Fri, 2 Mar 2012, IST
వ్యవసాయం దివాళ తీయడానికి ఉపాధిపథకం కారణం కాదు. ప్రభుత్వ విధానాలే. మార్కెట్ మాయా జాలం, ధళారుల దోపిడి ముఖ్యకారణం. ఈ సంవత్సర కాలంలో ఎరువుల ధరలు రెండు రెట్లు పెరిగాయి. రైతుల పెట్టుబడులు భారీగా పెరిగాయి. ప్రభుత్వ రుణాలు అందక, విద్యుత్ సౌకర్యం లేక అతివృష్టి, అనావృష్టి. వీటికి తోడు అనేక కష్టాలుపడి చెమటోడ్చి పండించిన పంటకు గిట్టుబాటు ధరలేదు.
జాతీయ ఉపాధి హామీ చట్టాన్ని వ్యవసాయానికి అనుసంధానం చేయడం గురించి అసెంబ్లీలో పెద్ద చర్చే జరిగింది. ఒక్క సిపియం మినహా అన్ని రాజకీయ పార్టీలు ఉపాధి హామీ కింద వ్యవసాయ పనులు చేపట్టాలని డిమాండ్ చేశాయి. ప్రధాన ప్రతిపక్షపార్టీ నాయకుడు చంద్రబాబు నాయుడు ఒకడుగుముందుకేసి వ్యవసాయానికి అనుసంధానం చేస్తూ తీర్మానం చేయాలని పట్టు బట్టారు. తామూ అదే ఆలోచనతో ఉన్నామని, కేంద్రం అనుమతి ఇచ్చిన మరుక్షణమే దీన్ని అమలు చేస్తామని ముఖ్యమంత్రి పేర్కొన్నారు. ఉపాధి హామీ చట్టాన్ని పకడ్బందీగా అమలు చేసి పేదలకు ఉపాధి కల్పించాల్సిన ముఖ్యమంత్రి, మాజీ ముఖ్యమంత్రి ఈ రకంగా మాట్లాడడం పేదప్రజల పట్ల వారికున్న ప్రేమ ఏపాటిదో అర్థమవుతుంది.
ఉపాధి పధకం వల్ల కూలీరేట్లు భారిగా పెరిగాయని, కూలీలు దొరకడంలేదని వ్యవసాయ రంగం దివాళా తీస్తుందని ముఖ్యమంత్రి చెప్పడం ఆయన భూస్వామ్య మనస్తత్వానికి నిదర్శనం. వ్యవసాయం దివాళ తీయడానికి ఉపాధిపథకం కారణం కాదు. ప్రభుత్వ విధానాలే. మార్కెట్ మాయా జాలం, ధళారుల దోపిడి ముఖ్యకారణం. ఈ సంవత్సర కాలంలో ఎరువుల ధరలు రెండు రెట్లు పెరిగాయి. రైతుల పెట్టుబడులు భారీగా పెరిగాయి. ప్రభుత్వ రుణాలు అందక, విద్యుత్ సౌకర్యం లేక అతివృష్టి, అనావృష్టి. వీటికి తోడు అనేక కష్టాలుపడి చెమటోడ్చి పండించిన పంటకు గిట్టుబాటు ధరలేదు. ఈ సంవత్సరం మిర్చి, పత్తి, వేరుశనగ పంటకు గిట్టు బాటు ధరలేక అనేక మంది అప్పులు పాలై ఆత్మహత్యలు చేసుకుంటున్నారు. గత సంవత్సరం మిర్చి క్వింటాల్ 10వేలు అమ్ముడుపోతే ఈ సంవత్సరం 4వేలకు కొనేదిక్కు లేదు. పత్తి 5వేల నుండి 3వేలకు పడిపోయింది.
ఉపాధి పథకాన్ని అనుసంధానం చేయడంపై రెండు వాదనలు ఉన్నాయి. మొదటివాదన ప్రకారం పేదల భూముల్ని అభివృద్ధి చేయడం, పంట కాల్వల పూడిక తీయడం, కొత్తగా తవ్వడం, చెరువులు , కుంటల పూడిక తీయడం, పంట పొలాలకు మట్టిరోడ్లు వేయడం, భూగర్భ జలాల పెంపుకోసం చెక్ డ్యాంలు, వాటర్ షెడ్‌లు నిర్మించడం, పేదల భూముల్లో బావులు తవ్వడం. తద్వారా వ్యవసాయాన్ని అభివృద్ధిపరిచి పేదలకు ఉపాధి కల్పించడం. ఇక రెండో వాదన ప్రకారం ఉపాధి పథకాన్ని వ్యవ సాయానికి అనుసంధానం చేయడమంటే కూలీలు భూస్వాముల పొలాల్లో వరినాట్లు, కలుపులు, కోత, నూర్పిళ్ళు మొదలగు వ్యవసాయ పనులు చేయాలి. ఈ చేసిన పనికి ఉపాధి పథకం నుండి కూలి తీసుకోవాలి. ఇది ముఖ్యమంత్రి మొదలుకొని గ్రామస్థాయి నాయకుడి వరకు పాలక వర్గాలు చేసే వాదన. ఇది ఉపాధిహామీకి అసలుకే ఎసరు పెట్టే ప్రయత్నం. ఉపాధి చట్టాన్ని నీరుగార్చే యత్నం. భూస్వాముల వత్తిడికి తలొగ్గి కోట్లాది మంది కూలీల కడుపుకొట్టే దుర్మార్గమైన వాదన.పేదలకు కల్పించే 100రోజుల పనులు భూస్వాముల పొలాల్లోనే చేయాలి.ఈ వందరోజులు పూర్తయిన తర్వాత ఉపాధి పథకం ద్వారా మరో వంద రోజులు చేయడానికి అవకాశం లేదు. చేయాలన్నా చట్టం ఒప్పుకోదు. ఎందుకంటే సంవత్సరానికి కుటుంబానికి 100 రోజులు మాత్రమేవ్యవసాయ పనులు లేని సమయంలో ఉపాధి పనులు కల్పించడం ద్వారా వలసలు నివారించి, ఉన్న ఊర్లోనే పనులు కల్పించాలనే లక్ష్యంతో వామపక్షాల వత్తిడితో ఈ చట్టాన్ని తీసుకువచ్చారు. ఉపాధి చట్టం వచ్చింది. ఈ చట్టం ప్రధాన ఉద్దేశ్యం పేదలకు ఉపాధి కల్పించడం తప్ప అభివృద్ధి పనులు చేపట్టడం కాదు. పనులు కల్పించాలి కాబట్టి అభివృద్ధి పనులు చేపట్టాలన్నది ద్వితీయ ప్రాధాన్యత.
మన రాష్ట్రంలో చట్టం వచ్చినప్పటి నుండి ప్రభుత్వ లెక్కల ప్రకారంగా ఉపాధి పనులు పరిశీలిస్తేమెట్ట ప్రాంతాంల్లో కొద్దో, గొప్పో జరిగాయి తప్ప డెల్టా ప్రాంతంలో నామ మాత్రంగా పనులు జరిగాయి. పధకం ప్రారంభం నుండి ఏసంవత్సరం కూడా కుటుంబానికి 100 రోజుల లక్ష్యం నెరవేర్చలేదు. ఏడాదికి సరాసరి 50 రోజులకు మించి పని చూపలేదు. ఉదాహరణకు ఈ ఆర్థిక సంవత్సరం కేంద్రం ప్రభుత్వం రూ||8200 కోట్లు కేటాయిస్తే ఆర్థిక సంవత్సరం పూర్తకావస్తున్నా రాష్ట్ర ప్రభుత్వం ఖర్చు చేసింది కేవలం 3వేల 700వందల కోట్లు మాత్రమే. మన రాష్ట్రంలో వ్యవసాయ పనులు ఉన్నప్పుడు ఉపాధి పనులను ప్రభుత్వమే నిలిపేసింది. వ్యవసాయ పనులు ముమ్మరంగా వున్నప్పుడు కూలీలు ఉపాధి పనులకు పిలిచినా వెళ్ళరు. ఎందుకంటే ఉపాధి పని ద్వారా వచ్చే రోజు వేతనం కేవలం రూ.100మాత్రమే. అదే నాట్లు, కోతలు సమయాల్లో కూలీలు జట్లుగా ఏర్పడి కాంట్రాక్ట్ పద్దతిలో కూలీకి వెళతారు. ఉ.6గం.ల నుండి సా 6.గంల వరకు అంటే రోజుకు 12 గంటలు నడుములెత్తకుండా పనిచేస్తారు. ఇలా చేయడం వల్ల వారికి రోజుకు ఒక్కోక్కరికి రూ. 200 నుండి 300 వరకు వస్తుంది. కాబట్టి, కష్టమైనా వ్యవసాయ పనులకే వెళతారు తప్ప ఉపాధి పనులకు వెళ్ళరు. ఈ లెక్కన వ్యవసాయానికి ఉపాధి పథకం ఆటంకం కాదు. దేశంలో ఎక్కడా లేని విధంగా రాష్ట్రంలో కూలీరేట్లు ఎక్కువగా ఉన్నాయనడం పూర్తిగా అవాస్తవం జీఓ నెం.48 ప్రకారం కనీస వేతనం రూ.149 నుండి రూ.250 చెల్లించాలని చట్టం చేశారు. అయితే ఎక్కడా అమలు కావడం లేదు. ఉపాధి కూలీలు ఎర్రటి ఎండలో చేతులు బొప్పలెక్కేలా పనిచేసినా రోజుకు రూ.70,80 మించి రావడంలేదు. ఇంత తక్కువ వేతనాలపై చివరకు సుప్రీం కోర్టు కూడా జోక్యం చేసుకొని ఉపాధి కూలీలకు కనీస వేతనాలను అమలు చేయాలని అదేశించినా ప్రభుత్వానికి చెవికెక్కలేదు కేరళ, పంజాబ్, కర్నాటక, గోవా రాష్ట్రాల్లో వ్యవసాయ రంగంలో రోజు వేతనం రూ.200 పైగా ఇస్తున్నారు. మనం రాష్ట్రంలో అంత వేతనం కేవలం వ్యవసాయ పనులు ముమ్మరంగా ఉన్నప్పుడే చెల్లిస్తారు. మిగిలిన సమయంలో రోజుకు రూ||100 మించి ఇవ్వడంలేదు.
ఈ సంవత్సరం తీవ్రమైన కరువు కారణంగా గ్రామాల్లో పనులు లేక రెండో వైపు ప్రభుత్వం ఉపాధి పనులు చేపట్టకపోవడం వల్ల లక్షలలాది మంది వలసలు పోతున్నారు. మెదక్ జిల్లాలో ఒకే రోజు 4 గురు పేదలు ఆత్మహత్య చేసుకున్నారంటే రాష్ట్రంలో పేదల పరిస్థితి ఎంత తీవ్రంగా వుందో అర్థమవుతుంది. ఇప్పటికైనా ప్రభుత్వం సహా పేదల వ్యతిరేక ధోరణితో ఆలోచించే పార్టీలు తమ వైఖరిని మార్చుకోవాలి. లేదంటే గ్రామీణ పేదల ఆగ్రహానికి గురికావాల్సి ఉంటుంది. ఉపాధి పనులు వ్యవసాయానికి అనుసంధానం చేయడం అంటే భూస్వాముల పొలాల్లో వెట్టి చాకిరి చేయమనడమే. ఒకవేళ వ్యవసాయానికి అనుసంధానం చేయాలనుకుంటే ఈ రాష్ట్రంలో అనర్హులచేతుల్లో వృధాగా పడివున్న లక్షలాది ఎకరాల ప్రభుత్వ భూమిని, భూస్వాముల దగ్గరవున్న మిగులు భూమిని ముందు పేదలకు అనుసంధానం చేయండి. అప్పుడు ఉపాధి పథకం అనుసంధానం గురించి మాట్లాడే అర్హత వుంటుంది.
-వి. వెంకటేశ్వర్లు
(రచయిత ఆం.ప్ర. వ్య.కా.స రాష్ట్ర కార్యదర్శి)
No comments:
Post a Comment