(7)
ప్రజాశక్తి - ఆదిలాబాద్ ప్రతినిధి Sun, 26 Feb 2012, IST
పైసా విడుదల చేస్తే ఒట్టు
సాగులో కొచ్చిన భూమి సున్నా
ఆదిలాబాద్ జిల్లాలో ఆరు మధ్యతరహా ప్రాజెక్టుల తీరిది
'అంకెల గారడ' అంటారో.. 'అబ్రకదబ్ర' అంటారో మీ ఇష్టం!. ఒక్కటి మాత్రం నిజం. ఈ ప్రభుత్వం 'పంచపాండవులు- మంచంకోళ్లు' చందంగా ఆదిలాబాద్ జిల్లా ప్రజలతో పరిహాసమాడింది. జిల్లాలో ఆరు మధ్యతరహా నీటి పథకాలకు మూడేళ్లుగా నిధులు కేటాయిస్తూనే ఉంది. కానీ ఒక్క పైసా విడుదల చేస్తే ఒట్టు. పలికేవి శుష్కప్రియాలు, చూపేవి శూన్య'హస్తాలు' అని జిల్లా ప్రజలు రాష్ట్రంలోని కాంగ్రెస్ ప్రభుత్వాన్ని ఈసడించుకుంటున్నారు.
ఆదిలాబాద్ జిల్లాలోని ఆరు మధ్యతరహా ప్రాజెక్టులకు ప్రభుత్వం 2010-11 బడ్జెట్‌లో రూ.172.01 కోట్లు కేటాయించింది. పైసా విడుదల చేయలేదు. 2011-12లో రూ.86.85 కోట్లు కేటాయించింది. ఎర్ర యాగానీ విడుదల చేయలేదు. 2012-13 బడ్జెట్‌లో 90.49 కోట్లు కేటాయించారు. 'ఉట్టికెక్కలేనమ్మ స్వర్గానికి నిచ్చెనేస్తానన్న' చందంగా గత రెండేళ్లుగా నయాపైసా విడుదల చేయని ప్రభుత్వం.. ఈసారి ఏకంగా రూ.90.49 కోట్లు కేటాయించింది. ఇది అలంకారప్రాయ కేటాయింపా.. లేక ఆదిలాబాద్ ఉప ఎన్నికలను దృష్టిలో పెట్టుకొని ప్రజలను మభ్యపెట్టే బడ్జెట్టా.. అనేది తర్వాతగానీ తేలదు. మరోవైపు ఈ ప్రాజెక్టుల వ్యయ అంచనాలు పెరిగిపోతున్నాయి. జలయజ్ఞంలో భాగంగా 2004లోవైఎస్ రాజశేఖరరెడ్డి నేతృత్వంలోని కాంగ్రెస్ ప్రభుత్వం జిల్లాకు ఆరు మధ్యతరహా నీటి పథకాలను మంజూరు చేసింది. గొల్లవాగు, ర్యాలీవాగు, నీల్వాయి, జగన్నాథపూర్, కొమరం భీమ్, మత్తడివాగు ఇవీ ఆ ప్రాజెక్టులు. 2005లో వీటి పనులను ప్రభ్వుత్వం ప్రారంభించింది. 2007 నాటికి ఈ ప్రాజెక్టులను పూర్తి చేసి వాటి ద్వారా మొత్తం మూడు లక్షల ఎకరాలకు సాగు నీరందిస్తామనీ ప్రకటించింది. అయితే ఈ ఆరు ప్రాజెక్టుల్లో రెండింటి నిర్మాణం పూర్తి కాకుండానే నీటి విడుదల చేశారు. తాంసి మండలంలోని మత్తడివాగుపై నిర్మించిన ప్రాజెక్టు తూములు, స్పిల్‌వే పనులు, కాల్వల నిర్మాణం పూర్తి కాకుండానే 2009లో నాటి ముఖ్యమంత్రి వైఎస్ నీటిని విడుదల చేశారు. ఆసిఫాబాద్ మండలం అడ గ్రామ సమీపంలోని కొమురం భీమ్ ప్రాజెక్టు పూర్తి కాకుండానే (స్పిల్‌వే వద్ద నీటిని నిల్వ ఉంచడం చేశారు. కాల్వలు మాత్రం లేవు) రెండు నెలల క్రితం ముఖ్యమంత్రి కిరణ్‌కుమార్‌రెడ్డి నీటిని విడుదల చేశారు. ప్రాజెక్టుల పరిపూర్తికి నిర్దేశించిన గడువు పూర్తయి ఐదేళ్లయినా మూడు లక్షల ఎకరాలకు నీరు ఇస్తామన్న ప్రభుత్వ పెద్దలు కొత్తగా ఒక్క ఎకరానికి నీరిచ్చిన పాపాన పోలేదు. నిధులు విడుదల చేయకపోవడం పనుల నిర్వహణకు అడ్డంకిగా ఉంది. అలాగే గుత్తేదారుల అలసత్వమూ ఉంది. ఆదిలాబాద్‌లో జిల్లాలో చేపట్టిన మధ్య తరహా ప్రాజెక్టుల తీరుతెన్నులిలా ఉన్నాయి.
గొల్లవాగు : జైపూర్ మండలం భీమారం గ్రామ సమీపంలో జి-5 సబ్ బేసిన్‌లోని గోదావరి నదికి ఉపనది అయిన గొల్లవాగుపై ప్రాజెక్టును నిర్మిస్తున్నారు. అంచనా వ్యయం రూ.83.61 కోట్లు. 28 కిలోమీటర్ల పొడవులో ఒకే ఒక కాలువ ఉంది. 20 కిలోమీటర్ల వరకూ తవ్వకమూ, లైనింగూ పూర్తయింది. మిగిలిన పనుల పూర్తికి రూ.ఆరు కోట్లు అవసరం. 2012-13 బడ్జెట్‌లో రూ.3.35 కోట్లు మాత్రమే కేటాయించారు. ప్రాజెక్టు నిర్మాణం పూర్తయినా ప్రధాన కాలువలు పూర్తికాక ఒక్క ఎకరానికి కూడా సాగు నీరందించే పరిస్థితి లేకుండా పోయింది.
ర్యాలీవాగు : మంచిర్యాల మండలం ముల్కల్ల గ్రామం వద్ద జి-5 సబ్ బేసిన్ గోదావరి నదికి ఉప నది అయిన ర్యాలీ వాగుపై ప్రాజెక్టు నిర్మాణం చేపట్టారు. ఆనకట్ట నిర్మాణం, గట్టు ఏర్పాటు, ప్రధాన రెగ్యులేటర్ల నిర్మాణం, సర్‌ప్లస్ కోర్స్, ఎల్‌ఎఫ్ అండ్ రీఎఫ్ కాలువ పిల్ల కాలువల తవ్వకం, లైనింగ్ ప్రధాన పనులు పూర్తయ్యాయి. 2007లోనే జలాశయంలో నీటిని నిల్వచేశారు. 2010లో ప్రాజెక్టు పనులు పూర్తి చేశారు. చిన్న పనులకు మరో రూ.కోటి కావాల్సి ఉంది. ఈ బడ్జెట్‌లో కేవలం రూ.60 లక్షలే కేటాయించారు. అంటే ఈ ప్రాజెక్టు ద్వారా ఈ సంవత్సరమూ నీరు విడుదల కాదన్నమాట.
నీల్వాయి : నీల్వాయి గ్రామ సమీపంలో ప్రాజెక్టు నిర్మాణం చేపట్టారు. కట్ట పనులు అసంపూర్తిగా ఉన్నాయి. మరో 100 మీటర్లు కట్ట నిర్మాణం జరగాల్సి ఉంది. పూర్తి స్థాయిలో కాలువలు నిర్మించాలి. వీటి నిర్మాణానికి ఇటీవల రూ.70 కోట్లకు టెండర్లు పిలిచారు. ఈ ఏడాది బడ్జెట్‌లో రూ.28.51 కోట్లు కేటాయించారు. గతేడాది కురిసిన భారీ వర్షాలకు కట్ట కొట్టుకుపోయింది. ఈ యేడు కేటాయించిన నిధులైనా సకాలంలో విడుదల చేస్తేనే పనులు పూర్తయ్యే అవకాశాలున్నాయి.
జగన్నాథ్‌పూర్ : కాగజ్‌నగర్ మండలం పెద్దవాగుపై దీనిని నిర్మిస్తున్నారు. ప్రాజెక్టు వ్యయం రూ.255 కోట్లు. నిధులు తక్కువగా కేటాయిస్తుండటంతో నిర్మాణ పనుల్లో జాప్యం జరుగుతోంది. బాడీవాల్ పూర్తయింది. 29 కిలోమీటర్ల పొడవున ఒకే ఒక కాలువ ఉంది. 21 కిలోమీటర్ల పొడవున తవ్వకం పనులు పూర్తయ్యాయి. ఆరు కిలోమీటర్ల పొడవునే లైనింగ్ పనులు పూర్తయ్యాయి. ప్రధాన కాలువ పనులు నత్తనడకగా సాగుతున్నాయి. కాలువలను పూర్తి స్థాయిలో నిర్మించాల్సి ఉంది. ప్రాజెక్టు పూర్తికి మరో రూ.30 కోట్లు అవసరం కాగా ఈ ఏడాది బడ్జెట్‌లో రూ.18.53 కోట్లే కేటాయించారు.
కొమురం భీమ్ : ఆసిఫాబాద్ మండలంలోని అడ గ్రామ సమీపంలో పెద్దవాగుపై ప్రతిపాదించిన మధ్యతరహా సాగు నీటి ప్రాజెక్టు ఇది. ఈ ప్రాజెక్టు వ్యయం రూ.274.14 కోట్లు. బడ్జెట్‌లో కేటాయింపులు తక్కువగా ఉండటంతో పనుల్లో జాప్యం జరుగుతోంది. ఈ ఏడాది బడ్జెట్‌లో రూ.39.50 కోట్లు కేటాయించారు. కాలువల నిర్మాణం ఇంకా పూర్తి కాకుండానే ప్రాజెక్టు పనులు పూర్తయినట్లుగా ముఖ్యమంత్రి కిరణ్‌కుమార్ రెడ్డి రెండు నెలల కిందట ఆర్భాటంగా నీటిని విడుదల చేయడం గమనార్హం.
మత్తడి వాగు : తాంసి మండలంలోని మత్తడివాగు పనులు 90 శాతం పూర్తయ్యాయి. చిన్న పనులకు మరో రూ.కోటి కావాల్సి ఉంది. జిల్లా నుండి ప్రతిపాదనలు పంపినా నయా పైసా కేటాయించలేదు. ఈప్రాజెక్టు పూర్తయినట్లు 2009లోనే అప్పటి ముఖ్యమంత్రి వైఎస్ రాజశేఖర్‌రెడ్డి నీటిని విడుదల చేశారు. కానీ రెండు ప్రధాన కాలువలున్నా ఒక్కదాని నిర్మాణమూ సక్రమంగా పూర్తి కాలేదు. దీనివల్ల ఒక్క ఎకరానికీ సాగునీరందని స్థితి. ఈ ప్రాజెక్టు పూర్తి చేసేందుకు కాలువల నిర్మాణానికి గతేడాది బడ్జెట్‌లో రూ.1.5 కోట్లు కేటాయించినా ప్రభుత్వం ఒక్క పైసా విడుదల చేయలేదు. ఈ ఏడాదీ ఒక్క పైసా కూడా కేటాయించలేదు.
No comments:
Post a Comment