అంతర్జాలంలోని అన్నిరకాల ముఖ్యమైన సమాచారాన్ని ఈ సైట్ లో నిక్షిప్తం చేసి, అందరికీ ఉపయోగపడే ఒక వేదికగా ఈ సైట్ ఉండాలనే ఉద్దేశ్యంతో ప్రారంభించడమైంది. ఏ సైట్ నుండి సమాచారం తీసుకున్నా వారి పేరుతోనే ఇందులో వుంచుతాను. సహృదయంతో సహకరించగలరు.
ఎవరికైనా అభ్యంతరముంటే వారి సైటుకు సంబంధించిన సమాచారం తొలగించడం జరుగుతుంది. - ధన్యవాదములతో...

Thursday, January 24, 2013

బాలికలు తగ్గారు! - జాతీయ బాలికల దినోత్సవం



సామాజిక, ఆర్థిక పరిస్థితుల కారణంగా గత దశాబ్ద కాలంలో బాలికల శాతం తగ్గింది. గత దశాబ్ద కాలంలో సుమారు 30 లక్షల మంది బాలికలు అదృశ్యమయ్యారు.
Written by Parvathi On 1/24/2013 11:41:00 AM
ఆడపిల్ల పుడితే ఆడపిల్ల కాదు... పాడు పిల్ల అనే అవగాహన నుంచి బయటపడితే మహిళల మీద జరుగుతున్న హింసకు అడ్డుకట్ట పడుతుంది. ఆడపిల్ల పుట్టుక భారంగా భావించి పురిటిలోనో, గర్భస్థ శిశువుగానో కడతేర్చే పరిస్థితులున్న సమాజంలో వారి భద్రత ఎప్పుడూ ప్రశ్నార్థకంగానే మారింది. చాలా సందర్భాల్లో ఆడ శిశువులను పిండంగానే పరిమారుస్తున్న పరిస్థితి నిత్యం జరుగుతోంది.


బాలికలైతే భారమని, మగపిల్లలైతే లాభమన్న భావన కారణంగానే తల్లిదండ్రులు ఆడశిశువులంటేనే అయిష్టత చూపుతున్నారు. ఈ కారణంతోనే కొందరు లింగ నిర్ధారణ పరీక్షలకు, మరికొందరైతే భ్రూణహత్యలకు సైతం తెగిస్తున్నారు. సామాజిక, ఆర్థిక పరిస్థితుల కారణంగా గత దశాబ్ద కాలంలో బాలికల శాతం తగ్గింది. గత దశాబ్ద కాలంలో సుమారు 30 లక్షల మంది బాలికలు అదృశ్యమయ్యారు. దీంతో బాలబాలికల లింగనిష్పత్తిలో వ్యత్యాసం అధికమవుతోందని, మొత్తం జనాభాలో బాలికల సంఖ్య తగ్గిందని కేంద్ర గణాంక శాఖ విడుదల చేసిన ‘చిల్డ్రన్ ఇన్ ఇండియా 2012- ఏ స్టాటిస్టికల్ అప్రైజల్’ నివేదిక తెలిపింది.

కేంద్ర ప్రభుత్వం జనవరి 24ని జాతీయ బాలికల దినోత్సవంగా ప్రకటించిన విషయం తెలిసిందే. అయితే పాలకులు ప్రకటనల వరకే పరిమితం అవుతున్నాయి. ఆచరణలో మాత్రం హక్కుల అమలుకు కృషి చేయటం లేదు. మహిళలు ప్రగతి సాధిస్తున్నారని చెబుతున్నా.. ఆడపిల్లల విషయానికి వస్తే పరిస్థితి ఆందోళనకరంగానే ఉందని చెప్పాలి.

దేశంలో ప్రతి 1000 మంది పురుషులకు 940 మంది మహిళలు ఉన్నారు. 2001 సెన్సెస్‌ ప్రకారం వెయ్యిమంది పురుషులకు 933 మంది మహిళలు ఉండేవారు. ఇప్పుడు 6 సంవత్సరాల లోపు ఆడపిల్లలైతే ప్రతి 1000 మంది మగ పిల్లలకు 914 మంది మాత్రమే ఉన్నారు. ఇది ఆందోళన కలిగించే విషయమే.

దీని బట్టి మహిళల నిష్పత్తి ఎలా దిగజారుతోందో అర్థం అవుతోంది. భ్రూణ హత్యలు పెరగడమే దీనికి కారణం కాగా, మరోవైపు బాలకార్మిక సంఖ్యలోనూ బాలికలే ఎక్కువగా ఉన్నారు. రోజూ 10 నుంచి 12 గంటల వరకు లెక్కకురాని పనిచేస్తూ బాలికలు తమ బాల్యాన్ని కోల్పోతున్నారు. వారు పాఠశాలలకు వెళ్ళినా లైంగిక వేధింపులు, వసతుల లేమి, వివక్ష వంటి సమస్యలతో చదువును కోల్పోతున్నారు.

కాగా పుట్టి పెరుగుతున్న క్రమంలో తోబుట్టువులైన మగపిల్లలకు అన్ని సౌకర్యాలు అమరుతుండగా ఆడపిల్లలు పౌష్టికాహర లోపంతో బాధపడుతున్నారు. చదువు సౌకర్యాలతో పాటు అన్ని విషయాల్లో వారు ద్వితీయ స్థానంలోనే ఉంటున్నారు. బాల్యవివాహాలు, గృహహింస వెంటాడుతూనే ఉన్నాయి. ఇన్నింటిని దాటుకొని బతికి బట్టకట్టిననాడు తరువాత కాలంలో ప్రసవ సమయంలో పోషకాహార లోపంతో అర్ధంతరంగా మరణిస్తోంది. ఇక ఖర్మకాలి భర్తను కోల్పోయి వితంతువు అయినట్లయితే అత్తింటివారు తన్ని తరిమేసే పరిస్థితి నెలకొంది. ఒక చోట అని కాక అడుగడుగునా ఓ ఆపద పొంచి ఉంది.

ఆడశిశువును ఆర్థిక భారంగా భావించనినాడు వారిపట్ల వివక్ష ఆగిపోతుంది. ఈ అవగాహనే వారికి ఏ విలువ ఇవ్వని పరిస్థితికి దారితీస్తోంది. ఇదే కారణంగా వారి ప్రతి కదలికను నియంత్రిస్తోంది. మరోవైపు దేశంలో చిన్నారులపై జరుగుతున్న నేరాల సంఖ్య రోజురోజుకు పెరుగుతూ ప్రమాద స్థాయికి చేరుతున్నది. దీంతోపాటు 0 నుంచి 6 సంవత్సరాలలోపు ఉన్న బాలబాలికల సంఖ్య క్రమంగా తగ్గుతూ వస్తోంది. మరోవైపు లింగ నిర్థారణ పరీక్షలు చట్టవ్యతిరేకమని, భ్రూణహత్యలు శిక్షార్హమైన నేరాలని ప్రభుత్వాలు ఎంతగా హెచ్చరికలు చేస్తున్నా, తల్లిదండ్రుల వైఖరిలో మార్పు రావటం లేదు.

నేడు జాతీయ బాలికల దినోత్సవం సందర్భంగా....

No comments:

Post a Comment