అంతర్జాలంలోని అన్నిరకాల ముఖ్యమైన సమాచారాన్ని ఈ సైట్ లో నిక్షిప్తం చేసి, అందరికీ ఉపయోగపడే ఒక వేదికగా ఈ సైట్ ఉండాలనే ఉద్దేశ్యంతో ప్రారంభించడమైంది. ఏ సైట్ నుండి సమాచారం తీసుకున్నా వారి పేరుతోనే ఇందులో వుంచుతాను. సహృదయంతో సహకరించగలరు.
ఎవరికైనా అభ్యంతరముంటే వారి సైటుకు సంబంధించిన సమాచారం తొలగించడం జరుగుతుంది. - ధన్యవాదములతో...

Monday, April 23, 2012

నియోజకవర్గాల సమాచారం


మెదక్‌
మండలాలు: మెదక్‌ అసెంబ్లీ నియోజకవర్గం పరిధిలో మెదక్‌ మున్సిపాలిటీతోపాటు, మెదక్‌ రూరల్‌, పాపన్నపేట, చిన్నశంకరంపేట, రామాయంపేట మండలాలున్నాయి.
గ్రామాలు: 157. గ్రామ పంచాయతీలు: 100.
విశేషాలు
నియోజకవర్గం పరిధిలో రాష్ట్ర, జాతీయ, అంతర్జాతీయ స్థాయిలో గుర్తింపు పొందిన ప్రాంతాలు, నిర్మాణాలు ఉన్నాయి.
పాపన్నపేట మండలం నాగ్సానిపల్లి వద్ద ఉన్న ఏడుపాయల ప్రసిద్ధ పుణ్యక్షేత్రంగా, పర్యాటక ప్రాంతంగా రాష్ట్రవ్యాప్త గుర్తింపు పొందింది.
మెదక్‌ పట్టణంలోని చర్చి ప్రపంచవ్యాప్త గుర్తింపు ఉన్న ప్రముఖ పర్యాటక కేంద్రం.
మెదక్‌లోనే కాకతీయ రెండో ప్రతాపరుద్రుడి కాలంలో నిర్మించిన దుర్గం (ఖిల్లా) చరిత్రకు సాక్ష్యంగా నిలిచి ఉంది.
నిజాంకాలంలో జిల్లాలో నెలకొల్పిన తొలి ఉన్నత పాఠశాల ఫోకానియా మెదక్‌లో ఉంది. జిల్లాకు చెందిన ఎందరో ప్రముఖులు ఈ విద్యాలయంలోనే చదివారు.
మెదక్‌ మండల పరిధిలోని పోచారం వన్యప్రాణి అభయారణ్యంలో కృష్ణ జింకల ప్రత్యుత్పత్తి కేంద్రం ఉంది.
నిజాం స్టేట్‌ ఇండియన్‌ యూనియన్‌లో విలీనం అయ్యాక భాషా ప్రయుక్త రాష్ట్రాలు, జిల్లాల విభజనలో నాటి పలు జిల్లాల కేంద్రం మెదక్‌ను రెవెన్యూ డివిజన్‌ కేంద్రంగా కుదించారు.
1980లో ఇందిరాగాంధీ మెదక్‌ లోక్‌సభ స్థానం నుంచి పోటీచేసి ఎంపీగా గెలిచి ప్రధాన మంత్రి పదవి అలంకరించడంతో మెదక్‌కు అంతర్జాతీయ స్థాయిలో గుర్తింపు లభించింది.
ఆసియా ఖండంలో రెండో అతిపెద్ద చర్చి మెదక్‌ పట్టణానికి తలమానికంగా భాసిల్లుతోంది.
మెదక్‌లో ప్యాలెస్‌ను తలపించేలా ఉన్న వెస్లీ ఉన్నత పాఠశాల భవనం సినిమా షూటింగ్‌లకు కేంద్రంగా మారింది.
మెదక్‌ పట్టణంలో ఏటా శీతాకాలంలో రికార్డు స్థాయిలో అత్యల్ప ఉష్ణోగ్రతలు, వేసవి కాలంలో అత్యధిక ఉష్ణోగ్రతలు నమోదవుతాయి.
నర్సాపూర్‌

తూర్పున తూప్రాన్‌, పడమర సంగారెడ్డి, దక్షిణాన జిన్నారం, ఉత్తరాన మెదక్‌ మండలాలున్నాయి. అందోలు, మెదక్‌, పటాన్‌చెరు, సంగారెడ్డి నియోజకవర్గాలు చుట్టుముట్టిఉన్నాయి. నర్సాపూర్‌, దౌల్తాబాద్‌, కౌడిపల్లి, హత్నూర, కొల్చారం, రంగంపేట,వెల్దుర్తి, శివ్వంపేట, దొంతి ప్రముఖ పట్టణాలు. ప్రధానంగా ఇక్కడ వరి, మొక్కజొన్న, చెరకు, పంటలు పండిస్తారు. నర్సాపూర్‌లో 2, శివ్వంపేటలో6, హత్నూరలో 10 పరిశ్రమలున్నాయి.
ప్రత్యేకతలు
నర్సాపూర్‌ ప్రాంతం దట్టమైన అడవులతో కూడుకొని ఉంది.
19.157 హెక్టార్ల పరిధిలో అడవులు విస్తరించి ఉన్నాయి. జంటనగరాల శివార్లలో ఇవి ఉండడంవల్ల సెలవురోజుల్లో పిక్నిక్‌లకు వస్తుంటారు. షూటింగ్‌లకు కేంద్రంగాకూడా కొనసాగుతున్నాయి.ఎత్త్తెనకొండలు, లోయలు, జలపాతాలు, దట్టమైన అడవుల్లో పక్షుల కిలకిలరావాలు,వణ్యప్రాణుల సంచారంతో ఆకట్టుకుంటాయి.
రాష్ట్ర మాజీ ఉపముఖ్యమంత్రి జగన్నాథరావు స్వగ్రామం నర్సాపూర్‌.
జేఎన్‌టీయూలో పేరొందిన బీవీఆర్‌ఐటీ ఇంజినీరింగ్‌ కళాశాల.
కొల్చారం మండలంలోని కొల్చారంలో జైనమందిరం, ఘణపూర్‌ ప్రాజెక్టు, 7 గ్రామాల మీదుగా మంజీరా నదీ ప్రవాహం.
సంస్కృత వేదపండితుడు మళ్లినాథసూరి కొల్చారం వాస్తవ్యుడు.
రంగంపేట, అప్పాజిపల్లి గ్రామాల్లో గడికోటలున్నాయి.
వెల్దుర్తిలో హల్దీవాగు, హల్దీ ప్రాజెక్టు, తెలంగాణ కాశి,కాకతీయుల కట్టడాలు, ప్రముఖ కవి వెల్దుర్తి మాణిక్యరావు స్వస్థలం
శివ్వంపేట మండలంలో ప్రముఖ పుణ్యక్షేత్రం చాకరిమెట్ల సహకారఆంజనేయస్వామి ఆలయం, సికింద్లాపూర్‌లో లక్ష్మీనర్సింహస్వామి ఆలయం
కౌడిపల్లి మండలం చిట్కుల్‌లో చాముండేశ్వరి ఆలయం* 7 గ్రామాల మీదుగా మంజీరనదీ ప్రవాహం, వెంకట్రావుపేటలో సంస్థానా దీశుల కాలంనాటి కోట.
హత్నూర మండలంలోని 9 గ్రామాల మీదుగా మంజీరానదీ ప్రవాహం.

సిద్దిపేట
మెదక్‌ జిల్లాలో సిద్దిపేట నియోజకవర్గానికి ప్రత్యేక స్థానం ఉంది. తెలంగాణ ఉద్యమానికి సిద్దిపేట కేంద్ర బిందువు. కళలకు కాణాచి. విద్య, వ్యాపార రంగాల్లో గణనీయమైన అభివృద్ధి సాధించిన ప్రాంతమిది. పౌల్ట్రీ రంగం కూడా బాగా విస్తరించింది. 1952లో ఏర్పాటైన సిద్దిపేట నియోజకవర్గం అంచెలంచెలుగా అనేక రంగాల్లో చక్కటి అభివృద్ధి సాధిస్తూ ముందుకు సాగుతోంది.
సిద్దిపేట నియోజకవర్గం మెదక్‌ జిల్లాలో కరీంనగర్‌, వరంగల్‌ జిల్లాల సరిహద్దులను ఆనుకొని ఉంది. సిద్దిపేట నియోజకవర్గానికి తూర్పున వరంగల్‌ జిల్లా హుస్నాబాద్‌ నియోజకవర్గం, పడమర దుబ్బాక, ఉత్తరాన కరీంగనర్‌ జిల్లా సిరిసిల్లా, దక్షిణాన గజ్వేల్‌ నియోజకవర్గం ఉంది.
1952లో పీడీఎఫ్‌కు చెందిన ఎడ్ల గురువారెడ్డి సిద్దిపేట నియోజకవర్గ తొలి శాసనసభ్యుడిగాఎన్నికయ్యారు.
తెలంగాణ ఉద్యమానికి సిద్దిపేట పురిటిగడ్డ. 1969 ఉద్యమం మొదలుకొని ప్రస్తుతం కొనసాగుతున్న ఉద్యమంలోనూ ఈ ప్రాంత నేతలదే కీలక పాత్ర. 1969లో ఈ ప్రాంతానికి చెందిన మదన్‌మోహన్‌ఉద్యమంలో కీలకపాత్ర పోషించారు.
1985లో సిద్దిపేట స్థానం నుంచి తొలిసారిగా ఎమ్మెల్యేగా ఎన్నికైన కేసీఆర్‌ వరుసగా ఆరు సార్లు ఎమ్మెల్యేగా (2001 ఉప ఎన్నికతో కలిపి)ఎన్నికవడం విశేషం.
2001లో సిద్దిపేట ఎమ్మెల్యేగా ఉన్న కేసీఆర్‌ తెదేపాకు, శాసన సభ్యత్వానికి రాజీనామా చేసి తెరాసను ఏర్పాటు చేశారు. 2001 నుంచి కేసీఆర్‌ ఆధ్వర్యంలో తెలంగాణ ఉద్యమం కొనసాగుతోంది.
ప్రస్తుతం సిద్దిపేట నియోజకవర్గం నుంచి తెరాసకు చెందిన తన్నీరు హరీశ్‌రావు ఎమ్మెల్యేగా ప్రాతినిథ్యం వహిస్తున్నారు. ఈయన తెరాస శాసనసభాపక్ష ఉపనేతగా కూడా వ్యవహరిస్తున్నారు.
జిల్లాలోనే సిద్దిపేట నియోజకవర్గంలో పారాబాయిల్డ్‌ మిల్లులు అత్యధిక సంఖ్యలో ఉన్నాయి. జిల్లాలో మొత్తం 52 పారాబాయిల్డ్‌ మిల్లులు ఉండగా, సిద్దిపేట, చిన్నకోడూరు మండలాల్లోనే 28 మిల్లులుఉండటం విశేషం. ఇక్కడ ఉత్పత్తి అయిన ఉప్పుడు బియ్యం గుజరాత్‌, మహారాష్ట్రలకు ఎగుమతి చేస్తున్నారు.
జిల్లాలోనే పెద్ద మార్కెట్‌ యార్డు సిద్దిపేటలో ఉంది. దాదాపు ఏడాది పొడవునా వ్యవసాయ ఉత్పత్తుల క్రయవిక్రయాలు ఇక్కడ కొనసాగుతాయి. మార్కెట్‌ యార్డుకు ఏటా దాదాపు రూ.2 కోట్ల ఆదాయం వస్తోంది.
సిద్దిపేట నియోజకవర్గంలో పౌల్ట్రీ రంగం భారీగా విస్తరించింది.జిల్లాలోనే అత్యధిక లేయర్‌, బ్రాయిలర్‌ కోళ్ల ఫారాలు ఈ నియోజకవర్గంలోనే అధికం. సిద్దిపేట నియోజకవర్గంలో 20కి పైగా లేయర్‌ కోళ్ల ఫారాలు ఉండగా, 12 నుంచి 15 లక్షల గుడ్లను ఉత్పత్తి చేసే కోళ్లను పెంచుతున్నారు. అలాగే 100కు పైగా బ్రాయిలర్‌ ఫారాలు ఉండగా, వీటిలో దాదాపు 6 లక్షల కోళ్లను పెంచుతున్నారు.
సిద్దిపేట కళలకు కాణాచి. చిత్రకళా రంగంలో డాక్టరు కాపు రాజయ్య, బాతిక్‌ బాలయ్య అంతర్జాతీయ స్థాయిలో ఖ్యాతి గడించారు. రుస్తుం కూడా మంచి చిత్రకారుడిగా గుర్తింపు సాధించారు. అష్టావధానం ద్వారా గుమ్మనగారి లక్ష్మీనర్సింహశర్మ (ఈయన ఈ మధ్య మరణించారు), అష్టకాల నర్సింహరామశర్మ విశేషమైన కీర్తి గడించారు. పేరిణి నృత్య కళాకారుడు రమేశ్‌లాల్‌కు అంతర్జాతీయ స్థాయిలో గుర్తింపు ఉంది. డాక్టర్‌ నందిని సిధారెడ్డి, కనపర్తి రామచంద్రాచార్యులు, ఐతా చంద్రయ్య, అమ్మన చంద్రారెడ్డి వంటి ప్రముఖ కవులు ఇక్కడి వారే. శిల్పి బాలరత్నంకు కూడా విశేషమైన పేరుంది. రసమయి బాలకిషన్‌, దేశపతి శ్రీనివాస్‌ వంటి తెలంగాణ గాయకులు ఈ ప్రాంతం వారే. మంజీర రచయితల సంఘం, జాతీయ సాహిత్య పరిషత్తు సిద్దిపేట కేంద్రంగా సాహితీ సేవలో నిమగ్నమయ్యాయి.


దుబ్బాక
దుబ్బాక అంటే చేనేతకు పెట్టిందిపేరు. ఇక్కడి చేనేత కార్మికులు తయారుచేసిన గొల్లభామల చీరలకు గతంలో ఎంతో ఆదరణ ఉండేది. దుబ్బాక మొదట దొమ్మాట నియోజకవర్గం పేరిట ఉండేది. నియోజకవర్గ పునర్‌ విభజన నేపథ్యంలో 2009లో దుబ్బాక నియోజకవర్గంగా ఏర్పడింది. ఈ నియోజకవర్గంలో దుబ్బాక, మిరుదొడ్డి, తొగుట, దౌల్తాబాద్‌, చేగుంట మండలాలు ఉన్నాయి. నియోజకవర్గానికి తూర్పున సిద్దిపేట, పడమర నిజామాబాద్‌ జిల్లా (దోమకొండ మండలం), ఉత్తరాన కరీంనగర్‌ జిల్లా (ముస్తాబాద్‌ మండలం), దక్షిణాన గజ్వేల్‌ నియోజకవర్గాలు ఉన్నాయి. దుబ్బాక నియోజకవర్గం 2,46,549 ఎకరాల విస్తీర్ణంలో ఉంది. 2001 ప్రకారం నియోజకవర్గంలో పురుషులు 1,30,299, మహిళలు 1,31,192 మంది మొత్తం 2,61,491 జనాభా ఉన్నారు. 50.6 శాతం అక్షరాస్యత ఉంది. మొత్తం 120 పంచాయతీలు ఉన్నాయి. నియోజకవర్గంలో 1,54,380 ఎకరాల వ్యవసాయం భూమి ఉంది.ధాన పంటలురి, మొక్కజొన్న. కూడవెళ్లి వాగు ఒడ్డున రామలింగేశ్వరాలయానికి ఎంతో ప్రాధాన్యం ఉంది. ఈ ఆలయం దక్షిణకాశీగా పేరొందింది. ప్రతి మాఘ అమావాస్య సందర్భంగా జాతర చేస్తారు.
 

అందోలు
ఏడు మండలాలు కలిగిన పెద్ద నియోజకవర్గం.. మొత్తం 156 పంచాయతీలు, 197 గ్రామాలు ఉన్నాయి. విస్తీర్ణం 1302 చదరపు కిలోమీటర్లు. ఇందులో వ్యవసాయ భూమి 1,45,892 ఎకరాలు. ప్రతీ ఏడాది 65,650 ఎకరాలు సాగవుతోంది.
నియోజకవర్గంలో మండలాలు: అందోలు, అల్లాదుర్గం, టేక్మాలు, రాయికోడ్‌, రేగోడు, మునిపల్లి, పుల్కల్‌
ప్రత్యేకతలు: నియోజకవర్గానికి ప్రత్యేక గుర్తింపుగా సింగూరు ప్రాజెక్టు, సింగూరు జల విద్యుత్తు కేంద్రాలు ఉన్నాయి. ఎన్నికల్లో పోటీ చేసే ప్రతీ ఒక్కరూ శ్రీ పాండురంగ స్వామి ఆలయాన్ని దర్శించుకుంటారు. ఈ ఆలయం మునిపల్లి మండలం అంతారంలో ఉంది. జోగిపేట సమీపంలో చాముండేశ్వరీ దేవి ఆలయం, అల్లాదుర్గం మండల కేంద్రంలో ఎల్లం, బేతాళ, వీరభద్ర దేవాలయాలతోపాటు సుమారు 40 వరకు వివిధ దేవాలయాలు ఉండటం ప్రత్యేకత. టేక్మాల్‌ మండలంలోని వేల్పుగొండలో పురాతన తుంబురేశ్వర ఆలయం ఉంది. ఇది కాకతీయుల కాలంలో నిర్మించినట్లుగా చరిత్ర చెబుతోంది. అందోలు మండలంలోని కిచ్చన్నపల్లిలో దక్షిణ తిరుపతిగా ప్రసిద్ధి చెందిన వెంకటేశ్వర ఆలయం, జోగిపేటలో జోగినాథ స్వామి, అందోలులో పురాతన రంగనాథస్వామి దేవాలయం ఉంది.
రాజకీయం: ఎస్సీ రిజర్వుడు నియోజకవర్గం. ఇక్కడి నుంచి కాంగ్రెస్‌ తరపున పోటీ చేసిన అభ్యర్థులు ఎక్కువసార్లు గెలిచారు. దామోదర్‌ రాజనర్సింహ నాలుగుసార్లు, ఆయన కుమారుడు దామోదర్‌ మూడుసార్లు, తెదేపా అభ్యర్థులు నాలుగుసార్లు, రెండుసార్లు స్వతంత్య్ర అభ్యర్థులు గెలిచారు. ఇక్కడి నుంచి గెలిచిన ప్రతీ ఒక్కరూ మంత్రి పదవులు అలంకరించారు.

No comments:

Post a Comment