కేంద్రంలోని నిరంకుశ మోడీ ప్రభుత్వానికి కార్మిక సంఘాలు గట్టి హెచ్చరికనే చేశాయి. సిఐటియు, ఎఐటియుసి, ఐఎన్‌టియుసి, బిఎంఎస్, హెచ్‌ఎంఎస్, ఎఐసిసిటియు, ఎల్‌పిఎఫ్ వంటి జాతీయ కార్మిక సంఘాల అనుబంధ యూనియన్లు, రాష్ట్రాల్లోని స్వతంత్ర యూనియన్లు కలిసి సమైక్యంగా చేపట్టిన ఈ సమ్మెలో క్యాబ్ ఆపరేటర్లు, ఆర్టీసీ యాజమాన్యాలు, ప్రభుత్వ రవాణా శాఖ సిబ్బంది, అధికారులు కూడా పాల్గొనడం విశేషం.
దేశవ్యాపితంగా బస్సులు, టాక్సీలు, ఆటో రిక్షాలకు చెందిన రెండు కోట్ల మందికి పైగా ప్రభుత్వ, ప్రైవేటు వర్కర్లు ఈ సమ్మెలో పాల్గొనడంతో రవాణా వ్యవస్థ స్తంభించిపోయింది. త్రిపుర, కేరళ, పశ్చిమబెంగాల్ వంటి రాష్ట్రాల్లో బంద్ వాతావరణం నెలకొంది. బెంగాల్‌లో తృణమూల్ కాంగ్రెస్ ప్రభుత్వం సమ్మెను విఫలం చేయాలని బలవంతంగా బస్సులు నడిపిం చినా, కొన్ని చోట్ల సమ్మె నిర్వాహకులపై తృణమూల్ గూండాలు దాడులకు తెగబడినా కార్మికులు సమ్మెను విజయవంతం చేశారు. దేశ రాజధాని ఢిల్లీతో సహా ఆంధ్రప్రదేశ్, తెలంగాణ, కర్ణాటక, తమిళనాడు, హిమాచల్‌ప్రదేశ్ ఇలా అన్ని రాష్ట్రాల్లోనూ సమ్మె జయప్రదమయింది. ఇటీవల భూకంపంతో అతలాకు తలమైన బీహార్‌ను మాత్రం ఈ సమ్మె నుంచి మినహా యించారు. రవాణా కార్మికులు ఇలా రోడ్డెక్కాల్సిన పరిస్థితి రావడానికి మోడీ ప్రభుత్వమే కారణం. ఈ ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన కొద్ది నెలలకే నూతన రోడ్డు రవాణా భద్రత పేరుతో అత్యంత అన్యాయమైన బిల్లును తీసుకొచ్చింది. అన్యాయమైనదని ఎందుకు అనాల్సి వస్తుందంటే మోటారు వర్కర్స్‌పై చిన్న నేరానికి సైతం పెద్ద శిక్షలు విధించే అనేక నిబంధనలను ఇందులో చేర్చింది. ప్రస్తుతం ఉన్న చట్టం ప్రకారం ట్రాఫిక్ సిగల్‌ను ఉల్లంఘిస్తే వంద రూపాయలు జరిమానా విధిస్తారు. కొత్త చట్టం ప్రకారం ఈ జరి మానా మూడు వేల నుంచి అయిదు వేల రూపాయల దాకా ఉంటుంది. అలాగే సీట్ బెల్టు ధరించకున్నా, డ్రైవింగ్ లైసెన్స్ లేకున్నా పెనాల్టీ మోత మోగిస్తారు. తాగి నడిపితే రూ.15 వేలు జరిమానా కట్టాల్సిందే. రోడ్డు ప్రమాదంలో పశువు చనిపోయినా ఆ వాహనాన్ని నడిపిన డ్రైవర్‌కు లక్ష రూపాయల దాకా జరిమానా, నాలుగేళ్ల దాకా జైలు శిక్ష పడుతుంది. అంతేకాదు, 15 సంవత్సరాలు నిండిన వాహనాలను కాలం తీరిన వాహనాలుగా పరిగణించి రోడ్లుపై నడపడానికి వీలు లేదన్న నిబంధనను ఇందులో చేర్చారు. వాహనాల మరమ్మతులకు అవసరమయ్యే విడి భాగాలు బ్రాండెడ్ కంపెనీవే అయివుండాలనేది మరో నిబంధన. ఇలాం టివే ఇంకా అనేక నిబంధనలను ఈ బిల్లులో చొప్పిం చారు. ఈ బిల్లు గనుక అమలులోకి వస్తే మోటారు వర్కర్లే కాదు, ప్రయాణీకులపై కూడా భారాల మోత మోగుతుంది. ఇప్పటికే టోల్ టాక్స్, మున్సిపల్ కార్పొరే షన్, జిల్లా బోర్డులు విధించే రకరకాల పన్నులకు ఇవి కూడా తోడై తడిసిమోపెడవుతాయి. రవాణా రంగంలో చిన్న చిన్న మోటారు యజమానులు, వర్కర్లు, మెకానిక్కులు, విడిభాగాల తయారీదారుల మనుగడే ప్రమాదంలో పడుతుంది. విదేశీ, బడా ట్యాక్సీ సంస్థల ప్రయోజనాల కోసం చిన్న చిన్న మోటారు ఆపరేటర్లను పణంగా పెడుతోంది మోడీ ప్రభుత్వం. ఇది ఒక రకంగా మోటారు కార్మికులపై ప్రభుత్వం యుద్ధం ప్రకటించడమే.
మరింత ఆందోళన కలిగించే అంశమేమిటంటే దేశ వ్యాపితంగా ప్రస్తుతం ఉనికిలో ఉన్న 54 రాష్ట్ర రోడ్డు రవాణా సంస్థలకు ఈ నూతన బిల్లు మృత్యు ఘంటికలను మోగిస్తున్నది. వివిధ రాష్ట్రాల ఆర్టీసీలను ప్రయివేటు ఆపరేటర్లకు అప్పగించేందుకు ఇది రాచబాట వేస్తున్నది. సామాజిక బాధ్యతను నిర్వహి స్తున్న ఆర్టీసీలకు ప్రస్తుత మోటారు వాహన చట్టం కల్పించిన సదుపాయాలను ఈ కొత్త బిల్లు పూర్తిగా హరిస్తున్నది. రిజిస్ట్రేషన్లు, లైసెన్సుల మంజూరు వంటి విభాగాలను ప్రయివేటుకు అప్పగించాలని స్పష్టంగా పేర్కొంది. రాష్ట్రాల హక్కుల్లోకి ఈ అక్రమ చొరబాటును అనేక రాష్ట్ర ప్రభుత్వాలు బాహాటంగానే విమర్శించాయి. అయినా, మోడీ ప్రభుత్వం రైతు వ్యతిరేక భూ సేకరణ బిల్లుపై వ్యవహరించినట్లే ఈ నూతన రహదారి భద్రతా బిల్లుపై కూడా మొండిగా ముందుకు వెళ్తోంది. మోటారు వర్కర్స్ యూనియన్లన్నీ కలిసి గత డిసెంబరు 18న పార్లమెంటుకు భారీ యాత్ర నిర్వహించాయి. వివిధ రూపాలలో నిరసన తెలియజేశాయి. అయినా ప్రభుత్వం దిగిరాకపోవడంతో అనివార్యమైన పరిస్థి తుల్లో సమ్మెకు పూనుకున్నాయి. ఇప్పటికైనా ప్రభుత్వం తన మొండి వైఖరిని విడనాడి రవాణా రంగాన్ని ప్రయివేట్ పరం చేసే దుష్ట ఆలోచనలకు స్వస్తి పలకాలి.
No comments:
Post a Comment