(10)
ప్రజాశక్తి - కడప ప్రతినిధి Wed, 29 Feb 2012, IST
కృష్ణా జలాలకు మోక్షమెప్పుడో..?
ప్రాజెక్టుల పూర్తికి చకోరపక్షుల్లా కడప ప్రజల ఎదురుచూపు
నీటి ప్రాజెక్టులకు నిధుల కోత కడప జిల్లా ప్రజలకు గుండెకోతగా తయారైంది. గాలేరు-నగరి సుజల స్రవంతి (జిఎన్‌ఎస్‌ఎస్) పనులు దశాబ్దాలుగా కొనసాగుతూనే ఉన్నాయి. తెలుగు గంగ పరిస్థితీ అలాగే ఉంది. మూడున్నరేళ్ల కిందట జాతికి అంకితం చేసినా.. ఈనాటికీ వెలిగొల్లు ప్రాజెక్టు నుంచి చుక్కనీరు ఆయకట్టుకు చేరలేదు. ప్రభుత్వం
అనాలోచితంగా పూర్తి చేసిన ఈ ప్రాజెక్టు నుంచి భవిష్యత్తులోనూ ఆయకట్టుకు నీరొచ్చే పరిస్థితులు కన్పించడం లేదు. మైలవరం ప్రాజెక్టు మూడు దశాబ్దాల కిందట రైతులకు అందుబాటులోకి వచ్చినా రెండుసార్లు మినహా ఆయకట్టుకు నీరందిన దాఖలాలు లేవు. కాలువలు సక్రమంగా లేకపోవడంతోనే ఈ దుస్థితి ఏర్పడింది. రెండు జిల్లాల రైతులకు నీటిని అందించేందుకు ఏడేళ్ల క్రితం కాలువలకు ఆధునికీకరణ పనులు చేపట్టారు. అవి నేటికి కొనసాగుతూనే ఉన్నాయి. ఇంకా పులివెందుల బ్రాంచి కెనాల్, ఎస్‌ఆర్‌బిసి, కెసి కెనాల్ వంటి ప్రాజెక్టుల తీరూ పైవాటికి భిన్నంగా లేవు. ఈ ప్రాజెక్టులకు రూ.1500 కోట్లు అవసరమవుతాయి. తాజా బడ్జెట్‌లో రూ.1050 కోట్లు కేటాయించి చేతులు దులుపుకున్నారు. ప్రాధాన్యతా జాబితాలో ఉన్న ప్రాజెక్టుల పనులకు కూడా నిధుల కోత పెడుతున్నారు. 'గాలేరు-నగరి'కి రూ.420 కోట్లు, పులివెందుల బ్రాంచ్ కెనాల్‌కు రూ.280 కోట్లు, తెలుగుగంగకు రూ.160 కోట్లు, కెసి కెనాల్‌కు రూ.75 కోట్లు, ఎస్‌ఆర్‌బిసికి రూ.125 కోట్లు, మైలవరానికి రూ.15 కోట్లు విదిలించారు.
కడప, చిత్తూరు, నెల్లూరు జిల్లాల్లోని 2.60 లక్షల ఎకరాలకు సాగునీరందించేందుకు గాలేరు-నగరి సుజల స్రవంతి ప్రాజెక్టు పనులు 23 ఏళ్లుగా కొనసాగుతూనే ఉన్నాయి. జలయజ్ఞం కింద పనులు చేపట్టిన తర్వాతా దీని పరిస్థితి యథాతథమే. జలయజ్ఞం కింద రూ.2,046.20 కోట్లతో పనులు చేపట్టి ఇప్పటివరకూ రూ.1,739.13 కోట్లు ఖర్చు చేశారు. ఇంకా రూ.307.07 కోట్ల విలువైన పనులు చేయాలి. మరో రూ.687.68 కోట్లతో 47, 48ఏ, 49ఏ, 31 ప్యాకేజీల కింద 52 కిలోమీటర్ల వరద కాలువ, 5.4 కిలోమీటర్ల సొరంగ మార్గం, ప్యాకేజీ-1 కింద రూ.344.11 కోట్లతో గండికోట జలాశయం, 24 కిలోమీటర్ల ప్రధాన కాలువ; ప్యాకేజీ-2 కింద రూ.301.85 కోట్లతో వామికొండ, సర్వరాయసాగర్, 10 కిలోమీటర్ల ప్రధాన కాలువ; రూ.712.2 కోట్లతో గండికోట ఎత్తిపోతల పథకం పనులను చేపట్టారు. నిధులు నిండుకుంటున్నాయి. వీటి నిర్మాణ గడువును ప్యాకేజీకి మూడు నుంచి నాలుగు పర్యాయాలు పొడిగించారు. అయినా ఇంకా పనులు పూర్తి కాలేదు. అనేక ప్యాకేజీల్లో పనులాగిపోయాయి.
సొరంగ పనుల్లో జాప్యం
అవుకు జలాశయం ద్వారా గండికోటకు 20 వేల క్యూసెక్కుల నీటిని తరలించేందుకు చేపట్టిన వరద కాలువలో భాగంగా ప్యాకేజీ 31 కింద సొరంగ మార్గం పనులను రూ.376.41 కోట్లతో చేపట్టారు. 52.184 కిలోమీటరు నుంచి 5.39 కిలోమీటర్ల పొడవుగల సొరంగమార్గం పనులు చేపట్టి పూర్తి చేశారు. అయితే నీరు గండికోటలోకి రావాలంటే సొరంగ మార్గంలో లైనింగ్ పనులు చేయాలి. ఈ పనులు 'ఎక్కడ వేసిన గొంగళి అక్కడే' అన్న చందంగా ఉన్నాయి. ఇప్పటివరకూ ఈ సొరంగ మార్గానికి రూ.267.23 కోట్లు ఖర్చు చేశారు. ఇంకా రూ.108.90 కోట్లు ఖర్చు చేయాలి. 71 శాతం మాత్రమే పనులు జరిగాయి. ఈ మార్గం పూర్తయితేనే జిల్లాలో కృష్ణా జలాలు పారే అవకాశం ఉంది.
మైలవరంలో అవినీతి బీటలు
మైలవరం జలాశయం కాలువల ఆధునికీకరణ పనుల్లో అవినీతి చోటు చేసుకోవడంతో కాలువ నిర్మాణాలకు బీటలు వారుతున్నాయి. కొన్నిచోట్ల పెచ్చులూడిపోయాయి. రెండేళ్లలో పూర్తి కావాల్సిన పనులు ఆరేళ్లయినా అలాగే ఉన్నాయి. కొద్దిపాటి వర్షానికే కాలువలకు గండ్లు పడ్డాయి. తొమ్మిది టిఎంసిల సామర్థ్యం కలిగిన మైలవరం జలాశయం ఉత్తర, దక్షిణ కాలువలను ఆధునికీకరించి కడప, కర్నూలు జిల్లాల్లోని 75 వేల ఎకరాలకు సాగునీటిని అందించేందుకు రూ.151 కోట్లతో 2005లో ప్రభుత్వం టెండర్లు పిలిచింది. ఏడాది ఆలస్యంగా 2006 జులైలో పనులు ప్రారంభమయ్యాయి. 50వేల ఎకరాలకు సాగునీటిని అందించేందుకు 34.30 కిలోమీటర్ల ఉత్తర కాలువను 90వ ప్యాకేజీగా రూ.77.44 కోట్లతో చేపట్టారు. 11 లక్షల చదరపు మీటర్ల లైనింగ్ పనులకుగాను ఇంకా రెండున్నర లక్షల చదరపు మీటర్ల పనులు జరగాల్సి ఉంది. 484 కట్టకాలకుగాను 415 పూర్తయ్యాయి. ఇంకా రూ.ఐదు కోట్ల విలువైన పనులు పెండింగ్‌లో ఉన్నాయి. 25 వేల ఎకరాలకు నీటిని అందించే 44.39 కిలోమీటర్లు గల దక్షిణ కాలువను 91వ ప్యాకేజీగా రూ.73.57 కోట్లతో చేపట్టారు. ఆరు లక్షల చదరపు మీటర్ల లైనింగ్ పనులకుగాను మూడు లక్షల మీటర్ల పనులు మాత్రమే జరిగాయి. ఇంకా మూడు లక్షల చదరపు మీటర్ల పనులు జరగాల్సి ఉంది. 470 కట్టడాలకుగాను ఇప్పటివరకూ 155 కట్టడాలు మాత్రమే పూర్తయ్యాయి. రూ.46 కోట్లు ఖర్చు చేశారు. ఇంకా రూ.27.57 కోట్ల పనులు జరగాల్సి ఉంది. 'హిందూస్థాన్-రత్న కన్‌స్ట్రక్షన్స్' మైలవరం ఉత్తర, దక్షిణ కాలువల ఆధునికీకరణ పనులను పొందింది. అయితే ఇది కడప జిల్లాలోని ఎర్రగుంట్లకు చెందిన 'ఫృధ్వీ కన్‌స్ట్రక్షన్స్'కు సబ్‌కాంట్రాక్టుకు ఇచ్చింది. ప్రధాన గుత్తేదారు పనులు చేయకపోవడం వల్లే ఆలస్యమవుతోంది. మరో ఒకటిన్నరేళ్లు గడువు పొడిగిస్తేనే పెండింగ్ పనులు పూర్తయ్యే అవకాశాలున్నాయి. ప్రస్తుతం బడ్జెట్‌లో కేవలం రూ.15కోట్లే విదిల్చారు.
గొల్లుమంటున్న 'వెలిగల్లు'
పెన్నాకు ఉపనదైన పాపాఘ్నిపై రూ.208.72 కోట్లతో వెలిగల్లు ప్రాజెక్టును నిర్మించారు. దీని నీటి సామర్థ్యం 4.64 టిఎంసిలు. నిత్యం కరువు కాటకాలతో అల్లాడే రాయచోటి నియోజకవర్గం పరిధిలోని మండలాలకు సాగు, తాగునీరు అందించేందుకు ఉద్దేశించిన ప్రాజెక్టు ఇది. దీన్నుంచి ఆయకట్టుకు నీరెప్పుడం దుతుందో తెలియని పరిస్థితి. జిల్లాలో జలయజ్ఞం కింద చేపట్టిన ప్రాజెక్టుల్లో 'వెలి గల్లు'ను 2008 డిసెంబర్ 22న జాతికి అంకితం చేశారు. నాలుగేళ్లు కావస్తున్నా ఆయకట్టుకు నీరందించే చర్యలు చేపట్టలేదు. ప్రస్తుతం వెలుగల్లు పరిస్థితి చూసి రైతులు గొల్లుమంటున్నారు. అన్నీ ఉన్నా అల్లుడి నోట్లో శని ఉందన్న చందంగా రైతుల పరిస్థితి తయారైంది. ఈ ప్రాజెక్టును అనాలోచితంగా నిర్మించడం వల్ల ప్రభుత్వ ధనం వృథా అయిందని జిల్లా ప్రజల నుంచి వినవస్తోంది. కృష్ణా జలాలు తప్ప మరో ప్రత్యామ్నాయం లేదు. బడ్జెట్‌లో కేవలం రూ.50 లక్షలే కేటాయించారు. గాలివీడు, రామాపురం, లక్కిరెడ్డిపల్లె మండలాల పరిధిలోని 22 గ్రామాలకు సంబంధించి 24,306 ఎకరాలకు సాగునీరు, 18 గ్రామాలకూ, రాయచోటి పట్టణానికీ (సుమారు లక్ష మందికి) తాగునీరు ఇవ్వాల్సి ఉంది. నాలుగేళ్లుగా ఆ ప్రాంతాల ప్రజలు, రైతులు నీటి కోసం చకోరపక్షుల్లా ఎదురు చూస్తునే ఉన్నారు.
No comments:
Post a Comment