అంతర్జాలంలోని అన్నిరకాల ముఖ్యమైన సమాచారాన్ని ఈ సైట్ లో నిక్షిప్తం చేసి, అందరికీ ఉపయోగపడే ఒక వేదికగా ఈ సైట్ ఉండాలనే ఉద్దేశ్యంతో ప్రారంభించడమైంది. ఏ సైట్ నుండి సమాచారం తీసుకున్నా వారి పేరుతోనే ఇందులో వుంచుతాను. సహృదయంతో సహకరించగలరు.
ఎవరికైనా అభ్యంతరముంటే వారి సైటుకు సంబంధించిన సమాచారం తొలగించడం జరుగుతుంది. - ధన్యవాదములతో...

Friday, March 2, 2012

కరువు జిల్లాతో క్రూర పరిహాసం


(3)
ప్రజాశక్తి - మహబూబ్‌నగర్‌ ప్రతినిధి   Wed, 22 Feb 2012, IST

మరో 2 వేల కోట్లిస్తేనే పాలమూరు ప్రాజెక్టులకు మోక్షం
'కోడ్‌'తో బెడిసికొట్టిన కాంగ్రెస్‌ నేతల కెఎల్‌ఐ పన్నాగం


''పాలమూరులో వలసలాపుతాం. బీళ్లను పచ్చగా కళకళలాడేలా మార్చేస్తాం. రెండు పంటలకు నీరందిస్తాం. కృష్ణా నీటిని ఎత్తిపోతల ద్వారా అందించి జిల్లాకు వైభవం తెస్తాం.. ఆకలిచావులూ ఆత్మహత్యలూలేని జిల్లాగా తీర్చిదిద్దుతాం'' అని ఉపన్యాసాలిచ్చి ఓట్లు దండుకుని గద్దెనెక్కిన కాంగ్రెస్‌ నేతలు కరువు జిల్లాతో ఇప్పుడు క్రూర
పరిహాసమాడుతున్నారు. జిల్లాలో 7,93,250 ఎకరాలకు సాగునీరందించేందుకు 6,935.40 కోట్ల అంచనాతో నాలుగు ఎత్తిపోతల పథకాలను 2004లో ప్రారంభించారు. ఈ ప్రాజెక్టులను ఐదేళ్లలో పూర్తి చేయాలనుకున్నారు. ఏడేళ్లకు ఏడేళ్లయినా ఒక్క ఎకరానికీ చుక్క నీరందించలేదు. ఇప్పటివరకూ రూ.5,536.66 కోట్లు ఖర్చు చేశారు. ప్రతిపాదిత అంచనాపై మరో రూ.రెండువేల కోట్లు అదనంగా పెంచితే తప్ప ఈ ప్రాజెక్టులు పూర్తయ్యేలా లేవు. 2011-12లో ఈ నాలుగు ప్రాజెక్టులకు కలిపి రూ.803 కోట్లు కేటాయించారు. కానీ రూ.267.33 కోట్లే ఖర్చు చేశారు. మిగతా డబ్బు ప్రభుత్వం విడుదల చేయలేదు. అప్పుడింత ఇప్పుడింత విదిలించిన పైసలతో పనులు మందకొడిగా సాగుతున్నాయి. 2012-13 బడ్జెట్‌లో రూ.584 కోట్లు కేటాయించారు. ఇందులో ఎంత విడుదల చేస్తారో తెలియదు. గత కేటాయింపుల కింద విడుదల కావాల్సిన సుమారు 535కోట్లను అటకెక్కించిన ప్రభుత్వం... ఆ మొత్తానికి కేవలం రూ.50కోట్లను మాత్రమే కలిపి రూ.584కోట్లు ఈ బడ్జెట్‌లో కేటాయించారు. కల్వకుర్తి ఎత్తిపోతల పథకం (కెఎల్‌ఐ) పనులను 2004 నవంబరు 26న అప్పటి ముఖ్యమంత్రి వైఎస్‌ రాజశేఖరరెడ్డి ప్రారంభించారు. వీటితోపాటు జిల్లాలోని 'కోయిల్‌సాగర్‌', 'భీమా', 'నెట్టెంపాడు' ఎత్తిపోతల పథకాల పనులు కూడా ప్రారంభించారు. వీటి పరిస్థితీ అదేవిధంగా వుంది. జిల్లాలో సాగునీటి ప్రాజెక్టుల పరిస్థితి ఇంత దారుణంగా వుంటే... మహబూబ్‌నగర్‌ ఎంపి, తెరాస అధ్యక్షుడు కె.చంద్రశేఖర్‌రావు ఈ విషయంపై పెదవి విప్పకపోవడం శోచనీయం.

ఉప కాల్వలు పూర్తి కాకుండా 'కల్వకుర్తి' నుంచి నీరెలా సాధ్యం?

ఈ పథకం 3.40 లక్షల ఎకరాలకు నీరందించేందుకు రూ.2,999 కోట్లతో పనులు చేపట్టారు. ఇప్పటివరకూ రూ.2292.26 కోట్లు ఖర్చు చేశారు. ఈ పథకం మొదటి లిప్టు పనులను మూడేళ్లలో పూర్తి చేసి 2008 నాటికి 13 వేల ఎకరాలకు సాగునీరందివ్వాలని నిర్ణయించారు. కానీ ప్రారంభోత్సవం పదిసార్లు వాయిదా పడింది. గత సంక్రాంతికి ప్రారంభించాలనుకున్నారు. ఈనెల 22న ముఖ్యమంత్రితో ప్రారంభించేందుకు సన్నాహాలు చేశారు. ఉప ఎన్నికల కోడ్‌తో అది వాయిదా పడింది. ఆ విధంగా మొదటి లిఫ్టును ప్రారంభించి ఉప ఎన్నికల్లో లబ్ధి పొందాలనే కాంగ్రెస్‌ నాయకుల ఎత్తుగడ బెడిసి కొట్టింది. అక్కడిప్పటివరకూ ట్రయల్‌ రన్‌ పూర్తి కాలేదు. లైనింగ్‌ పనులు జరగాలి. షట్టర్లు బిగించాలి. అధికారులు మాత్రం ప్రారంభానికి ఇవేమీ ఆటంకాలు కాబోవంటున్నారు. కోతిగుండు దగ్గర శ్రీశైలం బ్యాక్‌ వాటర్‌ వెనక్కెళ్లిపోయింది. ఇప్పుడు ప్రారంభించినా నీళ్లందే పరిస్థితి లేదు. వచ్చే ఖరీఫ్‌నాటికి నీరందించాలన్నా ఉపకాల్వలు పూర్తి కాలేదు. ఎల్లూరు నుంచి మొదటి జలాశయం నీరు సింగోటం చెరువు ద్వారా పంట పొలాలు చేరడానికి ఎల్లూరు, నార్లాపూర్‌, కొల్లాపూర్‌, మాచినేనిపల్లి, అంకిరావుపల్లి, చౌటపల్లి, సింగోటం గ్రామాల్లో ఉపకాల్వలు ఇంకా పూర్తి కాలేదు. కనుక ఇప్పుడు ప్రారంభిస్తే నీరు పంట పొలాలకందే పరిస్థితేమాత్రం లేదు. 2011-12 బడ్జెట్‌లో రూ.250 కోట్లు కేటాయించి 142.39 కోట్లు ఖర్చు చేశారు. 2012-13 బడ్జెట్‌లో రూ.220 కోట్లు కేటాయించారు. ఎంత ఖర్చు చేస్తారో చూడాలి.

నెట్టెంపాడు' ట్రయల్‌ రన్‌కు ఆటంకంగా క్రాస్‌ రెగ్యులేటరీ పనులు

నెట్టెంపాడు ప్రాజెక్టు రెండు లక్షల ఎకరాలకు సాగునీరందించేందుకు ఉద్దేశించింది. దీన్ని రూ.1428 కోట్ల అంచనాతో మొదలుపెట్టారు. ఇప్పటికి రూ.1344.76 కోట్లు ఖర్చు చేశారు. 2011-12లో రూ.233 కోట్లు కేటాయించి 42 కోట్లే ఖర్చు చేశారు. 2012-13లో 144 కోట్లు కేటాయించారు. 2007 డిసెంబరుకు మొదటి దశ కింద గూడెందొడ్డి జలాశయం ద్వారా 21 వేల ఎకరాలకు సాగునీరివ్వాలనుకున్నారు. నాలుగేళ్లుగా 'ట్రయల్‌ రన'్‌ వాయిదా పడింది. 99వ ప్యాకేజీలో ప్రధాన కాల్వలు, వాటిపై వంతెనలు, లైనింగ్‌ పనులు పూర్తి చేయాలి. 104, 105 ప్యాకేజీల పరిస్థితీ ఇలాగే ఉంది. 103 ప్యాకేజీ దగ్గర జలాశయానికి గేట్లు బిగించాలి. 101 ప్యాకేజీ కింద మినీ రిజర్వాయర్‌, అలుగు నిర్మాణం, గేట్ల అమరిక పనులు పెండింగులో ఉన్నాయి. ఇవన్నీ పూర్తయితే లక్ష ఎకరాలకు సాగునీరందుతుంది. ఇదే నెలలో ట్రయల్‌ రన్‌ చేయాలనుకుంటున్నారు. అయితే 98 ప్యాకేజీలో పంప్‌హౌస్‌ నుంచి నీటిని ఎత్తిపోసిన తర్వాత అటు ర్యాలంపాడు ఎత్తిపోతల-2కూ, ఇటు గూడెందొడ్డి జలాశయానికీ నీటిని విడుదల చేసే క్రాస్‌ రెగ్యులేటరీ పనులు ఇప్పటికీ ప్రారంభ దశలో ఉన్నాయి.

గడువు నాలుగేళ్ల నాడే ముగిసినా 'భీమా' సగమే పూర్తి

భీమా మొదటి దశ పనుల కింద 1.11 లక్షల ఎకరాలకు సాగు నీరందించాల్సుంది. పనులు 2008 నాటికి పూర్తి చేయాలని నిర్ణయించినా ఆ విధంగా జరగలేదు. జూరాల బ్యాక్‌వాటర్‌ నుంచి నీటిని తరలించే అప్రోచ్‌ కెనాల్‌ కాలువ రెండున్నర కిలోమీటర్లు అసంపూర్తిగా ఉంది. ఎపిఆర్‌ గుత్తేదారులకు పనులప్పగించినా నేటికీ ప్రారంభం కాలేదు. 'చిన్నగోప్లాపూర్‌' నుంచి భూత్పూర్‌ జలాశయానికి మఖ్తల్‌ పంప్‌హౌస్‌ నీటిని తరలించే ప్రధాన కాల్వ తవ్వకం పనులూ ప్రారంభం కాలేదు. కాల్వ పనులు 50 శాతం జరగాల్సి ఉంది. పంప్‌ హౌస్‌ నుండి నీటిని తరలించే ప్రధాన కాల్వ పనులు ఇంకా 20 శాతం జరగాలి. భీమా రెండోదశ 2006లో చేపట్టి 2008లో పూర్తి చేస్తామన్నారు. ప్రారంభం గడువు రెండుసార్లు వాయిదా పడింది. తవ్వకం పనులు 80 శాతమే పూర్తయ్యాయి. మొదటి ప్యాకేజీలో 35 శాతం పనులు జరిగాయి. ఇవి పూర్తయితేనే ట్రయల్‌రన్‌ జరుగుతుంది. ఈ ప్రాజెక్టు నిర్మాణ వ్యయ అంచనా రూ.2,158.40 కోట్లు. ఇప్పటికి రూ.1,583.86 కోట్లు ఖర్చ చేశారు. 2011-12లో రూ.260 కోట్లు కేటాయించి రూ.154 కోట్లే ఖర్చు చేశారు. 2012-13 బడ్జెట్‌లో రూ.175 కోట్లు కేటాయించారు.

'కోయిల్‌సాగర్‌' 4.5 కిలోమీటర్ల సొరంగం తవ్వకం అలాగే..

కోయిల్‌సాగర్‌ రెండో దశ పనులు 2005లో ప్రారంభమై 2008 నాటికి పూర్తి చేయాల్సి ఉంది. నాలుగున్నర కిలోమీటర్ల మేర అప్రోచ్‌ కాలువ, మరో నాలుగున్నర కిలోమీటర్ల సొరంగం తవ్వకాలు జరగాల్సుంది. లైనింగ్‌ పనులు 85 శాతం పూర్తయ్యాయి. విద్యుత్తు కోసం 132 కెవి సబ్‌స్టేషన్‌ పనులు చేపట్టాలి. కాల్వ నిర్మాణ పనులు అసంపూర్తిగానే ఉన్నాయి. ఈ ప్రాజెక్టు అంచనా వ్యయం రూ.359 కోట్లు. రూ.313.78 కోట్లు వ్యయం చేశారు. 2011-12 బడ్జెట్‌లో రూ.60 కోట్లు కేటాయించి రూ.27 కోట్లు ఖర్చు చేశారు. 2012-13 బడ్జెట్‌లో రూ.45 కోట్లు కేటాయించారు.

No comments:

Post a Comment