అంతర్జాలంలోని అన్నిరకాల ముఖ్యమైన సమాచారాన్ని ఈ సైట్ లో నిక్షిప్తం చేసి, అందరికీ ఉపయోగపడే ఒక వేదికగా ఈ సైట్ ఉండాలనే ఉద్దేశ్యంతో ప్రారంభించడమైంది. ఏ సైట్ నుండి సమాచారం తీసుకున్నా వారి పేరుతోనే ఇందులో వుంచుతాను. సహృదయంతో సహకరించగలరు.
ఎవరికైనా అభ్యంతరముంటే వారి సైటుకు సంబంధించిన సమాచారం తొలగించడం జరుగుతుంది. - ధన్యవాదములతో...

Friday, March 2, 2012

నీరుగారుతున్న జలయజ్ఞం (eenadu)


5.02లక్షల ఎకరాలు తగ్గిన సాగు విస్తీర్ణం 

జలయజ్ఞం ప్రాజెక్టులు చేపట్టిన రెండేళ్ల తరవాత నుంచి ఏటా అదనంగా కొన్ని లక్షల ఎకరాలకు నీటిపారుదల సామర్థ్యం కల్పించామని చెబుతూ రాష్ట్రప్రభుత్వం ఆరేళ్లుగా వివరాలు ప్రకటిస్తోంది. సర్కారు ప్రకటనలన్నీ నిజం
కావని, ఒక్క ఎకరా అయినా అదనంగా సాగులోకి రాలేదని ప్రతిపక్షాలు వాదిస్తున్నాయి. ఈ వాదనల్లో నిజాలు తేల్చడానికి ప్రభుత్వ అర్థగణాంక శాఖ 2009-10 వరకు ఇచ్చిన వార్షిక నివేదికల్లోని అంశాలు పరిశీలిస్తే కొన్ని దిగ్భ్రాంతకర విషయాలు వెల్లడవుతున్నాయి. ఈ విషయాలేమిటి, పరిస్థితులను చక్కదిద్ది మెరుగుపరచడానికి ఆధునిక శాస్త్ర సాంకేతిక పరిజ్ఞానం మేరకు ఉన్న ఆచరణ మార్గాలు ఏమిటి? ఇందుకయ్యే వ్యయాలకు అనుగుణంగా రాష్ట్రవార్షిక బడ్జెట్లో తీసుకురావాల్సిన స్వల్ప మార్పులు ఏమిటన్నది చర్చనీయాంశం!
పొంతనలేని ప్రకటనలు
జలయజ్ఞం చేపట్టి అయిదేళ్లు దాటినప్పటికీ, రాష్ట్రంలో భారీ, మధ్య తరహా ప్రాజెక్టుల (ప్రాజెక్టు కాల్వల) కింద సాగుభూమి విస్తీర్ణం దాదాపు పెరగలేదని డైరెక్టర్‌ ఆఫ్‌ ఎకనామిక్స్‌ అండ్‌ స్టాటిస్టిక్స్‌(డీఇఎస్‌) వార్షిక నివేదికల గణాంకాలు స్పష్టం చేస్తున్నాయి. ఆంధ్రప్రదేశ్‌ ప్రభుత్వానికి చెందిన ఈ విభాగం, ఎప్పటికప్పుడు వాస్తవిక క్షేత్ర అధ్యయనాలు జరుపుతుంది. ప్రామాణిక గణాంక, గణిత పద్ధతుల్లో తనిఖీలు నిర్వహిస్తుంది. వివిధ ప్రభుత్వ అభివృద్ధి పనులకు సంబంధించి గణాంక వివరాలు ప్రచురిస్తుంటుంది. అంతేకాకుండా ఇతర అంశాలకు సంబంధించిన గణాంక వివరాలూ అది సేకరిస్తుంది. ఈ విభాగం సమకూర్చే గణాంకాలను కేంద్ర, రాష్ట్రప్రభుత్వాలు ప్రణాళిక రచన సందర్భంగా ఉపయోగించుకుంటాయి. ఈ విభాగం తన వార్షిక నివేదికలో పొందుపరచిన గణాంకాల ప్రకారం- రాష్ట్రంలో ప్రాజెక్టు కాల్వల కింద నికర సాగుభూమి జలయజ్ఞం చేపట్టిన అయిదేళ్ల తరవాతా పెరగకపోవడం ఆందోళనకర పరిణామం. 2009-10 వరకు(2010-11 నివేదిక ఇంకా వెలువడలేదు) కొత్త ప్రాజెక్టులపై దాదాపు రూ.55,000కోట్లు ఖర్చుపెట్టారు. సుమారు 20లక్షల ఎకరాల అదనపు సాగు సామర్థ్యం సాధించినట్లు ప్రకటించారు. అందుకు భిన్నంగా, వాస్తవంలో సాగు ప్రాంతం దిగనాసిల్లడం కలవరం కలిగించేదే. పరిస్థితుల్ని మెరుగుపరచి, సాగును బాగు చేయాలంటే ఆచరణాత్మక చర్యలు అత్యవసరం.

డీఇఎస్‌ నివేదికల ప్రకారం- జలయజ్ఞానికి ముందు భారీ, మధ్యతరహా ప్రాజెక్టు కాల్వల కింద సాగుబడిలో ఉన్న వాస్తవ భూమి 40.75లక్షల ఎకరాలు (16.49లక్షల హెక్టార్లు). జలయజ్ఞం ప్రారంభమైన రెండేళ్ల తరవాత 4.5లక్షల ఎకరాల్లో అదనపు సాగునీటి సామర్థ్యం కల్పించినట్లు ప్రభుత్వం ప్రకటించింది. వాస్తవంలో 2006-07లో ప్రాజెక్టు కాల్వల కింద సాగైన భూమి 40.08 లక్షల ఎకరాలే(16.22లక్షల హెక్టార్లు). అంటే- జలయజ్ఞానికి ముందు సాగుబడిలో ఉన్న భూమికన్నా అది తక్కువ. జలయజ్ఞం ప్రారంభమయ్యాక మూడో ఏడాది, 2007-08లో 39.78లక్షల ఎకరాల్లో (16.10లక్షల హెక్టార్లు), నాలుగో ఏడాది 2008-09లో 41.27లక్షల ఎకరాల్లో (16.70లక్షల హెక్టార్లు) సాగు జరిగినట్లు డీఇఎస్‌ నివేదికలు వెల్లడించాయి. మూడో ఏడాది 8.5లక్షల ఎకరాలకు, నాలుగో ఏడాది 14లక్షల ఎకరాలకు అదనపు సాగునీటి సామర్థ్యం కలిగించామన్న ప్రభుత్వ ప్రకటనలకు, అధికార గణాంకాలకు పొంతన లేకుండా పోయింది. జలయజ్ఞం ముందునాటి పరిస్థితితో పోల్చినప్పుడు, ఒక ఏడాది సాగు విస్తీర్ణం తగ్గగా, మరో ఏడాది దాదాపు అదే స్థాయిలో కొనసాగింది. జలయజ్ఞం ప్రారంభమైన అయిదో ఏడాది అంటే- 2009-10లో పరిస్థితి మరింత విషమించింది. 2009-10లో ప్రాజెక్టు కాల్వల కింద వాస్తవంగా సాగుబడిలోకి వచ్చిన భూమి 35.73లక్షల ఎకరాలేనని(14.46 లక్షల హెక్టార్లు) డీఇఎస్‌ వెల్లడించింది. వర్షపాతం సాధారణంగా ఉన్నప్పటికీ జలయజ్ఞం ముందునాటితో పోల్చినప్పడు సాగుభూమి విస్తీర్ణం 5.02లక్షల ఎకరాలు (2.03లక్షల హెక్టార్లు) తగ్గిపోయింది. జలయజ్ఞం మొదలయ్యాక అయిదేళ్లలో దాదాపు 20లక్షల ఎకరాలకు అదనపు సాగునీటి సామర్థ్యం కల్పిస్తామని అప్పట్లో హామీ ఇచ్చారు. ఆ లెక్కన ఇప్పటికీ దాదాపు 60.75లక్షల ఎకరాల భూమి సాగుబడిలోకి వచ్చి ఉండాలి. అందుకు భిన్నంగా సాగుభూమి విస్తీర్ణం మునుపటికన్నా తగ్గిపోయింది. సాగునీటి రంగానికి బడ్జెట్లో భారీగా నిధులు కేటాయించి, వ్యయం చేస్తున్నప్పటికీ, జలయజ్ఞంలో భాగంగా చేపట్టిన ప్రాజెక్టుల కింద సాగుభూమి విస్తీర్ణం గణనీయంగా పడిపోవడాన్ని త్వరలో సరిదిద్ది మెరుగుపరచే చర్యలు చేపట్టాలి. అందుకు మార్గాలేమిటో పరిశీలిద్దాం.

2012-13లో బడ్జెట్‌ కేటాయింపులు సహా వివిధ వ్యూహాత్మక చర్యల ద్వారా ఈ పరిస్థితిని చక్కదిద్ది, సాగు విస్తీర్ణాన్ని ఇప్పుడున్నదానికి రెట్టింపు చేసే అవకాశం ఉంది. ఆంధ్రప్రదేశ్‌ రాష్ట్ర రిమోట్‌ సెన్సింగ్‌ అనువర్తన కేంద్రం (ఏపీఎస్‌ఆర్‌ఏసీ) సేవల్ని విస్తృతంగా ఉపయోగించుకోవడం ద్వారా ప్రభుత్వం సత్ఫలితాలు సాధించవచ్చు. 2012 ఖరీఫ్‌ సీజన్లో వాస్తవ సాగుబడిలోకి వచ్చిన భూమికి సంబంధించి క్షేత్రస్థాయి వివరాలు సేకరించే బాధ్యత ఏపీఎస్‌ఆర్‌ఏసీకి అప్పగించాలి. రిమోట్‌ సెన్సింగ్‌ వినియోగం, క్షేత్రస్థాయి సత్యశోధనల ద్వారా అన్ని ప్రాజెక్టుల పరిధిలో ప్రాజెక్టులవారీ అధ్యయనాలు జరపాల్సిందిగా దాన్ని కోరాలి. జలయజ్ఞంకోసం బడ్జెట్లో కేటాయించిన రూ.15,000కోట్లలో 0.2శాతం అంటే- రూ.30కోట్లు మాత్రమే ఇందుకు అవసరమవుతుంది. ప్రస్తుతం కొత్తగా నిర్మించిన భారీ, మధ్యతరహా ప్రాజెక్టుల కింద సాగుతున్న సాగుబడిపై అధ్యయనానికి ఈ మాత్రం డబ్బు సరిపోతుంది. అందులో రూ.15కోట్లు రాష్ట్రప్రభుత్వ సంస్థ అయిన ఏపీఎస్‌ఆర్‌ఏసీకి వెంటనే సమకూర్చాలి. దాంతో అది ఈ ఏడాదే అధ్యయనం చేపట్టడానికి వీలవుతుంది. ఈ పని పూర్తయితే- ప్రాజెక్టులవారీగా వాస్తవంలో ఎక్కడెక్కడ భూమి సాగైందీ; పంట కాల్వలు, నీటి పంపిణీ కాల్వలు, శాఖీయ కాల్వల ద్వారా నీరు ఎక్కడ, ఎంత ప్రవహించింది స్పష్టంగా తెలుస్తుంది. క్షేత్రస్థాయి, పొలాల సర్వే(గ్రౌండ్‌ ట్రూత్‌) ద్వారా ఈ వివరాలు నిర్థారించుకోవచ్చు. ఈ రకమైన గణాంక వివరాలపై సాధారణంగా సాగునీరు, రెవిన్యూ, వ్యవసాయ శాఖల మధ్య వివాదాలు తలెత్తుతుంటాయి. రిమోట్‌ సెన్సింగ్‌ ప్రక్రియ ద్వారా వాస్తవ ఛాయాచిత్రాలు సేకరించవచ్చు. గ్రౌండ్‌ ట్రూత్‌ ప్రక్రియ ద్వారా వాస్తవ గణాంక వివరాలు అందుబాటులోకి వస్తాయి. వివిధ శాఖల మధ్య వివాదాలకు అప్పుడిక తావుండదు. ఈ వివరాలు అందుబాటులోకి వచ్చాక నిర్దిష్ట కాల్వలో నీరు ప్రవహించకపోవడానికి కారణాలను పరిశోధన (ఇన్వెస్టిగేషన్‌) ద్వారా తెలుసుకోవచ్చు. పనులు సకాలంలో పూర్తికాకపోవడం, అసంపూర్తి పనులు, పనులు చేయకపోవడం, డిజైను తగినవిధంగా లేకపోవడం, నీటి నిర్వహణలో లోటుపాట్లు వంటివి అందుకు కారణాలుగా తేలవచ్చు. మొదటి నాలుగు కారణాలవల్లే ఈ దుస్థితి ఏర్పడినట్లు వెల్లడైతే- ప్రస్తుత ఆర్థిక సంవత్సరంలోనే తగిన డిజైన్ల ఆధారంగా ఈ పనుల్ని త్వరితంగా పూర్తి చేయడానికి అవసరమైనన్ని నిధులు కేటాయించాలి. వివిధ ప్రాజెక్టుల కోసం బడ్జెట్లో ప్రత్యేకించిన నిధులనుంచి ఇందుకోసం కనీసం వెయ్యికోట్ల రూపాయలు సమకూర్చాలి. పరిశోధనలో నిర్ధారించిన మేరకు వాస్తవిక అవసరాలకు అనుగుణంగా ఇందులో మార్పులు చేర్పులు చేయాలి. ఈ ఏడాదే ఇలాంటి పద్ధతి పాటిస్తే, వచ్చే ఏడాది ఖరీఫ్‌ సీజన్లోనే వాస్తవిక సాగుబడి విస్తీర్ణాన్ని రెట్టింపు చేసే అవకాశం ఉంటుంది.
దిద్దుబాటు చర్యలతో సత్ఫలితాలు 
ప్రాజెక్టు కాలువల సేద్యానికి భిన్నంగా భూగర్భ జల వినియోగంతో సాగు విస్తీర్ణం ఎలా పెరిగిందో ఇప్పుడు పరిశీలిద్దాం. వాస్తవ సర్వేల ప్రకారం బావుల కింద 1988-89నాటికి 28లక్షల ఎకరాలు (11.33 లక్షల హెక్టార్లు) నీటిపారుదల కింద సాగు అవుతుంటే, ఇది 2009-10నాటికి 56.44 లక్షల ఎకరాలకు(22.84 లక్షల హెక్టార్లు) పెరిగింది. అదేకాలంలో ప్రాజెక్టు కాలువల కింది సాగు విస్తీర్ణం 46.21లక్షల ఎకరాల(18.70లక్షల హెక్టార్లు) నుంచి 35.73 లక్షల ఎకరాలకు (14.46 లక్షల హెక్టార్లు) పడిపోయింది. అంటే- ప్రభుత్వం ద్వారా ఏ మూలధన పెట్టుబడి లేకుండా రైతులే ఖర్చులన్నీ భరించి చేసే ప్రక్రియలో రెట్టింపు విస్తీర్ణం సాగులోకి తెస్తుంటే, రూ.55వేలకోట్ల పూర్తి ప్రభుత్వ వ్యయంతో చేపట్టిన పనులవల్ల అదనంగా పొలాలు సేద్యంలోకి రావడం లేదు. పైగా జలయజ్ఞం చేపట్టిన అయిదేళ్ల తరవాత (2009-10) అయిదు లక్షల ఎకరాలు తగ్గడం విడ్డూరంగా ఉంది. దీన్ని సరిదిద్దడానికి పైన చెప్పిన విధంగా ఆయా ప్రాజెక్టుల పనుల్లో తగిన దిద్దుబాటు చర్యలు తీసుకోవాలి. అందుకు ప్రభుత్వం తగిన కార్యాచరణతో ముందుకు రావాలి. అప్పుడే రాష్ట్రప్రజలకు సాగునీటి పథకాల ఫలాలు అందుతాయి.
(రచయిత మాజీ ఇంజినీర్‌-ఇన్‌-చీఫ్‌, ఐక్యరాజ్య సమితి (ఒ.పి.యస్‌.) సలహాదారు)

No comments:

Post a Comment