అంతర్జాలంలోని అన్నిరకాల ముఖ్యమైన సమాచారాన్ని ఈ సైట్ లో నిక్షిప్తం చేసి, అందరికీ ఉపయోగపడే ఒక వేదికగా ఈ సైట్ ఉండాలనే ఉద్దేశ్యంతో ప్రారంభించడమైంది. ఏ సైట్ నుండి సమాచారం తీసుకున్నా వారి పేరుతోనే ఇందులో వుంచుతాను. సహృదయంతో సహకరించగలరు.
ఎవరికైనా అభ్యంతరముంటే వారి సైటుకు సంబంధించిన సమాచారం తొలగించడం జరుగుతుంది. - ధన్యవాదములతో...

Friday, January 27, 2012

గొంతు దిగని గుడ్డు


విద్యార్థికోసమిచ్చే డబ్బు రూ. 3.84 
గుడ్డు వెల రూ. 4 
పెరిగిన కూరగాయల ధరలు 
భోజన నిర్వాహకులకు కష్టాలు 

తెనాలి, అమృతలూరు, న్యూస్‌టుడే
మంది పెరిగితే మజ్జిగ పలుచన. మెనూలో ధరలు పెరగకపోతే చారు పల్చన. ఆకు కూరే. ఆకులుండవు. కిచిడీలో పోషక విలువలు ఎక్కువే అయితే ఎక్కడా కానరావు. ప్రత్యామ్నాయంగా పులిహోర విదిలింపులు. నీళ్ల సాంబారు, ఉల్లి ముక్కలతో పులుసుకూర. ఇదీ పాఠశాల విద్యార్థులకు ప్రభుత్వం పోషకాహారం పేరుతో అందచేస్తున్న మెనూ. నిర్వహణ చూస్తే అంతా నేతి బీర చందంగా మారింది.

పాఠశాల విద్యార్థులకు పోషకాహారం అందించి గైర్హాజరు శాతాన్ని తగ్గించాలనే ఉద్దేశంతో ప్రభుత్వం భోజన పథకం ప్రవేశపెట్టింది. పెరిగిన ధరలు, పెరగని మెనూ ఛార్జీలతో భోజనం పిల్లల గొంతు దిగనంటోంది. ధరలు ఆకాశాన్నంటి కూరలు పలుచబడిపోతే ఉన్న దానిలో కొంత ఏజెన్సీలు వెనకేసుకోగా మిగిలిందే పిల్లలకు దక్కుతోంది. జిల్లాలో పోషకాహారం పరిస్థితి ఇలా ఉంటే ప్రభుత్వం మాత్రం మెనూ ఛార్జీలు పెంచే ఆలోచనే చేయక పోవటంతో లక్ష్యం నీరుగారుతోంది. మొదట ప్రాథమిక పాఠశాలల విద్యార్థులకు ఈ పథకాన్ని వర్తింప చేసినా తర్వాత ఉన్నత పాఠశాలల్లోనూ అందించారు.
2.6 లక్షల మందికే భోజనం: జిల్లాలో ప్రాథమిక, ప్రాథమికోన్నత, ఉన్నత పాఠశాలలు మొత్తం 3,787 ఉన్నాయి. వీటిలో 4,04,048 మంది విద్యార్థులు చదువుకుంటున్నారు. వీరిలో సగం మందికే ప్రభుత్వం భోజనాన్ని అందిస్తోంది. మొత్తం మీద 2,61,974 మంది విద్యార్థులు ఈ పథకం కింద భోజనం తింటున్నారు. వీరిలో ఉన్నత, ప్రాథమికోన్నత పాఠశాలల విద్యార్థులకు రోజుకు ఒక్కరికి రూ. 4.40 ఇస్తుంటే ఈ మెనూ కింద భోజనం అందుతున్న విద్యార్థులు 89,746 మంది ఉన్నారు. ప్రాథమిక పాఠశాలల విద్యార్థులు మరో 1,72,228 మంది ఉంటే, వీరికీ రోజుకు ఒక్కొక్కరికి రూ. 3.84 భోజనానికి ఇస్తోంది. 89,746 మంది విద్యార్థులకు నెలకు రూ. 1.18 కోట్లు , 1,72,228 మంది ప్రాథమిక పాఠశాలల విద్యార్థులకు నెలకు రూ. 1.98 కోట్లు వెచ్చిస్తున్నారు.

మెనూ ఇలా... 
ప్రతిరోజూ ఒక్కో రకం ఆహారాన్ని అందించాలనేది ప్రభుత్వ నిర్ణయం. ఈ మేరకే మెనూ రూపొందించింది. దీని ప్రకారం ప్రతి సోమవారం అన్నంతోపాటు ఆకుకూర పప్పు, మంగళవారం సాంబారు, బుధవారం సాంబారుతోపాటు ఒక కోడి గుడ్డు ఇవ్వాలి. గురువారం కిచిడీ కానీ, పులిహోర కానీ అందించాలి. శుక్రవారం సాంబారుతోపాటు ఒక గుడ్డు ఇవ్వాలి. శనివారం ఒక పులుసుకూర ఉండాలి. అయితే ఎక్కడా ఈ మెనూ కచ్చితంగా అమలు జరుగుతున్న దాఖలాలు లేవు. భోజన నిర్వాహకులకు కూడా ప్రభుత్వం ఇస్తున్న మొత్తం చాలక వీటి నిర్వహణ భారమవటంతో ఆరోజు కూరల్లో ఏది తక్కువకు ధరకు దొరికితే అది చేరుస్తున్నారు. కొందరైతే ఉన్న దానిని పలుచన చేసి పది మంది భోజనాన్ని పాతిక మందికి అందిస్తున్నారు.

గుడ్డు గోవిందా 
ప్రభుత్వం పాఠశాల విద్యార్థులకు అందించాలనుకున్న పోషకాహారంలో ప్రధానమైనది గుడ్డే. ప్రభుత్వం నిర్ణయించిన ప్రకారం బుధ, శుక్ర వారాల్లో గుడ్డు తప్పనిసరిగా పిల్లలకు ఇవ్వాల్సిందే. కానీ ప్రస్తుతం మార్కెట్‌లో ఒక్కో గుడ్డు ధర రూ. 3.50 నుంచి రూ. 4 వరకు ఉంది. ప్రాథమిక పాఠశాల విద్యార్థులు 1,72,228 మందికి ఇవ్వాలంటే గుడ్డు ధర రూ. 4 ప్రకారం రోజుకు రూ. 6.88 లక్షలు ఖర్చవుతుంది. అయితే ఒక్కో బాలునికిచ్చే రూ. 3.84 పైసల ప్రకారం ప్రభుత్వం వీరికిచ్చేదే రూ. 6.61 లక్షలే. అంటే మరో రూ. 27 వేలకుపైగా అదనంగా ఏజెన్సీలకే ఖర్చవుతోంది. నాలుగు డబ్బులు మిగులుతాయని భోజన పథకానికి సిద్దపడిన ఏజెన్సీలు అసలుకే ఎసరు వస్తుండటంతో చాలాచోట్ల ఒక గుడ్డును మింగేస్తున్నారు. డెల్టా ప్రాంతంలో అయితే తెనాలి, అమృతలూరు, కొల్లూరు, వేమూరు రేపల్లె, తీరంలోని మిగిలిన మండలాల్లో వారంలో ఒక్క రోజే గుడ్డు పెడుతున్నారు. పల్నాడు ప్రాంతంలో అయితే అదీలేదు. మాచర్ల, పిడుగురాళ్ల, వినుకొండ, మరికొన్ని ప్రధాన పట్టణ కేంద్రాల్లోనే గుడ్డు లేకుండా చేస్తున్నారు. నెలలోనే ఒకటి, రెండు సార్లు పెడుతుండటం గొప్పేనని విద్యార్థుల తల్లిదండ్రులు ఆరోపిస్తున్నారు. ఒక్క గుడ్డుకే అదనపు వ్యయం వారి చేతుల్లో నుంచి పెట్టాల్సి వస్తే మిగిలిన సాంబారు ఎలా ఉంటుందనేది చెప్పనవసరంలేదు. అంతా నీళ్లమయమే. వీటన్నిటికితోడు వంటకు అయ్యే దినుసులు, కట్టె పుల్లలు లేదా గ్యాస్‌ ఖర్చూ అదనమే.

పెంచకుంటే నీళ్ల చారే 
ప్రస్తుతం మార్కెట్‌లో ఉన్న ధరల ప్రకారం ప్రభుత్వం ఇచ్చే మెనూ అదే ధరతో నిర్వహించటం కష్టమేననేది నిర్వాహకుల ఆవేదన. ఛార్జీలు పెంచకుంటే నీళ్ల చారు, పలుచని కూరలు తప్ప మేం తెచ్చి పెట్టలేమని వారు నిర్మొహమాటంగా చెబుతున్నారు. నిజంగా పిల్లలకు పోషకాహారాన్ని అందించాలనే ఉద్దేశంతో ప్రభుత్వం ఉంటే తాము కేటాయించిన మెనూ ధర ఏ మూలకూ సరిపోదు. ఉదాహరణకు సోమవారం ఆకుకూర పప్పు ఇవ్వాలంటే ఆకు కూరలకు ఒక్కో కట్టకే రూ. 2 వెచ్చించాలి. కిలో కందిపప్పు రూ. 55 నుంచి 60వరకు ఉంది. దీని ప్రకారం ఒక్కో బాలునికి ఈ ధరలతోపాటు గ్యాస్‌, వంట నూనె, మిగిలిన దినుసుల ఖర్చులు కలిపి రూ. 5.80 నుంచి రూ. 6.50 వరకు పడుతోంది. ప్రభుత్వం ఇచ్చేది సగమే. సాంబారు తయారీకీ మరికొన్ని కూరగాయలకు అదనపు ఖర్చు తప్పదు. మెనూ ప్రకారం ఇచ్చే ధర ఒక్క సాంబారుకు మాత్రం బొటాబొటీగా సరిపోతుంది. దీంతోపాటు గుడ్డు పెట్టాలంటేనే కష్టం. కిచిడి, పులిహోరల్లో ఒకటి పెట్టాలి. కిచిడీకీ మరికొన్ని కూరగాయలు వేయాల్సిందే. వీటికి అదనపు ఖర్చు పెట్టలేక ఏకంగా కిచిడీనే ఎత్తేశారు. మిగిలిన రోజుల్లో మెనూతీరూ ఇదే తరహాలో ఉంది. ఈ ధరలన్నీ చూసి నిర్వాహకులు మధ్యాహ్న భోజనం పెట్టలేమని చెబుతున్నారు. ఇప్పటికైనా ప్రభుత్వం మెనూను మార్చి ధర పెంచితేనే అనుకున్న పోషకాహార లక్ష్యం నెరవేరేది.

No comments:

Post a Comment