అంతర్జాలంలోని అన్నిరకాల ముఖ్యమైన సమాచారాన్ని ఈ సైట్ లో నిక్షిప్తం చేసి, అందరికీ ఉపయోగపడే ఒక వేదికగా ఈ సైట్ ఉండాలనే ఉద్దేశ్యంతో ప్రారంభించడమైంది. ఏ సైట్ నుండి సమాచారం తీసుకున్నా వారి పేరుతోనే ఇందులో వుంచుతాను. సహృదయంతో సహకరించగలరు.
ఎవరికైనా అభ్యంతరముంటే వారి సైటుకు సంబంధించిన సమాచారం తొలగించడం జరుగుతుంది. - ధన్యవాదములతో...

Sunday, February 26, 2012

శనగ ధర పతనం


ప్రజాశక్తి-ఒంగోలు ప్రతినిధి   Mon, 20 Feb 2012, IST  


క్వింటాలుకు మూడు వేలు
రూ.351కోట్లు నష్టపోనున్న రైతులు


శనగ ధర ఒక్కసారిగా పతనమయ్యే పరిస్థితి కనిపిస్తోంది. ప్రముఖ వాణిజ్య పంటగా ఉన్న శనగ.. దిగుబడి చేతికొచ్చే సమయంలో ధర పతనం కావడంతో రైతులు ఆందోళన చెందుతున్నారు. గత పంట కాలంలో ఎన్నడూలేని విధంగా ధరలు పెరగడంతో ఈ ఏడాది ఎక్కువ మంది రైతులు శనగ వైపు మొగ్గు చూపారు. హఠాత్తుగా ధరలు పతనం
కావడంతో పరిణామాలు అర్థంకాక ఆందోళన చెందుతున్నారు. ప్రస్తుతం ఉన్న ధరల ప్రకారం రైతులు కోట్లాది రూపాయలు నష్టపోయే ప్రమాదం కన్పిస్తోంది. కొద్దినెలల క్రితం క్వింటాలు గరిష్టంగా రూ.తొమ్మిది వేలకుపైగా ఉంది. మళ్లీ తిరోగమనం కనిపించింది. కొద్దికాలం రూ.ఎనిమిదివేల వద్ద ధర నిలబడింది. మూడునెలల క్రితం ప్రభుత్వం విత్తనాల కోసం క్వింటాలుకు రూ.7500 ధర నిర్ణయించి సేకరించింది. వ్యాపారులూ ఇదే ధరకు కొనుగోళ్లుచేశారు. ఇప్పుడు క్వింటా కాక్‌-2 రకం రూ.4,500కు దిగజారింది. క్వింటాలుకు సగటున రూ.మూడువేల ధర తగ్గింది. ఈ లెక్కన జిల్లాలో వచ్చే దిగుబడికి రైతులు రూ.351.92 కోట్లు నష్టపోతున్నట్లు అంచనా. పొగాకు వల్ల నష్టం రావడంతో ఈ ఏడాది ఎక్కువ మంది రైతులు శనగవైపు మొగ్గు చూపారు. వ్యాపారుల చేతికి వెళ్లాక శనగ ధరలకు రెక్కలు వచ్చాయి. ఫ్యూచర్‌, ఫార్వర్డ్‌ ట్రేడింగ్‌ల ఫలితమేనని రైతు సంఘం విశ్లేషించింది. ఇప్పుడు మళ్లీ రైతుల చేతిలో శనగలున్నాయి. రైతుల నుంచి సేకరించాక ఆనవాయితీగా ధరలు పెరగడం జరుగుతోంది. ఈ ప్రక్రియలో రైతులే నష్టపోతున్నారు. ప్రభుత్వం నుంచి సరైన మార్కెటింగ్‌ వ్యవస్థ లేకపోవడమే దీనికి కారణంగా కనిపిస్తోంది.

జిల్లాలో ఈ ఏడాది 2,34,612 ఎకరాల్లో శగన సాగు చేశారు. తుపానులకు లక్ష ఎకరాల వరకూ దెబ్బతిన్నది. కొంత తిప్పుకున్నది. పరిస్థితి బాగా ఉంటే ఎకరానికి కనీసం ఎనిమిది క్వింటాళ్లు వచ్చేది. తుపాను వల్ల దిగుబడి తగ్గే అవకాశముంది. ఇప్పుడు ఎకరానికి సగటున ఐదు క్వింటాళ్ల దిగుబడి వస్తుందని అంచనా. ఈ లెక్కన మొత్తం సాగులో 11.73 లక్షల క్వింటాళ్ల దిగుబడి వచ్చే అవకాశముంది. క్వింటాలుకు రూ.మూడు వేల ధర పతనం వల్ల 351.92 కోట్ల నష్టం వస్తోంది. ఎకరానికి రూ.15వేల లెక్కన రైతులు నష్టపోతున్నారు. ధర పతనంపై ప్రభుత్వం ఎటువంటి నియంత్రణా చేయలేకపోతోంది. ఇలా ఉంటే.. ధరల పతనానికి వ్యాపారుల విధానాలతోపాటు ప్రభుత్వ చర్యలు కూడా కారణాలుగా ఉన్నాయి.

జిల్లాలో ఐదేళ్లుగా శనగల నిల్వలున్నాయి. ధరలు వచ్చినప్పుడు అమ్ముకునేందుకు రైతులు శీతల గిడ్డంగుల్లో పెట్టుకున్నారు. అయితే కారణాలేమైనా ధరలు పెరిగాయి. రైతులకు మంచి రోజులు వచ్చాయనుకున్నారు. ఇంతలోనే ప్రభుత్వం విత్తనాల కోసం అంటూ ఆ గిడ్డంగులను సీజ్‌ చేసింది. దీంతో క్వింటాలు రూ.తొమ్మిదివేలున్న ధర పతనం వైపు సాగింది. రైతులు ఆందోళన చేశారు. రైతుసంఘం ఉద్యమంతో అధికారులు దిగొచ్చారు. ప్రభుత్వ ఆదేశాల మేరకు విత్తనాల సీజ్‌ను ఎత్తేశారు. రైతుల నుంచి క్వింటాలు రూ.ఏడున్నర వేలకు కొనుగోలు చేసి మిగతా రైతులకు పంపిణీ చేశారు. ఇక్కడ కొనుగోలు చేసి నిల్వలు పెడితే అధికారులు ఏ క్షణానైనా వారికి కావాల్సినప్పుడు సీజ్‌ చేస్తారనే భయంతో వ్యాపారులు ముందుకురాని పరిస్థితి. రైతులకు ఇదే చెబుతున్నారు. శనగ కొనుగోళ్లకు మహారాష్ట్ర, ఢిల్లీనుంచి వచ్చే వ్యాపారులు ఇప్పుడు రావడంలేదు. ఫలితంగా ధరలు పతనమయ్యాయి. ఢిల్లీ వ్యాపారులు ఇప్పుడు దళారులను పెట్టుకున్నారు. వారు సేకరించి పంపితే నగదు చెల్లిస్తారు. అంటే అధికారుల ఒంటెద్దు పోకడ వల్ల వ్యాపారులు కొనుగోలు వ్యవస్థనుంచి తప్పుకుని దళారులను పెట్టుకున్నారు. దళారీ వ్యవస్థలో రైతులకు ఏం జరుగుతుందో చెప్పనవసరం లేదు. ఇప్పుడిప్పుడే శనగ దిగుబడి వస్తోంది. మరో నెల రోజుల్లో పూర్తిగా వస్తుంది. ఈ లోపే ధరలు పతనమయ్యాయి. రానురాను ఎలా ఉంటుందో చెప్పలేని పరిస్థితి. రైతులు మళ్లీ గిడ్డంగుల్లో నిల్వలు పెట్టుకోక తప్పదు. పొగాకు వల్ల జరిగిన నష్టాల నుంచి బయటపడేందుకు శనగ వైపు వెళితే పంట చేతికి రాకముందే మార్కెట్‌లో చీకటి కనిపిస్తోంది. ప్రభుత్వం ఏదో ఒక సంస్థద్వారా సేకరించి వ్యాపారులకు విక్రయించే పద్ధతి వస్తే తప్ప రైతులు కోలుకునే పరిస్థితి లేదు. పైగా జిల్లాలో ప్రత్యామ్నాయ పంటగా శనగను ప్రభుత్వమే సూచించింది. ఈ నేపథ్యంలో రైతులకు గిట్టుబాటు ధర వచ్చేలా చూడాలి. రెండు నెలల క్రితం సేకరించిన ధరలకు వ్యాపారులు కొనేలా చూడాలని రైతులు కోరుతున్నారు. ప్రభుత్వం దృష్టి పెట్టకపోతే శనగ రైతులు నిండా మునిగే ప్రమాదముంది.

No comments:

Post a Comment