రైతన్నకు దక్కని ‘గిట్టుబాటు’
ధర లేక విలవిల్లాడుతున్న పసుపు, కంది, పత్తి రైతులు
ఏడాదిలో రూ.10 వేల నుంచి రూ.4 వేలకు చేరిన పసుపు ధర
మార్క్‌ఫెడ్ ద్వారా కొనుగోళ్లపై రాష్ట్ర ప్రభుత్వ నిర్లక్ష్యం
కందికీ కరువైన మద్దతు
ఒక్క నెలలోనే రూ.500 తగ్గిన పత్తి ధర
హైదరాబాద్, న్యూస్‌లైన్: రాష్ట్రంలో నానాటికీ వ్యవసాయం అంటేనే రైతులు బెంబేలెత్తిపోయే పరిస్థితులు నెలకొంటున్నాయి. వైఎస్ హయాం వ్యవసాయం పండుగ అని నిరూపిస్తే.. సర్కారు నుంచి ఏ సాయం అందని ప్రస్తుత పరిస్థితులు.. వ్యవసాయాన్ని దండుగలా మార్చివేస్తున్నాయి. పండించిన పంటకు గిట్టుబాటు ధర దక్కక అన్నదాత విలవిల్లాడిపోతున్నాడు. మార్కెట్ మాయాజాలంలో చిక్కుకుని కనీసం పెట్టుబడి అయినా దక్కకపోవడంతో అప్పులపాలై ఆత్మహత్యలకు పాల్పడుతున్నాడు. పసుపు, కంది, పత్తి ఇలా.. ఏ పంట వేసినా లాభం మాట దేవుడెరుగు, రైతన్న నష్టాల ఊబిలో కూరుకుపోతున్నా రాష్ట్ర ప్రభుత్వం కంటి తుడుపు చర్యలు చేపట్టి చోద్యం చూస్తోంది మినహా అన్నదాత విషయంలో చిత్తశుద్ధితో వ్యవహరించడం లేదు.
పసుపు రైతుకు పుట్టెడు దుఃఖం:
భారతదేశ సంప్రదాయంలో శుభానికి సూచిక పసుపు. కానీ పసుపును పండించిన రైతులకు మాత్రం కష్టాలే మిగులుతున్నాయి. వ్యాపారుల మాయాజాలంతో పసుపు ధర రోజురోజుకు తగ్గిపోతోంది. ఏడాది క్రితం క్వింటాల్ రూ.10 వేలు పలికిన పసుపు ధర ఇప్పుడు రూ.4 వేలకు పడిపోయింది. ప్రభుత్వ పరంగా మార్కెట్‌లో పోటీ లేకపోవడంతో నాణ్యత పేరుతో దళారులు కొన్ని చోట్ల క్వింటాల్‌కు రూ.3,800 మాత్రమే ఇస్తున్నారు. పసుపు పంట ఎక్కువగా మార్కెట్‌కు వచ్చేది ఇప్పుడే. సరిగ్గా ఇదే సమయంలో ధరల పరిస్థితి దారుణంగా ఉండడం రైతులకు ఆందోళన కలిగిస్తోంది. లక్షల రూపాయలు పెట్టుబడి పెట్టిన రైతుల కళ్లల్లో కన్నీళ్లు చూసైనా రాష్ట్ర ప్రభుత్వంలో కనీస స్పందన రావడం లేదు. మార్కెట్ జోక్యం పథకం (ఎంఐఎస్)పై కేంద్రం నుంచి ఆదేశాలు రాలేదనే నెపంతో కొనుగోళ్ల విషయంలో రాష్ట్ర ప్రభుత్వం ఎటూ తేల్చడం లేదు. ఫలితంగా వ్యాపారులు చెప్పిందే ధరగా మారింది.
పసుపు మార్కెట్ మొదలైన డిసెంబరు మూడో వారంలోనే ధరలు తగ్గడం ప్రారంభించాయి. దీంతో రైతులు ఆందోళనకు దిగారు. దీంతో రాష్ట్ర ప్రభుత్వం ఎంఐఎస్ కింద ఆంధ్రప్రదేశ్ వ్యవసాయ మార్కెటింగ్ సమాఖ్య (మార్క్‌ఫెడ్) ద్వారా కొనుగోళ్లు చేస్తామని ప్రకటించింది. కనీస మద్దతు ధర లేని పసుపు వంటి పంటలకు రాష్ట్ర ప్రభుత్వాలు ఇచ్చే ఉత్పత్తి ఖర్చుల సమాచారం ఆధారంగా కేంద్ర ప్రభుత్వం ఎంఐఎస్ ధర నిర్ణయిస్తుంది. ఒకవేళ వ్యాపారులు ఎంఐఎస్ ధర కన్నా తక్కువగా ఇస్తే తగ్గిన మొత్తాన్ని కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు చెరిసగం భరించి రైతులకు ఇస్తాయి. రాష్ట్రంలో పసుపు పంట ఎక్కువగా ఉత్పత్తి అయ్యే నిజామాబాద్ జిల్లాలోని క్షేత్ర స్థాయి పెట్టుబడి లెక్కల ఆధారంగా క్వింటాల్‌కు రూ.5500 ఎంఐఎస్ ధరగా నిర్ణయిస్తే రైతులకు గిట్టుబాటు అవుతుందని డిసెంబరు 23న రాష్ట్ర ప్రభుత్వం కేంద్రానికి ప్రతిపాదనలు పంపింది. రెండు నెలలు గడిచినా ఎంఐఎస్‌పై కేంద్రం ఎలాంటి నిర్ణయం తీసుకోలేదు. ఇప్పట్లో నిర్ణయించే పరిస్థితీ కనిపించడం లేదు. అయితే రాష్ట్ర రైతన్నలను దృష్టిలో ఉంచుకుని.. కేంద్ర నిర్ణయంతో సంబంధం లేకుండా మార్క్‌ఫెడ్‌తో పసుపును కొనుగోలు చేయించాల్సిన రాష్ట్ర ప్రభుత్వమూ పట్టించుకోవడం లేదు. పసుపు మార్కెట్ సీజను మార్చి ఆఖరు వరకు ఉంటుంది. రాష్ట్రంలో 30 శాతం మంది పసుపు రైతులు ఇప్పటికే అయినకాడికి పంటను అమ్ముకున్నారు. రాష్ట్ర ప్రభుత్వం ఇప్పటికైనా కొనుగోళ్లు మొదలుపెట్టకపోతే రైతులు భారీగా నష్టపోవడంతో పాటు వచ్చే ఏడాది నుంచి రాష్ట్రంలో పసుపు సాగే కనుమరుగయ్యే ప్రమాదం ఉంది.
కంది సాగుతో కన్నీళ్లు..
మూడేళ్లుగా రైతులకు సిరులు కురింపించిన కంది పంట రాష్ట్ర ప్రభుత్వ నిర్లక్ష్యంతో ఇప్పుడు కన్నీళ్లు పెట్టిస్తోంది. ఏడాది క్రితం కనీస మద్దతు ధర (ఎంఎస్‌పీ)కు రెట్టింపు ధర పలికిన కందులకు ఇప్పుడు ఎంఎస్‌పీ కూడా దక్కడం లేదు. ప్రస్తుత ఏడాదిలో కందులకు కేంద్ర ప్రభుత్వం ప్రకటించిన కనీస మద్దతు ధర క్వింటాల్ రూ.3200. పంట కోతల సమయంలో రెండు నెలల వరకు రైతులకు ఎంఎస్‌పీ దక్కకపోతే అదనంగా రూ.500 బోనస్ ఇవ్వాలని కేంద్రం నిర్ణయించింది. అంటే మార్కెట్‌లో కందులకు ఎంఎస్‌పీ కన్నా తక్కువ ధర పలికితే ప్రభుత్వ సంస్థలు ఎంఎస్‌పీ, బోనస్ కలిపి క్వింటాల్‌కు రూ.3700 ఇవ్వాల్సి ఉంటుంది. కందుల మార్కెట్ సీజను నెల క్రితం మొదలైంది. సరిగ్గా అప్పట్నుంచే కందుల ధర రోజురోజుకూ పతనమవుతోంది. నెల క్రితం మార్కెట్‌లో క్వింటాల్ రూ.3500 వరకు పలికిన కందులకు వ్యాపారుల సిండికేట్ మాయతో ఇప్పుడు రూ.2800 రావడం లేదు.
ఏడాది క్రితం ఇదే సమయంలో ఉత్పత్తి ఎక్కువగానే ఉన్నా.. బహిరంగ మార్కెట్‌లో కందులకు రూ.5 వేల ధర పలికింది. కానీ ఈ ఏడాది కందుల ఉత్పత్తి తగ్గింది. ఉత్పత్తి తగ్గినప్పుడు ధరలు పెరగాలిగానీ మార్కెట్ మాయాజాలంతో తగ్గుతోంది. ప్రభుత్వ పరంగా పోటీ లేకపోవడంతో వ్యాపారులు సిండికేట్‌గా మారి తక్కువ ధర ఇస్తున్నారు. రైతులకు ఎంఎస్‌పీ దక్కని పరిస్థితుల్లో వెంటనే కొనుగోళ్లకు దిగాల్సిన మార్క్‌ఫెడ్ నిర్లక్ష్యంగా వ్యవహరిస్తోంది. ధర మరీ దారుణంగా పడిపోవడంతో మొక్కుబడిగా కేవలం మూడు కేంద్రాలు ఏర్పాటు చేసి తూతూమంత్రంగా ఇప్పటికి కేవలం 780 టన్నులే కొనుగోలు చేసింది. పరిస్థితి ఇంత దారుణంగా ఉంటున్నా..మార్కెట్‌లో కంది పప్పు ధర మాత్రం ఏడాది కాలంగా కిలో రూ.60-65 మధ్యనే ఉంటోంది. రైతులను నట్టేటముంచుతున్న వ్యాపారులు కందిపప్పు వినియోగదారులను సైతం నిలువుదోపిడీ చేస్తున్నారు. ప్రభుత్వ నియంత్రణ, పోటీ లేకపోవడం వల్లనే రైతులు, వినియోగదారులకు ఇబ్బందులు తప్పడం లేదు.
పత్తి రైతు చిత్తు..
పత్తి విషయానికొస్తే గత ఏడాది ఇదే సమయంలో రూ.5 వేలు పలికిన క్వింటాల్ ధర ఇప్పుడు రూ.3600కు పడిపోయింది. పత్తి మార్కెట్‌కు ప్రసిద్ధి చెందిన వరంగల్‌లో జనవరి 23న రూ.4100 ఉన్న పత్తి క్వింటాల్ ధర శనివారం నాటికి రూ.500 తగ్గింది. అంతర్జాతీయ మార్కెట్‌లో డిమాండ్ తగ్గిందని చెబుతూ వ్యాపారులు రైతులను దోపిడీ చేస్తున్నారు. ఈ పరిస్థితిని నివారించి రైతులకు న్యాయం చేయాల్సిన మార్కెటింగ్ శాఖ అధికారులకు వ్యాపారులకే వత్తాసు పలుకుతున్నారు. రైతులకు అండగా నిలవాల్సిన కాటన్ కార్పొరేషన్ ఆఫ్ ఇండియా(సీసీఐ) కొనుగోళ్లపై మొహం చాటేస్తోంది. రాష్ట్ర వ్యాప్తంగా 75 కేంద్రాలు ఏర్పాటు చేస్తామని ఆర్భాటంగా చెప్పినా.. ఇప్పటికీ కేవలం 16 కేంద్రాలే తెరిచింది. ఈ కేంద్రాల్లోనూ మొక్కుబడిగానే కొనుగోళ్లు చేస్తోంది. గత ఏడాది మార్కెట్‌లో క్వింటాల్‌కు రూ.7 వేలు పలికినప్పుడు 13 లక్షల క్వింటాళ్ల పత్తిని కొనుగోలు చేసిన సీసీఐ.. ప్రస్తుతం రైతులు నష్టపోతున్నా నామమాత్రపు కొనుగోళ్లకే పరిమితమైంది.
No comments:
Post a Comment