వైవాహిక జీవితంలో మహిళలపై జరిగే అత్యాచారాలను (మారిటల్ రేప్) అరికట్టడానికి బిల్లు తెచ్చే ప్రతిపాదన ఏదీ లేదని డీఎంకే సభ్యురాలు కనిమొళి రాజ్యసభలో అడిగిన ప్రశ్నకు కేంద్ర హోంశాఖ సహాయమంత్రి హరిభాయ్ చౌదరి బుధవారం ఇచ్చిన జవాబు అనేకానేక ప్రశ్నలకు తావిచ్చింది. అత్యాచారం నిర్వచనాన్ని, అందుకు విధించే శిక్షను ప్రస్తావిస్తున్న భారత శిక్షాస్మృతిలోని సెక్షన్ 375... భార్య వయసు 15 ఏళ్ల లోపు కానిపక్షంలో ఆమె అంగీకారం లేకుండా భర్త సంభోగంలో పాల్గొనడం అత్యాచారంగా పరిగణించరాదని చెబుతున్నది. మరో మాటలో చెప్పాలంటే భార్య వయసు 15 ఏళ్లు దాటినట్టయితే ఆమె అనుమతి లేకుండా లైంగిక క్రియలో పాల్గొనడం నేరం కాదని చట్టం పరోక్షంగా అంటున్నది. దీన్ని సవరించే ఆలోచన ఏమైనా చేస్తున్నారా అన్నదే కనిమొళి ప్రశ్న. పెళ్లాడిన భర్త అయినా, మరొకరైనా మహిళ సమ్మతి లేకుండా సంభోగంలో పాల్గొంటే దాన్ని అత్యాచారంగా పరిగణించాలని ఐక్యరాజ్యసమితి కోరింది.
ఆ మేరకు చట్టాలను సవరించాలని అన్ని దేశాలకూ సూచించింది. నిర్భయ ఉదంతం జరిగాక ఏర్పాటైన జస్టిస్ జేఎస్ వర్మ కమిటీ సైతం ఈ అంశంపై దృష్టి కేంద్రీకరించింది. సెక్షన్ 375లో ఉన్న మినహాయింపును తొలగించాలని సిఫార్సు చేసింది. భర్త తనపై లైంగిక అత్యాచారానికి పాల్పడ్డాడంటూ ఒక మహిళ పెట్టిన కేసుపై విచారణ సందర్భంగా గత ఏడాది ఢిల్లీ కోర్టు కొన్ని ముఖ్యమైన అంశాలను స్పృశించింది. మన దేశంలో వైవాహిక వ్యవస్థలో విస్తృతంగా నెలకొనివున్న లైంగిక అత్యాచారాలను మహిళలు మౌనంగా భరిస్తున్నారని అనడమే కాదు... లైంగిక దాడి చేసిన వ్యక్తి ఆమె భర్త అయినంత మాత్రాన బాధితురాలి విషయంలో వివక్ష ప్రదర్శించరాదని ఢిల్లీ ప్రభుత్వానికి స్పష్టం చేసింది. అత్యాచారానికి వివాహం మినహాయింపుకాదన్నది. న్యాయస్థానాలు చట్టానికి భాష్యం మాత్రమే చెబుతాయి... చట్టాలను చేయలేవు. ఆ పని చేయాల్సింది చట్టసభలు.
అయితే దుదృష్టవశాత్తూ చట్టసభలు ఇలాంటి అంశాల్లో చొరవ ప్రదర్శించలేక పోతున్నాయి. ఇప్పుడు కనిమొళి ప్రశ్నకు జవాబిచ్చిన కేంద్రమంత్రి కూడా మన వైవాహిక వ్యవస్థలో అత్యాచారాలు చోటుచేసుకోవడం లేదని వాదించలేదు. అలాంటి అత్యాచారాలను నేరంగా పరిగణించాలనే డిమాండ్‌ను అమలు చేయడం అంత సులభం కాదని మాత్రమే అంటున్నారు. అందుకు సమాజంలో అక్షరాస్యత శాతం తక్కువగా ఉండటం, పేదరికం, భిన్న సంస్కృతులు, ఆచారవ్యవహారాలు, విలువలు, మతపరమైన విశ్వాసాల వంటివి కారణంగా చెబుతున్నారు. స్వాతంత్య్రం వచ్చిన 67 సంవత్సరాల తర్వాత కూడా ఒక చట్టం చేయ(లే)కపోవడానికి ఇలాంటివి కారణాలుగా చెప్పడమంటే మన వైఫల్యాన్ని అంగీకరించడమే. వీటిని అధిగమించి ఒక తప్పును సరిచేయడం ఎలా అన్నదే ప్రభుత్వ కర్తవ్యం కావాలి తప్ప అసలు సరిదిద్దడమే అసాధ్యమనడం ధర్మం అనిపించుకోదు.
పెళ్లిని ఇక్కడ పవిత్రంగా పరిగణించే సంప్రదాయం ఉండటం కూడా చట్టం చేయలేకపోవడానికి కారణమని మంత్రి చెబుతున్నారు. ఈ సందర్భంలో మన పొరుగునున్న నేపాల్‌లో ఏం జరిగిందో ఆయన తెలుసుకోవాలి. 2008లో సెక్యులర్ రిపబ్లిక్‌గా ప్రకటించుకునేంతవరకూ అది హిందూ రాజ్యంగానే ఉంది. అక్కడి సుప్రీంకోర్టులో 2001లో మారిటల్ రేప్‌పై దాఖలైన పిటిషన్ విషయంలోనూ ఆ ప్రభుత్వం ఇలాంటి కారణాలే చెప్పింది. హిందూ సంప్రదాయం వైవాహిక వ్యవస్థను పవిత్రంగా పరిగణిస్తుందని, అందువల్ల భర్త బలత్కారాన్ని అత్యాచారంగా పరిగణించడం సాధ్యం కాదని వాదించింది. నేపాల్ సుప్రీంకోర్టు ఈ అభిప్రాయాన్ని తోసిపుచ్చింది. పెళ్లికి ముందైనా, తర్వాతైనా మహిళకు ఒక మనిషిగా హక్కులుంటాయని... వివాహమైనంత మాత్రాన ఆమె వాటిని కోల్పోదని స్పష్టంచేసింది. మారిటల్ రేప్‌ను నేరంగా ప్రకటిస్తూ తీర్పునిచ్చింది.
మన దేశంలో నిరుడు నిర్వహించిన జాతీయ కుటుంబ ఆరోగ్య సర్వే (ఎన్‌ఎఫ్‌హెచ్‌ఎస్) గణాంకాలు చూస్తే సమస్య ఎంత జటిలమైనదో అర్థమవుతుంది. లైంగిక హింసకు సంబంధించి మహిళల నుంచి వచ్చిన ఫిర్యాదుల్లో అత్యధిక భాగం వైవాహిక జీవితానికి సంబంధించినవే. బయటివారు అత్యాచారం చేశారని చెప్పిన మహిళలు కేవలం 2.3 శాతంమంది మాత్రమే. మిగిలినవారంతా భర్తలనే దోషులుగా చూపారు. సమస్య ఉన్నదని గుర్తించినప్పుడు దానికి పరిష్కారం వెతకాల్సిన బాధ్యత... అందుకవసరమైన మార్గాన్వేషణ చేయాల్సిన బాధ్యత ప్రభుత్వానిదే. సంప్రదాయం పేరుచెప్పి సమాజంలో సగభాగంగా ఉన్నవారి హక్కులను గుర్తించ బోమనడం, వారిని బాధితులుగానే మిగల్చడం అనాగరికం అనిపించుకుంటుంది.
No comments:
Post a Comment