prajasakti Thu, 1 Mar 2012, IST
సిరియా విషయంలో తీరు మార్చుకోవడం, ఇరాన్ విషయంలో వ్యవహరిస్తున్న వైఖరి భారత విదేశాంగ నీతిలో వాస్తవాన్ని ఆవిష్కరిస్తున్నాయి. విశాల జాతీయ ప్రయోజనాల ప్రాతిపదికగా స్వతంత్ర విధానాన్ని ఇంకెంతమాత్రం అనుసరించడం లేదు. సామ్రాజ్యవాద ఒత్తిళ్లు, అమెరికా భౌగోళిక, రాజకీయ ప్రయోజనాలకు దాసోహమంటోంది.
సిరియాపై యుపిఎ ప్రభుత్వ తీరు మారింది. సిరియాపై మరిన్ని ఆంక్షలు విధిస్తూ యూరోపియన్ దేశాలు భద్రతా మండలిలో ప్రవేశపెట్టిన తీర్మానంపై 2011 అక్టోబర్‌లో జరిగిన ఓటింగ్‌ను బహిష్కరించిన భారత్ మూడు మాసాల తరువాత అరబ్‌లీగ్ ప్రవేశపెట్టిన ఇటువంటి తీర్మానానికి అనుకూలంగా ఓటు వేసింది. ఈ రెండు తీర్మానాలను రష్యా, చైనా వీటో చేశాయి. భారత్ తొలుత తీసుకున్న వైఖరికి పూర్తి భిన్నమైన వైఖరిని తాజాగా తీసుకుంది. లిబియా తరహాలో సిరియా వ్యవహారాల్లో అంతర్జాతీయ జోక్యానికి అరబ్ లీగ్ తీర్మానం ఉద్దేశింపబడింది. రష్యా, చైనా వీటో చేయడంతో ఇది కూడా చెల్లుబాటు కాలేదు. తొలి తీర్మానం ఓటింగ్‌లో పాల్గొనని భారత్ అమెరికా, దాని నాటో మిత్రపక్షాలు, అరబ్ దేశాల్లోని దాని తాబేదార్లతో కలసి ఈ తీర్మానానికి అనుకూలంగా ఓటు వేసింది.
భద్రతా మండలిలో విఫలమవడంతో ఐక్యరాజ్యసమితి జనరల్ అసెంబ్లీలో ఇదే తరహాలో మరో తీర్మానాన్ని ప్రవేశపెట్టగా దానికి కూడా భారత్ అనుకూలంగా ఓటు వేసింది. ఈ తీర్మానాన్ని ఐక్యరాజ్యసమితి ఆమోదించింది. అయితే భద్రతా మండలి ఆమోదం లేదు కనక ఈ తీర్మానానికి కట్టుబడి ఉండాల్సిన అవసరం లేదు. సిరియా విషయంలో భారత వైఖరిపై ఏమైనా అనుమానాలుంటే అవి ట్యునిస్‌లో గత నెల 24న జరిగిన 'ఫ్రెండ్స్ ఆఫ్ సిరియా'' సమావేశానికి హాజరు కావాలని భారత్ నిర్ణయిం చడంతో పటాపంచలయ్యాయి. విదేశాంగ శాఖలో పశ్చిమాసియా, ఉత్తర ఆఫ్రికా వ్యవహారాలను పర్యవేక్షిస్తున్న సంయుక్త కార్యదర్శిని భారత్ ఈ సమావేశానికి పంపింది. ''ఫ్రెండ్స్ ఆఫ్ లిబియా'' సమ్మేళనాల తరహాలోనే ఈ సమావేశం జరిగింది.
గత అక్టోబర్ నుండి సిరియాలో పరిస్థితి అత్యంత భయానక వివాదంగా మారింది. ఆ దేశంలో అధికారంలో ఉన్న బషార్ అలి అస్సాద్ ప్రభుత్వాన్ని గద్దె దింపేందుకు అమెరికా, సిరియా మాజీ వలస రాజ్యాలు, ఫ్రాన్స్, బ్రిటన్, సౌదీ అరేబియా కుట్ర పన్నాయి. ఇందుకోసం నాటో మిత్రదేశమైన టర్కీని సిరియా తిరుగుబాటు దారులకు ఆశ్రయం కల్పించేందుకు స్థావరంగా ఉపయోగించుకుంటున్నాయి. సిరియా జాతీయ మండలి, స్వతంత్ర సిరియా సైన్యం ఏర్పాటయ్యాయి. టర్కీలో స్థావరం ఏర్పాటు చేసుకున్న వాటికి నాటో ఆయుధాలు సరఫరా చేస్తోంది. సిరియా పోరాటదళాలను టర్కీలోని ఇస్కెరన్‌డమ్‌కు చేరవేస్తోంది. ఈ ప్రాంతం సిరియా సరిహద్దుకు చేరువలో ఉంది. హామ్స్, ఇతర ప్రాంతాలను లక్ష్యంగా చేసుకుని సాయుధ దళాలు సిరియా భద్రతా దళాలపై, ప్రభుత్వ సంస్థలపై దాడులు చేస్తున్నాయి. సిరియా భద్రతా దళాలపై, పౌరులపై సాయుధ దళం దాడులు చేస్తున్నట్లు సిరియా సందర్శించిన అరబ్ లీగ్ బృందం తన నివేదికలో పేర్కొంది. ప్రభుత్వం అందుకు ప్రతిస్పందిస్తుండటంతో మరింత హింసాకాండ చోటుచేసుకుంటోందని తెలిపింది. సిరియాలో చోటుచేసుకుంటున్న హింసా కాండను పశ్చిమ దేశాల మీడియా వక్రకరిస్తోంది. ముస్లింలు, తీవ్రవాద ఇస్లామిక్ గ్రూప్‌లతో ఏర్పడిన తిరుగుబాటు దళాలు చేస్తున్న దాడులను అది కప్పి పుచ్చుతోంది. అరబ్ ప్రపంచంలో సిరియా ప్రభుత్వం ఒక్కటే లౌకిక వాద ప్రభుత్వంగా వ్యవహరిస్తుండటంతో అల్‌ఖైదా కూడా తిరుగుబాటు దళాలకు మద్దతు తెలిపింది. సిరియాను లక్ష్యంగా చేసుకునేందుకు నిరంకుశంగా వ్యవహరిస్తున్న సౌదీ, గల్ఫ్ ప్రభుత్వాలను ఒక నిర్దిష్ట వ్యూహం ప్రకారం ఉపయోగించుకుంటున్న పశ్చిమ దేశాలు మరోవైపు సిరియా ప్రభుత్వం నిరంకుశంగా వ్యవహరిస్తోందని విమర్శిస్తూ తమ ద్వంద్వ ప్రవృత్తిని చాటుకుంటున్నాయి.
సిరియాలో కొనసాగుతున్న పోరాటం ఒక ప్రాంతీయ సమస్య కాదు. ఇరాన్‌కు వ్యతిరేకంగా, పశ్చిమాసియాలో సామ్రాజ్యవాద శక్తుల పెత్తనం, అక్కడ చమురు వనరులపై నియంత్రణను కొనసాగించేందుకు ఉద్దేశించిన భౌగోళిక రాజకీయ పోరాటంలో అంతర్భాగం. ఇరాన్‌తో సిరియాకు గల సన్నిహిత సంబంధాలను తెగతెంపులు చేసేందుకు సిరియాలో అధికార మార్పిడి జరగాలని అమరికా, నాటో దళాలు కోరుకుంటున్నాయి. ఇది ఇజ్రాయిల్ ప్రయోజనాలకు కూడా దోహదం చేస్తుంది. సన్నీ వహాబీ ప్రభావాన్ని సిరియాకు విస్తరించి షియాలు ఆధిక్యతలో ఉన్న ఇరాన్‌ను వంటరి చేయాలని కోరుతున్న సౌదీ అరేబియా అస్సాద్ ప్రభుత్వాన్ని గద్దె దిగడం పెద్ద గెలుపే అవుతుంది.
ఇంతకుముందు లిబియాపై భద్రతా మండలిలో భారత్ సరైన నిర్ణయం తీసుకుంది. నాటో దళాలు, దాని కతార్ వంటి దాని ప్రాక్సీలు ఈ తీర్మానాన్ని ఏ విధంగా ఉపయోగించుకున్నాయో చూసిన తరువాత సిరియాలో కొనసాగుతున్న అధికార క్రీడకు దూరంగా ఉండటం అవసరం. అమెరికా ఒత్తిడి చేయడంతోనే 2011 అక్టోబర్‌లో తీసుకున్న వైఖరికి భిన్నమైన వైఖరిని భారత్ తీసుకుందని భావించవచ్చు. ఇరాన్ విషయంలో కూడా భారత్ ఇదే వైఖరిని అవలంభిస్తోంది. ఇరాన్‌ను వంటరి చేసి, అక్కడ కూడా ప్రభుత్వాన్ని మార్చాలనే తన వ్యూహానికి భారత్ వంత పాడాలని అమెరికా కోరు కుంటోంది. ఇరాన్ నుండి చమురు కొనడాన్ని నిలిపి వేయాలని, దానితో వర్తక, ఆర్థిక సంబంధాలను తెగతెంపులు చేసుకోవాలని నిరంతరం ఒత్తిడి తీసుకువస్తోంది. అమెరికా విదేశాంగ శాఖ ప్రతినిధి ఈ నెల 21న భారత్, చైనాలను ప్రత్యేకంగా ప్రస్తా విస్తూ ఇరాన్ చమురుపై ఆధారపడటాన్ని తగ్గించు కోగలవని భావిస్తున్నట్లు చెప్పారు. తాము ఈ విషయమై ఆ ప్రభుత్వాలతో చర్చలు జరుపు తున్నట్లు ఆమె తెలియజేశారు. ఇరాన్ నుండి చమురు కొనుగోలును కొనసాగించనున్నట్లు భారత్ ప్రకటించగానే అమెరికా విదేశాంగ శాఖ మాజీ సహాయ మంత్రి నికొలస్ బర్న్ ఒక పత్రికలో వ్యాసం రాశారు. భారత ప్రభుత్వ ప్రకటన అమెరికా ముఖంపై చెంపపెట్టు మాత్రమే కాదని, దాని నాయకత్వ సామర్ధ్యానికే సవాలని ఆయన ఆ వ్యాసంలో వ్యాఖ్యానించారు. అమెరికా- భారత్ అణు ఒప్పందంపై జరిగిన చర్చల్లో నికొలస్ బర్న్ కీలక పాత్ర పోషించిన విషయం తెలిసిందే.
ఇరాన్ నుండి చమురు కొనుగోలు చేయడాన్ని భారత్ కొనసాగించగలదని ఆర్థిక మంత్రి ప్రణబ్ ముఖర్జీ ప్రకటించినప్పటికీ, దిగుమతులను తగ్గిం చేందుకు భారత ప్రభుత్వం మౌనంగా చర్యలు తీసు కుంటోంది. 2008-09లో ఇరాన్ నుండి భారత్ 21.8 మిలియన్ టన్నుల చమురును దిగుమతి చేసుకోగా 2010-11లో 18.5 మిలియన్ టన్నులు మాత్రమే దిగుమతి చేసుకుందని అందు బాటులో ఉన్న గణాంకాలు తెలియజేస్తున్నాయి. వర్తమాన ఆర్థిక సంవత్సరంలో అది మరింతగా పతనమై 13.1 మిలియన్ టన్నులకు చేరుకుంది. ఇతర వనరులను అన్వేషించాలని ప్రభుత్వ రంగం లోని చమురు కంపెనీలకు ప్రభుత్వం సూచించింది. అమెరికా సలహా ప్రకారం చమురు దిగుమతులను పెంచడంపై సౌదీ అరేబియాతో భారత్ ఇప్పటికే చర్చలు జరిపింది. ఇరాన్‌కు ఎగుమతులను కూడా మౌనంగా తగ్గిస్తోంది.
సిరియా విషయంలో తీరు మార్చుకోవడం, ఇరాన్ విషయంలో వ్యవహరిస్తున్న వైఖరి భారత విదేశాంగ నీతిలో వాస్తవాన్ని ఆవిష్కరిస్తున్నాయి. విశాల జాతీయ ప్రయోజనాల ప్రాతిపదికగా స్వతంత్ర విధానాన్ని ఇంకెంతమాత్రం అనుసరించడం లేదు. సామ్రాజ్యవాద ఒత్తిళ్లు, అమెరికా భౌగోళిక, రాజకీయ ప్రయోజనాలకు దాసోహమంటోంది.
పీపుల్స్ డెమొక్రసీ సంపాదకీయం
( ఫిబ్రవరి 29,2012 )
No comments:
Post a Comment