హరికిషన్ సింగ్ సూర్జిత్ నగర్ (ఖమ్మం)- ప్రజాశక్తి ప్రత్యేక ప్రతినిధి
Fri, 3 Feb 2012, IST
- స్వాగతోపన్యాసంలో 'తమ్మినేని'
పోరాడాట గడ్డ ఖమ్మంలో జరుగుతున్న సిపిఎం రాష్ట్ర మహాసభలు రాష్ట్ర రాజకీయాలకు దిశానిర్ధేశం చేయనున్నాయని సభల ఆహ్వానసంఘం అధ్యక్షులు తమ్మినేని వీరభద్రం అన్నారు. సిపిఎం రాష్ట్ర మహాసభల
ప్రారంభ సభలో ఆయన స్వాగతోపన్యాసం చేశారు. రాష్ట్ర వ్యాపితంగా అన్ని జిల్లాల నుంచి తరలివచ్చిన ప్రతినిధులకు ఆయన సాదర స్వాగతం పలికారు. జిల్లా చరిత్రను వివరిస్తూ పోరాటాల గుమ్మంగా ఖమ్మం కొనసాగిన వైనాన్ని తెలిపారు. పాలకుల నిర్లక్ష్యమే తమ జిల్లాకు శాపమైందని, వనరులున్నా ఉపయోగించుకోని ఫలితంగా అభివృద్ధి వెనకడుగు వేసిందని ఆవేదన వ్యక్తం చేశారు. ఇదే తీరున రాష్ట్ర పరిస్థితులూ ఉన్న విషయాన్ని గుర్తించి మహాసభల్లో ఉద్యమ కర్తవ్యాలు తీసుకోవాల్సి ఉందన్నారు. అల్లూరి సీతారామరాజు రాజేసిన బ్రిటిష్ సామ్రాజ్యవాద వ్యతిరేక పోరాటంలోనూ, నిజాం నిరంకుశ ఫ్యూడల్ బంధనాలను తెంచేందుకు తెలంగాణ రైతాంగం సాగించిన సాయుధ పోరాటంలోనూ ఖమ్మం ప్రజల పాత్ర ఎనలేనిదన్నారు. ఎర్రాప్రగడ ఖమ్మం నివాసి కావడం, నిజాం వ్యతిరేక పోరాటంలో ప్రముఖ పాత్ర వహించిన దాశరథి కృష్ణమాచార్య, రంగాచార్య సోదరుల కార్యస్థానంగా, భద్రాచలం దేవాలయ నిర్మాణం చేసిన కంచర్ల గోపన్న (భక్త రామదాసు) జన్మించిన గడ్డగా స్ఫూర్తి పొందిన పురాతన పట్టణంగా ఖమ్మం ఉందన్నారు. 300 అడుగుల ఎత్తుగల పెద్ద బండరాయిపై ఆనాటి రెడ్డి రాజులు నిర్మించిన కోట వలన స్తంభగిరిగా పిలిచిన చరిత్రను గుర్తు చేశారు. గిరిజనుల పాదస్పర్శతో పులకించే అడవులు జిల్లాలోని సగం భూభాగంలో ఉన్నాయన్నారు. ఖనిజాలున్నాయ న్నారు. దుమ్ముగూడెం ప్రాజెక్టు జిల్లా ప్రజల స్వప్నంగానే మిగులుతోంది. జిల్లాలో ప్రజలకు జరిగిన అభివృద్ధిగానీ, సమకూరిన హక్కులు గానీ ఏమేరకున్నా అవి కమ్యూనిస్టుల పోరాటాల ద్వారానే జరిగాయని సగర్వంగా ప్రకటించారు. ఖమ్మం ప్రాంతంలో ముందుగా గ్రంథాలయ ఉద్యమం ప్రారంభమైన తీరుతో పాటు ఆంధ్రమహాసభను విచ్ఛిన్నకులను ఎదుర్కొని నిర్వహించిన విధానాన్ని తెలిపారు. కమ్యూనిస్టు ఉద్యమంలో వచ్చిన చీలికల సందర్భంగా ఈ జిల్లా ఉద్యమం సిపిఎం పక్షాన ధృడంగా నిలబడిందన్నారు. జిల్లాలో 1980లో సాగిన భూపోరాటాలు, 1990 దశకంలో వందలాది గ్రామాలలో సాగిన కూలి పోరాటాలు చెప్పుకోదగిన మైలు రాళ్లు. భద్రాచలం ఏజెన్సీలో 2 లక్షల ఎకరాలను ముంచేస్తూ 3 లక్షల మంది గిరిజనులను నిర్వాసితులను చేసే పోలవరం ప్రాజెక్టును సవరించాలని సాగిన ఉద్యమాలను ప్రస్తావించారు. విద్యుత్‌పోరాటంలో ఈ జిల్లాకు చెందిన కామ్రేడ్ సతైనపల్లి రామకృష్ణ ప్రాణాలర్పించారని, 2007 సంవత్సరంలో రాష్ట్ర వ్యాప్తంగా సాగిన భూపోరాటంలో (ముదిగొండలో) ఏడుగురు వీరులు ప్రాణత్యాగాలతో ఉవ్వెత్తున ఉద్యమాలు సాగాయన్నారు. 2003లో జరిగిన మహా ప్రస్థాన పాదయాత్ర, 2011లో జరిగిన దళిత వాడల సైకిల్‌యాత్ర, గిరిజన గూడాల సైకిల్‌యాత్రలు భారీగా జరిగి ఉద్యమాన్ని ఉత్సాహ పరిచిన ముఖ్య ఘటనలని తెలిపారు. అనేక మహాసభలకు గతంలోనూ ఆతిధ్యమిచ్చామని, అయితే 1968 తరువాత పార్టీ మహాసభ జరపడం ఇదేనన్నారు. మళ్లీ 43 వసంతాల తరువాత తిరిగి వచ్చిన ఈ అవ కాశాన్ని సద్వినియోగం చేయడానికి, ఉద్యమ విస్తరణ చేయడానికి ఖమ్మం జిల్లా పార్టీ కమిటీ శాయశక్తులా కృషి జరిపిందన్నారు. జిల్లా ప్రజలు కూడా రాజకీయ తేడాలకు అతీతంగా గొప్పగా స్పందించి సహకరిం చారని చెప్పారు. భవిష్యత్‌లో పోరాటాలు వెలువెత్తే అవకాశాలు కనిపిస్తున్న సందర్భంగా జరుగుతున్న ఈ ద్వారా ప్రజా సమస్యలను ప్రధాన ఏజెండాగా ముందుకు తీసుకొచ్చే వీలుందన్నారు.
No comments:
Post a Comment