ప్రజాశక్తి - అనంతపురం ప్రతినిధి Tue, 21 Feb 2012, IST
ఏ ముఖ్యమంత్రి హామీ అమలుకాని స్థితి \
ఎటూచాలని రూ. 700 కోట్ల కేటాయింపు
హెచ్చెల్సీ ఆధునీకరణా ఇంతేసంగతి
'హంద్రీ నీవా సుజల స్రవంతి' పథకం 'ఓ అడుగు ముందుకు నాలుగు అడుగులు వెనక్కు'గా సాగుతోంది. బడ్జెట్ కేటాయింపులు రాయలసీమ వాసులను నిరాశ పరిచాయి. అనంతపురం, కడప, కర్నూలు, చిత్తూరు జిల్లాల్లోని 575
గ్రామాల్లో 33 లక్షల మందికి తాగునీరు, 6,02,500 ఎకరాలకు సాగునీరు అందించాల్సివుంది. ఈ గ్రామాలన్నీ కరువు పీడిత ప్రాంతాలే... అయినా ప్రాజెక్టు పనులు ప్రతిసారీ వాయిదా పడుతున్నాయి. అంచనా వ్యయం రెట్టింపయింది. మొదటి, రెండో దశ కలిపి ప్రారంభ అంచనా వ్యయం రూ.3,185 కోట్లు. ప్రస్తుతమిది రూ.6,850 కోట్లకు చేరింది. అదేవిధంగా అనంతపురం జిల్లాలో ఏకైక జలవనరు తుంగభద్ర ప్రధాన ఎగువ కాలువ (హెచ్‌ఎల్‌సి). దీని ఆధునీకరణ కూడా ఇంతేసంగతి అని భావించాలి. పనులు ప్రారంభమైనప్పటి నుంచీ ఏనాడూ పట్టుమని రూ.వంద కోట్లు కేటాయించిన పాపానపోలేదు. ఈ ఏడాదీ బడ్జెట్లో నిధులూ కేటాయించలేదు. దీంతో ఆధునీకరణ అటకెక్కినట్లే.
తెలుగుదేశం ప్రభుత్వ కాలంలో హంద్రీనావాకు మూడు మార్లు శంకుస్థాపనలు చేశారు. కానీ తర్వాతొచ్చిన కాంగ్రెస్ ప్రభుత్వం 2005 ఏప్రిల్ 21న నాటి ముఖ్యమంత్రి వైఎస్.రాజశేఖర్‌రెడ్డి ఉరవకొండ మండలం చిన్న ముష్టూరు వద్ద మొదటి దశ పనులకు శంకుస్థాపన చేశారు. కర్నూలు జిల్లా నందికొట్కూరులోని మల్యాల నుంచి అనంతపురం జిల్లా ఉరవకొండ మండలం జీడిపల్లి జలాశయం వరకూ శ్రీశైలం డ్యాం బ్యాక్ వాటర్ ద్వారా మొదటి దశ కింద ఈ రెండు జిల్లాల్లోని 3,45,000 ఎకరాలకు నీరందించాలని తలపెట్టారు. అనంతపురం, చిత్తూరు, కడప జిల్లాలకు 2,57,500 ఎకరాలకు సాగునీరందించాలని రెండో దశగా పెట్టుకున్నారు. రెండో దశలో ముఖ్యమంత్రి కిరణ్‌కుమార్ రెడ్డి సొంత నియోజకవర్గం పీలేరులోని భూములకు సాగునీరందుతోంది.
2007 ఖరీఫ్ నాటికి మొదటి దశ, 2009 నాటికి రెండో దశ పనులను పూర్తి చేస్తామని వైఎస్ రాజశేఖరరెడ్డి ప్రకటించారు. అయినా ఆ సమయానికి పనులు పూర్తి కాలేదు. 2009 ఖరీఫ్ నాటికి మొదటి దశ పూర్తి చేస్తామని ఆయన మళ్లీ ప్రకటించారు. ఆయన తరువాత ముఖ్యమంత్రి రోశయ్య 2010 ఖరీఫ్ నాటికి పూర్తి చేస్తామని రాయదుర్గం సభలో ప్రకటించారు. అదీ అమలు జరగలేదు. ప్రస్తుత ముఖ్యమంత్రి కిరణ్‌కుమార్‌రెడ్డి 2011 నాటికి మొదటి దశ, 2012 నాటికి రెండో దశ పూర్తి చేస్తామని ప్రకటించారు. 2012 నాటికయినా మొదటి దశయినా పూర్తవుతుందా అనే అనుమానాలు కలుగుతున్నాయి.
తుంగభధ్ర ప్రధాన కాలువ కమామిషూ...
ఈ పథకానికి 2011-12లో రూ.660 కోట్లు కేటాయించి రూ.548 కోట్లు మాత్రమే విడుదల చేశారు. ఇందులో రూ.101.74 కోట్లే ఖర్చుపెట్టారు. హంద్రీ నీవా మొదటి, రెండు దశలకు కలిపి కనీసం రూ.1800 కోట్లు తక్షణావసరం. 2012-13 బడ్జెట్‌లో కేటాయించినది కేవలం రూ.700 కోట్లు మాత్రమే. జీడిపల్లి జలాశయం వరకూ 21కి.మీ. కాలువ పనులు పూర్తి కావాలంటే రూ.700 కోట్లు కావాలి. కానీ ప్రభుత్వం రెండు దశలకూ కలిపి రూ.700 కోట్లే కేటాయించింది. ఈ ప్రాజెక్ట్ ఇంకెక్కడ పూర్తవుతుందనేది సందేహమే...
తుంగభద్ర డ్యాంలో పూడిక పెరగడం వల్ల నీటి నిలువ సామర్థ్యం 132.47 నుంచి 100 టిఎంసిలకు సామర్థ్యం పడిపోయింది. ఫలితంగా తుంగభద్ర నుంచి ఎగువ ప్రధాన కాలువకు రావాల్సిన 32.5 టిఎంసిల నీరు 23 టిఎంసిలకు తగ్గిపోయింది. అదే సమయంలో ఎప్పుడో 60 ఏళ్ల క్రితం నిర్మించిన కాలువ కావడంతో గండ్లు పడి ప్రవాహ నష్టం అధికం. ఆయకట్టు చివరి భూములకు నీరందడం గగనమైంది. ఈ కాలువ కింద 2,84,992 ఎకరాల సాగు ఉంది. ప్రస్తుతం లక్ష ఎకరాలకే నీరు లభిస్తోంది.
నిధుల కేటాయింపులో నిర్లక్ష్యం...
ఆధునీకరణ పనులను సక్రమంగా చేపట్టి ఉంటే 2012 నాటికి పూర్తి కావాలి. రూ.477 కోట్లతో చేపట్టిన ఈ పనులకు.. ఏ బడ్జెట్లోనూ నిధులను సక్రమంగా కేటాయించలేదు. దీంతో కాంట్రాక్టర్లు మట్టి పనులు పూర్తి చేసి ఆపేశారు. ఆధునీకరణకు 2009-10లో రూ.వంద కోట్లు కేటాయించి రూ.45 కోట్లే విడుదల చేసింది. 2010-11లో ఒక్క రూపాయీ కేటాయించలేదు. 2011-12లో రూ.160 కోట్లు కేటాయించి రూ.17 కోట్లు విడుదల చేసింది. ఇక రూ.2012-13లో రూ.37 కోట్లు మాత్రమే కేటాయించింది. ఇందులో ఎంత విడుదల చేస్తుందో చూడాలి.
No comments:
Post a Comment