అంతర్జాలంలోని అన్నిరకాల ముఖ్యమైన సమాచారాన్ని ఈ సైట్ లో నిక్షిప్తం చేసి, అందరికీ ఉపయోగపడే ఒక వేదికగా ఈ సైట్ ఉండాలనే ఉద్దేశ్యంతో ప్రారంభించడమైంది. ఏ సైట్ నుండి సమాచారం తీసుకున్నా వారి పేరుతోనే ఇందులో వుంచుతాను. సహృదయంతో సహకరించగలరు.
ఎవరికైనా అభ్యంతరముంటే వారి సైటుకు సంబంధించిన సమాచారం తొలగించడం జరుగుతుంది. - ధన్యవాదములతో...

Monday, April 23, 2012

వ్యవసాయం

నీటిపారుదల :

వ్యవసాయరంగ ప్రాధాన్యతను సంతరించుకొన్న జిల్లా మెదక్‌. మంజీరా నది ద్వారా కొన్ని ప్రాంతాలకు సాగునీరు అందుతోంది. మెజారిటీ రైతులు వర్షంపై ఆధారపడే వ్యవసాయం చేస్తున్నారు. బోర్ల ఆధారంగా ఎక్కువ విస్తీర్ణంలో పంటలు సాగవుతున్నాయి.
జిల్లాలో వ్యవసాయ రంగ పరిస్థితులు విభిన్నంగా ఉంటాయి. 96 కిలోమీటర్ల మేర మంజీర నది ప్రవహిస్తున్నా, పలు ప్రాజెక్ట్‌లు ఉన్నా వాటి ద్వారా సాగవుతున్న భూవిస్తీర్ణం తక్కువే. మంజీరా నదిపై నిర్మించిన ఘనపూర్‌ ప్రాజెక్ట్‌ కింద స్థిరీకరించిన ఆయకట్టు 21,625 ఎకరాలు కాగా ప్రస్తుతం గరిష్టంగా 15 వేల ఎకరాలు మాత్రమే సాగవుతోంది. సింగూర్‌ ప్రాజెక్ట్‌ ద్వారా 40 వేల ఎకరాలకు సాగునీరు అందించేందుకు రూ.100 కోట్ల అంచనా వ్యయంతో ప్రస్తుతం కాలువల నిర్మాణం పనులు కొనసాగుతున్నాయి.
మంజీరా నదిపై కౌడిపల్లి, కొల్చారం, పాపన్నపేట, టేక్మాలు మండలాల పరిధిలో పలు ఎత్తిపోత పథకాలు నిర్మితమయ్యాయి. కాని నిర్వహణలోపం కారణంగా నదిలో నీరున్నప్పటికి పాపన్నపేట మండల పరిధిలోని చాలా ఎత్తిపోత పథకాలు వృథాగా మారాయి.
జిల్లా వ్యాప్తంగా నీటి పారుదలశాఖ పరిధిలో 582 చెరువులు ఉండగా వాటికింద 1.31 లక్షల ఎకరాల ఆయకట్టు... 5,319 కుంటలు ఉండగా వాటికింద 95 వేల ఎకరాల ఆయకట్టు ఉంది. కాగా ఏటా వర్షాభావ పరిస్థితులు ఎదురవుతుండటం... చాలా మండలాల్లో అత్యల్ప వర్షాపాతం నమోదవుతుండటంతో చెరువులు, కుంటలు నిండక వేలాది ఎకరాల భూములు సాగుకు నోచడంలేదు. ముఖ్యంగా మెదక్‌, సిద్దిపేట, నారాయణఖేడ్‌ ప్రాంతాల్లో వర్షపాతం అత్యల్పంగా ఉంటోంది. పర్యవసానంగా చెరువులు, కుంటల కింది ఆయకట్టు సింహభాగం బోర్ల ద్వారానే సాగవుతోంది.
హల్దీవాగుపై వెల్దుర్తి మండలం హకీంపేట వద్ద నిర్మించిన హల్దీప్రాజెక్ట్‌ ద్వారా 2,900 ఎకరాలకు సాగునీరందించాల్సి ఉండగా కాలువల నిర్మాణ లోపాల వల్ల వర్షాలు కురిసి ప్రాజెక్ట్‌ పూర్తిగా నిండి పొంగిపొర్లినా 400 ఎకరాలకు మించి సాగుకావడంలేదు.
కల్హేర్‌ మండల పరిధిలోని నల్లవాగు ప్రాజెక్ట్‌ కింద 6,030 ఎకరాల ఆయకట్టు ఉంది. అయితే కాల్వలకు సిమెంట్‌ లైనింగ్‌ లేక నిర్దేశిత ఆయకట్టుకు పూర్తిస్థాయిలో నీరందడంలేదు.

జిల్లాలో ప్రధాన పంట వరి. ఆ తరువాత ఎక్కువ విస్తీర్ణంలో చెరకు సాగవుతుంది. పెద్ద చక్కెర కర్మాగారాలు ఉన్న మెదక్‌, సంగారెడ్డి, జహీరాబాద్‌ ప్రాంతాల్లో చెరకు పంట ఎక్కువగా సాగవుతుంది. నారాయణఖేడ్‌, జహీరాబాద్‌ ప్రాంతాల్లో వాణిజ్య, మెట్ట పంటలు... సిద్దిపేట, మెదక్‌ డివిజన్‌ల పరిదిలో మొక్కజొన్న, గజ్వేల్‌, జగదేవ్‌పూర్‌, కొండపాక, చిన్నకోడూరు తదితర మండలాల్లో పత్తిపంట సాగుచేస్తారు. తొగుట, కొండపాక, చేగుంట, జిన్నారం, నర్సాపూర్‌, ములుగు, గజ్వేల్‌ మండలాల్లో కూరగాయల పంటలు ఎక్కువగా సాగవుతాయి.
వర్షాభావ పరిస్థితులు, భూగర్భజలాలు అడుగంటిపోతున్న పరిస్థితులను దృష్టిలో ఉంచుకొని రైతులు తక్కువ నీటితో ఎక్కువ విస్తీర్ణంలో పంటలు సాగుచేసే బిందు, తుంపర సేధ్య విధానాలపట్ల ఆసక్తి కనబరుస్తున్నారు. ప్రభుత్వం రాయితీ ఇచ్చి ప్రోత్సహిస్తుండటంతో చెరకుపంటతోపాటు, కూరగాయతోటలు, పండ్లతోటలు, మల్బరీ సాగుచేసే రైతులు సూక్ష్మసేద్య పరికరాలు అమర్చుకొని పంటలు సాగుచేస్తున్నారు. జిల్లా వ్యాప్తంగా వివిధ మండలాల పరిధిలో దాదాపు 40 వేల మంది రైతులు సుమారు 28 వేల హెక్టార్లలో బిందు సేద్య, సుమారు 20 వేల మంది రైతులు దాదాపు 17 వేల హెక్టార్ల విస్తీర్ణంలో తుంపర సేద్య పరికరాలు అమర్చుకొని వివిధ రకాల పంటలు పండిస్తున్నారు.

ప్రధాన పంటలు :
 జిల్లాలో ప్రజల ప్రధాన వృత్తి వ్యవసాయం. జీవనదులు లేవు. వర్షాకాలంలో ప్రవహించే నదులు, బోర్లు, చెరువులు, స్వల్పంగా ఉన్న ప్రాజెక్టులతోపాటు, వర్షాధారంపై ఆధారపడి ప్రధానంగా వ్యవసాయం చేస్తున్నారు. జిల్లాలో పశ్చిమ, దక్షిణ ప్రాంతాలలో మెట్ట వ్యవసాయం ఎక్కువ. రాష్ట్ర రాజధాని నగరం పక్కనే ఉండటంతో కూరగాయల సాగు అధికంగా చేస్తూ హైదరాబాద్‌కు ఎగుమతి చేస్తున్నారు. వీటిని పందిరి, షెడ్‌నెట్‌, గ్రీన్‌హౌస్‌ల విధానంలో సాగుచేస్తున్నారు. అంతర్జాతీయ స్థాయిలో మెట్ట పంటల పరిశోధన కేంద్రం(ఇక్రిశాట్‌) జిల్లాలోని పటాన్‌చెరు మండలంలో ఉంది. పాల ఉత్పత్తి అధికం. డెయిరీలతోపాటు, జంటనగరాలకు సరఫరా చేస్తుంటారు.
వరి, మొక్కజొన్న, పత్తి, చెరకు, ప్రధానపంటలుగా సాగు చేస్తారు. ఉద్యాన పంటలైన కూరగాయలు, మామిడి, కొంత మేర అరటి, ద్రాక్ష పంటల సాగు ఎక్కువగా ఉంది. అధిక మొత్తంలో శనగ, మినుము, పెసర, కంది తదితర పప్పు దినుసులతో పాటు వాణిజ్య పంటలైన అల్లం, పసుపు, ఉల్లిని కొంతమేర సాగుచేస్తారు. రాష్ట్రంలో ఎక్కడా లేనంతగా బంగాళదుంప(ఆలు) సాగవుతుంది. గజ్వేల్‌ పత్తి, సిద్దిపేట ధాన్యం, పత్తి మార్కెట్‌ యార్డులలో భారీగా కొనుగోళ్లు జరుగుతాయి. మెదక్‌ జిల్లాలో 4.72 లక్షల హెక్టార్లలో సాగుకు అనుకూలమైన భూములున్నాయి. ఇందులో ఏటా 4.20 లక్షల హెక్టార్లలో వివిధ పంటలను రైతులు సాగుచేస్తున్నారు.
ఖరీఫ్‌లో 4 లక్షల హెక్టార్లు, రబీలో 1.85 హెక్టార్ల విస్తీర్ణంలో పంటలు సాగవుతున్నాయి.
ప్రధానపంటలు: జిల్లాలో వరి, మొక్కజొన్న, పత్తి, చెరకు, కూరగాయలు, మామిడి, పప్పుధాన్యాలు.
జిల్లాలో 10.5 లక్షల ఎకరాల సాగు భూమి ఉంది. దీనిలో 5.5 లక్షల ఎకరాలు మాగాణి కాగా 5 లక్షల ఎకరాలు మెట్ట భూమి ఉంది. జీవనదులు లేని జిల్లాలో వరి ప్రధాన పంట. వివిధ పంటల సాగుతీరు ఇలా ఉంది..
వరి 2 లక్షల ఎకరాలు, మొక్కజొన్న 2.5 లక్షలు, పత్తి 1.95 లక్షలు, చెరకు 0.67 లక్షలు, శనిగ 1.0 లక్షలు, పెసర 1.25 లక్షల ఎకరాలు, కంది 0.75 లక్షలు, మినుము 0.55 లక్షలు, జొన్న 0.52 లక్షల ఎకరాలు, పొద్దుతిరుగుడు 0.33 లక్షల ఎకరాలు, కూరగాయలు 0.50వేల ఎకరాలు, వీటితోపాటు మామిడి, అరటి, ద్రాక్ష, అల్లం, ఉల్లి, ఎల్లిగడ్డ సాగుచేస్తారు. వ్యవసాయం
జిల్లా భౌగోళిక విస్తీర్ణం: 9,69,000 హెక్టార్లు
అటవీ విస్తీర్ణం: 96,000 హెక్టార్లు
సాగులో ఉన్న విస్తీర్ణం: 4,01,300 హెక్టార్లు
భీడు భూములు: 1,03,957 హెక్టార్లు
సాగుకు పనికిరాని భూముల విస్తీర్ణం: 20,168 హెక్టార్లు
మార్కెట్‌ యార్డులు: 7
మార్కెట్‌ కమిటీలు: 11

భూముల రకాలు
దుబ్బ భూములు: 55 శాతం
నల్లరేగడి నేలలు: 44 శాతం
ఎర్రచెల్క నేలలు: 1 శాతం

ప్రాజెక్టులు :

ఘనపురం ప్రాజెక్టు
1899లో నిజాం నవాబు హయాంలో ఘనపురం ప్రాజెక్టు నిర్మాణాన్ని ప్రారంభించి 1905లో పూర్తి చేశారు. 17,308 ఎకరాల ఆయకట్టు కేటాయించారు. ఆనకట్ట పూర్తిగా నిండితే 8.3 అడుగుల నీరు ఉంటుంది. రెండు కాల్వల ద్వారా ప్రస్తుతం 28 వేల నుంచి 40 వేల ఎకరాల ఆయకట్టుకు నీరు అందుతోంది.ప్రతీ ఏడాది సింగూరు ప్రాజెక్టు నుంచి ఘనపురం ప్రాజెక్టుకు 4.06 టీఎంసీల నీరు కేటాయిస్తారు.
మంజీరా ప్రాజెక్టు
జిల్లా కేంద్రం సంగారెడ్డికి 4 కిలోమీటర్ల దూరంలో గల కల్పగూరు వద్ద నిర్మించారు. 1.5 టీఎంసీల సామర్థ్యంతో నిర్మించిన ఈ ప్రాజెక్టు ద్వారా జంట నగరాలకు 1, 2 పైపులైన్‌ల ద్వారా తాగునీటిని అందిస్తున్నారు. కేవలం తాగునీటి కోసం నిర్మించిన మంజీరా ప్రాజెక్టుకు ప్రతీ ఏడాది సింగూరు ప్రాజెక్టు నుంచి 2.99 టీఎంసీలు విడుదల చేస్తారు.
సింగూరు ప్రాజెక్టు
పుల్కల్‌ మండలం సింగూరు గ్రామం వద్ద 29.91 టీఎంసీల సామర్థ్యంతో నిర్మించారు. 1976 సంవత్సరంలో రూ.29.25 కోట్లతో నిర్మాణాన్ని చేపట్టారు. కర్ణాటక ముఖ్యమంత్రి దేవరాజ్‌ శంకుస్థాపన చేశారు. 1980 నుంచి నీటి నిల్వను ఆరంభించారు. అప్పటి నుంచి జంట నగరాలకు తాగునీటితోపాటు నిజాంసాగర్‌, ఘనపురం ఆనకట్టలకు సాగుకు నీటిని విడుదల చేస్తున్నారు. రూ.8889 కోట్లు వరద కాల్వల నిర్మాణానికి మంజూరయ్యాయి. వీటి ద్వారా 60 కిలోమీటర్లు కాల్వ నిర్మించి 40 వేల ఎకరాల సేద్యానికి నీరు అందించాలి. పనులు ఐదేళ్లుగా కొనసాగుతున్నాయి.
నల్లవాగు ప్రాజెక్టు
కల్హేర్‌ మండలం నల్లవాగు వద్ద 1965 సంవత్సరంలో ప్రాజెక్టు నిర్మాణం చేపట్టారు. రూ.98 లక్షలతో చేపట్టిన ప్రాజెక్టు నిర్మాణం 1967 వరకు పూర్తి చేశారు. ప్రస్తుతం ప్రాజెక్టు కింద 5330 ఎకరాల ఆయకట్టు సాగవుతోంది. 2009-10లో రూ.14 కోట్లతో నల్లవాగు ప్రాజెక్టు వరద కాల్వలను ఆధునికీకరించారు.
ఉజలంపాడు ప్రాజెక్టు
నారాయణఖేడ్‌ మండలం చాప్టా గ్రామపంచాయతీ పరిధిలోని ఉజలంపాడు గ్రామశివారులోని వాగుపై 1977-78లో నిర్మాణాన్ని చేపట్టారు. 550 ఎకరాల ఆయకట్టుకు నీరందించే ప్రాజెక్టు నిర్మాణానికి రూ.1.10 కోట్లు అంచనా వేశారు. ఇప్పటివరకూ నిర్మాణం పూర్తి కాలేదు.
గట్టు లింగంపల్లి ప్రాజెక్టు
మనూరు మండలం గట్టులింగంపల్లి శివారులోని వాగుపై 1977-78లో ప్రాజెక్టు నిర్మాణం చేపట్టారు. 150 ఎకరాల ఆయకట్టుకు నీరందించే ప్రాజెక్టు నిర్మాణానికి రూ.65 లక్షలు అంచనా వేశారు. ఇప్పటివరకూ పనులు పూర్తి కాలేదు.
హల్దీ వాగు
వెల్దుర్తి మండలంలో మంజీరా నదికి ఉప నదిగా ప్రవహిస్తున్న హల్దీ వాగుకు నాచారం వద్ద ఆనకట్ట నిర్మాణానికి 1991 పరిశీలన జరిగింది. 1993-94లో అంచనాలు సిద్ధం చేశారు. రూ.19.90 లక్షల అంచనా వ్యయంతో నిర్మాణం చేస్తే నాచారంలో 90 ఎకరాలు, యావాపూర్‌లో 210 ఎకరాలు సాగయ్యేది. నేటికీ నిర్మాణం పూర్తి కాలేదు.
గంగకత్వ
సదాశివపేట మండలం ఆరూర్‌, సూరారం గ్రామ శివారులో నిజాం కాలంలో నిర్మించారు. రంగారెడ్డి జిల్లా నుంచి నీటి పరివాహక ప్రాంతం ఉంటుంది. 1500 ఎకరాల విస్తీర్ణం సాగు చేయడానికి మండలంలోని 10 చెరువులను నింపడానికి నిర్మించారు. కాల్వలకు మరమ్మతు, నిర్వహణ సక్రమంగా లేకపోవడంతో చెరువులు నిండటం లేదు.
నారింజ ప్రాజెక్టు
జహీరాబాద్‌ మండలం కొత్తూరు వద్ద 1964లో నిర్మించారు. 0.085 టీఎంసీల సామర్థ్యంతో నిర్మించిన దీని ద్వారా 3000 ఎకరాలు సాగు విస్తీర్ణంగా భావించారు. జహీరాబాద్‌, ఝరాసంగం, కోహీర్‌ మండలాల నుంచి వచ్చే నీటిని అడ్డంగా నిర్మించినా దీనిఎత్తును పెంచకపోవడంతో మిగులు నీరు కర్ణాటకకు తరలి పోతోంది.

నదులు :
 జిల్లాలో గోదావరి ఉప నదులైన మంజీరానది బీదర్‌ జిల్లా గుండా పయనిస్తూ ఈశాన్య దిక్కున నుంచి మెదక్‌ జిల్లాలోకి ప్రవేశించి నారాయణఖేడ్‌, జహీరాబాద్‌, సంగారెడ్డి, నర్సాపూర్‌ తాలూకాలలో 96 కి.మీ. ప్రయాణం చేస్తుంది. మంజీరాకు ఉపనది అయిన హల్ది నది లేదా పసుపులేరు గజ్వేల్‌ తాలుకాలో పుట్టి మెదక్‌, రామాయంపేట తాలుకాల మీదుగా ప్రవహించి మంజీరాలో కలుస్తుంది. ఇవి గాక గజ్వేల్‌, సిద్దిపేట తాలుకాలలో కడలేరు అనే చిన్న వాగు ప్రవహిస్తుంది. ప్రస్తుతం ఉన్న సాగునీటి దిగువ డ్యాములకు సహాయపడటంతో పాటు హైదరాబాద్‌, సికింద్రాబాద్‌ జంట నగరాలకు మంచినీరు సరఫరా చేయబడుతుంది.

మంజీరా నది
మహారాష్ట్రలో జన్మించి 4044 చ.మై., కర్ణాటకలో 1550 చ.మై., ఆంధ్రప్రదేశ్‌లో 621 చ.మై. పరివాహక ప్రాంతంలో విస్తరించి ఉంది. జిల్లాలోని మనూరు మండలం గౌడగాం జనవాడ వద్ద ప్రవేశిస్తుంది. 120 కిలోమీటర్ల పొడవునా ఎన్నో వంపులు తిరుగుతూ నిజామాబాద్‌ జిల్లా కందుకుర్తి వద్ద గోదావరిలో కలుస్తుంది. ఈ నదిపై సింగూరు, ఘనపురం, మంజీరా ఆనకట్టలను నిర్మించారు.

No comments:

Post a Comment