతికకాయాన్ని మెయింట్స్‌లోనే ఫ్రాన్నిస్కాన్ చర్చిలో ఖననం చేశారు. కాలక్రమంలో ఆ చర్చి, బర్గ్ సమాధి శిథిలమై కనుమరుగైపోయాయి.
గూటెన్‌బర్గ్ స్మృతి చిహ్నం ఒక్కటైనా ఈ ఆధునిక ప్రపంచంలో మిగల్లేదు. 
మరేం పర్లేదు.
కాగితం మీది అక్షరాలను కళ్లకు అద్దుకుని చూడండి. ఆయన సాక్షాత్కరిస్తారు.


జోహాన్నెస్ గూటెన్‌బర్గ్,అచ్చుయంత్రం సృష్టికర్త
1398 - 3 మార్చి 1468
జన్మస్థలం : మెయింట్స్ (జర్మనీ)

తల్లిదండ్రులు : తండ్రి ఫ్రియలీ,తల్లి వైరిచ్

కుటుంబస్థానం: కడపటి బిడ్డ

వృత్తి : వడ్రంగం, కమ్మరం, ముద్రణ 

మతం : కేథలిక్

భార్య : ఎల్స్ విరిక్ 

సంతానం : కచ్చితమైన వివరాలు లేవు

ప్రతిష్ట : గూటెన్‌బర్గ్ బైబిల్ ప్రచురణ


- సాక్షి సౌజన్యంతో

No comments:

Post a Comment