(5)
ప్రజాశక్తి - విజయనగరం ప్రతినిధి Fri, 24 Feb 2012, IST
రూ.15కోట్ల ఎగనామం?
జలయజ్ఞంలో భాగంగా రాష్ట్ర ప్రభుత్వానికి కేంద్రం ఇచ్చిన వాగ్దానాలన్నీ గాలిలో కలిసిపోతున్నాయి. కేంద్రం నుంచి ప్రాజెక్టుల పూర్తికి తన వాటాగా ఇస్తానన్న 20 శాతం నిధులకు ఎఐబిపి (యాక్సెలరేటరీ ఇరిగేషన్ బెనిఫిట్ ప్రోగ్రాం)
మంగళం పలికింది. షెడ్యూల్ ప్రకారం పనులు జరగనందున నిధుల వితరణ నుంచి విరమించుకున్నట్లు ఇటీవల ప్రకటించిందని రామతీర్థసాగర్ ప్రాజెక్టు ఎగ్జిక్యూటివ్ ఇంజినీర్ డి.తిరుమలరావు 'ప్రజాశక్తి'కి చెప్పారు.
విజయనగరం జిల్లాలో రామతీర్థసాగర్ ప్రాజెక్టుకు మూడు దశాబ్దాల క్రితం ఎన్‌టి రామారావు ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు శంకుస్థాపన చేశారు. 2005లో వైఎస్ రాజశేఖరరెడ్డి ఈ ప్రాజెక్టు పనులు ప్రారంభించారు. రెండేళ్లలోనే ప్రాజెక్టు పూర్తిచేసి 24,710 ఎకరాలకు నీరందిస్తామని ప్రకటించారు. వాస్తవానికి ఈ ప్రాజెక్టు బ్యారేజి గుర్ల మండలం కోటగండ్రేడు వద్ద చంపావతి నదిపైనా, రిజర్వాయర్ (జలాశయం) పూసపాటిరేగ మండలం కుమిలి వద్ద నిర్మించాలని నిర్ణయించారు. 1985లో దీని అంచనా వ్యయం రూ.30కోట్లు కాగా, 2000 సంవత్సరంలో రూ.65 కోట్లకు, తాజాగా రూ.181 కోట్లకు పెంచుకుంటూ వచ్చారు. ఇప్పటి వరకూ రూ.90కోట్ల విలువైన పనులు పూర్తయినట్లు సంబంధిత ఇంజనీర్ల నివేదిక. దీంట్లో భూసేకరణకు రూ.45కోట్లు, ఆర్ అండ్ ఆర్ (పునరావాసం, నష్టపరిహారం) కోసం రూ.45కోట్లు ఖర్చయ్యాయి. ఈ ప్రాజెక్టు వల్ల సాగునీటి ఉపయోగం పెద్దగా ఉండదనీ, చంపావతి నదిలో బ్యారేజి నిర్మాణం వద్ద నీటి లభ్యత లేదనీ గతంలో ఇంజనీర్ల కన్సార్టియం నిర్ధారించింది.
నెల్లిమర్ల మండలం రామతీర్థం సమీప కొండల పక్క నుంచి 13 కిలోమీటర్ల కాలువ తీయాలి. ఒక కిలోమీటరు కొండ గుహల్లో (టన్నెల్) కాలువ తవ్వాల్సి ఉంది. ఇక్కడ సీతారాముల విగ్రహాలు ఉన్నాయి. సాంప్రదాయాలకు భంగం కలుగుతుందనే ఉద్దేశంతో పురావస్తుశాఖ ఇంతవరకూ అనుమతించలేదు. ఏళ్లతరబడి ఇంజనీర్లు ప్రభుత్వానికి క్లియరెన్స్ కోసం అర్జీలు పెడుతున్నా ఫలితం లేదు. ఫారెస్టు క్లియరెన్స్ కూడా ఇంతవరకూ లేదు. రామతీర్థాలు వద్ద రైల్వే క్రాసింగ్ కింద నుంచి సన్నటి బ్రిడ్జి తయారు కావాల్సి ఉంది. హైదరాబాద్‌కు చెందిన సిఆర్ 18జి, పిఎస్‌ఇపిఎల్ జాయింట్ వెంచర్‌లో ఈ పనులు చేసేందుకు టెండర్లు దక్కించుకున్నారు. తక్షణం రూ.50కోట్లుంటేనే పనులు ముందుకు సాగుతాయని ఇంజనీర్లు చెబుతున్నారు. కొత్త బడ్జెట్‌లో ఈ ప్రాజెక్టు కోసం రూ.30కోట్లు కేటాయించారు. పునరావాసం, నిర్వాసితుల సమస్య పరిష్కారానికి సరైన చర్యలు ఇంతవరకూ తీసుకోలేదు. ఎఐబిపి నిధులకు ఆటంకం రావడంతో ఇంజనీర్లు త్రిశంకు స్వర్గంలో పడ్డారు. జూన్ 2013 నాటికి దీన్ని పూర్తిచేస్తామని వైఎస్ రాజశేఖరరెడ్డి హయాంలో ఈ ప్రాజెక్టు పనులు ప్రారంభించారు. ఇప్పటివరకూ రూ.25కోట్లనే ఎఐబిపి ఇచ్చి, మిగతా రూ.15కోట్లు ఇవ్వనని తెగేసి చెప్పింది. దీంతో, ఇంజనీర్లతోపాటు కాంట్రాక్టర్లు అయోమయంలో పడ్డారు.
No comments:
Post a Comment