న్యూఢిల్లీ Thu, 1 Mar 2012, IST
భారత్‌లో ఇంకా బాల్య వివాహాలు...గృహ హింస
యునిసెఫ్ తాజా నివేదిక వెల్లడి
బాల్య వివాహాలు, చిన్న వయసులోనే మాతృత్వం, గృహ హింస వంటి సమస్యలు ఆధునిక భారతాన్ని ఇంకా వెన్నాడుతూనే వున్నాయి. యునిసెఫ్ బుధవారం విడుదల చేసిన 'ప్రపంచ చిన్నారుల నివేదిక -2012' తాజా
గణాంకాలు ఈ విషయాన్ని స్పష్టం చేస్తున్నాయి. భారతదేశంలో దాదాపు 22 శాతం మంది మహిళలు (20 నుండి 24 ఏళ్లలోపు వున్నవారు) 18 ఏళ్లకే తల్లులయ్యారని ఈ నివేదిక పేర్కొంది. పుట్టిన ప్రతి వెయ్యి మందిలో 45 మంది చిన్నారులు 15 నుండి 19 ఏళ్ల వయసున్న వారికి పుట్టినవారేనని తెలిపింది. ఆశ్చర్యకరమైన విషయమేమిటంటే...57 శాతం మంది కౌమారదశ (15-19 ఏళ్లలోపు) పురుషులు, 53 శాతం మహిళలు ఒకానొక పరిస్థితుల్లో భార్యలను కొట్టడం సమర్థనీయమే అనే ఆలోచనలో వున్నారు. కేవలం 35 శాతం మంది కౌమారదశలోని పురుషులు, 19 శాతం మహిళలు మాత్రమే హెచ్‌ఐవిపై సమగ్ర పరిజ్ఞానం కలిగివున్నారు. బరువు తక్కువగా వున్న ఐదేళ్లలోపు వారిని చూస్తే, దాదాపు 33 శాతం నగరాల్లో వుండగా, 46 శాతం మంది గ్రామాల్లో వున్నారు. ప్రతి ముగ్గురిలో ఒకరు తక్కువ బరువుతో పుడుతుండగా, 50 శాతం కంటే తక్కువ చిన్నారులకు మాత్రమే తల్లిపాలు అందుతున్నాయి. ఐదేళ్లలోపు వారిలో 43 శాతం మంది చిన్నారులు బరువు తక్కువగా వుండగా, 16 శాతం మంది తీవ్రమైన పౌష్టికాహార లోపంతో బాధపడుతున్నారు. అలాగే 48 శాతం చిన్నారులు ఎదుగుదల లోపంతో వున్నారని ఈ యునిసెఫ్ నివేదిక పేర్కొంది. ఆరోగ్యం, పోషణ, మంచినీటి సదుపాయం, పారిశు ద్ధ్యం, విద్య, రక్షణ తదితర విషయాల్లో గ్రామీణ ప్రాంతాల్లో చిన్నారులు, పట్టణాల్లోని పేదలు ఎదుర్కొంటున్న సవాళ్లల్లో సారూప్యతను ఈ నివేదిక వెల్లడిస్తోందని భారత్‌లో యునిసెఫ్ ప్రతినిధి కరిన్ హుల్‌షాఫ్ తెలిపారు. 'బరువు తక్కువ, రక్తహీనత, 18 ఏళ్లలోపు వారికి పుట్టడం తదితర కారణాలతో నగరాల్లోని మురికివాడల్లో పుట్టిన చిన్నారి మొదటి పుట్టినరోజు నాటికి మరణిస్తోంది. ఇదే గ్రామాల్లోనూ జరుగుతోంది. దురదృష్టకరమేమంటే, నగర జీవనంలో చాలా సందర్భాల్లో ఈ అంశాలేవీ బయటకు రావడంలేదు' అని హుల్‌షాఫ్ చెప్పారు. యుసిసెఫ్ అంచనా ప్రకారం ప్రపంచవ్యాప్తంగా జరుగుతున్న బాల్య వివాహాల్లో 40 శాతం కంటే ఎక్కువగా మన దేశంలోనే జరుగుతున్నాయి. 'చిన్న వయసులో పెళ్లి చేయడంతో శారీరక పరిపక్వత సాధించముందే అత్యధికమంది తల్లులవుతున్నారు' అని యునిసెఫ్ పేర్కొంది. జెనీవాలో ఇటీవల జరిగిన ప్రపంచ ఆరోగ్య సంస్థ (డబ్ల్యుహెచ్‌ఓ) ఎగ్జిక్యూటివ్ బోర్డు సమావేశం ఈ అంశంపై చర్చించింది. డబ్యుహెచ్ ప్రకారం బాల్య వివాహాలైన వారిలో సగం మంది దక్షిణాసియాలోనే వున్నారు. జాతీయ మహిళా ఆరోగ్య సర్వే ప్రకారం, ప్రపంచవ్యాప్తంగా ప్రతి ఏడాది కోటి మంది మహిళలకు 18 ఏళ్లలోపు వివాహాలు జరుగుతున్నాయి. బాల్య వివాహాలను మన దేశ చట్టాలు నిషేధిస్తున్నప్పటికీ ఇందులో మూడో వంతు భారత్‌లోనే జరుగుతుండటం విశేషం. బాల్య వివాహాలను నిరోధిస్తూ 1929లో మన దేశంలో చట్టాలను ప్రవేశపెట్టారు. అప్పట్లో చట్టప్రకారం 12 లోపు వారికి పెళ్లి చేయకూడదు. 1978లో దీనిని 18 ఏళ్లకు సవరించారు.
No comments:
Post a Comment