అంతర్జాలంలోని అన్నిరకాల ముఖ్యమైన సమాచారాన్ని ఈ సైట్ లో నిక్షిప్తం చేసి, అందరికీ ఉపయోగపడే ఒక వేదికగా ఈ సైట్ ఉండాలనే ఉద్దేశ్యంతో ప్రారంభించడమైంది. ఏ సైట్ నుండి సమాచారం తీసుకున్నా వారి పేరుతోనే ఇందులో వుంచుతాను. సహృదయంతో సహకరించగలరు.
ఎవరికైనా అభ్యంతరముంటే వారి సైటుకు సంబంధించిన సమాచారం తొలగించడం జరుగుతుంది. - ధన్యవాదములతో...

Friday, March 2, 2012

కొండను తవ్వి ఎలుకను పడుతున్న రెవెన్యూ సదస్సులు


  Thu, 1 Mar 2012, IST

గ్రామాల్లో ఏళ్ల తరబడి అపరిష్కృతంగా ఉన్న సమస్యల పరిష్కారానికి రెవెన్యూ సదస్సులు నిర్వహిస్తున్నామని కిరణ్‌ కుమార్‌ రెడ్డి ప్రభుత్వం ఆర్భాటంగా ప్రకటించింది. వీటిని జనవరి 18 నుండి మార్చి 17 వరకూ రాష్ట్రంలోని అన్ని గ్రామాలు, శివారు గ్రామాల్లోనూ జరుపుతోంది. రాష్ట్ర ప్రభుత్వం భూసంబంధిత సమస్యలన్నిటికీ సర్వరోగ నివారిణి
లా పనిచేస్తాయని సదస్సుల గురించి ప్రభుత్వం ఊదరగొడుతోంది. కానీ, వీటి నిర్వహణా తీరు చూస్తుంటే కొండను తవ్వి ఎలుకను పట్టిన సామెత గుర్తుకొస్తోంది. అన్ని రకాల వ్యక్తిగత భూసమస్యలు, ప్రభుత్వ భూముల గుర్తింపు, అసైన్డ్‌ భూసమస్యలు, కౌల్దారులకు రుణ అర్హత కార్డులకు దరఖాస్తులు, 5 విడతల్లో భూపంపిణీ ద్వారా పట్టాలు పొంది స్వాధీనం కాని వారికి అప్పగించడం, 6వ విడత భూ పంపిణీలో లబ్ధిదారుల గుర్తింపు వంటి లక్ష్యాలతో ఈ సదస్సులు సాగుతున్నాయని ప్రకటించారు.

ఇప్పటికే రాష్ట్ర వ్యాప్తంగా అత్యధిక గ్రామాల్లో రెవెన్యూ సదస్సుల నిర్వహణ పూర్తయింది. వీటి తీరు చూస్తుంటే ప్రకటనలకు, చేతలకు పొంతన లేదని అర్థమవుతోంది. కీలకమైన సామూహిక, ప్రభుత్వ, పేదల భూముల సమస్యలు పరిష్కారం కావడం లేదు. వీటిపై ప్రజలు, ప్రజా సంఘాలు ఇచ్చిన వినతి పత్రాలపై అధికారులు నోరు మొదపడం లేదు. కనీసం నిర్దిష్టమైన గడువు ప్రకటించడం లేదు.


పశ్చిమగోదావరి జిల్లా దెందులూరు మండలంల దోసపాడులో ప్రభుత్వ బంజరు, అసైన్డ్‌ భూములు 150 ఎకారాలు ఉన్నాయని, వీటిలో 100 ఎకరాలు కృష్ణా జిల్లాకు చెందిన అధికార పార్టీ ప్రజాప్రతినిధి సోదరుడు తదితరులు ఆక్రమించి అనుభవిస్తున్నారు. ఈ భూములకు ముఫైఏళ్ళ క్రితమే ప్రభుత్వం స్థానిక దళితులకు పట్టాలిచ్చింది. పట్టాలు పేదల చేతుల్లో ఉండగా భూములను భూస్వాములు చేపల చేరువులుగా సాగు చేస్తున్నారు. ఈ విషయమై తహశీల్దార్‌ను గ్రామ ప్రజలు నిలదీస్తే మౌనమే సమాధానమైంది. జంగారెడ్డి మండలం రామచర్లగూడెంలో సీలింగ్‌, ఈనాం భూములు 8 ఎకరాలను ఇతర ప్రాంతాలకు చెందిన ఇద్దరు సంపన్నులు ఈ ఆక్రమించి, అనుభవిస్తున్నారు. ఆధారాలతో అధికారులకు విన్నవించినా ఫలితం శూన్యం. సదస్సు నిర్వహణా స్థలం ప్రక్కనే ఆ భూమలున్నా కనీసం వాటిని పరిశీలించేందుకు కూడా పూనుకోలేదు. భీమవరం రూరల్‌ మండలం చిన అమిరం గ్రామంలో 1983వ సంవత్సరంలో ఇళ్ళపట్టాలిచ్చినా నేటికీ భూమి స్వాధీన పర్చలేదు. భూస్వాములు ఆ భూమిని రియల్‌ ఎస్టేట్‌గా మారుస్తుంటే అధికారులు కళ్లు అప్పగించి చూస్తున్నారు. ఇదేమని అడిగితే మా దగ్గర రికార్డులు లేవు. మమ్ముల్నేం చేయమంటారని ఆర్‌.డి.ఓ యే ఎదురు ప్రశ్నించడంతో మిడియా సైతం దిగ్భ్రాంతికి గురైంది. కొన్ని చోట్ల దరఖాస్తులకు రశీదులిచ్చి చేతులు దులుపుకుంటున్నారు.

సదస్సులో అన్ని భూసంబంధిత సమస్యల్ని పరిష్కరిస్తామని ప్రకటించినా ప్రజానీకానికి సమాచారమందించడం లేదు. భీమవరం మండలం చిన అమిరంలో భూసమస్యలపై పంచాయితీ ఆఫీసు క్రింద ఆవారాలో పేదలు సమావేశమయ్యారు. పైన (భవనం) రెవెన్యూ సదస్సు జరుగుతున్న విషయం వారికి వ్య.కా.స నాయకులు చెప్పే వారకూ తెలీనే లేదు. జంగారెడ్డిగూడెం మండలం రామచర్ల గూడెంలో తొలుత అంగన్‌వాడీ కేంద్రంలో సదస్సు జరుపుతామని ప్రకటించారు. తర్వాత ఎవ్వరూ ఊహించని విధంగా పంట చేల్లో నిర్వహించారు. చిత్రమేమంటే ఈ గ్రామం ప్రజలు నివసించని రెవెన్యూ గ్రామం. అక్కడ అంగన్‌ వాడీ భవనమే లేదు. పలుచోట్ల కౌల్దారుల రుణార్హత కార్డులకు దరఖాస్తు చేయెచ్చన్న విషయం కౌలురైతులకు వ్య.కా.స రైతు సంఘాల కార్యకర్తలు సదస్సు రోజున చెప్పేదాకా తెలియలేదు. అయితే మరుసటి రోజు పత్రికల్లో సదస్సుల వార్తాలు జిల్లా పేజీల్లో ప్రముఖంగా వస్తున్నాయి. పరిష్కారం కంటే ప్రచారానికే ప్రాధాన్యమిస్తున్నారని తేలుతోంది.

వీటిలో అక్కడక్కడా కొన్ని వ్యక్తిగత సమస్యలు పరిష్కరిస్తున్నా మళ్ళీ మొదటికొస్తున్నారు. నర్సాపురం మండలం సరిపల్లి, ఏలూరు మండలం పోరాంగి గ్రామాల్లో పొలానికి వెళ్ళేదారి ఆక్రమణకు గురైందని రైతులు దరఖాస్తు చేశారు. రెవెన్యూ సిబ్బంది వాటిని పరిష్కరించారు. ఐతే రెండో రోజే సమస్యలు మొదటికొచ్చాయి. మరలా అధికారులకు తమ గోడు వెళ్ళబోసుకుంటే ఇంతకు మించి తామేమి చేయలేమని చేతులెత్తేశారు.

వివాదాలు లేని కొందరు జిరాయితీ భూముల రైతులకు పట్టాదారీ పాస్‌ పుస్తకాలు, టైటిల్‌డీడ్లు, అడంగళ్‌లో పేర్ల నమోదు, సవరణ వంటి పనులు అక్కడక్కడా కొన్ని అవుతున్నాయి. వీటికి కూడా పనికో ధర నిర్ణయించి లబ్ధిదారుల నుండి డబ్బులు గుంజుతున్నట్లు బహిరంగ ఆరోపణలు, పత్రికల్లో వార్తలొస్తున్నాయి. జీలుగుమిల్లి గ్రామ సదస్సులో వ్య.కా.స నేతలు నిలదీస్తే బాధ్యులపై చర్యలు తీసుకుంటామని తహశీల్దార్‌ చెప్పాల్సి వచ్చింది.

సదస్సుల అసలు లక్ష్యం మరోకటి ఉందేమోనని పశ్చిమ గోదావరిజిల్లా జాయింట్‌ కలెక్టర్‌ ప్రకటన పరిశీలిస్తే అనిపిస్తుంది. ప్రభుత్వ స్థలాల్లో ఆక్రమించి గుడిసెలు, నిర్మాణాలు చేపడితే సహించేది లేదని అటువంటి వారిపై కఠిన చర్యలు తప్పవని జె.సి ఆ ప్రకటనలో హెచ్చరించారు. ఇప్పటికే ఆక్రమణకు గురైన అసైన్డ్‌, ప్రభుత్వ భూములతో న్యూలాండ్‌ బ్యాంక్‌ ఏర్పాటు చేసేందుకు ప్రభుత్వం ఆదేశాలిచ్చింది. మరో పక్క దళితులు, పేదల చేతుల్లో ఉన్న అసైన్డ్‌ భూముల్ని అత్తసోమ్ము అల్లుడు దానం చేసినట్లుసెజ్‌లు, పరిశ్రమలకు దారాధాత్తం చేస్తోంది. ప్రభుత్వ అసైన్డ్‌ భూములు స్వాధీనం చేసుకుని సంపన్నులకు కట్టబెట్టే సేవల కొనసాగింపే రెవెన్యూ సదస్సుల అసలు లక్ష్యంగా కానవస్తోంది. వాస్తవాలు గ్రహించిన వ్యవసాయ కార్మికులు, పేద రైతులు మేలుకోకపోతే ప్రభుత్వ భూములన్నీ సంపన్నులకు కట్టబెట్టడం ఖాయం.

ఎ.రవి, పశ్చిమ గోదావరిజిల్లా వ్య.కా.స కార్యదర్శి.

No comments:

Post a Comment