మాడ్రిడ్ Fri, 2 Mar 2012, IST
విద్యకు కోతలపై వ్యతిరేకత
బార్సిలోనాలో పోలీసు లాఠీఛార్జి
ఉపాధ్యాయుల లేఆఫ్‌లు, క్రిక్కిరిసిన క్యాంపస్‌లు, రూమ్ హీటర్లు లేని తరగతి గదులకు దారితీస్తున్న విద్యా కోతలకు నిరసనగా స్పెయిన్‌వ్యాప్తంగా వేలాది మంది విద్యార్థులు బుధవారం తరగతులను బహిష్కరించి ప్రదర్శనలు
నిర్వహించారు. దాదాపు 30 వేల మంది వీధుల్లోకొచ్చిన బార్సిలోనాలో పోలీసులు, నిరసనకారుల మధ్య ఉద్రిక్తతలు చెలరేగాయి. 'విద్యార్థి వసంతం', 'ఫ్యాకల్టీల ముట్టడి' పేరిట ఉన్న ఉద్యమంలో కార్యకర్తలు కొందరు విశ్యవిద్యాలయాల్లో రాత్రి కూడా క్యాంపు చేశారు. అనంతరం బుధవారం ఉదయం వివిధ పట్టణాలలో నిరసనకారులు ప్రదర్శనలు నిర్వహించారు. తరగతులకు అవరోధం కలిగిస్తున్న, ఉపాధ్యాయ ఉద్యోగాల్లో కోత విధిస్తున్న పొదుపు చర్యలకు నిరసనగా దేశవ్యాప్తంగా 40 నగరాలు, పట్టణాలలో నేషనల్ స్టూడెంట్స్ యూనియన్ ప్రదర్శనలకు పిలుపునిచ్చింది. 'ఈ సంక్షోభాన్ని మేము సృష్టించలేదు. కానీ ప్రతి దానికీ మేము మూల్యం చెల్లించాల్సి వస్తోంది' అని బుధవారం నాటి ప్రదర్శనల నేపథ్యంలో యూనియన్ నేత తోహిల్ డెల్గాడో చెప్పారు. తరగతులు, వేలాది ఉపాధ్యాయ ఉద్యోగాల్లో కోత పడినట్లు ఆయన తెలిపారు. 'వారు ప్రభుత్వ విద్యలో కోతలు విధిస్తున్నారు. వారు పని చేసేందుకు ఎలాంటి ప్రత్యామ్నాయం ఇవ్వడం లేదు. వీటన్నింటినీ మించి ప్రజాతంత్రయుతంగా నిరసన తెలుపుతుంటే మమ్ముల్ని పోలీసులతో కొట్టిస్తున్నారు' అని ఆయన చెప్పారు. ఒక్క వలెన్సియాలోనే వేలాది మంది పాల్గొన్నట్లు ఆయన అంచనా వేశారు. 'కొద్దిపాటి కోతలు, ఎక్కువగా విద్య!' అంటూ మాడ్రిడ్‌లో విద్యార్థులు ఈలలు వేస్తూ నినాదాలిచ్చారు. వారు జాతీయ విద్యా శాఖ వెలుపల గోలగోలగా ర్యాలీ అయ్యారు. దేశంలోని ప్రధాన బ్యాంకు శాంటాండర్ కార్యాలయాల వెలుపల ఆగి కోపంగా నినాదాలిచ్చారు. ఆర్థిక వ్యవస్థను పటిష్ట పరుస్తానని, తద్వారా నిరుద్యోగాన్ని తగ్గిస్తానని, మితవాద ప్రభుత్వం చెబుతూ చేపడుతున్న కోతలు, సంస్కరణలపై ఆగ్రహించిన వివిధ రంగాల ప్రజలు జరుపుతున్న ప్రదర్శనల్లో భాగమే ఇవి. స్పెయిన్‌లో నిరుద్యోగం 23 శాతంగా ఉంది. 'ఈ కోతలు, కార్మిక సంస్కరణలన్నీ శ్రామిక మార్కెట్లో యువత ప్రవేశించడాన్ని కష్టం చేస్తున్నాయి' అని మాడ్రిడ్ ప్రదర్శనలో మూడవ సంవత్సరం రాజకీయశాస్త్ర విద్యార్థి డీగో పరేజో(21) ఎఎఫ్‌పి వార్తా సంస్థకు చెప్పారు. 'నేను యూనివర్శిటీ విద్య పూర్తి చేయగానే చాలా చీకటి భవిష్యత్తును చూస్తాను' అని అన్నారు. బార్సిలోనాలో లాఠీలు ధరించిన పోలీసులు అనేక చోట్ల లాఠీ ఛార్జీ నిర్వహించినట్లు 'ది గార్డియన్' పత్రిక తెలిపింది. బార్సిలోనా విశ్వవిద్యాలయం ప్రధాన భవనం నుంచి వందలాది మంది విద్యార్థులను బలవంతంగా వెనక్కి తోసేశారు. నగరంలోని ఎగ్జిబిషన్ కేంద్రం వద్ద ప్రధాన అంతర్జాతీయ టెలికామ్స్ ట్రేడ్ ఫెయిర్ జరుగుతున్న మొబైల్ వరల్డ్ కాంగ్రెస్ వద్ద శాంతియుత ప్రదర్శన జరిగింది. దాని సమీపంలోని ప్రధాన రోడ్డును దిగ్బంధించారు. విద్యార్థి నిరసనల్లోకి సంఘ వ్యతిరేక శక్తులు చొరబడినట్లు అధికారులు చెబుతుండగా, ముసుగులు ధరించిన నిరసనకారులు కొందరు టెలివిజన్ కెమెరామేన్‌పై దాడి చేశారు. ఇలాంటి ఘటనల వల్ల విద్యార్థులు, విశ్వవిద్యాలయ ప్రపంచమే ఇదంతా చేస్తోందనే అభిప్రాయం కలుగుతోందని కాటలాన్ ప్రాంతీయ ప్రభుత్వానికి చెందిన విశ్వవిద్యాలయాల డైరెక్టర్ ఆంటోనీ క్యాస్టెల్లా చెప్పారు. ఈ నిరసన సందర్భంగా కొద్ది మందిని అరెస్టు చేసినట్లు, తొమ్మిది మంది గాయపడినట్లు తొలి వార్తలను బట్టి తెలుస్తోంది.
ఇంత స్థాయిలో అణచివేత ఉంటుందని తాము ఊహించలేదని నిరసనకారులపై పోలీసు లాఠీఛార్జీ అనంతరం పావ్ బ్రోసన్స్ అనే విద్యార్థి చెప్పాడు. పోలీసులు లాఠీ ఛార్జీకి పాల్పడే వరకూ ఎవ్వరూ ఎలాంటి ఉల్లంఘనలకూ పాల్పడలేదని అన్నాడు. బుధవారం నాటి ప్రదర్శనలు రానున్న ఆందోళనలకు సంకేతాలు మాత్రమేనని లాస్ ఏంజెల్స్ టైమ్స్ హెచ్చరించింది. 'స్పెయిన్ ప్రభుత్వం కేవలం ఈ సంవత్సరం అమలు చేసిన రెండు వేల కోట్ల డాలర్ల కోతలు, పన్నుల ప్యాకేజీని మాత్రమే చవి చూశారు.17 దేశాల యూరోజోన్ సభ్యులు బడ్జెట్ లోటులను పరిమితం చేసేందుకు ప్రయత్నాలు కొనసాగిస్తున్నందున మరిన్ని కోతలు రావచ్చు' అని ఆ పత్రిక వ్యాఖ్యానించింది.
No comments:
Post a Comment