ఆదివారం అనుబంధం- కె.ఎక్స్.రాజు Sun, 26 Feb 2012, IST
నిత్యజీవితంలో సాంకేతిక వినియోగం ఒక భాగం. త్వరితగతిన అభివృద్ధి చెందుతున్న సాంకేతిక విజ్ఞానం భావి తరాలకు నిత్యావసరం. కంప్యూటర్, ఇంటర్నెట్ ఆవిష్కరణతో అనేక నూతన సాంప్రదాయాలకు కూడా నాంది
పలికింది. విజ్ఞానసర్వస్వం ప్రజలకు అందుబాటులో ఉండాలని ఎవరైనా కోరుకునేదే. అయితే కార్పొరేట్ కంపెనీల గుప్పెట్లో విజ్ఞానం బందీ అవుతున్న నేటి తరుణంలో కాపీరైటు, పేటెంట్ల వంటివి అసలు సాధ్యమయ్యేనా అనిపిస్తుంది. కానీ ఇటువంటి ఒక నూతన సాంప్రదాయానికి శ్రీకారం చుట్టింది కూడా ఐటి రంగంలోనే. అదే 'ఫ్రీ సాఫ్ట్‌వేర్'.
ప్రపంచ వ్యాప్తంగా విజ్ఞాన సర్వస్వాన్ని ఇంటర్నెట్లో అందుబాటులోకి తెస్తున్న 'వికీపీడియా' కూడా దీని స్ఫూర్తితోనే ప్రారంభమైంది. ఒక్క వికీపీడియానే కాదు మనం కూడా మనకు తెలియకుండానే ఫ్రీసాఫ్ట్‌వేర్‌ని వినియోగిస్తున్నాం. అంటే.. ఇంటర్నెట్ వాడుతున్న ప్రతిఒక్కరూ ఖచ్చితంగా ఫ్రీ సాఫ్ట్‌వేర్ వాడుతున్నట్లే. ప్రపంచంలోని ఇంటర్నెట్‌లో 85శాతం సర్వర్లు ఫ్రీసాఫ్ట్‌వేర్ వల్ల రూపొందిన లినక్స్ ఆపరేటింగ్ సిస్టమ్‌తో నడుస్తున్నవే. ఎక్కడెక్కడ వాడుతున్నారో వివరంగా చెప్పాలంటే కొన్ని గ్రంథాలే ప్రచురించాల్సి వుంటుంది. ఉదాహరణకు నాసాలో, మన చంద్రయాన్ ప్రాజెక్టు మిషన్ కంట్రోల్ సెంటర్లో, శాస్త్ర పరిశోధనల్లో, లాటిన్ అమెరికా దేశాలన్నింటిలో, జర్మనీ, ఫ్రాన్సులో ప్రభుత్వ కార్యకలాపాలకి, పాఠశాల విద్యలో వినియోగిస్తున్నారు. అంతెందుకు కేరళ హైస్కూళ్ళన్నింటిలోనూ ఫ్రీ సాఫ్ట్‌వేర్ మాత్రమే వాడుతున్నారు. ఫ్రీసాఫ్ట్‌వేర్ వినియోగం వల్ల మైక్రోసాఫ్ట్ సంస్థ ఎంతో నష్టపోయింది. ''పిల్లలకు ప్రొప్రయిటరీ సాఫ్ట్‌వేర్‌లను అలవాటు చేయడం అంటే... ఉచితంగా సిగరెట్లు పంపిణీ చేయడం వంటిదే''నని ఫ్రీసాఫ్ట్‌వేర్ వ్యవస్థాపకులు రిచర్డ్స్ స్టాల్‌మన్ వ్యాఖ్యానించడం ఇక్కడ గమనించాల్సిన అంశం.
మామూలుగా ఫ్రీ అంటే.. ఉచితం అనే అర్థం. అయితే దీనిలో ఫ్రీ అంటే 'స్వతంత్ర' అనే అర్థంలో తీసుకోవాలి. ఇంగ్లీషులో 'స్వతంత్ర' అనే పదానికి ఉచితం అనే అర్ధానికి 'ఫ్రీ' పర్యాయపదంగా ఉంది.
సాఫ్ట్‌వేర్ రెండు రకాలుగా వుంటుంది. ఒకటి సోర్స్‌కోడ్, రెండోది బైనరీ. సోర్స్‌కోడ్ (మూల రూపకరణాలు) అంటే ప్రోగ్రామర్లు రాసేది. బైనరీ అంటే కంప్యూటర్‌లో ఎగ్జిక్యూట్ చేయటానికి ఒకటి, సున్నాల (1,0) రూపంలో ఉండేది. ఇంకా వివరంగా చెప్పాలంటే స్కూృలూ, నట్లతో బిగించిన వాహనం సోర్స్‌కోడ్ అయితే, ఇవేవీ లేకుండా జాయింట్స్ అన్నిటినీ వెల్డింగ్ చేసేటటువంటి ప్రక్రియ బైనరీ. మనం ఎంత మంచి వాహనం అయినా స్కూృలు, నట్లు లేకుండా వెల్డింగ్ చేసిన దాన్ని కొనగలుగుతామా? మైక్రోసాఫ్ట్ వంటి కంపెనీలు మనకి అమ్ముతున్నది వెల్డింగ్ చేసిన వాహనాల వంటి సాఫ్ట్‌వేర్‌నే. ఒక సాఫ్ట్‌వేర్‌లో ఏదైనా సమస్య వస్తే తదుపరి కొత్త వర్షన్ విడుదల అయ్యేవరకు వేచి ఉండమంటాయి మైక్రోసాఫ్ట్ వంటి కంపెనీలు. ఒకవేళ మీరే స్వంతగా ప్రోగ్రామ్ రాసి ఆ సమస్యను సవరించే ప్రయత్నం చేస్తే కంపెనీ వారి లైసెన్స్ అగ్రిమెంట్ ప్రకారం శిక్షారుÛలు అవుతారు. సాఫ్ట్‌వేర్ రంగంలో ఈ రకమైన గుత్తాధిపత్యాన్ని బద్దలుకొట్టి... సోర్స్‌కోడ్‌తో కూడిన సాఫ్ట్‌వేర్‌ని అందించింది ఫ్రీ సాఫ్ట్‌వేర్. ఈ సోర్స్‌కోడ్ అందరికీ అందుబాటులోకి రావటం వల్ల దీని అభివృద్ధి అత్యంత వేగంగానూ, నాణ్యంగానూ జరిగింది. ఈ సాఫ్ట్‌వేర్‌ను వైరస్‌లు కూడా సోకలేవంటే దీని నాణ్యతేమిటో అర్థం చేసుకోవచ్చు. ఫ్రీ సాఫ్ట్‌వేర్‌ల తయారీలో ప్రపంచ వ్యాపితంగా 20 లక్షలకు పైగా పని చేస్తున్నారు. విండోస్ మాదిరిగా పనిచేసే ఫ్రీ సాఫ్ట్‌వేర్ ఆపరేటింగ్ సిస్టంలు సుమారు 400 రకాలు వాడకంలో ఉన్నాయి. మన రాష్ట్రంలో తెలుగులో తయారయిన 'స్వేచ్ఛ' కూడా ఈ కోవకు చెందిందే. సోర్స్‌కోడ్ అందుబాటులో వుండడంతో ఇది ప్రపంచ భాషలన్నింటిలోకి అనువదింపబడుతోంది.
ప్రపంచవ్యాప్తంగా విస్తరించిన ఫ్రీ సాఫ్ట్‌వేర్ ఉద్యమం మన దేశంలో కూడా క్రమంగా వృద్ధి చెందుతోంది. మాజీ రాష్ట్రపతి అబ్దుల్ కలామ్ వంటి ప్రముఖులు కూడా ఫ్రీసాఫ్ట్‌వేర్ వినియోగం యొక్క ఆవశ్యకతను ప్రతి సందర్భంలోనూ వివరిస్తున్నారు. ఇది ఇంతటి ఆదరణ, గుర్తింపు పొందడానికి కారణం ఏ ఒక్క కంపెనీకో, వ్యక్తికో చెందినది కాదు. ఇదంతా ఫ్రీ సాఫ్ట్‌వేర్ ఉద్యమంలో సైనికులవలే పనిచేస్తున్న ఎందరో సాఫ్ట్‌వేర్ నిపుణుల శ్రమ ఫలితం. ప్రపంచ ప్రఖ్యాతి గాంచిన 'గూగుల్ సెర్చ్ ఇంజన్' సైతం ఫ్రీసాఫ్ట్‌వేర్‌ని ఉపయోగించే సేవలందిస్తోందనే విషయం చాలా మందికి తెలియకపోవచ్చు. కానీ ఇది అక్షరసత్యం. మన రాష్ట్రం తెలుగులో సాఫ్ట్‌వేర్‌ని అందుబాటులోకి తెచ్చింది కూడా ఈ ఉద్యమమే. 2001లో ఫ్రీ సాఫ్ట్‌వేర్ ఆధ్వర్యంలో 'స్వేచ్ఛ' ప్రారంభమైంది. ప్రపంచవ్యాప్తంగా ఎందరో నిపుణులు దీని అభివృద్ధికి కృషి చేస్తూనే వున్నారు.
ఏ సాఫ్ట్‌వేర్‌నైనా ఫ్రీసాఫ్ట్‌వేర్ అనాలంటే అది నాలుగు సూత్రాలకు కట్టుబడివుండాలి. 1. ఏ అవసరానికైనా స్వేచ్ఛగా వినియోగించుకోగలగాలి. 2. తమ అవసరాలకనుగుణంగా మలచుకునే అవకాశం ఉండాంటే సోర్స్‌కోడ్ ఇచ్చి తీరాలి. 3. సాఫ్ట్‌వేర్‌ను అభివృద్ధి చేసి ఇతరులకు అమ్మడం లేదా ఉచితంగా పంపిణీ చేసే హక్కు ఉండాలి. 4. అభివృద్ధి చేసిన సాఫ్ట్‌వేర్‌ను కూడా స్వేచ్ఛ వినియోగానికి అందుబాటులో వుండాలి.
ఫ్రీ సాఫ్ట్‌వేర్‌కు సంబంధించిన వివరాలకు www.fsmi.in, www.swecha.org ని సందర్శించండి.
ఒపెన్ సోర్స్, ఫ్రీ వేర్, షేర్ వేర్ మధ్య వ్యత్యాసం ఏమిటి?
సాఫ్ట్‌వేర్ డౌన్‌లోడ్‌ల కోసం నెట్‌లో సెర్చ్ చేస్తే సాధారణంగా కనిపించేవి ఫ్రీ సాఫ్ట్‌వేర్, ఓపెన్ సోర్స్, ఫ్రీ వేర్, షేర్‌వేర్. అయితే వీటి మధ్య చాలా పెద్ద తేడాలే ఉన్నాయి. ముఖ్యంగా ఫ్రీ సాఫ్ట్‌వేర్, ఓపెన్‌సోర్స్‌లు ఒకేలావున్నా, కొంతమంది ఈ రెండూ ఒక్కటేనని చెప్పినా వీటి మధ్య విభజన రేఖ చాలా స్పష్టంగా వుంటుంది. ఈ తేడాను గమనించకపోతే వినియోగదారులు పెద్దఎత్తున నష్టపోవాల్సి వుంటుంది. ఫ్రీ సాఫ్ట్‌వేర్ గురించి పైన వివరంగా తెలుసుకున్నాము. ఇక ఓపెన్‌సోర్స్, ఫ్రీవేర్, షేర్‌వేర్‌ల గురించి చూద్దాం...
ఓపెన్ సోర్సు
ఫ్రీ సాఫ్ట్‌వేర్ నుంచి బయటికొచ్చిన కొంతమంది ఓపెన్‌సోర్స్‌ను ప్రారంభించారు. వాస్తవానికి ఓపెన్‌సోర్స్ అని పిలువబడుతున్న సాఫ్ట్‌వేర్లలో అత్యధిక భాగం జిపిఎల్ ఫ్రీ సాఫ్ట్‌వేర్లనే విడుదల చేస్తున్నప్పటికీ వాటిని ఓపెన్‌సోర్స్‌గా పిలుస్తున్నారు. దీనికి ఓపెన్ సోర్స్ లైసెన్స్ ఫ్రీసాఫ్ట్ వేర్ అంత పకడ్బందీగా లేకపోవడమే కారణం. ఈ కారణంగానే వ్యాపార వర్గాల ప్రయోజనాల దృష్ట్యా ఓపెన్‌సోర్స్ పేరును ప్రచారంలో పెట్టారు. ఈ కోవలోకి వచ్చే సాఫ్ట్‌వేర్లలో 'రెడ్‌హ్యాట్'ను ఉదాహరణగా చెప్పొచ్చు.
ఫ్రీ వేర్
ఉచితంగా లభిస్తూ, డౌన్‌లోడ్ చేసుకోవటానికీ, వాడటానికీ ఎటువంటి నిర్బంధమూ వుండదు. అయితే ఫ్రీవేర్‌కు ఓపెన్ సోర్సులా ఒక వ్యవస్థ కానీ, మెరుగు పరిచే విధానాలు కానీ ఉండవు. కాబట్టి ఒక ఫ్రీవేర్‌ను, ఎలా ఉందో అలానే వాడాలే తప్ప, దానిని మెరుగు పరిచే అవకాశంగానీ, అందుకు కావాల్సిన సహాయంగానీ పొందలేము.
షేర్ వేర్
దీన్ని పూర్తి అర్థవంతంగా చెప్పాలంటే... తొలుత భారతదేశంలోకి బ్రిటిష్ వారు వచ్చినప్పుడు టీ, కాఫీలను బాగా అలవాటు చేశారు. ఆ తర్వాత అమ్మకానికి పెట్టి విపరీతమైన లాభాలు గడించారు. ఒక్కమాటలో చెప్పాలంటే... ఇప్పుడీ షేర్‌వేర్ పరిస్థితి కూడా అంతే. ఏదైనా ఒక సాఫ్ట్‌వేర్ కంపెనీ వారి సాఫ్ట్‌వేర్ ప్రచారం కోసం దీన్ని తయారు చేస్తారు. ఇదొక భిన్నమైన కాన్సెప్ట్. ఇది డౌన్‌లోడ్ చేసుకోడానికి, పరీక్షించటానికీ ఉచితమే. అంటే ట్రయల్ వెర్షన్స్ మాత్రమే ఉచితంగా డౌన్‌లోడ్ చేసుకొనే అవకాశం వుంటుంది. కానీ దీని పూర్తిస్థాయి సాఫ్ట్‌వేర్‌ను ఉపయోగించాలనుకుంటే మాత్రం డబ్బు కట్టాల్సిందే. వినియోగదారుకు సోర్స్‌కోడ్ చూసే అవకాశం గానీ, మార్పులు చేసే స్వేచ్ఛ గానీ ఉండవు. ఈ సాఫ్ట్‌వేర్‌ను తయారు చేసిన సంస్థ చేతుల్లోనే దీనికి సంబంధించిన సర్వ హక్కులూ వుంటాయి.
ఈ సాఫ్ట్‌వేర్ల మధ్యనున్న వ్యత్యాసాన్ని గుర్తించలేకపోతే ఫ్రీ సాఫ్ట్‌వేర్ అభివృద్ధికి ఆటంకమవుతుంది. ముఖ్యంగా ఫ్రీసాఫ్ట్‌వేర్‌కు, ఓపెన్‌సోర్స్‌కు మధ్య వున్న వ్యత్యాసాన్ని గమనంలో వుంచుకోవాలి. ఇక ఫ్రీవేర్లు, షేర్‌వేర్లు పేర్లతో లభించే సాఫ్ట్‌వేర్లలో aసషaతీవలు, ఎaశ్రీషaతీవల వల్ల డేటాను కోల్పోవడంతోపాటు ఆర్థికంగానూ నష్టపోవాల్సివుంటుంది. అందువల్ల ఇటువంటి సాఫ్ట్‌వేర్లను ఉపయోగించి కోరి కష్టాలను తెచ్చుకొనేబదులు ఉచితంగా లభించే సాఫ్ట్‌వేర్లను ఉపయోగించడం అన్నివిధాలా శ్రేయస్కరం.
No comments:
Post a Comment