అంతర్జాలంలోని అన్నిరకాల ముఖ్యమైన సమాచారాన్ని ఈ సైట్ లో నిక్షిప్తం చేసి, అందరికీ ఉపయోగపడే ఒక వేదికగా ఈ సైట్ ఉండాలనే ఉద్దేశ్యంతో ప్రారంభించడమైంది. ఏ సైట్ నుండి సమాచారం తీసుకున్నా వారి పేరుతోనే ఇందులో వుంచుతాను. సహృదయంతో సహకరించగలరు.
ఎవరికైనా అభ్యంతరముంటే వారి సైటుకు సంబంధించిన సమాచారం తొలగించడం జరుగుతుంది. - ధన్యవాదములతో...

Friday, March 2, 2012

సాధనాల... అతనో సంచలనం


ఉస్మానియాలో ఎం.టెక్‌ బంగారు పతక గ్రహీత 
ఇంజినీరు ఉద్యోగం వదలి ఉద్యమబాట 
రెండు నెలల్లో మావోయిస్టులకు మరో ఎదురుదెబ్బ 
మొన్న జంగల్‌ మహల్‌ వద్ద మల్లోజుల ఎన్‌కౌంటర్‌ 
నేడు కోల్‌కతలో రామకృష్ణ అరెస్టు 
హుస్నాబాద్‌, న్యూస్‌టుడే
అపారమైన సాంకేతిక పరిజ్ఞానం.. అంతకంటే మిన్నగా సామాజిక స్పృహ.. ఈ రెండు కలిస్తే సాధనాల రామకృష్ణ అలియాస్‌ సాధుల రామకృష్ణ. హుస్నాబాద్‌ మండలం అంతకపేటకు చెందిన ఆయన ప్రస్తుతం మావోయిస్టు పార్టీలో రాష్ట్ర కమిటీ సభ్యుడిగా, కేంద్ర సాంకేతిక కమిటీ కార్యదర్శిగా కొనసాగుతున్నారు. విద్యార్థి దశ నుంచే ప్రజల
సమస్యలను తన సమస్యలుగా భావించి స్పందించే గుణమున్న రామకృష్ణ చదువుల్లో ప్రతిభాశాలి. వరంగల్‌ ఆర్‌ఈసీలో బి.టెక్‌, ఉస్మానియాలో ఎంటెక్‌ చదివిన ఆయన ఆ రోజుల్లోనే బంగారుపతకం సాధించిన సరస్వతీపుత్రుడు. పంచాయితీరాజ్‌లో ఇంజినీరుగా పనిచేస్తునే ఉద్యోగాన్ని వదులుకుని ఉద్యమ బాట పట్టారు. రామకృష్ణను గురువారం కోల్‌కత్తాలో పోలీసులు అరెస్ట్‌ చేయడం హుస్నాబాద్‌ ప్రాంతంలో సంచలనం కలిగించింది. ఈ అరెస్టుతో మావోయిస్టు పార్టీకి కోలుకోని దెబ్బ తగిలినట్లయింది.
నవంబరు 24న పార్టీ అగ్రనేత మల్లోజుల కోటేశ్వర్‌రావు ఎన్‌కౌంటర్‌ పశ్చిమ బెంగాల్‌లోని మిడ్నాపూర్‌ జిల్లా జంగల్‌మహల్‌ ప్రాంతంలో జరగగా రామకృష్ణ అరెస్టు అదే రాష్ట్రంలోనే జరిగింది. మావోయిస్టులు అధునాతన సాంకేతిక పరిజ్ఞానం ఉపయోగించుకోవడం వెనుక రామకృష్ణ మేథస్సు ఉందని.. ఆయన ఎన్నో ఆపరేషన్లకు వ్యూహరచన చేశారని అంటారు.

మూడు దశాబ్దాల క్రితం అజ్ఞాతంలోకి వెళ్లిన రామకృష్ణ ఆ తర్వాత జిల్లాకు వచ్చింది తక్కువే. సాధుల వెంకటయ్య, రామక్క దంపతులకు ఇద్దరు కుమారులు, ముగ్గురు కూతుళ్లు. పెద్ద కుమారుడైన రామకృష్ణ 33 ఏళ్ల క్రితం అజ్ఞాతంలోకి వెళ్లాడు. ఉస్మానియాలో ఎంటెక్‌ పూర్తి చేశాక బీహెచ్‌ఈఎల్‌లో కొంతకాలం పనిచేసి తర్వాత పంచాయతీరాజ్‌ ఇంజనీరింగ్‌ విభాగంలో అసిస్టెంట్‌ ఇంజనీర్‌గా చేరాడు. ఉద్యోగం చేస్తూనే స్వగ్రామమైన అంతకపేటకు రక్షిత మంచినీటి పథకం మంజూరు చేయించారు. తన గ్రామానికి ఏదైనా చేయాలనే తపనతో ఉండేవాడని సన్నిహితులు తెలిపారు. ఇద్దరు అక్కల పెళ్లిళ్లు ఆయనే జరిపించారు. పెళ్లి చేసుకోవాలని తండ్రి తరచూ వివాహ ప్రస్తావన తెస్తే రామకృష్ణ సున్నితంగా తిరస్కరించేవారని తెలిసింది. ఆయనే సోదరుడు రాంమోహన్‌ పెళ్లి చేశారు. తర్వాత అజ్ఞాతంలోకి వెళ్లి అప్పటి నుంచి ఇంటి వెపు కన్నెత్తి చూడలేదు. మావోయిస్ట్‌ కేంద్ర కమిటీలో ముఖ్యమైన బాధ్యతలు నిర్వహిస్తున్నారనే విషయం ఈ ప్రాంతం వారికి తెలిసినా ఏ హోదాలో ఉన్నాడో కుటుంబ సభ్యులకూ తెలియదు. కలకత్తాలో అరెస్ట్‌ అయ్యాడనే సమాచారంతో రామకృష్ణ ఉద్యమ ప్రస్థానం చర్చంశనీయంగా మారింది.
నన్ను పరామర్శించి వెళ్లడమే చివరిసారి 
రామకృష్ణ సోదరుడు రాంమోహన్‌ 
1985లో కరీంనగర్‌కు స్కూటర్‌పై వెళ్లుతుండగా జరిగిన రోడ్డు ప్రమాదంలో గాయపడి చికిత్స పొందుతున్నపుడు చివరిసారిగా అన్నను చూశాను. నేను ప్రమాదంలో గాయపడ్డానని తెలిసి ఆస్పత్రికి వచ్చిన అన్న నన్ను పరామర్శించి వెళ్లాడు. అదే చివరిసారి చూడడం.గురువారం కలకత్తాలో అన్న అరెస్టు సమాచారం టీవీల ద్వారా తెలిసింది. హైద్రాబాద్‌లో ఉద్యోగం చేస్తునే అక్కడ నుంచి అజ్ఞాతంలోకి వెళ్లాడని తప్ప మరో సమాచారం తెలియదు. స్వయంకృషితో అభివృద్ధి చెందాలని, ఇతరుల సాయం కోరవద్దని, ఇతరులను ఇబ్బందులకు గురి చేయవద్దని తరచూ చెబుతుండేవాడు. తల్లిదండ్రులు చనిపోయినా చూడడానికి రాలేదు. పోలీసుల నుంచి మాకు ఎలాంటి ఇబ్బందులు ఎదురుకాలేదు. అప్పుడప్పుడు వచ్చి రామకృష్ణ గురించి అడిగి వెళ్లేవారు.
హుస్నాబాద్‌లో కేసులు లేవు 
హుస్నాబాద్‌ పోలీస్‌స్టేషన్‌లో రామకృష్ణపై ఎలాంటి కేసులు నమోదు కాలేదు. ఉద్యమబాటలో భాగంగా దళాల్లో పని చేయలేదని పోలీసు వర్గాలు చెబుతున్నాయి. సాంకేతిక నిపుణుడుగా ఈయన పని చేశాడని, ఆయుధాలు పట్టుకుని ఉద్యమంలో పాల్గొనకపోవడంతో కేసులు నమోదు కాలేదని అభిప్రాయపడుతున్నారు.

No comments:

Post a Comment