జీవన డెస్క్ - కె.ఎక్స్.రాజు
Wed, 27 Mar 2013, IST
కేబుల్, డీటీహెచ్ (డైరెక్ట్ టూ హోమ్) ద్వారా వందలాది చానళ్లను టీవీల్లో చూస్తున్నాము. కేబుల్ టీవీ ఆపరేటర్లకు నెలకు రూ.150-250 చెల్లిస్తూ.. టీవీలో 80-105 చానల్స్ వరకు చూస్తున్నవారే రాష్ట్రంలో అధికం. ఇష్టమున్నా, లేకున్నా ఈ చానళ్లలో ప్రసారమవు తున్నవాటిని చూడాల్సిందే.
అయితే కేబుల్ టీవీ డిజిటలైజేషన్‌తో ప్రస్తుత పరిస్థితిలో సమూల మార్పులు రానున్నాయి. ఉచిత చానళ్లతో కలిపి డీటీహెచ్‌లో 400, కేబుల్‌లో 1,000 చానళ్ల వరకు ప్రసారాలను చూడొచ్చు. ఇందు కోసం కేబుల్ వినియోగదారులు ఎంఎస్‌వో (మల్టీ సిస్టమ్ ఆపరే టర్)ల వద్ద సెట్‌టాప్ బాక్సులను కొనుగోలు చేయాల్సిందే. ఈ వ్యవస్థ వల్ల స్థానిక ఆపరేటర్లు తమ ప్రాంతాల్లో ఎన్ని కనెక్షన్లు ఇచ్చారో, ఎమ్‌ఎస్‌ఓకు స్పష్టత వస్తుంది. పే-చానళ్లలో అవసరమైన వాటికే డబ్బు చెల్లించే అవకాశం ఖాతాదారులకూ ఉంటుంది.
దేశంలోని ఢిల్లీ, ముంబయి, చెన్నై, కోల్‌కతా మహానగరాల్లో కేబుల్ టీవీ డిజిటలైజేషన్ ప్రక్రియ పూర్తవుతోంది. రెండో దశలో దేశంలోని 38 నగరాల్లో ఈ ప్రక్రియ మార్చి నెలాఖరులోపు పూర్తవ్వాల్సి ఉంది. ఈ జాబితాలో రాష్ట్రంలోని హైదరాబాద్, విశాఖపట్నం కూడా ఉన్నాయి. వచ్చే ఏడాది సెప్టెంబరు 30లోపు మూడో విడతగా దేశంలోని అన్ని పట్టణాల్లోనూ డిజిటలైజేషన్ పూర్తవ్వాలి. 2014 డిసెంబరు ఆఖరుకు దేశవ్యాప్తంగా టీవీ ప్రసారాలు డిజిటల్ పద్ధతిలోనే జరగాలని ప్రభుత్వం నిర్ణయించింది.
సెట్ టాప్ బాక్స్‌లు అంటే?
ప్రస్తుతం మనం చూస్తున్న టీవీ ప్రసారాలను కేబుల్ ఆపరేటర్ల ద్వారా ఎనలాగ్ సిగలింగ్ వ్యవస్థ అందిస్తోంది. సాధారణంగా ఎనలాగ్ సిగలింగ్ ప్రసారాల్లో కొంత నాణ్యతా లోపం వుంటుంది. కొన్ని చానల్స్‌లోని ప్రసారాలు స్పష్టంగా వస్తే, మరికొన్ని అస్పష్టంగా ఉంటాయి. ఈ ప్రసారాల్లో స్పష్టత... నాణ్యత బాగుండాలంటే డిజిటలైజేషన్ ఒక్కటే పరిష్కారమని భావించిన సాంకేతిక రంగం సెట్ టాప్ బాక్సుల విధానాన్ని రూపొందించింది.
శాటిలైట్ల ద్వారా అందే చానళ్ల ప్రసారాలు ప్రస్తుతం అనలాగ్/ డిజిటల్ తరంగాలుగా కేబుల్ ద్వారా, డీటీహెచ్ (డైరెక్ట్ టూ హోమ్) రూపంలో వినియోగ దారులకు చేరుతున్నాయి. ఇక ఎంఎస్‌వోల నుంచి ప్రసారాలు పొందే స్థానిక కేబుల్ ఆపరేటర్, తన పరిధిలోని ఖాతాదారులకు కేబుల్ ద్వారా కనెక్షన్లు ఇస్తున్నారు. అనలాగ్‌లో పరిమిత సంఖ్య దాటితే స్పష్టత తగ్గుతుంది. డిజిటల్‌లో ఆ సమస్య ఉండదనీ, దృశ్యంలోనూ శబ్దంలోనూ స్పష్టత బాగుంటుందనీ, ఒక అనలాగ్ చానల్ ఫ్రీక్వెన్సీలో 8-15 డిజిటల్ చానళ్లు ప్రసారం చేయొచ్చని చెబుతున్నారు. ప్రస్తుతం 105 చానళ్ల వరకు వస్తున్న ప్రసారాలు.. డిజిటలైజేషన్ అనంతరం 1,000 చానళ్ల వరకు అందించేందుకు వీలవుతుంది.
వినియోగదారులే అమర్చుకోవాలి!
డిజిటల్ చానళ్ళ ప్రసారాలకు అవసరమైన సెట్‌టాప్ బాక్సులను వినియోగదారులే అమర్చుకోవాలి. వీటి మార్కెట్ ధర రూ.750. ఆపరేటర్లు మాత్రం రూ.1,200 నుంచి రూ.2,000 వరకూ ఒక్కో ప్రాంతంలో ఒక్కో రకంగా విక్రయిస్తున్నారు. వీటితోపాటు హై డెఫినిషన్ ప్రసారాలు అందించే హెచ్‌డీ సెట్‌టాప్ బాక్సు ధర రూ.6,000- 8,000 వరకు ఉంది. బిగించినందుకుగాను రూ. 300 అదనంగా చెల్లించాలి. సెట్‌టాప్ బాక్సులకు ఎంత చార్జీ వేయాలనే విషయంలో ఆపరేటర్లకు స్పష్టత లేదు. దేశంలో సెట్‌టాప్‌బాక్సుల తయారీ జరగడం లేదు. విదేశాల నుండి పెద్ద మొత్తంలో దిగుమతి చేసుకుంటున్నారు. ముఖ్యంగా చైనా నుంచి ఎక్కువగా దిగుమతి అవుతున్నాయి.
ఇన్‌స్టలేషన్ ప్రక్రియ
పట్టణాల్లో అద్దె ఇళ్ళలో ఉండేవారి సంఖ్య ఎక్కువ. అవసరాలను బట్టి ఒక ప్రాంతం నుండి మరో ప్రాంతానికి మారడం సర్వ సాధారణం. అలాంటి సందర్భంలో ఇప్పటి దాకా స్థానిక కేబుల్ టీవీ ఆపరేటర్‌కు ఇన్‌స్టలేషన్ చార్జీలతోపాటు నెలవారీ రుసుము చెల్లిస్తే సరిపోతోంది. అయితే డిజిటైజేషన్ తర్వాత వినియోగదారుడు ఒక ప్రాంతం నుంచి మరో ప్రాంతానికి మారితే పాత సెట్‌టాప్ బాక్సు వినియోగించుకునే వీలుండదు. ఒక ఆపరేటర్ ఇచ్చిన సెట్‌టాప్ బాక్సు మరో ఆపరేటర్ పనికిరాదని చెబుతున్నారు. ఫలితంగా ఒకే ప్రాంతంలో ఇద్దరు ఆపరేటర్లు సేవలందిస్తున్నా, ఖాతాదారు ఒక ఆపరేటర్‌కే పరిమితమవ్వాలి. లేదా మరొకరి వద్ద కూడా సెట్‌టాప్ బాక్సు కొనుగోలు చేయాల్సి ఉంటుంది.
ఉచితంగా ప్రసారమయ్యే చానళ్లన్నీ మామూలుగానే ప్రసారమవుతాయి. డీటీహెచ్ ఆపరేటర్ల మాదిరిగానే కేబుల్ ఆపరేటర్లు కూడా పేచానళ్లను బృందాలుగా విభజించి, రుసుము నిర్ణయించే అవకాశం ఉంది. తెలుగు చానళ్లు, పిల్లల కోసం ప్రత్యేకిం చినవి, క్రీడలు.. ఇలా భిన్న రకాలకు వేర్వేరు ప్యాకేజీలుగా నిర్ణయించే అవకాశం వుంది.
పాశ్చాత్య ప్రభావం
డిజిటలైజేషన్ పద్ధతి ద్వారా ప్రపంచ వ్యాప్తంగా 1000 చానళ్ల వరకు చూసే అవకాశం లభిస్తుంది. దీనివల్ల సంస్కృతి, సంప్రదాయాలు మంట కలిసిపోతాయని పలువురు వాపోతున్నారు. ప్రస్తుతం ఉన్న కొద్దిపాటి చానళ్ళతోనే పాశ్చాత్య సంస్కృతి మన నట్టింట నాట్యమాడుతోందనీ, ఈ డిజిటలై జేషన్ ద్వారా అందుబాటులోకి వస్తోన్న చానల్స్‌తో మన సంస్కృతి మంటగలిస ిపోతోందనే వాదనలూ వినిపిస్తున్నాయి.
టి.ఆర్.పి. రేటింగ్ సులభతరం
డిజిటలైజేషన్ వల్ల అవసరమనుకున్న చానళ్ళను ఎంపిక చేసుకోవచ్చు. ఎంపిక చేసుకునే చానళ్లను బట్టి ఎంత చెల్లించాలన్నది వినియోగదారులకు తెలియజేస్తారు. తద్వారా అధిక మొత్తంలో డబ్బు చెల్లించాల్సిన అవసరం గానీ, అనవసరమైన చానళ్లను చూడాల్సిన పరిస్థితి గానీ ఉండదు. ఈ విధానం వల్ల 'టి.ఆర్.పి' (టెలివిజన్ వ్యూయర్‌షిప్ రేటింగ్ పాయింట్) తెలుసుకోవడం కూడా సులభంగా ఉంటుందని నిపుణుల అంచనా.
రేటింగ్స్ పెంచుకునేందుకు అనేక చానెళ్లు గ్యాసిప్స్‌తో పబ్బం గడుపుతున్నాయి. డిజిటలైజేషన్ వల్ల 'రేటింగ్స్'లో శాస్త్రీయత, పారదర్శకత ఉంటుందనే అభిప్రాయం వ్యక్తమవుతోంది. అంతేకాకుండా వీక్షకులు ఏ చానల్‌ను, ఏ కార్య క్రమాన్ని ఎంతమంది చూస్తున్నారన్న విషయాలను కచ్చితంగా లెక్కించవచ్చని నిపుణుల అభిప్రాయం.
గ్రేటర్ హైదరాబాద్ పరిధిలో...
ఒక్క గ్రేటర్ హైదరాబాద్ పరిధిలోనే దాదాపు 24 లక్షలకు పైగా కేబుల్ టీవీ కనెక్షన్లున్నాయి. మరో 6-8 లక్షల వరకు డీటీహెచ్ కనెక్షన్లుంటాయి. ఒక్కొక్క ఇంటిలో రెండు మూడు టీవీలను వినియోగించేవారు కూడా లేకపోలేదు. ఈ సెట్‌టాప్ బాక్సులు అమర్చుకోకపోతే ఏప్రిల్ 1వ తేదీ నుంచి గ్రేటర్ పరిధిలో వేలాది టెలివిజన్లు మూగబోతాయి. టీవీ కనెక్షన్లున్న వారిలో ఇప్పటి వరకు 30 శాతం మంది కూడా సెట్‌టాప్ బాక్సులను అమర్చుకోలేదు. ప్రధాన నగరాల్లో కేబుల్ టీవీల డిజిటలైజేషన్‌ను కేంద్ర ప్రభుత్వం తప్పనిసరి చేసిన దరిమిలా రాష్ట్రంలోని హైదరాబాద్, విశాఖపట్నం లోనూ ఈ ప్రక్రియను అమలుపరచాల్సి ఉంది.
కేబుల్ టీవీ ఆపరేటర్లు ఈ అవకాశాన్ని తమకు అనుకూలంగా మార్చుకుంటున్నారు. బిఐఎస్ ప్రమాణాలతో కూడిన సెట్‌టాప్ బాక్సులను మాత్రమే ఏర్పాటు చేసుకోవాలనే నియమాలున్నా నాణ్యత కొరవడిన బాక్సులు కూడా మార్కెట్లోకి వచ్చాయి. వీటికి రూ.2 వేలు డిమాండ్ చేస్తున్నారని పలువురు వినియోగదార్లు ఆరోపిస్తున్నారు. మరో నాలుగు రోజుల్లో గడువు ముగుస్తుండడంతో వీటికి డిమాండ్ పెరిగింది. ఇప్పటివరకు హాత్‌వే సంస్థ 2.5 లక్షలు, సిటీకేబుల్- డిజికేబుల్ సంస్థ మరో 50వేల వరకు సెట్‌టాప్ బాక్సులను విక్రయించాయని అంచనా. గ్రేటర్ హైదరాబాద్ పరిధి లోనే మరొక 20 లక్షల బాక్సుల అవసరం ఉంది. విశాఖపట్నంలో 4 లక్షల కనెక్షన్లున్నాయని సమాచారం.
No comments:
Post a Comment