లండన్ Tue, 31 Jan 2012, IST
- ఓ పక్క జనాభా పెరుగుదల
- మరో పక్క ఆహారం, నీరు, ఇంధన కొరతలు
- ఐరాస నివేదిక వెల్లడి
ప్రపంచానికి ప్రమాద ఘంటికలు మోగుతున్నాయి. ముందున్నది గడ్డు కాలమేననే హెచ్చరికలు వినబడుతున్నాయి. ప్రభుత్వాలు, పాలకులు, ప్రజలు అజాగ్రత్తగా, నిర్లక్ష్యంగా ఉన్నట్లయితే ఇక్కట్లు తప్పవన్న
నిష్టుర సత్యాన్ని ఐక్యరాజ్య సమితి సోమవారం విడుదల చేసిన తాజా నివేదికలో వెల్లడించింది. పెరుగుతున్న ప్రపంచ జనాభాకు అనుగుణంగా ఆహారం, నీరు, ఇంధనం మొదలైన వనరులు తగినంతగా అందుబాటులో లేవని, వీటికి తీవ్ర కొరత ఏర్పడుతోందని ఐరాస నివేదిక హెచ్చరించింది. ప్రపంచ జనాభా పెరుగుతున్న స్థాయిలో ఈ వనరులు పెరగడం లేదని, ఇందుకు ప్రధాన కారణం పాలకుల విధానాలేనని నివేదిక స్పష్టం చేసింది. ప్రస్తుతం ప్రపంచ అభివృద్ధి నమూనా నిలకడగా లేదని, అది గాడిలో పడాలంటే రాజకీయ చిత్తశు ద్ధి అవసరమని పేర్కొంది. శరవేగంగా పెరుగుతున్న జనాభాకు అనుగుణంగా తగినంత ఆహారం, నీరు, ఇంధనం మొదలైన వనరులను ప్రజలకు అందుబాటులో ఉంచాల్సిన అవసరం ప్రభుత్వాలపై ఉంది. ఈ పని చేయలేకపోతే 300 కోట్ల మంది దారిద్య్రంలో మగ్గుతారు. ఇప్పుడు 700 కోట్లుగా ఉన్న జనాభా 2040 నాటికి 900 కోట్లు అవుతుంది. వచ్చే ఇరవై ఏళ్ళు, ఆ పైన మధ్య తరగతి వినియోగదారులు 300 కోట్లకు పైగా పెరుగుతారు. కాబట్టి అవసరమైన ప్రాథమిక వనరుల కోసం డిమాండ్ పెరుగుతుంది. 2030 నాటికే ప్రపంచానికి కనీసం 50 శాతం కంటే ఎక్కువ ఆహారం అవసరమవుతుంది. అలాగే, 45 శాతం కంటే ఎక్కువ ఇంధనం, 30 శాతాన్ని మించి నీరు అవసరమవుతాయి. అయితే ఆ సమయానికి మారిన వాతావరణ పరిస్థితుల కారణంగా వనరుల సరఫరాకు కొత్త పరిమితులు ఏర్పడతాయని ఐక్యరాజ్య సమితి నివేదిక అంచనా వేసింది. వనరుల కొరతను తీర్చడంలో ప్రపంచం విఫలమైనట్లయితే 300 కోట్ల మంది వరకూ దారిద్య్రంలో మగ్గాల్సిన పరిస్థితి ఏర్పడుతుందని నివేదిక తెలిపింది. నిలకడైన అభివృద్ధి కోసం వేగంగా, పటిష్టంగా ప్రయత్నాలు జరగడంలేదని, రాజకీయ చిత్తశు ద్ధి కూడా లోపించిందని నివేదిక రూపొందించిన ఐరాస ఉన్నత స్థాయి కమిటీ పేర్కొంది. 'ప్రస్తుత ప్రపంచ అభివృద్ధి నమూనా నిలకడగా కొనసాగడం లేదు. ఇది స్థిరత్వం సాధించాలంటే ప్రపంచ ఆర్థిక వ్యవస్థ రూపాంతరం చెందాల్సిన అవసరముంది' అని నివేదిక తెలిపింది. 'మరమ్మతులు చేసే పని వద్దు. సంక్షోభంలో ఉన్న ప్రస్తుత ప్రపంచ ఆర్థిక వ్యవస్థ ముఖ్యమైన సంస్కరణలు కోరుకుంటోంది' అని ఐరాస నివేదిక స్పష్టం చేసింది.
నివేదికలోని కొన్ని ముఖ్యాంశాలు
* ప్రస్తుతం ప్రపంచంలో 20 కోట్ల మంది పౌష్టికాహార లోపంతో బాధపడుతున్నారు.
* ఏటా 52 లక్షల హెక్టార్ల విస్తీర్ణంలో అడవులు తరిగిపోతున్నాయి. ఈ విస్తీర్ణం కోస్టారికా దేశంతో సమానం.
* అన్ని రకాల మత్స్య సంపద 85 శాతం మేరకు తరిగిపోతోంది.
* 1990-2009 మధ్య కర్బన ఉద్గారాలు 38 శాతం మేరకు పెరిగాయి.
ప్రపంచానికి కొత్త రాజకీయ ఆర్థిక వ్యవస్థ అవసరమని పేర్కొన్న ఐరాస నివేదిక నిలకడైన వృద్ధి కోసం 56 సిఫార్సులు చేసింది.
No comments:
Post a Comment