అంతర్జాలంలోని అన్నిరకాల ముఖ్యమైన సమాచారాన్ని ఈ సైట్ లో నిక్షిప్తం చేసి, అందరికీ ఉపయోగపడే ఒక వేదికగా ఈ సైట్ ఉండాలనే ఉద్దేశ్యంతో ప్రారంభించడమైంది. ఏ సైట్ నుండి సమాచారం తీసుకున్నా వారి పేరుతోనే ఇందులో వుంచుతాను. సహృదయంతో సహకరించగలరు.
ఎవరికైనా అభ్యంతరముంటే వారి సైటుకు సంబంధించిన సమాచారం తొలగించడం జరుగుతుంది. - ధన్యవాదములతో...

Monday, April 23, 2012

పర్యాటక రంగం :

ప్రధాన దేవాలయాలు :
చారిత్రక ప్రాధాన్యతను కలిగి, కళాత్మక నైపుణ్యంతో నిర్మితమై రాష్ట్ర, జాతీయ, అంతర్జాతీయ స్థాయి గుర్తింపు పొందిన ప్రముఖ దేవాలయాలు మెదక్‌
జిల్లాలో ఉన్నాయి. ప్రపంచ ప్రసిద్ధిగాంచిన సుందరమైన చర్చి... రాష్ట్ర ప్రభుత్వపరంగా ఉత్సవాలు జరిగే సుప్రసిద్ధ పుణ్యక్షేత్రం ఏడుపాయల... చదువుల తల్లి సరస్వతి కొలువైన వర్గల్‌ విద్యాధరి మందిరం.. పురాతనమైన ఝరాసంఘం కేతకీ సంగమేశ్వరాలయం ఎల్లలు దాటి భక్తజనులను ఆకర్షిస్తూ దినదినాభివృద్ధి చెందుతున్న పుణ్యక్షేత్రాలు.
మెదక్‌: ఇక్కడ ప్రపంచ ప్రసిద్ధిగాంచిన ఏసుక్రీస్తు మందిరం కెథడ్రల్‌ చర్చి ఉంది. రాష్ట్ర రాజధాని హైదరాబాద్‌ నుంచి ఇక్కడికి 100 కిలోమీటర్ల దూరం. జిల్లా కేంద్రం సంగారెడ్డి నుంచి 70కిలోమీటర్లు.
ఏడుపాయల: వనదుర్గామాత కొలువైన పుణ్యక్షేత్రం ఇది. మెదక్‌ పట్టణం నుంచి 20 కిలోమీటర్ల దూరం. రాష్ట్ర రాజధాని హైదరాబాద్‌ నుంచి 120 కిలోమీటర్లు.
వర్గల్‌: చదువుల తల్లి సరస్వతి మాత కొలువైన మందిరం. రాజీవ్‌ రహదారికి సమీపంలో ఉంది. సికింద్రాబాద్‌ నుంచి 40 కిలోమీటర్ల దూరం.
నాచారం: లక్ష్మీ నృసింహస్వామి దేవాలయం. తూప్రాన్‌-గజ్వేల్‌ మార్గంలో ఉంది. హైదరాబాద్‌ నుంచి 50 కిలోమీటర్లు. తూప్రాన్‌ నుంచి 6 కిలోమీటర్లు.
ఝరాసంఘం: కేతకీ సంగమేశ్వరాలయం. హైదరాబాద్‌ నుంచి 120 కిలోమీటర్ల దూరం. జహీరాబాద్‌ నుంచి 16 కిలోమీటర్ల దూరం.
బొంతపల్లి: వీరభద్రస్వామి దేవాలయం. హైదరాబాద్‌ నుంచి 45, సికింద్రాబాద్‌ నుంచి 30 కిలోమీటర్ల దూరం.
కొల్చారం: జైనమందిరం. హైదరాబాద్‌ నుంచి 85 కిలోమీటర్లు. మెదక్‌ నుంచి 15 కిలోమీటర్ల దూరం.
సిద్దిపేట: ఉమాపార్థీవ కోఠి లింగేశ్వరాలయం. శ్రీ మహా రేణుకా ఎల్లమ్మ దేవాలయం. హైదరాబాద్‌ నుంచి 106 కిలోమీటర్ల దూరం. మెదక్‌ నుంచి 70 కిలోమీటర్లు.
చిట్కుల్‌: చాముండేశ్వరీ దేవాలయం. మెదక్‌ - జోగిపేట- సంగారెడ్డి మార్గంలో ఉంది.
అనంతసాగర్‌: సరస్వతీ క్షేత్రం. రాజీవ్‌రహదారిపై ఉంది. సిద్దిపేట నుంచి 20 కిలోమీటర్ల దూరం. హైదరాబాద్‌ నుంచి 120 కిలోమీటర్ల దూరం.
బీరంగూడ: పటాన్‌చెరుకు రెండు కిలో మీటర్ల దూరంలో ఉంటుంది. హైదరాబాద్‌ నుంచి 20 కిలో మీటర్ల దూరంలో ఉంటుంది.

మెదక్‌ చర్చి
ఆసియా ఖండంలో రెండో అతిపెద్ద చర్చి మెదక్‌ పట్టణంలో ఉంది. అద్భుతమైన నిర్మాణ నైపుణ్యంతో రూపుదిద్దుకొని కరుణామయుడు ఏసుక్రీస్తు కొలువైన మహా దేవాలయంగా పేరొందిన ఈ చర్చి సందర్శనకు రాష్ట్రంలోని వివిధ జిల్లాల నుంచే దేశంలోని వివిధ రాష్ట్రాలు, విదేశీ భక్తులు సైతం వస్తారు. జిల్లాకు తలమానికంగా భాసిల్లుతున్న మహాద్భుత కట్టడం మెదక్‌ కెథడ్రల్‌ చర్చి. ఇది కల్లోల జగతికి శాంతి సందేశాన్ని అందించిన కరుణామయుడి మందిరమే కాదు... అన్నార్థులను ఆదుకొనే మహోన్నత ఆశయంతో రూపుదిద్దుకొన్న మహాదేవాలయం. కరువు నుంచి ఉద్భవించిన కళాత్మక నిర్మాణం.
కరవు నుంచి ఉద్భవించిన కళాత్మక కట్టడం
సుందరమైన మెదక్‌ చర్చికి ఘనమైన చరిత్ర ఉంది. మొదటి ప్రపంచ యుద్ధకాలంలో మెదక్‌ ప్రాంతంలో తీవ్ర దుర్భిక్షం నెలకొంది. కరవుతో ఉపాధి లేక తినడానికి తిండికిలేక ప్రజలు ఆకలిదప్పులతో అల్లాడిపోయారు. ఆ సమయంలో ఇంగ్లాండ్‌ నుంచి వచ్చి మెదక్‌ ప్రాంతంలో సువార్త సేవలందిస్తున్న క్రైస్తవ గురువు చార్లెస్‌ వాకర్‌ ఫాస్నెట్‌ చలించిపోయారు. అన్నార్థులను ఆదుకోవాలన్న సదాశయంతోపాటు... సర్వమానవాళి పాపాలను తన భుజాలపై మోసిన కరుణామయుడు ఏసుక్రీస్తుకు ఓ మందిరం నిర్మించాలన్న ఆలోచనతో ఆయన మెదక్‌లో చర్చి నిర్మాణానికి పూనుకొన్నారు. పనికి ఆహారం ప్రాతిపదికన చేపట్టిన ఈ చర్చి నిర్మాణం 1914లో ప్రారంభమై 1924 వరకు పదేళ్లపాటు కొనసాగడం విశేషం. ఎన్నో ప్రత్యేకతలు ఉండటంతోపాటు చారిత్రక ప్రాధాన్యత గల మెదక్‌ కెథడ్రల్‌ చర్చి ఆసియాఖండంలో అతిపెద్ద రెండో చర్చిగా ప్రఖ్యాతి గాంచింది. ఈ అందాల మందిరం ఆధ్యాత్మికతకు నెలువుగా వెలుగొందుతూ, అన్ని వర్గాల వారిని ఆకట్టుకొంటూ మతసామరస్యాన్ని చాటుతోంది.

ఆరాధనలు... ఉత్సవాలు
1924 డిసెంబరు 25వ క్రిస్మస్‌ రోజు ఈ మహాదేవాలయాన్ని ప్రజలకు అంకితం చేశారు. ఆనాటి నుంచి ఏటా క్రిస్మస్‌ సందర్భంగా ఈ చర్చిలో ఏసుక్రీస్తు జన్మదిన వేడుకలు అంగరంగ వైభవంగా జరుగుతున్నాయి. క్రిస్మస్‌ ఉత్సవాలకు సుమారు లక్ష మంది హాజరవుతారు. సీఎస్‌ఐ ఆవిర్భావ దినోత్సవం, మహిళా మైత్రి సంఘ ఆవిర్భావ దినోత్సవం సందర్భంగా కూడా ఉత్సవాలు జరుగుతాయి. ప్రతి ఆదివారం ఈ చర్చిలో ప్రత్యేక ఆరాధనలు ఉంటాయి. రాష్ట్రంలోని వివిధ ప్రాంతాల వారే కాక పొరుగు రాష్ట్రాల నుంచి, విదేశాల నుంచి సైతం ఎంతో మంది భక్తులు, పర్యాటకులు మెదక్‌ చర్చి సందర్శనకు వస్తుంటారు. దూర ప్రాంతాల నుంచి వచ్చే వారు బస చేసేందుకు చర్చి ప్రాంగణంలో వసతి సదుపాయాలు కూడా ఉన్నాయి.

ఏడుపాయల దుర్గాభవాని మందిరం
మెదక్‌ పట్టణం నుంచి 20 కిలోమీటర్ల దూరంలో తెలంగాణలో ప్రసిద్ధిగాంచిన ఏడుపాయల వనదుర్గామాత పుణ్యక్షేత్రం ఉంది. మెదక్‌ పట్టణం నుంచి బస్సులు ఇక్కడికి నడుస్తాయి. బొడ్మట్‌పల్లి చౌరస్తా, ఏడుపాయల కమాన్‌ నుంచి ఆటోలు ఉంటాయి. మంజీర నదీ ఏడుపాయలుగా చీలి ప్రవహించే చోట ఓ పాయ ఒడ్డున రాతిగుహలో వనదుర్గామాత కొలువై ఉంది. ఎల్లలు దాటి భక్తజనులను ఆకర్షిస్తున్న ఏడుపాయల తల్లి... ఎందరో భక్తుల ఇలదైవం. చుట్టూరా నదీ పాయలు... కొండలు... రాళ్లగుట్టలు... చెట్లపొదలతో నిండి ఉండే ఏడుపాయల ప్రాంగణం ఏడాది పొడుగునా నిత్యం దీపదూప నైవేద్యాలతో అలరారుతోంది. జమదగ్ని, అత్రి, కాశ్యపి, విశ్వామిత్ర, వశిష్ఠ, భరద్వాజ, గౌతమి అనే సప్తరుషుల పేర్లతో ఏడుపాయలను పిలుస్తారు. వీటితో పాటు పాపాల మడుగు, ఏకోత్తర శతకుండలం, మునిపుట్ట, తపోభూమి, సంతర్పణ స్థలాలుగా పేరొందిన ప్రాంతాలలో భక్తులు పూజలు చేస్తారు. పాపాల మడుగులో స్నానం చేస్తే పాపవిముక్తులవుతారనేది భక్తుల ప్రగాఢ విశ్వాసం.
ఎల్లలు దాటి భక్తజనం
వన దుర్గామాతను దర్శించుకొని పూజిస్తే కోరిన కోర్కెలు నెరవేరుతాయని భక్తుల నమ్మకం. దీంతో చాలా మంది సకుటుంబ సమేతంగా ఇక్కడికి తరలివస్తారు. దుర్గామాతను భక్తితో కొలుస్తారు. బోనాలు తీసి.. ఒడి బియ్యం పోసి మొక్కుబడులు చెల్లించుకొంటారు. ఏటా జరిగే ఏడుపాయల జాతరకు లక్షల మంది భక్తులు పెరుగుతూనే ఉన్నారు. ఈ జాతరకు తెలంగాణా జిల్లాలతో పాటు, కర్నాటక, మహారాష్ట్ర రాష్ట్రాల నుంచి కూడా పెద్ద సంఖ్యలో భక్తులు తరలివస్తారు. ఇక్కడ ఏటా మహాశివరాత్రికి జరిగే జాతరకు రాష్ట్రంలోని వివిధ జిల్లాల నుంచే కాక మహారాష్ట్ర, కర్నాటక నుంచి 10 లక్షలకు పైగా భక్తులు హాజరవుతారు. ఆదివారాల్లో, సెలవు దినాల్లో భక్తుల రాక అధికంగా ఉంటుంది. పర్యాటకులు విడిది చేసేందుకు ఇక్కడ వసతి సదుపాయాలున్నాయి.
ఇదీ 'ఏడుపాయల' చరిత్ర
'గరుడగంగా'గా పేరొందిన మంజీరా నది ఉద్భవించడం, ఏడుపాయలుగా చీలిపోవడం గురించి ఎన్నో పురాణ, చారిత్రక కథలు ఇక్కడి జానపదులు చెబుతారు. ద్వాపర యుగాంతంలో పాండవ వంశపు కడపటి రాజు, పాండవుల మునిమనుమడైన జనమేజయ మహారాజు తన తండ్రి పరీక్షిత్‌ మహారాజు మరణానికి కారణమైన సర్పజాతిని సమూలంగా అంతమొందించాలని సప్తరుషులతో సర్పయాగం చేయించినట్టు... ఆ యాగం జరిగిన ప్రాంతమే నేటి ఏడుపాయల అని పురాణ కథనం. ప్రస్తుతం జాతర జరిగే ప్రదేశం బండరాళ్లపై గుండ్రటి ఆకారంలో గుంతలు ఉండటం... కొద్దిదూరంలో ఎల్లాపూర్‌ గ్రామ పరిసర ప్రాంతాల్లో మంజీరా నది ఒడ్డున ఇసుక మేటలు తవ్వితే విభూతి మాదిరిగా అగుపించే తెల్లని మట్టి లభిస్తుండటంతో ఇక్కడ యాగం జరిగిందనడానికి బలం చేకూరుస్తోందని నమ్మిక. ఏడుగురు మహర్షుల ఆధ్వర్యంలో జరిగిన యాగాగ్ని గుండాలలో సమస్త సర్ప సంతతి ఆహుతి కావడం జరిగిందని, ఈ యాగంలో ఆహుతైన సర్ప రాజులకు సద్గతి కలిగించేందుకు గరుడుడు పాతాళలోకంలోని భోగవతి నదీమతల్లిని తీసుకవచ్చాడని, ఆ నది సప్త మహర్షుల యజ్ఞగుండాలను తాకేందుకు ఏడుపాయలుగా చీలి ప్రవహించినట్టుగా ఒక గాథ ప్రచారంలో ఉంది. గరుడు తీసుకురావడం వల్లే భోగవతికి గరుడగంగ అనే పేరు వచ్చిందని పురాణ కథనం.
ఉత్సవాలు... జాతర్లు
ఏటా మాఘఅమావాస్య, మహాశివరాత్రి సందర్భంగా ఏడుపాయల్లో పెద్ద జాతర జరుగుతుంది. శివరాత్రి జాతర ఉత్సవాలు అత్యంత వైభవంగా నిర్వహిస్తారు. సంప్రదాయం ప్రకారం బండ్ల ఊరేగింపు ఉంటుంది. ఎద్దుల బండ్లు, గుమ్మటాల బండ్లను జాతర ప్రాంగణంలో ఊరేగిస్తారు. ఈ రోజు భక్తులు అమ్మవారికి బోనాలు తీసి, ఒడిబియ్యం పోసి మొక్కుబడులు చెల్లించుకొంటారు. తెల్లవారుజామున రథోత్సవం ఉంటుంది. ప్రతిఏటా దసరా సందర్భంగా ఏడుపాయల్లో నవరాత్రి ఉత్సవాలు కన్నుల పండువగా జరుగుతాయి.
ప్రత్యేకతలు
మంజీరా నది ఏడుపాయలుగా చీలి ప్రవహిస్తూ మళ్లీ ఒకచోట కలిసి ప్రవహించే అరుదైన ప్రదేశం ఏడుపాయల.
మహాభారత కాలంలో జనమేజయ మహారాజు సర్పయాగం చేసిన స్థలంలోనే ఏడుపాయల వనదుర్గామాత ఆలయం కొలువై ఉంది.
ఏడుపాయల్లో వనదుర్గామాత ఆలయంతోపాటు ముత్యాలమ్మ గుడి, శివాలయం, ఆంజనేయస్వామి దేవాలయం, పరుశరాముని మందిరం, మునిపుట్ట, దర్గా ఉన్నాయి.


మహిమాన్విత దుర్గా భవాని మందిరం
సంగారెడ్డి మండలం ఇస్మాయిల్‌ఖాన్‌పేట (ఈశ్వరపురం) గ్రామంలో సప్తప్రాకారయుత దుర్గా భవాని ఆలయం ప్రసిద్ధి చెందింది. తొమ్మిది సంవత్సరాల క్రితం పురాతన కోటలో ఆలయాన్ని గ్రామస్థులు నిర్మించారు. ఆలయంలో ఎనిమిది ప్రకారాలు నిర్మించాలని నిర్ణయించారు. దేశంలోనే అతి పెద్ద అమ్మవారి విగ్రహాల్లో ఈ విగ్రహం ఒకటి. నిత్యం భక్తులతో ఆలయం కిటకిటలాడుతుంది. భక్తుల కోర్కెలు నెరవేరుతుండడంతో మహిమాన్విత ఆలయంగా ప్రసిద్ధి చెందింది. దేవాలయ ఆవరణలో ఉన్న చెట్లకు భక్తులు మొక్కులు చెల్లించుకుంటారు. దేవాలయానికి జిల్లా నలుమూలల నుంచే కాకుండా హైదరాబాద్‌, రంగారెడ్డి, కరీంనగర్‌, నిజామాబాద్‌ జిల్లాల నుంచి భక్తులు వస్తుంటారు. పక్కనున్న కర్ణాటక, మహరాష్ట్ర నుంచి కూడా భక్తులు వచ్చి అమ్మవారిని దర్శించి మొక్కులు చెలించుకుంటారు.
ప్రత్యేక ఆకర్షణ లక్ష దీపోత్సవం
ప్రతి ఏడాది మార్చి నెలలో మూడు రోజుల పాటు దేవాలయ వార్షికోత్సవాలను ఘనంగా నిర్వహిస్తారు. చివరి రోజు లక్ష దీపోత్సవం ఇక్కడి ప్రత్యేక ఆకర్షణ. జిల్లా వ్యాప్తంగా వివిధ ప్రాంతాల నుంచి వచ్చిన ప్రజలు ఇక్కడ దీపాలను వెలిగిస్తారు. దీంతోపాటు విజయదశమకి నవరాత్రి ఉత్సవాలను కూడా ఆలయంలో ఘనంగా నిర్వహిస్తారు. రోజూ ఒక్కో రూపంలో అమ్మవారిని అలంకరిస్తారు. ప్రతి మంగళవారం, శుక్రవారం, ఆదివారం దేవాలయంలో ప్రత్యేక పూజలు నిర్వహిస్తారు. అన్నదాన కార్యక్రమం జరుగుతుంది.
దేవాలయాలనికి వెళ్ళాలంటే..
జిల్లా కేంద్రమైన సంగారెడ్డికి ఎనిమిది కిలోమీటర్ల దూరంలో ఇస్మాయిల్‌ఖాన్‌పేట గ్రామం ఉంది. హైదారాబాద్‌ నుంచి గ్రామానికి మూడు రోడ్డు మార్గాలు ఉన్నాయి. హైదరాబాద్‌ నుంచి పటాన్‌చెరు, సంగారెడ్డి మీదుగా 58 కి.మీ. దూరం ఉంటుంది. హైదరాబాద్‌ నుంచి పటాన్‌చెరు, గణేష్‌గడ్డ మీదుగా దేవాలయానికి 50 కి.మీ. దూరం ప్రయాణించాల్సి ఉంటుంది. హైదరాబాద్‌ నుంచి నర్సాపూర్‌ మీదుగా ఇస్మాయిల్‌ఖాన్‌పేట వరకు 58 కి.మీ. దూరం ఉంటుంది.


ఝరాసంఘం కేతకీ ఆలయం
హైదరాబాద్‌ నుంచి 120 కిలోమీటర్ల దూరం. జహీరాబాద్‌ నుంచి 16 కిలో మీటర్ల దూరంలో మండల కేంద్రంలో కేతకీ సంగమేశ్వరాలయం ఉంది. జిల్లాలో పురాతన శైవక్షేత్రమిది. దక్షిణ కాశీగా ఖ్యాతికెక్కింది. ఆలయాన్ని ఆనుకుని పెద్ద గుండం ఉండటం ఇక్కడ ప్రత్యేకత. కాశీ నుంచి ఒక ఝరా(జలం) ఇక్కడి ఆలయంలోని అమృత గుండంలో కలుస్తుందని ప్రతీతి. అందువల్ల ఈ గుండంలో పుణ్యస్నానం చేస్తే మంచి జరుగుతుందని భక్తుల విశ్వాసం. ఈ ఆలయంలో నిత్య పూజలతో పాటు సోమ, శుక్రవారాలు, ప్రతి అమావాస్య, పౌర్ణమి రోజుల్లో, తొలి ఏకాదశి, శ్రావణ మాసాల్లో ప్రత్యేక పూజా కార్యక్రమాలు ఉంటాయి. ఏటా మహశివరాత్రి సందర్భంగా పెద్దఎత్తున ఉత్సవాలు నిర్వహిస్తారు. జిల్లా వాసులేకాక, జంట నగరాల నుంచి పొరుగున్న ఉన్న కర్ణాటక, మహారాష్ట్రాల నుంచి కూడా భక్తులు పెద్దసంఖ్యలో ఇక్కడికి వస్తారు. ఆలయ ప్రాంగణంలో భక్తులకు వసతి సదుపాయాలు ఉన్నాయి.

సుందరం... జైన మందిరం
ఈ ఆలయం హైదరాబాద్‌ నుంచి 85 కిలోమీటర్ల దూరం, మెదక్‌ నుంచి 15 కిలో మీటర్ల దూరంలో మండల కేంద్రమైన కొల్చారంలో ఉంది. ఇక్కడి జైన మందిరంలో 23వ జైనమత తీర్థంకరుడు పార్వ్శీనాథుడి ఏకశిలా విగ్రహం కొలువైఉంది. 1984లో కొల్చారంలోనే జరిపిన తవ్వకాల్లో విగ్రహం బయటపడగా ఆలిండియా జైన్‌ దిగంబర్‌ మహాసభ ఆధ్వర్యంలో సుమారు కోటి రూపాయలు వెచ్చించి 2002లో ఇక్కడే సుందరమైన ఆలయం నిర్మించి విగ్రహాన్ని ప్రతిష్ఠించారు. హైదరాబాద్‌ నుంచే కాక దేశంలోని వివిధ రాష్ట్రాల నుంచి జైనులు ఎక్కువగా ఈ ఆలయ సందర్శనకు వస్తారు. ఈ ఆలయంలో నిత్య పూజలు ఉంటాయి. జైన దిగంబర స్వాములు వచ్చినపుడు కొల్చారం జైన మందిరంలో ప్రత్యేక ఉత్సవాలు నిర్వహిస్తారు. దూర ప్రాంతాల నుంచి వచ్చే భక్తులు, సందర్శకుల కోసం ఆలయ ప్రాంగణంలోనే వసతి సదుపాయాలు ఉన్నాయి.

చదువుల తల్లి కోవెల... వర్గల్‌ విద్యాధరి
మండల కేంద్రమైన వర్గల్‌లో విద్యాధరి క్షేత్రం ఉంది.సికింద్రాబాద్‌ నుంచి 40 కిలోమీటర్ల దూరంలో, గజ్వేల్‌ నుంచి 10 కిలో మీటర్ల దూరం, రాజీవ్‌ రహదారి నుంచి ఐదు కిలోమీటర్ల దూరం ఉంటుంది. రాజీవ్‌ రహదారికి సమీపంలో ఉన్న ఇక్కడికి గజ్వేల్‌ నుంచి నేరుగా బస్సు సదుపాయం ఉంది. హైదరాబాద్‌, సిద్దిపేట వైపునుంచి వచ్చే వారు గౌరారం స్టేజీ వద్ద బస్సుదిగి ఆటోలో ఆలయానికి చేరుకోవచ్చు. చదువుల తల్లి సరస్వతి కొలువై ఉన్న ఈ ఆలయం జిల్లాలో ప్రసిద్ధ పుణ్యక్షేత్రం. ఎత్త్తెన కొండపై వెలసిన ఈ ఆలయం ప్రముఖ పుణ్యక్షేత్రంగా వెలుగొందుతోంది. జిల్లా వాసులే కాక పొరుగు జిల్లాల నుంచి ముఖ్యంగా జంట నగరాల నుంచి భక్తులు ఇక్కడికి ఎక్కువగా వస్తారు. యాత్రికులు బస చేసేందుకు ఆలయ ప్రాంగణంలో సత్రాలు ఉన్నాయి.
వర్గల్‌ విద్యాధరి క్షేత్రంలో ప్రతిఏటా సరస్వతి జన్మదినమైన వసంత పంచమి రోజు విశేష కార్యక్రమాలు.
దసరా సందర్భంగా నవరాత్రి ఉత్సవాలు జరుగుతాయి.
ప్రతి శని త్రయోధశికి ప్రత్యేక తైలాభిషేకాలు, శని పూజలు ఉంటాయి.

నాచగిరి నృసింహాలయం

ఈ దేవాలయం గజ్వేల్‌ నుంచి 18 కిలో మీటర్లు. 44వ జాతీయ రహదారిపై ఉన్న తూప్రాన్‌ నుంచి ఆరు కిలోమీటర్ల దూరం ఉంటుంది. ఇక్కడ లక్ష్మీనృసింహస్వామి కొలువై ఉన్నాడు. ఇక్కడ నిత్యం కుంకుమార్చన, అభిషేకం, వాహన పూజలు, శాశ్వత కల్యాణం, సత్యనారాయణ వ్రతాలు నిర్వహిస్తారు. ఏడాదికోసారి బ్రహ్మోత్సవాలు స్వామివారి అధ్యయనోత్సవాలువైభవంగా జరుగుతాయి.

రేణుకా ఎల్లమ్మ దేవాలయం
సిద్దిపేట పట్టణ శివారులోని సిరిసిల్ల మార్గంలో ఈ ఆలయం ఉంది. ఈ మందిరంలో ఎల్లమ్మదేవి కొలువై ఉంది. సహజంగా అన్ని ఎల్లమ్మ దేవాలయాల వద్ద జంతువులను బలిఇవ్వడం ఆనవాయితీ కాగా ఇక్కడ జంతు బలి పూర్తిగా నిషేధం. ఈ ఆలయంలో శాక్తేయ పద్ధతిలో పూజలు నిర్వహిస్తారు. ప్రతిఏటా మార్చిలో ఆలయ వార్షికోత్సవాలు, ఏటా దసరా సందర్భంగా నవరాత్రి ఉత్సవాలు వైభవంగా నిర్వహిస్తారు. ప్రతి మంగళ, శుక్రవారాల్లో భక్తుల చేతుల మీదుగా పంచామృత అభిషేక పూజలు ఉంటాయి.

కోటి లింగాల ఆలయం
సిద్దిపేట పట్టణ శివారులో మెదక్‌ మార్గంలో ఈ ఆలయం ఉంది. ఇక్కడ ఆలయ గర్భంలో కోటి లింగాలను ప్రతిష్టించారు. ప్రతిఏటా మహాశివరాత్రికి, ఆలయ వార్షికోత్సవం సందర్భంగా ప్రత్యేక ఉత్సవాలు జరుగుతాయి. రుద్రాభిషేక పూజలు ఇక్కడ ప్రత్యేకం

అనంతసాగర్‌ సరస్వతి క్షేత్రం
చిన్నకోడూర్‌ మండలం అనంతసాగర్‌ గ్రామంలో ఈ ఆలయం ఉంది. హైదరాబాద్‌ నుంచి 120 కిలోమీటర్లు, సిద్దిపేట పట్టణం నుంచి 20 కిలోమీటర్లు, రాజీవ్‌ రహదారిపై ఉన్న శనిగరం స్టేజీ నుంచి రెండు కిలోమీటర్ల దూరం ఉంటుంది. చుట్టూ ఎత్త్తెన గుట్టల మధ్య చదువుల తల్లి సరస్వతి మాత కొలువై ఉంది. వీణధారి అయిన సరస్వతీ మాత నిల్చుండి ఉన్న విగ్రహం ఇక్కడి ప్రత్యేకత. నిత్యం అభిషేకం, అర్చన, కుంకుమార్చన, అక్షరాభ్యాస కార్యక్రమాలు ఉంటాయి. ఏటా వసంతి పంచమి సందర్భంగా మూడు రోజుల పాటు ఉత్సవాలు నిర్వహిస్తారు. భక్తులకు ఆలయ ప్రాంగణంలో వసతి సదుపాయాలున్నాయి.

బొంతపల్లి.. వీరభద్రుడి ఆలయం
హైదరాబాద్‌-మెదక్‌ ప్రధాన మార్గంలో బొంతపల్లి కమాన్‌ నుంచి మూడు కిలోమీటర్ల దూరంలో జిన్నారం మండలం బొంతపల్లిలో ఈ ఆలయం ఉంది. హైదరాబాద్‌ నుంచి 40, బాలనగర్‌ నుంచి 25, నర్సాపూర్‌ నుంచి 18 కిలోమీటర్ల దూరంలో ఉంది. ఇక్కడ వీరభద్రస్వామి కొలువై ఉన్నాడు. ఈ మందిరంలో అద్దాల మండపం ఉండటం ప్రత్యేకం. ఇక్కడ నిత్యం అభిషేకం, అర్చనలు ఉంటాయి. ఏటా శ్రావణ, కార్తీక మాసాల్లో ప్రత్యేక పూజలు, ఏడాదికోసారి బ్రహోత్సవాలు తొమ్మిది రోజుల పాటు అత్యంత వైభవంగా నిర్వహిస్తారు. ఈ సందర్భంగా కల్యాణోత్సవం, రథోత్సవం అంగరంగవైభవంగా జరుగుతాయి.

చిట్కుల్‌ చాముండేశ్వరి
మెదక్‌-సంగారెడ్డి మార్గంలో కౌడిపల్లి మండలం చిట్కుల్‌ గ్రామం వద్ద మంజీరా నది ఒడ్డున ఈ ఆలయం వెలసింది. ఇక్కడ శక్తి స్వరూపిని అయిన చాముండేశ్వరీమాత కొలువై ఉంది. ఇటీవలే సుందరమైన ఆలయాన్ని నిర్మించారు. ఆలయంలో నిత్యం కుంకుమార్చన, అభిషేకం, వాహన పూజలు నిర్వహిస్తారు. చాముండేశ్వరి ఆలయం వద్ద ఏటా మాఘ అమావాస్య, జనవరిలో ఆలయ వార్షికోత్సవం సందర్భంగా పెద్దఎత్తున జాతర జరుగుతుంది. ఈ ఆలయం వద్ద ఏడాది పొడుగునా నిత్యాన్నదాన కార్యక్రమం కొనసాగుతుండటం విశేషం. భక్తులకు వసతి సదుపాయాలున్నాయి.

బీరంగూడ
65 నెంబరు జాతీయ రహదారిపై పటాన్‌చెరు మండలం బీరంగూడ గ్రామంలో ఈ ఆలయం వెలిసింది. ఇక్కడ మల్లికార్జునస్వామి కొలువై ఉన్నాడు. దినదినాభివృద్ధి చెందుతున్న ఈ ఆలయంలో నిత్యపూజలతో పాటు ఏలా మహాశివరాత్రి సందర్భంగా, కార్తిక మాసంలో ప్రత్యేక ఉత్సవాలు నిర్వహిస్తుంటారు. జిల్లా వాసులే కాకుండా హైదరాబాద్‌ జంట నగరాలకు చెందిన భక్తులు ఆలయ సందర్శనానికి వస్తుంటారు. ఆలయం చేరుకునేందుకు పటాన్‌చెరు, హైదరాబాద్‌ నుంచి బస్సు సదుపాయం ఉంది. ఆలయ సమీపంలో వసతి సదుపాయాలు కూడా ఉన్నాయి.

పర్యాటక ప్రదేశాలు :
 హ్లాదాన్ని... ఆనందాన్ని... పంచే సుందర ప్రదేశాలు... జాలువారే జలపాతాలు... మరచిపోలేని మదురానుభూతులను పంచే ప్రకృతి అందాలు... సుందర ప్రదేశాలు... వన్యప్రాణులతో అలరారే అభయారణ్యాలు... గత చరిత్రను తెలియజెప్పే చారిత్రక కట్టడాలు... మెదక్‌ జిల్లాలో ఉన్నాయి. నేటి పోటీ ప్రపంచంలో యాంత్రిక జీవనం సాగిస్తూ విశ్రాంతి లేకుండా జీవనం సాగిస్తున్న వారికి మానసిక ప్రశాంతతను కలిగించేందుకు సహజ ప్రకృతి అందాలు స్వాగతం పలుకుతున్నాయి.

 సహజ ప్రకృతి అందాల సమహారం ఏడుపాయల

పుణ్యక్షేత్రంగానే కాక ప్రముఖ పర్యాటక కేంద్రంగా భాసిల్లుతోంది ఏడుపాయల. మెదక్‌ పట్టణానికి 20 కిలోమీటర్ల దూరంలో పాపన్నపేట, కొల్చారం మండలాల సరిహద్దులో ఉన్న ఏడుపాయల ప్రాంతం సహజసిద్ధమైన ప్రకృతి అందాలతో అలరారుతుంది.గలగల పారే మంజీరా నదిపాయలు, నిండుగా నీటితో కళకళలాడే ఘనపూర్‌ ఆనకట్ట, ఎత్త్తెన రాళ్లగుట్టలు, అబ్బుర పరిచే శిలాకృతులతో... చుట్టూరా కొండలతో ఈ ప్రాంతం ఎంతో ఆహ్లాదకరంగా ఉంటుంది. ఎండాకాలం మినహా మిగతా సమయాల్లో పచ్చదనంతో కళకళలాడుతూ... నదీ పాయల పరవళ్లతో ఏడుపాయల సందర్శకులకు మరచిపోలేని మదురానుభూతులను మిగుల్చుతుంది.


కట్టిపడేసే చర్చి, గోల్‌బంగ్లా
మెదక్‌ పట్టణంలోని సుప్రసిద్ధ చర్చి అతిసుందరమైన కట్టడం. పర్యాటకులు తప్పనిసరిగా సందర్శించదగ్గ ప్రదేశం. అత్యద్భుతమైన నిర్మాణ శైలి. ఆశ్చర్యం గొలిపే అద్దాల కిటికీలు. విఖ్యాత మెదక్‌ చర్చిని సందర్శిస్తే కనిపించే దృశ్యాలివి. ఆసియా ఖండంలో ఉన్నతమైనదిగా గుర్తింపుపొందిన ఈ కెథడ్రల్‌ చర్చి యూరఫ్‌ గోతిక్‌ శైలిలో నిర్మితమైంది. ఇటలీ దేశస్తులతో పాటు, భారత దేశంలోని వివిధ ప్రాంతాలకు చెందిన నిర్మాణరంగ నిపుణులు, కళాకారులు చర్చి నిర్మాణం పనుల్లో పాలుపంచుకొన్నారు. 200 అడుగుల పొడవు... 100 అడుగుల వెడల్పుతో రూపుదిద్దుకొన్న ఈ మహాదేవాలయానికి 175 అడుగుల ఎత్తున్న శిఖరం (టవర్‌) ప్రత్యేక ఆకర్షణ. పూర్తిగా రాళ్లు, డంగుసున్నం వినియోగించి 10 సంవత్సరాలపాటు నిర్మించిన చర్చిలో అడుగడుగునా కళాత్మక నైపుణ్యం కొట్టొచ్చినట్టు కనిపిస్తుంది. పిల్లర్లు, బీములు లేకుండా రెండు అంతస్థులతో విశాలమైన ప్రార్థనా మందిరాన్ని, ఎత్త్తెన శిఖరాన్ని నిర్మించడం, ప్రార్థనా మందిరం పైకప్పును ఎంతో ఆకర్షణీయంగా తీర్చిదిద్దడం ఆనాటి నిర్మాణ నిపుణుల పనితనానికి నిదర్శనం. చర్చిలోపలి భాగంలో నేలపై ఇంగ్లాండు నుంచి తెప్పించిన రంగురంగుల టైల్స్‌లో ఆకర్షణీయంగా తీర్చిదిద్దారు. శబ్దం ప్రతిధ్వనించకుండా నిర్మాణంలో తగు జాగ్రత్తలు తీసుకొన్నారు. చర్చిలో రంగురంగుల స్టెయిన్‌ గ్లాసు ముక్కలతో రూపొందించిన కిటికీలు క్రీస్తు జన్మవృత్తాంతాన్ని కన్నులకు కడతాయి. ఇంగ్లాండ్‌ చిత్రకారుడు ఫ్రాంక్‌.ఓ.సాలిస్‌ బరి ఎంతో సృజనాత్మక నైపుణ్యంతో కళాత్మకంగా వీటిని రూపొందించారు. దేవదారు కర్రతో పక్షిరాజు ఆకారంలో రూపొందించిన బైబిల్‌ పఠన వేదిక, బాత్‌ స్టోన్‌తో తయారుచేసిన ప్రసంగ వేదిక, ఇటాలియన్‌ స్టోన్‌తో నిర్మించిన వేదిక ఫ్లోరింగ్‌, రంగూన్‌ టేకు కలపతో తయరుచేసిన ఫర్నీచర్‌, గులాబి కర్రతో రూపొందించిన కుర్చీలు, వెలుగులు విరజిమ్మే షాండ్లియర్‌లు ఇలా చర్చిలో ప్రతీదీ ప్రత్యేకమే. అన్నీ ఆకట్టుకొనేవే. చర్చి శిఖరం పైభాగాన వేలాడదీసిన శిలువ రాత్రివేళ లైట్ల కాంతితో ధగధగలాడుతుంది. ఐదు వేల మంది భక్తులు ఒకే సారి దైవారాధనకు కూర్చునే వసతి ఈ మందిరంలో ఉండటం విశేషం. మెదక్‌ చర్చి అందాలను చూసి తీరాల్సిందే. చర్చి సమీపంలోనే ప్యాలెస్‌ను తలపించే 'గోల్‌బంగ్లా' ఉంది. ఇంగ్లాండ్‌లోని ట్రినిటీ ప్యాలెస్‌ తరహాలో నిర్మితమైన ఈ బంగ్లా చూపరులను ఎంతగానో ఆకట్టుకొంటుంది. ఈ బంగ్లాలో పలు సినిమా షూటింగ్‌లు జరిగాయి. * హైదరాబాద్‌ నుంచి మెదక్‌ పట్టణానికి 100 కిలోమీటర్ల దూరం.



చరిత్రచెప్పే 'ఖిల్లా'
మెదక్‌ పట్టణంలో పడమర దిక్కున సహజసిద్ధంగా ఏర్పడిన ఎత్త్తెన గుట్టపై ఉన్న పురాతన కోట (ఖిల్లా) దర్శనీయ స్థలం. కాకతీయ సామ్రాజ్య చివరి పాలకుడైన రెండవ ప్రతాపరుద్రుడు ఈ కోటను నిర్మించినట్టు చరిత్ర చెబుతోంది. రాజ్యపాలనా వ్యవహారాల కోసం కాకుండా రక్షణ అవసరాల దృష్ట్యా ఈ కోటను నిర్మించి... దీనిని సైనిక దుర్గంగా వినియోగించినట్టు కోట నిర్మాణ తీరుతెన్నులను బట్టి తెలుస్తుంది. పూర్తిగా కోట పైభాగానికి చేరుకోవాలంటే మొత్తం ఏడు ద్వారాలు దాటుకొని వెళ్లాల్సి ఉంటుంది. కోట చివరన ఉన్న మజీదుపై కులీకుతుబ్‌షాహీలకు సంబంధించిన చిహ్నాలు ఉన్నాయి. సందర్శన కేంద్రంగా ఉన్న మెదక్‌ ఖిల్లాను వినోద, విహార కేంద్రంగా తీర్చిదిద్దే ప్రయత్నం జరుగుతోంది.



వన్యప్రాణులకు ఆలవాలం... పోచారం
మెదక్‌ మండలంలో చివరన నిజామాబాద్‌ జిల్లా సరిహద్దులో పోచారం వన్యప్రాణి అభయారణ్యం ఉంది. కృష్ణ జింకలు, నీల్‌గాయ్‌లు, సాంబార్‌లు, కొండగొర్రెలు. నెమళ్లు తదితర వన్యప్రాణులు అనేక రకాల పక్షులు ఇక్కడ ఉన్నాయి. ప్రతిఏటా వేసవి ముందర రాజస్థాన్‌ నుంచి రాజహంసలు (ఫ్లెమింగో)లు ఇక్కడికి వలస వస్తాయి. పోచారం అభయారణ్యంలో సందర్శకులు సేదతీరేందుకు ఆహ్లాదకరమైన పార్కు కూడా ఉంది. అభయారణ్యాన్ని ఆనుకొనే పోచారం ప్రాజెక్ట్‌ ఉండటం వల్ల ఈ ప్రాంతం పిక్నిక్‌ స్పాట్‌గా మారింది. మెదక్‌, నిజామాబాద్‌ జిల్లాల నుంచి ఆదివారాలు, ఇతర సెలవు దినాల్లో అనేక మంది పోచారం అభయారణ్యం, ప్రాజెక్ట్‌ సందర్శనకు వస్తారు. అభయారణ్యం అందాలను, వన్యప్రాణులను తిలకించేందుకు వీలుగా వాచ్‌ టవర్‌లను నిర్మిస్తున్నారు. హైదరాబాద్‌-మెదక్‌-బోధన్‌ మార్గంలో ఉన్న పోచారం అభయారణ్యానికి వెళ్లేందుకు హైదరాబాద్‌, మెదక్‌ నుంచి నేరుగా బస్సు సదుపాయం ఉంది. ఎల్లారెడ్డి, బాన్సువాడ, బోధన్‌ వెళ్లే బస్సుల్లో ఎక్కి అభయారణ్యం వద్దే దిగొచ్చు. హైదరాబాద్‌ నుంచి 116 మెదక్‌ నుంచి 16 కిలోమీటర్ల దూరం ఉంటుంది.


మంజీరా అభయారణ్యం... మొసళ్ల ప్రత్యేకం
సంగారెడ్డి సమీపంలోని మంజీరా బ్యారేజి వద్ద మంజీరా వన్యప్రాణి అభయారణ్యం ఉంది. ఇక్కడ మంచినీటి మొసళ్ల ప్రత్యుత్పత్తి కేంద్రం ఉంది. వలస పక్షుల విడిది కేంద్రంగా ఈ అభయారణ్యం భాసిల్లుతోంది. రష్యా, నైజీరియా తదితర దేశాలకు చెందిన పలు రకాల పక్షులు ప్రత్యుత్పత్తి కోసం ఈ అభయారణ్యానికి ఏటా వలస వస్తాయి. మంజీరా నదిలోని ద్వీపాలలో ఉన్న చెట్లపై ఆవాసం ఏర్పాటు చేసుకొని నెల్లాళ్లపాటు ఇక్కడే ఉండి మళ్లీ తమ స్వస్థలాలకు తిరిగి వెళ్తాయి.


పరవశింపజేసే ప్రాజెక్ట్‌ అందాలు
మెతుకు సీమ వరప్రదాయని అయిన మంజీరా నదిపై జిల్లా కేంద్రమైన సంగారెడ్డికి సమీపంలో నిర్మితమైన సింగూర్‌ ప్రాజెక్ట్‌, మంజీరా బ్యారేజ్‌లు సందర్శన కేంద్రాలుగా విరాజిల్లుతున్నాయి. సింగూర్‌ ప్రాజెక్ట్‌ వద్ద విద్యుదుత్పత్తి కేంద్రం కూడా ఉంది. రాష్ట్ర రాజధాని హైదరాబాద్‌కు సింగూర్‌ ప్రాజెక్ట్‌ 91 కిలో మీటర్ల దూరం.


కొండాపూర్‌ మ్యూజియం
జిల్లా కేంద్రమైన సంగారెడ్డికి 20 కిలోమీటర్ల దూరంలో మండల కేంద్రమైన కొండాపూర్‌లో పురాతన మ్యూజియం ఉంది. ఇక్కడికి హైదరాబాద్‌ నుంచి 75 కిలోమీటర్ల దూరం. ఈ మ్యూజియంలో పురాతన కాలం నాటి మట్టి పాత్రలు, రకరకాల పరికరాలు, రాగి నాణాలు, మాతృదేవత ప్రతిమ, బౌద్ధస్థూపం ఉన్నాయి.


జడీమల్కాపూర్‌ జలపాతం
జహీరాబాద్‌ పట్టణానికి 30 కిలోమీటర్ల దూరంలో ఉన్న జడీమల్కాపూర్‌ శివారులో ఉన్న జలపాతాలు సందర్శకులను ఎంతగానో ఆకట్టుకొంటాయి. వంకలు తిరిగి ప్రవహించే వాగు... పలుచోట్ల పెద్దపెద్ద బండరాళ్ల పైనుంచి జాలువారుతూ జలపాతాన్ని తలపించే నీటి అందాలు కనువిందు చేస్తాయి.


పరవశింపజేసే గొట్టంగుట్ట అందాలు
జహీరాబాద్‌కు 25 కిలోమీటర్ల దూరంలో గొట్టంగుట్ట ప్రాంతం ఉంది. సువిశాలమైన అటవీప్రాంతం, చుట్టూరా ఎత్త్తెన కొండలు, దట్టమైన చెట్లు, కొండల మధ్యలో నుంచి వంకలు తిరుగుతూ ప్రవహించే పెద్ద వాగు, పురాతన దేవాలయం ఉండటంతో ఈ ప్రాంతం ఆహ్లాదకరంగా ఉంది. ఆంధ్రప్రదేశ్‌-కర్ణాటక రాష్ట్రాల సరిహద్దులో ఉన్న ఈ ప్రాంతం ప్రకృతి ఒడిలో సేదతీరాలనుకొనే వారికి ఎంతో అనువైనది. ఇక్కడి సహజసిద్ధమైన ప్రకృతి అందాలు, కనుచూపు మేర వంకలు తిరుగుతూ వయ్యారంగా సాగిపోయే వాగు హోయలు పర్యాటకుల మదినిదోచుకొంటాయి. మనసుల్లో చెరగని ముద్రవేస్తాయి.
 
 

No comments:

Post a Comment