అంతర్జాలంలోని అన్నిరకాల ముఖ్యమైన సమాచారాన్ని ఈ సైట్ లో నిక్షిప్తం చేసి, అందరికీ ఉపయోగపడే ఒక వేదికగా ఈ సైట్ ఉండాలనే ఉద్దేశ్యంతో ప్రారంభించడమైంది. ఏ సైట్ నుండి సమాచారం తీసుకున్నా వారి పేరుతోనే ఇందులో వుంచుతాను. సహృదయంతో సహకరించగలరు.
ఎవరికైనా అభ్యంతరముంటే వారి సైటుకు సంబంధించిన సమాచారం తొలగించడం జరుగుతుంది. - ధన్యవాదములతో...

Sunday, January 27, 2013

రూ.లక్ష కోట్లు కావాలి!

భారీగా 'హైమా' సమగ్ర ప్రణాళిక భారం
నిధులు కేటాయింపు అంత సులువు కాదు

ఈనాడు, హైదరాబాద్‌, January 25, 2013
అవును... నిజమే... తాజాగా రాష్ట్ర ప్రభుత్వం ఆమోదించిన హైదరాబాద్‌ మాస్టర్‌ ప్లాన్‌ను అమలు చేయాలంటే ఒకటి కాదు... రెండు కాదు... అక్షరాల లక్ష కోట్ల రూపాయలు అవసరం. రానున్న 20 ఏళ్లలో ఇంత భారీ మొత్తం కేటాయించేందుకు ప్రభుత్వం సిద్ధమేనా? లేక మునుపటి ప్రణాళికల మాదిరిగానే ఇదీ కాగితాలకే పరిమితం కానుందా? అన్న సందేహాలు వ్యక్తమవుతున్నాయి. నగరంతో పాటు సరిహద్దున ఉన్న అయిదు జిల్లాల్లోని 5,965 చదరపు కిలోమీటర్ల పరిధిలో హైదరాబాద్‌ మహానగరాభివృద్ధి సంస్థ (హైమా) అభివృద్ధి మాస్టర్‌ ప్లాన్‌ ఖరారైంది. సుమారు రెండేళ్ల కసరత్తు అనంతరం ఒక కొలిక్కివచ్చిన దీనికి ఎట్టకేలకు రాష్ట్ర ప్రభుత్వం ఆమోద ముద్ర వేసింది.


మహా నగరం అనూహ్యంగా విస్తరిస్తున్న నేపథ్యంలో వ్యూహాత్మక అభివృద్ధికి వీలుగా మాస్టర్‌ ప్లాన్‌ను తయారు చేశారు. ఆ ప్రకారం ఆయా ప్రాంతాల్లో కనీస ప్రణాళికను రూపొందించేందుకు అవసరమైన వనరులు ఎలా అన్నది చిక్కుప్రశ్నగా మారుతోంది. హైమా వార్షిక బడ్జెటు రూ.2,500 కోట్ల నుంచి రూ. 3,000 కోట్ల మధ్యలో ఉంది. సుమారు రూ.1,100 కోట్ల మేర అప్పులు ఇప్పటికే ఆ సంస్థకు పెరుభారంగా పరిణమిస్తున్నాయి. ఇదికాక ఆదాయ పన్ను శాఖకు మరో రూ.700 కోట్లు చెల్లించాల్సి ఉంది. ఆర్థికంగా అతలాకుతలం అవుతున్న నేపథ్యంలో ఇంతటి బృహత్‌ ప్రణాళికను ఏ మేరకు అమలు చేస్తార్నది ప్రశ్నార్థకమే.

ఎలా ఖర్చు చేయాలంటే...
రానున్న 20 సంవత్సరాల్లో ఈ ప్రణాళికను కార్యరూపంలోకి తీసుకురావాలంటే రూ.లక్ష కోట్లను ఆయా విభాగాలు ఖర్చు చేయాల్సి ఉంటుంది. హైమా ఒక్కటే ఇంత మొత్తాన్ని ఖర్చు చేయాల్సిన అవసరం లేకపోయినప్పటికీ అన్ని విభాగాలు సంయుక్తంగా ముందుకు రావాల్సిందే. ఎంపిక చేసిన 13 అర్బన్‌ నోడ్స్‌కు వేరువేరు మాస్టర్‌ ప్లాన్లను తయారు చేయించాల్సి ఉంటుంది. ఆయా ప్రాంతాల్లో పూర్తి స్థాయిలో మౌలిక వసతులు కల్పించాలి. మాస్టర్‌ ప్లాన్‌ పరిధి అంతటికీ రవాణా వ్యవస్థ ఏర్పాటు చేయటం అంత సులువైంది కాదు. భారీ ఖర్చుతో పాటు విస్తృత కసరత్తును అవసరం.. ప్రాంతీయ రింగు రోడ్ల నిర్మాణానికి భారీ స్థాయిలో భూసేకరణ చేయాల్సి ఉంటుంది. ప్యాసింజర్‌, రవాణా కేంద్రాలను ఏర్పాటు చేసేందుకు ప్రాంతాలను గుర్తించింది. వాటిని కార్యరూపంలోకి తీసుకురావాల్సి ఉంది. మాస్టర్‌ప్లాన్‌ రూపొందించిన పరిదిలో అన్నీµ పంచాయతీలు, నగర పాలక సంస్థలే ఉన్నాయి. వాటి ఆర్థిక పరిస్థితి జీతభత్యాలకే అంతంత మాత్రంగా ఉంది. ఈ నేపథ్యంలో ప్రభుత్వం చొరవ చూపాల్సిన అవసరం ఉందని నిపుణులు చెబుతున్నారు.

ఆ ఏడూ అంతంత మాత్రమే!
హైమా పరిధిలో ఇప్పటికే ఏడు మాస్టర్‌ ప్లాన్లు అమలులో ఉన్నాయి. ఇప్పటికి ఏ ఒక్కటీ కనీసం 30 శాతం అమలు చేసిన దాఖలాలు లేవు. అన్ని ప్రణాళికలు కాగితాల్లో భద్రంగా ఉన్నాయి. అవన్నీ ఆచరణకు ఆమడ దూరంలో ఉన్నట్లు అధికారులు సైతం అంగీకరిస్తున్నారు. మునుపటి హైదరాబాద్‌ నగర పాలక సంస్థ (172 చదరపు కిలోమీటర్ల విస్తీర్ణం) పరిధికి 1975 తొలిసారి మాస్టర్‌ ప్లాన్‌ రూపొందించారు. ఆ తరువాత 2010లో సవరించారు. ఈ ప్రణాళిక మాత్రం కొంత అమలులోకి వచ్చింది. మునుపటి హైదరాబాద్‌ పట్టణాభివృద్ధి సంస్థ(మునుపటి హుడా) పరిధిలోని అభివృద్ధికి 1980లో ప్రణాళిక తయారు చేశారు. 2001లో సైబరాబాద్‌ అభివృద్ధి ప్రణాళికను, 1988లో సంగారెడ్డి మాస్టర్‌ప్లాన్‌, 1989లో భువనగిరి ప్రాంతానికి ప్రణాళిక, 2001లో సైబరాబాద్‌ డెవలప్‌మెంట్‌ అథారిటీ, 2008లో ఎయిర్‌పోర్టు డెవలప్‌మెంట్‌ అథారిటీ, 2008లోనే అవుటర్‌ రింగు రోడ్డు గ్రోత్‌కారిడార్‌ డెవలప్‌మెంట్‌ అథారిటీల మాస్టర్‌ ప్లాన్‌లను ప్రభుత్వం ఆమోదించింది. ఒక్క మునుపటి హైదరాబాద్‌ నగర పాలక సంస్థ మాస్టర్‌ ప్లాన్‌ మాత్రమే కొంత మేరకు అమలులోకి వచ్చింది. రాష్ట్ర రాజధాని నగరం కావటంతో నగర పాలక సంస్థ ఆర్థికంగా ఒక్కింత మెరుగ్గా ఉండటంతో ప్లాన్‌ను కొంతమేర అమలు చేయగలిగింది. మిగిలినవన్నీ అంతంత మాత్రంగానే ఉన్నాయి. శంషాబాద్‌ విమానాశ్రయం మినహా మిగిలింది ఇంకా కార్యరూపంలోకి రాలేదు. ఈ నేపథ్యంలో హైమా తాజాగా రూపొందించిన మాస్టర్‌ ప్లాన్‌ను రానున్న 20 ఏళ్లల్లో ఎంతమేరకు అమలు చేస్తారన్నది ప్రశ్నార్ధకమే. మాస్టర్‌ ప్లాన్‌ను ఆచరణలోకి తెచ్చేందుకు అవసరమైన నిధులు

(నిపుణుల అంచనా మేరకు... రూ.వేల కోట్లలో)
రవాణా నెట్‌ వర్క్‌: 25 వేలు
అర్బన్‌ నోడ్స్‌, అర్బన్‌ సెంటర్లు: 20 వేలు
ప్రాంతీయ రింగు రోడ్లకు: 15 వేలు
ప్యాసింజర్‌, రవాణా టెర్మినళ్లు: 15 వేలు
మౌలిక వసతులు: 15 వేలు
పార్కులు, పచ్చదనం: 2 వేలు
అధ్యయనాలు, ఇతర అవసరాలు: 8 వేలు

No comments:

Post a Comment