సహజ సంపదలతో పచ్చని పొలాలతో పసిడి రాసులు, ధాన్యపు రాసులకు పుట్టినిల్లయిన మెదక్ జిల్లాను పూర్వం మెతుకు దుర్గం అని పిలిచేవారు.
తెలంగాణ జిల్లాలోకెల్లా వరి ఎక్కువగా పండించడం వల్ల ఈ పేరు వచ్చిందని చరిత్ర చెబుతోంది. కాలక్రమేణ ఇది మెతుకుగాను తరువాత మెదక్‌గాను మారింది. విభిన్న సంస్కృతులు, నాగరికతలకు నిలయమైన మెదక్ జిల్లాను శాతవాహనులు, బాదామి చాళుక్యులు, కళ్యాణి చాళుక్యులు, రాష్ట్రకూటులు, కాకతీయులు, బహుమనీలు, బరిద్‌షాహీలు, కుతుబ్‌షాహీలు, మొగలులు, అసఫ్‌జాహీ వంశస్థులు వేరు వేరు కాలాలలో జిల్లాలోని వివిధ విభాగాలను పరిపాలించారు. ఆ తరువాత అల్లాఉద్దీన్ ఖిల్జీ నాయకుడు మాలిక్‌కపూర్ 1309లో దక్షిణ దండయాత్ర విజయపరంపరలో మెదక్ జిల్లా అతని స్వాధీనమైంది. అనంతరం గోల్కొండ కుతుబ్‌షాహిల అధీనంలోకి వెళ్లిన మెదక్‌కు గుల్షానాబాద్ అని పేరు పెట్టగా నిజాం దాన్ని మెదక్‌గా మార్చారు. 1948లో నిజాం సంస్థానం రద్దు కావడంతో తెలంగాణ జిల్లాలతో పాటు మెదక్ జిల్లా 1956లో ఆంధ్రప్రదేశ్‌లో ఒక జిల్లాగా ఏర్పడింది. అయితే పరిపాలనా సౌలభ్యం కొరకు జిల్లా ప్రధాన కేంద్రంగా సంగారెడ్డిని చేసుకొని కార్యకలాపాలు నిర్వహించబడుతోంది. మెదక్ జిల్లా 17 డిగ్రీలు-18, 18 డిగ్రీలు-19 అక్షాంశ రేఖలు మరియు 78 డిగగగ్రీలు-28, 79 డిగ్రీలు-10 తూర్పు దీర్ఘాంశ రేఖల మధ్య ఉంది. జిల్లాకు ఎల్లలుగా ఉత్తరాన కరీంనగర్, నిజామాబాద్ జిల్లాలు, దక్షిణాన హైదరాబాద్, రంగారెడ్డి జిల్లాలు, తూర్పున వరంగల్, నల్గొండ జిల్లాలు, పశ్చిమాన కర్నాటక రాష్ట్రం ఉన్నాయి. జిల్లా విస్తీర్ణం 9699 చ.కి.మీ. ఇది రాష్ట్ర వైశాల్యంలో 3.53 శాతం. జిల్లాలో బాలఘాట్ పర్వత శ్రేణికి చెందిన గుట్టల వరుసలు, మరికొన్ని కొండల ప్రాంతం మినహా తక్కిన భూభాగమంతా పీఠభూమివలె ఉంటుంది. జిల్లాలో ఇసుకతో కూడిన చెలక నేలలు, ఎర్ర నేలలు, నల్లరేగడి నేలలు కలవు.
జిల్లాలో గోదావరి ఉప నదులైన మంజీరానది బీదర్ జిల్లా గుండా పయనిస్తూ ఈశాన్య దిక్కున నుంచి మెదక్ జిల్లాలోకి ప్రవేశించి నారాయణఖేడ్, జహీరాబాద్, సంగారెడ్డి, నర్సాపూర్ తాలూకాలలో 96 కి.మీ. ప్రయాణం చేస్తుంది. మంజీరాకు ఉపనది అయిన హల్ది నది లేదా పసుపులేరు గజ్వేల్ తాలుకాలో పుట్టి మెదక్, రామాయంపేట తాలుకాల మీదుగా ప్రవహించి మంజీరాలో కలుస్తుంది. ఇవి గాక గజ్వేల్, సిద్దిపేట తాలుకాలలో కడలేరు అనే చిన్న వాగు ప్రవహిస్తుంది. జిల్లాలో పెద్ద నదులు లేనందున పెద్ద ప్రాజెక్టు లేవీ లేవు. ఉన్న చిన్న ప్రాజెక్టులలో చెప్పుకోదగినవి ఘనపూర్ ఆనకట్ట, రాయనపల్లి ప్రాజెక్టు, గంగకత్వ ప్రాజెక్టు, బొగ్గంపల్లి ప్రాజెక్టు, పెద్దవాగు ప్రాజెక్టు, నారింజ ప్రాజెక్టు, మెలిగిరిపేట వాగు ప్రాజెక్టులు. సాగునీటికి ప్రధానంగా చెరువుల మీద, వర్షాదారం మీద ఆధారపడవలసి వస్తున్నందున జిల్లాలో 26 శాతం మాత్రమే భూమి సాగవుతుంది. జిల్లా సాధారణ వర్షపాతం 873 మి.మీ. జిల్లాలో సింగూరు గ్రామ సమీపంలో మంజీర నదిపై నిర్మించిన సింగూరు ప్రాజెక్టు 30 టీఎంసీల నీటి నిల్వ సామర్థ్యం గలది. రాష్ట్ర ప్రభుత్వం జిల్లా రైతుల కోరిక మేరకు 2 టీఎంసీల నీటిని వ్యవసాయ సాగుకై విడుదల చేయుటకు ఉత్తర్వులు జారీ చేసింది. దీని వల్ల 40 వేల ఎకరాల భూమి సాగు చేయబడుతుంది. ప్రస్తుతం ఉన్న సాగునీటి దిగువ డ్యాములకు సహాయపడటంతో పాటు హైదరాబాద్, సికింద్రాబాద్ జంట నగరాలకు మంచినీరు సరఫరా చేయబడుతుంది. జిల్లాలో వరి, జొన్న, మొక్కజొన్న, చెరకు, మిర్చి, ప్రత్తి మొదలగునవి ప్రధాన పంటలు. జిల్లాలో క్వార్ట్జ్, తెల్ల బంకమన్ను అధికంగా లభిస్తుంది.
No comments:
Post a Comment