న్యూఢిల్లీ, హైదరాబాద్ - న్యూస్‌టుడే
డీఏపీ, ఎంఓపీ వంటి పోషకాధార ఎరువుల రాయితీపై రాబోయే ఆర్థిక సంవత్సరానికి ప్రభుత్వం 33 శాతం వరకు కోత విధించింది. అంతర్జాతీయ మార్కెట్లో వీటి ధరలు తగ్గినందున, ఎక్కువగా దిగుమతిపైనే ఆధారపడుతున్నందున
రాయితీలో కోత విధించినా రైతులపై భారం పడబోదని ప్రభుత్వం తెలిపింది. రాయితీలో కోత విధించాలన్న ఎరువుల మంత్రిత్వశాఖ ప్రతిపాదనకు గురువారం సమావేశమయిన ఆర్థికవ్యవహారాల కేబినెట్ కమిటీ ఆమోదం తెలిపింది. రాయితీలో కోతవల్ల ప్రభుత్వానికి రూ.10వేల కోట్లు ఆదా అవుతుంది. 2012-13కు నత్రజని, పొటాషియం ఎరువులపై కిలోకి రూ.24, ఫాస్పేట్ ఎరువులపై కిలోకి రూ.21.8, సల్ఫర్‌పై రూ.1.67 రాయితీ అందుతుంది. గత ఏడాది ఇవే ఎరువులపై కిలోకి వరుసగా రాయితీ రూ.27.15, రూ.32.33, రూ.26.76 ఉంది. కొత్త ధరలు ఏప్రిల్ 1నుంచి అమల్లోకి వస్తాయి. కొత్త ధరల ప్రకారం.. టన్ను డీఏపీపై రూ.14,350, ఎంవోపీపై రూ.14,440 రాయితీ ఉంటుంది.
అంతర్జాతీయ మార్కెట్‌లో ఎరువుల ధరలు పెరిగినందునే ఇక్కడ కూడా ధరలను కంపెనీలు పెంచుతున్నాయని ఇప్పటివరకూ చెబుతున్న ప్రభుత్వం అక్కడ ధరలు తగ్గినప్పుడు...అదే న్యాయాన్ని అనుసరించకుండా తప్పించుకుంది. ఇక్కడ ధరలు తగ్గించేలా చూసి రైతులకు మేలు చేయాల్సింది పోయి కంపెనీలకిచ్చే రాయితీలో కోత విధించి తన భారాన్ని తగ్గించుకుంది.
* అంతర్జాతీయ మార్కెట్‌లో ధర పెరిగిందనే నెపంతో ఇక్కడి మార్కెట్‌లో రైతులకు అమ్మే 50 కిలోల బస్తా ధరను 2010 నుంచి 2011 డిసెంబరు నాటికి రూ.486 నుంచి 956కి కంపెనీలు పెంచేశాయి.
* అంతర్జాతీయ మార్కెట్లో 2011 ఆగస్టులో టన్ను డీఏపీ ధర 659.38 డాలర్లు. రవాణా ఖర్చులు కలుపుకుంటే కంపెనీకి పడే ధర దాదాపు రూ.38వేలు. దీనిపై కేంద్రం టన్నుపై రూ.19,763 రాయితీ ఇస్తోంది. అది పోను మిగిలిన సొమ్మును రైతుల నుంచి కంపెనీలు వసూలు చేయాలి.
* ప్రస్తుతం అంతర్జాతీయ మార్కెట్‌లో టన్ను ధర 600 డాలర్లకు పడిపోయింది. వచ్చే ఖరీఫ్ కోసం టన్నుకు 550 డాలర్లుగా దిగుమతి ధరను కేంద్రం స్థిరపరిచింది. రవాణా ఖర్చులు కలుపుకుంటే కంపెనీకి టన్నుకు దాదాపు రూ.32వేలకు ధర పడుతుంది. ఇలా తగ్గిన మేరకు కంపెనీలు రైతులకు తగ్గించి విక్రయించడానికి సుముఖంగా లేవు. అంటే గతంలో ఇస్తున్నంత రాయితీనే ప్రభుత్వం ఇచ్చినా అది రైతులకు చేరదన్న మాట. ధరలు తగ్గించకపోతే కంపెనీలే లాభపడతాయి. అందుకే ప్రభుత్వం రూ.19,763 రాయితీలో కోత విధించి రూ.14,350గా స్థిరపరిచింది. ఒక వేళ కేంద్రం రాయితీలో కోత విధించకుండా ఆ మేర ధర తగ్గించాల్సిందేనని కంపెనీలపై ఒత్తిడి తెచ్చి ఉన్నట్లయితే రైతులకు మేలు జరిగేది.
No comments:
Post a Comment