(6)
ప్రజాశక్తి-వరంగల్ ప్రతినిధి Sat, 25 Feb 2012, IST
మూడేళ్లుగా పాలకుల నాన్చివేత
అరకొర కేటాయిపులకే పరిమితం
పూర్తైతే 7.50 లక్షల ఎకరాలకు నీరు
వరంగల్ జిల్లాలోనే అతి పెద్ద బహుళార్ధక ప్రాజెక్టు అయిన కంతనపల్లి నిర్మాణానికి నిధులలేమి వెంటాడుతోంది. నిధులు కేటాయించడంలోనూ, విడుదల చేయడంలో ప్రభుత్వం ప్రతిసారీ మొండిచేయే చూపుతోంది. ప్రాజెక్టు వ్యయాన్ని 10వేల 450 కోట్లుగా నిర్ధారించారు. ఈ ప్రాజెక్టు పూర్తి చేస్తే వరంగల్, ఖమ్మం, నల్లగొండ జిల్లాలోని 7లక్షల
50వేల ఎకరాలకు సాగునీరందు తుంది. హైదరాబాద్‌కు తాగునీటిని అందించవచ్చు. 300 మెగావాట్ల విద్యు దుత్పత్తి కానుంది. ఇంతటి ప్రాధాన్యత గల ఈ ప్రాజెక్టుకు 2011-12 బడ్జెట్‌లో 50కోట్లు కేటాయించగా కోటి మాత్రమే ఖర్చు చేసినట్లు అంచనా. 2012- 13బడ్జెట్‌లో 60కోట్లు కేటాయించారు. నిధుల కేటాయింపు, విడుదల ఇదే రీతిగా ఉంటే దశాబ్దాలు గడిచినా ఈ ప్రాజెక్టు పూర్తయ్యే పరిస్థితి కనిపించ డంలేదు.
రానున్న రోజుల్లో హైదరాబాద్ నగరాన్ని తాగునీటి ముప్పునుండి కాపాడేందుకు ఇండియన్ ఇనిస్టిట్యూట్ ఆఫ్ ఇంజనీర్స్ సౌత్ బ్రాంచ్ గోదావరిని పరిశీలించింది. కంతనపల్లి వద్ద ప్రాజెక్టు నిర్మాణం చేయడం వల్ల వరంగల్‌కు మొదటి దశలో 3లక్షల 10వేల ఎకరాలకు, రెండో దశలో లక్షా 13వేల 578 ఎకరాలకు, నల్లగొండ జిల్లాలో 2లక్షల 57వేల 508 ఎకరాలకు, ఖమ్మం జిల్లాలో 68వేల 914 ఎకరాలకు, మొత్తంగా 7లక్షల 50వేల ఎకరాలకు నీరివ్వడంతో పాటు హైదరాబాద్ వరకు గోదావరి జలాలను తరలించొచ్చని డిజైన్ చేశారు. 300 మెగావాట్ల విద్యుత్ కేంద్రాన్ని నిర్మాణం చేసే అవకాశం కూడా ఉంది. కంతనపల్లి స్టేజ్-2 ఎస్‌ఆర్‌ఎస్‌పికి జీవనాధారంగా ఉపయోగ పడనుంది. ఇది పూర్తిగా గోదావరిపై కడుతున్న ఆనకట్ట కావడంతో దేవాదుల వద్ద నీటిని నిల్వ చేసే అవకాశముంది. ఈ విషయాలపై అవగాహనా సదస్సు కూడా నిర్వహించారు. సదస్సుకు వరంగల్ నుండి రైతు సంఘం జిల్లా కార్యదర్శి సారంపల్లి వాసుదేవరెడ్డి హాజరయ్యారు. సుమారు 100 టిఎంసిల నీటిని వాడుకునే అవకాశముండడంతో పాటు దేవాదుల ప్రాజెక్టు క్రింద ఏడాదికి 365 రోజులు నీటిని నిల్వ చేసే అవకాశం ఉంటుందని నిర్ధారించారు. దీనిపై సిపిఎం జిల్లా కమిటీ పూర్తి స్థాయిలో అధ్యయనం చేసింది. దీని ప్రాధాన్యత గుర్తించి వివిధ రూపాల్లో ఆందోళనలు చేపట్టింది. బచావత్‌అవార్డు నీటి నిబందనలకు లోబడి ఈ ప్రాజెక్టు నిర్మాణం చేయొచ్చనే విషయాన్ని ప్రభుత్వం దృష్టికి తీసుకెళ్లారు. 120 మందితో కంతనపల్లి నుండి హైదరాబాద్ వరకు పాదయాత్ర నిర్వహించి ప్రాజెక్టు ప్రధాన్యతను అప్పటి ముఖ్యమంత్రి వైఎస్ రాజశేఖరరెడ్డికి వివరించారు. ప్రభుత్వం స్పందించి ప్రాజెక్టు ప్రణాళికకు రూపకల్పన చేసింది. 2009 మార్చి 19న అప్పటి ముఖ్యమంత్రి రాజశేఖరరెడ్డి శంకుస్థాపన చేశారు.
నిధుల విడుదలలో నిర్లక్ష్యం
2010-11బడ్జెట్‌లో ఈ ప్రాజెక్టుకు 30 కోట్ల రూపాయలు కేటాయించారు. 2011-12 బడ్జెట్‌లో 50 కోట్లు కేటాయించారు. వీటిలో కోటి రూపాయలు మాత్రమే ఖర్చు చేశారు. ఈ యేడాది బడ్జెట్‌లో రూ.60కోట్లు కేటాయించి చేతులు దులుపుకున్నారు. ఇప్పటి వరకూ తట్టెడు మట్టికూడా తీయలేదు. వరంగల్ జిల్లాకు చెందిన పొన్నాల లక్ష్మయ్య ఆరున్నరేళ్లు భారీనీటి పారుదల శాఖ మంత్రిగా పనిచేశారు. కానీ జిల్లాలో చేపట్టిన దేవాదుల, ఎస్సారెస్పీ, కంతనపల్లి ప్రాజెక్టులను పూర్తిచేయడంలో ఎలాంటి ఆసక్తి కనబరచలేదు. దేవాదులకు సుమారు 6500కోట్లు ఖర్చు చేశారు. కానీ ఒక్క ఎకరాకు నీరివ్వడం లేదు. కంతనపల్లిని పట్టించుకున్న పాపానపోలేదు. పొన్నాల లక్ష్మయ్యనే కాకుండా ఇప్పటి మంత్రి బస్వరాజు సారయ్య కూడా జిల్లా సమగ్రాభివృద్ధి విషయంలో ఏమాత్రం శ్రద్ద కనబర్చడం లేదు. ఈ ప్రాజెక్టు వల్ల ఒనగూరే లాభాలను మంత్రులు, ఎమ్మెల్యేలు పదేపదే ఉపన్యాసాలతో ఊదరగొట్టడమేగానీ దీని నిర్మాణానికి చిత్తశుద్ధితో పని చేసేవారే లేదు.
ప్రాజెక్టు సాధనకు సిపిఎం పోరాటాలు
కంతనపల్లి ప్రాజెక్టు ప్రాధాన్యతను గుర్తించిన సిపిఎం దాన్ని సాధించేందుకు అనేక పోరాటాలు చేసింది. మొదటగా కంతనపల్లి ప్రాధాన్యతపై కరపత్రాలతో ప్రచారం చేశారు. వరంగల్, నల్లగొండ, ఖమ్మం జిల్లాలో సదస్సులు నిర్వహించారు. మండల కేంద్రాల్లో ధర్నాలు చేశారు. అయినప్పటికీ ప్రభుత్వం స్పందించకపోవడంతో చివరకు కంతనపల్లి నుండి అసెంబ్లీ వరకు పాదయాత్ర నిర్వహించారు. సుమారు రెండు గంటల పాటు కంతనపల్లి ప్రాధాన్యతను సిపిఎం బృందం అప్పటి ముఖ్యమంత్రికి వివరించారు. సానుకూలంగా స్పందించిన సిఎం ప్రాజెక్టు నిర్మాణ ప్రతిపాదనలు తయారు చేయాలని నీటిపారుదల శాఖను ఆదేశించారు. అలా ప్రాజెక్టు నిర్మాణానికి శంకుస్థాపన జరిగింది. నిధుల కేటాయింపు కోసం ఇప్పటికీ సిపిఎం ఆందోళనలు చేస్తూనే ఉంది.
No comments:
Post a Comment