(9)
ప్రజాశక్తి-కృష్ణా ప్రతినిధి Tue, 28 Feb 2012, IST
మట్టిపనుల్లో కోటి రూపాయలకుపైగా కైంకర్యం
గుత్తేదారుల ఇష్టారాజ్యం
పనులు చేయించలేమంటున్న అధికారులు
గతేడాది ప్రారంభించిన డెల్టా ఆధునీకరణ పనులు నాసిగా మారాయి. కృష్ణాజిల్లా బంటుమిల్లి కాల్వకు రూ.129 కోట్లు, కెఇబి దాని బ్రాంచ్ కాల్వలకు రూ.147.70 కోట్లను ప్రభుత్వం కేటాయించింది. టెండర్ దక్కించుకున్న పటేల్ ఇంజనీరింగ్ కంపెనీ నేరుగా పనులు చేపట్టకుండా సబ్ కాంట్రాక్టర్లకు అప్పగించింది. అయితే గుత్తేదారులు పనులను
నాశిరకంగా చేస్తున్నారనీ, విజిలెన్సు అధికారులతో తనిఖీ చేయించాలని రైతుసంఘాల నాయకులు డిమాండ్ చేస్తున్నారు. కెఇబి కెనాల్ పరిధిలోని 9/7 వద్ద వేసిన సిసి లైనింగ్ దెబ్బతిన్న మాట వాస్తవమేనని, దాన్ని తొలగించి మరోమారు కాంక్రీట్ వేయాల్సివుందని నీటిపారుదల అధికారులు సైతం ఒప్పుకుంటున్నారు. కెఇబి కెనాల్ మట్టి పనుల్లో నాణ్యత లోపించి కోటి రూపాయలకుపైగా దుర్వినియోగమైనట్లు టాస్క్‌ఫోర్సు బృందం కూడా గుర్తించింది. ఈ సీజన్‌లో 35 నుండి 45 శాతం పనులు పూర్తి చేస్తామని ప్రభుత్వం హామీ ఇచ్చి రబీ పంటకు విరామం ప్రకటించింది. అయితే డెల్టాలోని ప్రధాన మురుగు కాల్వల్లో ఇంతవరకూ తట్ట మట్టి కూడా తీయలేదు. గుండేరు, శివగంగ, తాళ్లపాలెం డ్రెయిన్‌లలో ఇంకా సర్వే కొనసాగుతూనేంది. డెల్టాలో పూడికతీతను దశాబ్ధాల తరబడి నిర్లక్ష్యం చేసిన ఫలితంగా కొద్దిపాటి వర్షాలకూ పంట, మురుగు కాల్వలు పొంగి ప్రవహించడంతో పంటలు దెబ్బతిని రైతులు తీవ్రంగా నష్టపోతున్నారు. 2006లో వచ్చిన ఓగ్ని తుపాను పంటలకు తీవ్ర నష్టం కలిగించటంతో రూ.2185 కోట్లతో కృష్ణాడెల్టాను ఆధునీకరించటానికి ముందుకొచ్చింది.
తీరప్రాంతానికి సాగునీరందిస్తున్న కెఇబి, దాని బ్రాంచ్ కెనాల్స్‌తో పాటు బందరు, బంటుమిల్లి కాలువలను ఆధునీకరించాలని భావించింది. లంకపల్లి, నెలకుర్రు, ఇసుకపల్లి, లంకలకలవగుంట, అర్తమూరు మధ్యస్ధాయి పంటకాలవలతో పాటు మరో 85 మైనర్ కాల్వలను కూడా అభివృద్ధి పర్చాలని నిర్ణయించింది. ప్రధాన మురుగు కాల్వలైన శివగంగ, తాళ్లపాలెం, లజ్జబండ, గుండేరును పూర్తి స్ధాయిలో ఆధునీకరించాల్సిన అవసరాన్ని గుర్తించి టెండర్ల పక్రియను పూర్తి చేసింది. పటేల్ ఇంజనీరింగ్ ఈ పనులను దక్కించుకుంది. పనుల నాణ్యతపై ఆరోపణలు వెల్లువెత్తుతున్న నేపథ్యంలో టాస్క్‌ఫోర్సు, క్వాలిటీ కంట్రోల్ అధికారులు దృష్టి సారించారు. కృష్ణాడెల్టా కెఇబి కెనాల్ పరిధిలో అక్రమాలు జరిగినట్లు టాస్క్‌ఫోర్సు అధికారులు గుర్తించారు. చీఫ్ ఇంజనీరు హరేరామ్ ఆధ్వర్యంలో టాస్క్‌ఫోర్స్ బృందం రెండు పర్యాయాలు పనులను పరిశీలించింది. కెఇబి కెనాల్ మట్టిపనుల్లో రూ.1.04 కోట్ల కుంభకోణం జరిగినట్లు ప్రాధమిక అంచనాకొచ్చింది. ఈ నేపథ్యంలో క్వాలిటీ కంట్రోల్ పర్యవేక్షక ఇంజనీరు (ఎస్‌ఇ) సుబ్బారావు కెఇబి కెనాల్ ఆధునీకరణ పనులను పరిశీలించనున్నారు. కరకట్టకు బయట నుండి మట్టి తీసుకొచ్చి పటిష్టపర్చాల్సి ఉండగా, కాల్వ బెడ్‌లోని 1.74 లక్షల క్యూబిక్ మీటర్ల మట్టినే తీసి కరకట్టకు వినియోగించారు. అయితే బయటి నుండి మట్టి తీసుకొచ్చినట్లు చూపించి రూ.1.04 కోట్ల మేర ఖజానాకు కన్నం వేయడంపై సుబ్బారావు ప్రత్యేక దృష్టి పెట్టినట్లు సమాచారం. ఈ నెల 7న రాష్ట్ర భారీ నీటిపారుదల శాఖ మంత్రి సుదర్శన్‌రెడ్డిని గన్నవరం విమానాశ్రయంలో అధికారులు కలిశారు. గుత్తేదార్లు తమ మాట ఖాతరు చేయటంలేదనీ, డెల్టా ఆధునీకరణ పనులు వేగవంతం చేయటం తమవల్ల కాదనీ చేతులెత్తేశారు.
కెఇబి కెనాల్ పరిధిలో ఏ అధికారీ పనిచేయటానికి సుముఖంగా లేరన్నారు. 9/7, 9/5లో జరుగుతున్న పనులను ఒక జెఇ మాత్రమే పర్వవేక్షిస్తున్నారనీ, రెగ్యులర్ డిఇ, ఇఇలు లేరనీ గుర్తుచేశారు.
ఆధునీకరణ పేరుతో నిధుల దుర్వినియోగం:
మారుబోయిన ఆంజనేయులు (రైతు)
కాలువల ఆధునీకరణ పేరుతో నిధులు దుర్వినియోగం చేయటం తప్ప రైతులకు న్యాయం జరుగుతుందన్న నమ్మకం కలగటం లేదు. గుత్తేదారులు నాణ్యతా ప్రమాణాలకు తిలోదకాలివ్వటంతో 9/7లో వేసిన సిమెంట్ కాంక్రీట్ లైనింగ్ బిల్లులు చెల్లించకముందే బీటలు వారింది.
నీటిపారుదల శాఖ ప్రిన్సిపల్ సెక్రటరీ మందలించినా ఫలితం శూన్యం:
వక్కపట్ల శ్రీనివాసరావు (తుమ్మలపల్లి సర్పంచ్ కుమారుడు)
జిల్లా కలెక్టర్ రిజ్వి ఇప్పటికి నాలుగు సార్లు పనులు పరిశీలించి నాణ్యతపై అసంతృప్తి వ్యక్తం చేశారు. రాష్ట్ర నీటిపారుదల శాఖ ప్రిన్సిపల్ సెక్రటరీ జోషి కూడా పనులు పరిశీలించి నాణ్యతపై పెదవి విరిచారు. గుత్తేదారును, అధికారులను తీవ్రంగా మందలించారు. అయినా పనుల నాణ్యతలో ఎలాంటి మెరుగుదలా లేదు.
లైనింగ్ డిజైన్‌లోనే లోపాలున్నాయి:
అర్జా వెంకటేశ్వరరావు (పెదయాదర పిఎసిఎస్ అధ్యక్షులు)
లైనింగ్ డిజైన్‌లోనే లోపాలున్నాయి. కరకట్ట వెంబడి లోడు లారీ వెళితే సిసి లైనింగ్ దెబ్బతినటం ఖాయమనే విషయాన్ని జిల్లా కలెక్టర్ దృష్టికి తీసుకెళ్లినా ఫలితం లేకపోయింది. విజిలెన్సు అధికారులు పనులను పరిశీలిస్తే లోపాలు బయటకొస్తాయి. సిమెంటు కాంక్రీటు వేసేటప్పుడు ఉప్పు నీరు వాడారు. సిమెంటు పాళ్లు తగ్గడంతో రెండు నెలలు తిరిగే సరికే బీటలు బయటపడ్డాయి.
చేసిన పనే తిరిగి చేస్తున్నారు:
గౌరిశెట్టి వెంకటేశ్వరరావు (కెఇబి ప్రాజెక్టు కమిటీ ఉపాధ్యక్షులు)
చేసిన పనినే తిరిగి చేస్తున్నారు. మట్టి బదులు బుసక వాడుతున్నారు. వర్షం వస్తే గట్లపై వేస్తున్న మట్టి కాల్వలో కూర్చోవటం ఖాయం. ఇదేమిటని ప్రశ్నిస్తే జవాబు చెప్పే నాధుడు లేడు.
No comments:
Post a Comment