అంతర్జాలంలోని అన్నిరకాల ముఖ్యమైన సమాచారాన్ని ఈ సైట్ లో నిక్షిప్తం చేసి, అందరికీ ఉపయోగపడే ఒక వేదికగా ఈ సైట్ ఉండాలనే ఉద్దేశ్యంతో ప్రారంభించడమైంది. ఏ సైట్ నుండి సమాచారం తీసుకున్నా వారి పేరుతోనే ఇందులో వుంచుతాను. సహృదయంతో సహకరించగలరు.
ఎవరికైనా అభ్యంతరముంటే వారి సైటుకు సంబంధించిన సమాచారం తొలగించడం జరుగుతుంది. - ధన్యవాదములతో...

Friday, March 2, 2012

ఏ ఒక్కటీ పూర్తికాని దేవాదుల..!


(8)
ప్రజాశక్తి - వరంగల్‌ ప్రతినిధి   Mon, 27 Feb 2012, IST

రూ. 5,670 కోట్లు ఖర్చు
ఒక్క ఎకరాకూ అందని నీరు
పదేళ్లుగా రైతుల ఎదురుచూపు

జె. చొక్కారావు దేవాదుల ఎత్తిపోతల పథకం పనులు మొదలెట్టి దశాబ్దం గడిచింది. ఇప్పటిదాకా ఏ ఒక్క దశా పూర్తికాలేదు. ఒక్క ఎకరాకూ నీరివ్వలేదు. ఈ ప్రాజెక్టును ఐదేళ్లలో, మూడు దశల్లో నిర్మించి 6 లక్షల 52 వేల 40 ఎకరాలకు సాగు నీటిని, పలు ప్రాంతాలకు తాగు నీరు అందించాలనేది లక్ష్యం. మూడు దశలుగా నిర్మించనున్న ఈ
ప్రాజెక్టు అంచనా వ్యయం 9,427 కోట్ల 73 లక్షలు. ఇప్పటికి 5 వేల 670 కోట్లు ఖర్చు చేశారు. ప్రారంభం నుండీ ప్రాజెక్టు నిర్మాణంలో అనేక అవకతవకలు, లోపాలు. దేవాదుల అంటే లీకేజీల ప్రాజెక్టుగా ముద్రపడింది. మూడు దశల్లో దేవాదులను పూర్తి చేయాల్సి ఉండగా ఏ ఒక్కటీ పూర్తి కాలేదు. జిల్లాకు చెందిన పొన్నాల లక్ష్మయ్య ఏడేళ్ల పాటు భారీ నీటి పారుదల శాఖ మంత్రిగా పనిచేసినా, ఒరిగింది శూన్యం. నేటికీ రిజర్వాయర్లు, కాల్వలు అసంపూర్తిగానే ఉన్నాయి. 2011-12 బడ్జెట్‌లో 858.35 కోట్లు కేటాయించగా 700 కోట్లు ఖర్చయినట్లు అంచనా. ఈ యేడాది బడ్జెట్‌లో 532.78 కోట్లు కేటాయించారు. నిధులు నీళ్లలా ఖర్చవుతున్నాయే గానీ, నాలుగు జిల్లాలకు నీరందించే ఈ ప్రాజెక్టును పూర్తిచేయడంలో ప్రభుత్వ చిత్తశుద్ధి లోపించింది. దేవాదులపై ప్రజాశక్తి ప్రత్యేక కథనం...

గోదావరి నీటిని ఎత్తిపోతల ద్వారా మళ్లించి వరంగల్‌, కరీంనగర్‌, నల్గొండ, మెదక్‌ జిల్లాకు నీరందించాలని 2001లో అప్పటి తెలుగుదేశం ప్రభుత్వం దేవాదులకు రూపకల్పన చేసింది. సాగునీటితో పాటు తాగునీరు అందించడం లక్ష్యంగా ఇచ్చంపల్లికి దిగువన గంగారం వద్ద ఈ ఎత్తిపోతల పథకానికి స్థలాన్ని ఎంపిక చేశారు. 16 జూన్‌ 2001న అప్పటి ముఖ్యమంత్రి నారా చంద్రబాబునాయుడు శంకుస్థాపన చేశారు. దీని ద్వారా 50 టిఎంసిల నీటిని పంపింగ్‌ చేయాలని నిర్ణయించారు. ప్రస్తుతం మూడు దశలకు 38 టిఎంసిల నీటిని మాత్రమే వాడుకునేందుకు ప్రాణాళికను రూపొందించి అమలు చేస్తున్నారు. దేవాదులను మూడు విభాగాలుగా విడగొట్టారు. మొదటి దశ ద్వారా గంగారం నుండి ధర్మసాగర్‌ వరకు 5.18 టిఎంసిల నీటిని ఎత్తిపోయడం ద్వారా లక్షా 22 వేల 864 ఎకరాలకు, రెండో దశలో ధర్మసాగర్‌ రిజర్వాయర్‌ నుండి జనగామలోని చిటకోడూరు రిజర్వాయర్‌ వరకు, చేర్యాలలోని తపాస్‌పల్లి వరకు 7.25 టిఎంసిలను పంపింగ్‌ చేసి 2లక్షల 85వేల ఎకరాలకు, మూడో దశలో అశ్వరావుపల్లి రిజర్వాయర్‌ నుండి కాలువ ద్వారా నల్లగొండ జిల్లాకు లక్షా 20వేల ఎకరాలకు, వరంగల్‌ జిల్లాలో 52వేల 552 ఎకరాలకు నీరందించాలని ప్రణాళికలు తయారు చేశారు. ఈ పథకాన్ని ఐదేళ్లలో పూర్తి చేయాల్సి ఉండగా పదేళ్లు దాటినప్పటికి మొదటి దశ కూడా పూర్తి కాలేదు.

అరకొర నిధుల కేటాయింపు

వైఎస్‌ రాజశేఖరరెడ్డి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత దేవాదుల ప్రాజెక్టును రెండేళ్లలో పూర్తిచేస్తామని 2004 మే 14న హామీ ఇచ్చారు. ఆయన హామీకి కూడా ఏడేళ్లు గడిచాయి. కానీ ఒక్క ఎకరాకు నీరందలేదు. ప్రాజెక్టు నిర్మాణానికి ప్రతి బడ్జెట్‌లోనూ కంటితుడుపుగా నిధులు కేటాయిస్తున్నారు. 2008-09 బడ్జెట్‌లో 1270 కోట్లు కేటాయించారు. అప్పటి అంచనాల ప్రకారం మొదటి దశకు 950 కోట్లు, రెండో దశకు 1887కోట్లు, మూడో దశకు 3513 కోట్లు ఖర్చు చేయాలి. మొత్తం 6,350 కోట్లు ఖర్చు చేయాలి. పెరిగిన అంచనాల ప్రకారం ప్రాజెక్టు వ్యయం 9427కోట్ల 73లక్షలకు చేరింది. ఇప్పటి వరకు 5,670కోట్లు ఖర్చు చేశారు. అంటే సగానికిపైగా నిధులు ఖర్చయ్యాయి. కానీ ఏ ఒక్క దశ కూడా పూర్తి కాలేదు. మొదటి, రెండో దశ పనులు కొంత వరకు జరగ్గా, మూడో దశ కింద అక్కడక్కడా కాల్వలు తీయడానికే పరిమితమయ్యారు. మొదటి దశను రెండేళ్లలో, మూడు దశల్ని ఐదేళ్లలో పూర్తి చేస్తామని ప్రభుత్వం చెప్పినా, ఈ ఐదేళ్లలో ఒక్క దశా పూర్తి స్థాయిలో పూర్తి కాలేదు.

ఎందుకింత నిర్లక్ష్యం

వరంగల్‌ జిల్లాలో సుమారు 6 లక్షల 52 వేల 40 ఎకరాలకు నీరందించేందుకు అవకాశం ఉన్న ఈ ప్రాజెక్టు నిర్మాణంలో ప్రభుత్వం తీవ్ర నిర్లక్ష్యం చేస్తోంది. రెండో దశ పూర్తిగా మంత్రి పొన్నాల లక్ష్మయ్య నియోజకవర్గానికి సంబందించింది. మొదటి దశ పనుల్ని రెండేళ్లలో పూర్తి చేస్తామని 30 జూన్‌ 2005న అప్పటి సిఎం వైఎస్‌ ప్రకటించారు. డిసెంబర్‌ లోగా 20వేల ఎకరాలకు నీరందిస్తామని 24 నవంబర్‌ 2007లో మరోసారి చెప్పారు. 'మొదటి దశ పనులు పూర్తి అయ్యాయి, ఖరీఫ్‌లోగా నీరందిస్తాం' అని 14 మే 2009న అప్పటి మంత్రి పొన్నాల లక్ష్మయ్య ప్రకటించారు. ఇవేవీ నెరవేర్చలేకపోయారు. ఇటీవల మరో మారు 'దేవాదుల కింద 20వేల ఎకరాలకు నీరందిస్తున్నాం' అని చెప్పారు. ఎక్కడ ఇస్తున్నారని అడిగినా వివరాలు చెప్పరు. వాస్తవాలను పరిశీలిస్తే ఒక్క ఎకరాకూ నీరిచ్చిన దాఖలాలు లేవు.

No comments:

Post a Comment