అంతర్జాలంలోని అన్నిరకాల ముఖ్యమైన సమాచారాన్ని ఈ సైట్ లో నిక్షిప్తం చేసి, అందరికీ ఉపయోగపడే ఒక వేదికగా ఈ సైట్ ఉండాలనే ఉద్దేశ్యంతో ప్రారంభించడమైంది. ఏ సైట్ నుండి సమాచారం తీసుకున్నా వారి పేరుతోనే ఇందులో వుంచుతాను. సహృదయంతో సహకరించగలరు.
ఎవరికైనా అభ్యంతరముంటే వారి సైటుకు సంబంధించిన సమాచారం తొలగించడం జరుగుతుంది. - ధన్యవాదములతో...

Friday, March 2, 2012

కరవు సాయం కరవే! (eenadu)


రుణాల రీషెడ్యూలూ లేదు 
కరవు పింఛను కానరాదు 
రాష్ట్రంలో రైతుల దుస్థితి ఇది 
హైదరాబాద్‌ - న్యూస్‌టుడే
వ్యవస్థాపరమైన జాప్యం రైతుకు శాపంగా మారింది. కరవు సాయం ఎండమావిగా మారింది. అప్పుల వూబిలో చిక్కుకుని విలవిల్లాడుతున్న రైతుకు ప్రభుత్వం ఇచ్చే అరకొరసాయం ఎందుకు ఉపయోగపడకుండాపోతోంది. గత
ఏడాది ఖరీఫ్‌లో నెలకొన్న కరవుపై రాష్ట్ర ప్రభుత్వం నింపాదిగా కేంద్రానికి నివేదిక సమర్పించింది. గత నెలలో కేంద్ర బృందం వచ్చి వెళ్లింది. ఈ బృందం తన నివేదికను సమర్పించిన మీదట కేంద్ర మంత్రులస్థాయిలోని ఉన్నతస్థాయి కమిటీ సమావేశమై నిర్ణయం తీసుకోవలసి ఉంది. ఈ ప్రక్రియ అంతా పూర్తి కావడానికి ఇంకా నెల రోజులపైనే పట్టే అవకాశముంది. ఏప్రిల్‌, మే నెలల్లో తప్ప రైతులకు సాయం అందే పరిస్థితి లేదు. దీంతో రైతులు తెచ్చిన అప్పులకు వడ్డీకి కూడా ప్రభుత్వం ఇచ్చే సహాయం సరిపోని స్థితి ఏర్పడింది. సాధారణంగా ఒక సీజన్‌ దెబ్బతింటే రైతులు వెంటనే పంటలు వేసుకోవడానికి విత్తనాలు, ఎరువులను ప్రభుత్వం సరఫరా చేసేది. అయితే రాష్ట్రంలో తీవ్ర వర్షాభావ పరిస్థితులు నెలకొన్నాయనే ఉద్దేశంతో రబీ పంటలకు విత్తనాలు, ఎరువులు సరఫరా చేయాలన్న వూసే రాష్ట్ర ప్రభుత్వం ఎత్తలేదు. కరవు మండలాలను ప్రకటించిన తరువాత రుణాల రీ-షెడ్యూలు చేస్తారు. అయితే ఈ దఫా రుణాల రీ-షెడ్యూలు కూడా లేదు. రుణాలను రీ-షెడ్యూలు చేస్తే వడ్డీ పడుతుంది. అపుడు రైతులకు అదే భారం అవుతుందనే ఉద్దేశంతో వీటిపైన వడ్డీని తగ్గించాలని కోరుతూ ముఖ్యమంత్రి ఎన్‌.కిరణ్‌కుమార్‌రెడ్డి గతంలో లేఖ రాసినా కేంద్ర ప్రభుత్వం స్పందించలేదు.
కంటితుడుపు చర్య:వ్యవసాయానికి పెట్టుబడి వ్యయం పెరిగిపోయిన నేపథ్యంలో పంట నష్టాల్లో ఎకరాకు కనీసం రూ.10 వేలు సహాయం అందించాలని రైతు సంఘాలు డిమాండ్‌ చేస్తున్నాయి. అయితే కేంద్రం మాత్రం హెక్టారుకు ఇచ్చే మొత్తాన్ని రూ.4 వేల నుంచి రూ.6 వేలు చేసింది. రాష్ట్ర ప్రభుత్వం ఇప్పటికే పలు పంటలకు హెక్టారుకు రూ.6 వేల చొప్పున పరిహారం ఇస్తుండడంతో రైతుకు అదనంగా ఒరిగింది ఏమీ లేకపోయింది.

రాష్ట్రంలో వర్షాభావ పరిస్థితుల నేపథ్యంలో కరవు పింఛన్లను పంపిణీ చేయాలని రాష్ట్ర ప్రభుత్వం భావించింది. కేంద్రానికి సమర్పించిన నివేదికలో ఈ విషయం తెలియజేసింది. రాష్ట్రంలోని 876 మండలాల్లో మండలానికి 1,500 మంది చొప్పున ఒక్కొక్కరికి రూ.200 చొప్పున పది నెలలపాటు పింఛన్లు అందించాలని రాష్ట్ర ప్రభుత్వం ప్రతిపాదించింది. వ్యవసాయ కార్మికుల కుటుంబాలకు రోజుకు రూ.75 చొప్పున మండలానికి వంద కుటుంబాలకు, పౌష్టికాహారం కోసం గర్భిణీలకు నెలకు రూ.200 చొప్పున పది నెలలు సాయం అందించాలని ప్రతిపాదించింది. ఇందుకు రూ.514.65 కోట్లు అవసరమని అంచనా వేసి కేంద్రానికి తెలియజేసింది. కేంద్ర స్పందనపైనే వీటి పంపిణీ ఆధారపడి ఉంది. రాష్ట్రంలో 1.20 కోట్ల మంది రైతులు ఉన్నారు. ఇందులో కోటి మంది రైతులు సన్న, చిన్నకారు రైతులే. మహబూబ్‌నగర్‌ (7.70 లక్షలు), గుంటూరు (7.01 లక్షలు), నల్గొండ (6.97 లక్షలు) రైతులు ఎక్కువగా ఉన్నారు. కరవు వల్ల 51.54 లక్షల మంది రైతులు దెబ్బతిన్నారు. 34.24 లక్షల హెక్టార్లలో రూ.5,746 కోట్ల విలువ కలిగిన పంటలు దెబ్బతిన్నాయి.

దేశంలో రాజస్థాన్‌, కర్ణాటక తరువాత మన రాష్ట్రమే వరుస కరవులను ఎదుర్కొంటోంది. అనంతపురం, చిత్తూరు, కడప, కర్నూలు, మహబూబ్‌నగర్‌, నల్గొండ, ప్రకాశం జిల్లాల్లో కరవు ప్రభావం ఎక్కువగా ఉంటోంది.

No comments:

Post a Comment