(4)
ప్రజాశక్తి - ఒంగోలు ప్రతినిధి Thu, 23 Feb 2012, IST
రూ.498 కోట్ల వ్యయం - గుండ్లకమ్మ కాల్వలు ఏర్పాటు కాని వైనం - వెలుగొండ సొరంగం పనుల్లో తీవ్ర జాప్యం
ప్రకాశం జిల్లాలోని నీటి పారుదల ప్రాజెక్టుల పట్ల రాష్ట్ర ప్రభుత్వం నిర్లక్ష్య వైఖరి అవలంబిస్తోంది. తాజా బడ్జెట్‌లో గుండ్లకమ్మకు రూ.నాలుగున్నర కోట్లు కేటాయించింది. గతేడాది రూ.మూడు కోట్లు కేటాయించారు. వెలుగొండ
గతేడాది రూ.545 కోట్లు కేటాయించగా, ఈ ఏడాది రూ.599 కోట్లు కేటాయించింది. గత ఏడేళ్లలో జిల్లాలో చేపట్టిన వెలుగొండ, రామతీర్థం, గుండ్లకమ్మ, పాలేరు జలాశయం తదితర ప్రాజెక్టులకు రాష్ట్ర ప్రభుత్వం సుమారు రూ.3,250 కోట్ల వరకూ వ్యయం చేసింది. అయినా ప్రాజెక్టుల నిర్మాణం ఓ కొలిక్కిరాలేదు. పనులు ముందుకు సాగడంలేదు. రెండేళ్లనుంచీ మరీ నత్తనడకన సాగుతున్నాయి. నిధులు సకాలంలో రానందున పనులు చురుగ్గా సాగడంలేదు. పునరావాసం, భూసేకరణ పనులూ సజావుగాలేవు. నిర్వాసితులకు పూర్తిస్థాయిలో వసతులతోకూడిన కాలనీలు ఏర్పాటు చేయడంలో ప్రభుత్వం వైఫల్యం చెందింది. దీంతో ప్రాజెక్టు పనులు పూర్తయినా ముంపు గ్రామాలు ఖాళీ చేయని పరిస్థితి. ఇటీవల హైదరాబాద్‌లో మంత్రి డొక్కా మాణిక్య వరప్రసాద్ సమక్షంలో మంత్రులు, ప్రజాప్రతినిధుల సమావేశంలో చర్చ కూడా జరిగింది.
గుండ్లకమ్మ జలాశయం నిర్మాణ వ్యయం రూ.592.18 కోట్లకు పెరిగింది. ఇప్పటికే రూ.498.86 కోట్లు ఖర్చు చేశారు. కాలువల పనులు పూర్తిగాక ఒక్క ఎకరానికీ నీరివ్వలేదు. ఇక ముంపు గ్రామాలకు పూర్తిస్థాయిలో పునరావాసం కల్పించకపోవడంతో సగానికిపైగా గ్రామాలు ఖాళీ చేయలేదు. నీరు నిల్వ ఉంచితే గ్రామాలు మునిగే పరిస్థితి. ఇటీవల గ్రామాల్లో పర్యటించిన పునరావాస కమిషనర్ పరిస్థితిని సమీక్షించి నిధుల విడుదలకు హామీ ఇచ్చారు. నిధులు రావాల్సి ఉంది. ప్రస్తుతం పునరావాసానికే రూ.30 కోట్లకుపైగా అవసరం. అయితే ఈ ప్రాజెక్టు ఖాతాలో రూ.ఐదు లక్షలు మాత్రమే నిధులు అందుబాటులో ఉన్నట్లు అధికారులు చెపుతున్నారు.
వెలుగొండ విషయానికి వస్తే ప్రాజెక్టు వ్యయం రూ.5,150 కోట్లకు పెరిగింది. ఇప్పటికి రూ.2,693.37 కోట్లు ఖర్చు పెట్టారు. గ్యాపుల నిర్మాణం దాదాపుగా పూర్తయినా.. రెండు సొరంగాల పనులు పూర్తికావాల్సి ఉంది. ప్రస్తుతం ఉన్న డిజైన్‌లోనే మరో రెండు లక్షల ఎకరాలకు నీరిచ్చే అవకాశముందని చర్చ సాగుతోంది. అధికారులూ అదే చెబుతున్నారు. కృష్ణానది నుంచి నీరు వస్తూంటే దిగువన ఆయకట్టు పెంచుకునే వీలుంటుందనేది అధికారుల విశ్లేషణగా ఉంది. కనిగిరి, గిద్దలూరు, వై.పాలెం నియోజకవర్గాల్లో ఆయకట్టు పెంచాలనే ఎమ్మెల్యేల నుంచి వినిపిస్తోంది. దీనిపై నిర్ణయం తీసుకోవాల్సి ఉంది. పొలాల్లో కాల్వలు వెళ్తున్నా నీరు రాని ప్రాంతాలు పశ్చిమ ప్రాంతంలో ఉన్నాయి. ఆయకట్టుపై నిర్ణయం తీసుకోవాల్సి ఉంది. గత డిసెంబరు వరకూ పనులు సాగని రెండో సొరంగం పనులనూ ఇటీవల చేపట్టారు. శ్రీశైలం జలాశయం నుంచి వెలుగొండకు నీటిని తరలించేందుకు ఈ సొరంగాలను తవ్వుతున్నారు. ఒక్కో సొరంగం 18.8 కిలోమీటర్ల దూరం తవ్వాల్సి ఉంది. ఇప్పటివరకూ మొదటి సొరంగం తవ్వకం 5.5 కిలోమీటర్లు పూర్తయింది. రెండో సొరంగాన్ని సుమారు నాలుగు కిలోమీటర్లు తవ్వారు. మొదటి దానికి రూ.276 కోట్లు, రెండోదానికి రూ.266 కోట్లు ఖర్చు చేశారు. పనులు ఇదే వేగంతో కొనసాగితే సొరంగాల తవ్వకం పనులు ఏడాదిన్నర కాలం పడుతుందని అధికారులు అంచనా వేస్తున్నారు. ఈ దశలో ప్రాజెక్టులకు నిధులు పెద్ద ఎత్తున కేటాయిస్తే తప్ప పనులు కావు. ఇంకా సగం నిధులు విడుదల కావాలి. గతేడాది బడ్జెట్‌లో రూ.545 కోట్లు చూపారు. ప్రస్తుతం రూ.ఐదు లక్షలే ఉన్నాయి. పాలేరు జలాశయం పనులు మొదలే కాలేదు. భూసేకరణ పూర్తి చేశారు. దీనికోసం రూ.10.66 కోట్లు వెచ్చించారు. ఇక ప్రాజెక్టుల పనులను వేగవంతం చేయాలని జిల్లా ప్రజలు కోరుతున్నారు.
No comments:
Post a Comment