ప్రజాశక్తి-హైదరాబాద్ ప్రత్యేక ప్రతినిధి Fri, 2 Mar 2012, IST
పత్తి సాగు తీరు తెన్నులు
ఇటు చూస్తే ఒంటి నిండా బట్టల్లేని వారు, అటు చూస్తే పత్తి ధర రాక భోరుమంటున్న రైతులు !! అటు చూస్తే మన దేశం నుంచి గతేడాది కంటే పత్తి ఎగుమతుల పెరుగుదల, ఇటు చూస్తే అంతకు ముందు కంటే తక్కువ ఆదాయం !!! మనం ఎవరికోసం పత్తి పండిస్తున్నట్లు, ఎవరిని ఉద్దరించేందుకు ఎగుమతి చేస్తున్నట్లు? పత్తి మార్కెట్ తీరు
తెన్నులను చూసే వారికి పెద్దగా ఆలోచించ కుండానే ఎదురౌతున్న ప్రశ్నలివి. గతేడాది మన దేశం నుంచి ఎగుమతి చేసిన పత్తి 66లక్షల బేళ్లు కాగా ఆర్జించిన విదేశీ మారకద్రవ్యం రు.15,500 కోట్లు. ఈ ఏడాది ఎగుమతి అంచనా 80లక్షల బేళ్లకు గాను వస్తుందని ఆశిస్తున్న ఆదాయం రు.14,000 కోట్ల రూపాయలు. గతేడాది ఇదే సమయంలో అంతర్జాతీయ మార్కెట్‌లో పౌను దూది మార్చి నెల 11వ తేదీ ముందస్తు ధర 191 సెంట్లు. కాగా ఈ ఏడాది మార్చి 12 వ తేదీ ముందస్తు ధర 91 సెంట్లు. దేశీయంగా మన వినియోగదారులకు వస్త్రాల ధరలు తగ్గాయా అంటే గతేడాది కంటే ఒక్క పైసా కూడా తగ్గలేదు.
ఎగుమతిదార్లు దుస్తులు ఎగుమతి చేయాలంటే ఐరోపా దేశాలన్నీ సంక్షోభంతో కొట్టుమిట్టాడు తున్నాయి. మనకంటే దరిద్రం తాండవించే బంగ్లాదేశ్‌లో ఫ్యాక్టరీలు పెట్టి అక్కడ చౌకగా ఉత్పత్తి చేసి ఐరోపా దేశాలు దిగుమతి చేసుకుంటున్నాయి. మార్కెట్ తీరుతెన్నులను బట్టి రానున్న రోజుల్లో పత్తి ధర ఇంకా పడిపోయే అవకాశం ఉన్నట్లు వాణిజ్య వర్గాలు చెబుతున్నాయి. జనవరి 24వ తేదీ వరకు మన దేశం నుంచి 44లక్షల బేళ్ల పత్తి ఎగుమతి జరిగింది. ఈ మొత్తం 84లక్షలకు చేరవచ్చని జనవరిలో జరిగిన భారత పత్తి సలహా సంస్థ(కాబ్) సమావేశం పేర్కొన్నది. ప్రయివేటు వ్యాపారులు కోటి బేళ్లకు చేరవచ్చని చెబుతున్నారు. ఇది కూడా గణనీయంగా చైనా కొనుగోలు చేయటం మూలంగానే అన్నది గమనంలో ఉంచుకోవాలి. గతేడాది ధర పెరిగిన కారణంగా ఈ ఏడాది మన దేశంలో మాదిరి ప్రపంచంలో అన్ని దేశాలలో రైతులు అధిక పత్తిని సాగు చేశారు. మార్కెట్ కుప్పకూలటంతో వచ్చే ఏడాది కొరత ఏర్పడవచ్చన్న వార్తలు వస్తున్నాయి. ధరలు పతనం కావటంతో పాటు పరిస్థితి ఎటుబోయి ఎటువస్తుందో అని చైనా వచ్చే ఏడాదికి కూడా నిలువ ఉంచుకొనే విధంగా ఈ ఏడాది పత్తి కొనుగోలు చేస్తున్నది. దీంతో మన దేశ దుస్తుల ఎగుమతిదార్లు ఇప్పుడు కొత్త డిమాండును ముందుకు తెచ్చారు. ప్రతి ఏటా దేశీయ కంపెనీలకు 25లక్షల బేళ్ల పత్తి నిల్వలు ఉండే విధంగా ఒక విధానాన్ని రూపొందించాలని కోరుతున్నారు. ఈ ఏడాది మన దేశంలో దిగుబడులు గణనీయంగా తగ్గిన కారణంగా మొత్తం ఉత్పత్తి 356లక్షల బేళ్ల అంచనాను 'కాబ్' 345లక్షలకు తగ్గించింది. అయినప్పటికీ గతేడాది కంటే 20లక్షల బేళ్లు ఎక్కువే. మన మార్కెట్లో ధరలు పడిపోయి దిక్కుతోచని స్థితిలో ఉన్న రైతాంగం గురించి కేంద్ర ప్రభుత్వం పట్టించుకోవటం లేదు. ఇదే సమయంలో మన దేశం నుంచి చేసుకొనే నూలు దిగుమతులపై ఈజిప్టు విధించిన పన్ను మొత్తాన్ని తగ్గించాలని ప్రపంచ వాణిజ్య సంస్థను కేంద్ర ప్రభుత్వం కోరింది. ఈనెల 26 నాటికి గతేడాదితో పోల్చితే మార్కెట్‌కు వచ్చిన పత్తి 233.84లక్షల బేళ్ల నుంచి 223.43లక్షల బేళ్లకు తగ్గిందన్నది సిసిఐ సమాచారం.
పడిపోయిన ధరలు ఇంకే మాత్రం పెరిగే అవకాశం కనిపించకపోవటంతో రైతులు పెరుగుతున్న అప్పుల వడ్డీ భారాన్ని తగ్గించుకొనేందుకు జనవరితో పోల్చితే ఫిబ్రవరి నెలలో ఎక్కువగా సరకును అమ్ముకున్నట్లు స్పష్టంగా కనిపిస్తోంది. అయినప్పటికీ ఇంకా ఆశ చావని వారు, నిల్వచేసుకొనే శక్తి ఉన్నవారు నిల్వ చేసుకున్నారు.
No comments:
Post a Comment