హరికిషన్‌సింగ్ సూర్జిత్ నగర్ (ఖమ్మం) నుండి ప్రజాశక్తి ప్రత్యేక ప్రతినిధి :
Fri, 3 Feb 2012, IST
- సిపిఎం రాష్ట్ర మహాసభ హెచ్చరిక
పెంచిన విద్యుత్ చార్జీల ప్రతిపాదనను ఉసంహరించి ప్రజలపై భారాలను తగ్గించాలని గురువారం నాడిక్కడ ప్రారంభమైన సిపిఎం 23వ మహాసభ రాష్ట్ర ప్రభుత్వాన్ని డిమాండ్ చేసింది. ఈ మేరకు సిపిఎం శాసనమండలి నాయకుడు చెరుపల్లి సీతారాములు ప్రతిపాదించిన తీర్మానాన్ని కె. మురళి బలపరిచారు. తీర్మానంలోని ముఖ్యాంశాలు ఇలా ఉన్నాయి.
రాష్ట్రంలో 2012-13లో రూ.4950 కోట్ల మేరకు విద్యుత్ ఛార్జీల పెంపు రూపంలో అదనపు భారాలు మోపేందుకు ప్రభుత్వ నిర్ణయం మేరకు నాలుగు విద్యుత్ పంపిణీ కంపెనీలు డిసెంబరు 26న ఆంధ్రప్రదేశ్ విద్యుత్ నియంత్రణ కమిషన్‌కు వార్షిక ఆదాయ అవసరాలను ప్రతిపాదించాయి. నాలుగు కంపెనీల అవసరం రూ.35,062 కోట్లుగా, ప్రస్తుత విద్యుత్ ఛార్జీల ప్రకారం రూ.24,009 కోట్ల ఆదాయం లభిస్తుందని, ప్రతిపాదించిన ఛార్జీలు రు. 4,950 కోట్ల పెంపుదల తరువాత ఇంకా రూ.6103 కోట్ల మేరకు రెవెన్యూ లోటు ఉంటుందని పంపిణీ కంపెనీలు అంచనాలు చూపాయి.
ఈ మొత్తంగాక 2008-09 మరియు 2009-10 ఆర్థిక సంవత్సరానికి వినియోగదారుల నుండి రూ.3024 కోట్ల సర్‌ఛార్జీ వసూలు చేయడానికి డిస్కాంలకు ఇచ్చిన అనుమతిని ఈ ఏడాది జనవరి 19న రాష్ట్ర హైకోర్టు నిలుపుదల చేస్తూ తీర్పు ఇచ్చింది.
వీధిదీపాల కరెంట్ బిల్లులే చెల్లించలేని పంచాయితీలపై చార్జీలు వడ్డించడం అవగాహనా రాహిత్యమే. గ్రామాల్లో రక్షిత మంచినీటి పథకాలు బిల్లులు కట్టలేకపోతే మూలనపడ్డట్లే. విద్యుత్ సరఫరా సక్రమంగా లేక బోరుబావులతో వ్యవసాయం జేసే రైతుల పంటలు ఎండిపోతున్నాయి. కోతలు లేకుండా వ్యవసాయానికి విద్యుత్ సరఫరా జేయాలి. విద్యుత్ కొరత కాలంలో బహిరంగ మార్కెట్టులో యూనిట్టుకు దాదాపు రు.5లకు కొనుగోలు జేస్తున్నారు. 4 గ్యాస్ ఆధారిత ప్రైవేటు విద్యుత్ కంపెనీలకు 20 శాతం విద్యుత్‌ను బహిరంగ మార్కెట్టులో అమ్ముకోవడానికి ప్రభుత్వం అవకాశం ఇచ్చింది.ప్రయివేటు సంస్థలను ఎక్కువ ధరలకు అమ్ముకోనిస్తూ మరోవైపు మరింత ఎక్కువ ధరకు విద్యుత్ పంపిణీ సంస్థలు బయట కొనుక్కోవడం ప్రైవేటు సంస్థల లాభానికి ప్రభుత్వ రంగాన్ని బలిచేయడమే.
గ్యాస్ లేక ఉత్పత్తి ప్రారంభించని కంపెనీలకు ఫిక్స్‌డ్ ఛార్జెస్‌ను చెల్లించాల్సిన అవసరం లేదు. ప్రైవేటు కంపెనీలు కోరినట్లుగా ఫిక్స్‌డ్ ఛార్జెస్ చెల్లిస్తే సుమారు రు.3000కోట్ల అదనపుభారం ప్రజలపై పడుతుంది. ప్రభుత్వం ఈ విషయంలో పైవేటు సంస్థలకు అనుకూలంగా కాకుండా, ప్రజలకు అనుకూలంగా వ్యవహరించాలి. రాష్ట్రంలో గ్యాస్ ఆధారిత పవర్ ప్లాంట్లకు తగినంత గ్యాస్ అందడం లేదు. రిలయన్స్, ఇతర గ్యాస్ ఉత్పత్తి సంస్థల్లో మన ప్లాంట్లకు గ్యాస్ తప్పకుండా సరఫరా జేసేట్లు చర్యలు తీసుకోవాలి.
అమెరికా డాలరుతో రూపాయి మారకం విలువ పడిపోవటం రెండు విధాలుగా అదనపు భారాలను మోపుతున్నది. ప్రైవేటు విద్యుత్ ప్రాజెక్టుల పెట్టుబడిలో విదేశీ మారక ద్రవ్యం భాగం ఉన్న మేరకు పిపిఎలలోని లోపభూయిష్ట నిబంధనల మేరకు స్థిర ఛార్జీల చెల్లింపుకు డాలరుతో రూపాయి మారకపు విలువ ప్రకారం సర్దుబాటు చేసి ప్రతి నెలా విద్యుత్ కొనుగోలు బిల్లు మొత్తాలలో భాగంగా చెల్లించాల్సి వస్తున్నందున అదనపు భారాలు పడుతున్నాయి. రిలయన్స్ వంటి గుత్త పెట్టుబడిదారి సంస్థలకు అనుచిత లబ్ది చేకూర్చేందుకు కెజి బేసిన్‌లో ఉత్పత్తి చేస్తున్న గ్యాస్ ధరను అమెరికా డాలర్లలో నిర్ణయించిన కేంద్ర ప్రభుత్వ తుగ్లక్ నిర్ణయం వల్ల, డాలరుతో రూపాయి మారకపు విలువ పడిపోయినపుడల్లా గ్యాస్‌కు రూపాయిలలో చెల్లించాల్సిన మొత్తం పెరుగుతూ అదనపు భారాలు పడుతున్నాయి. అదేవిధంగా, దిగుమతి చేసుకునే బొగ్గు, ఆర్‌ఎల్‌ఎన్‌జి వంటి ప్రత్యామ్నాయ ఇంధనాల ధరలు కూడా ఈ కారణంగా పెరుగుతూ అదనపు భారాలు పడుతున్నాయి.
రాష్ట్రంలో 20వేల మెగావాట్లకు పైగా సామర్థ్యంతో బొగ్గు, గ్యాస్, ఆధారిత ప్రైవేటు థర్మల్ పవర్‌ప్లాంట్ల ఏర్పాట్లకు ప్రభుత్వం అనుమతులు, మద్దతునివ్వడానికి సన్నాహాలు జేస్తున్నది. ఈ ప్రాజెక్టులలో ఎక్కువ భాగం శ్రీకాకుళం, నెల్లూరు జిల్లాలలో వున్నాయి. శ్రీకాకుళం జిల్లాలోని ఏడు మండలాల్లో 18000 మెగావాట్ల సామర్ధ్యం( కొవ్వాడ అణువిద్యుత్ కేంద్రం 2వేల మెగావాట్లతో కలిపి) కల్గిన ఏడు విద్యుత్ ప్లాంటులకు అనుమతిచ్చినట్లు తెలుస్తున్నది. జిల్లాలో సోంపేట మండలం బీల ప్రాంతంలో నాగార్జున కన్‌స్ట్రక్షన్ కంపెనీకి థర్మల్ విద్యుత్ ప్రాజెక్టు కోసం 1100 ఎకరాలను, కాకరాపల్లిలో ఈస్ట్‌కోస్టు పవర్ ప్లాంట్ నిర్మాణానికి 3333 ఎకరాలను ప్రభుత్వం కేటాయించింది. నెల్లూరు జిల్లాలో 22 విద్యుత్ ప్రాజెక్టులకు గాను వివిధ కంపెనీలకు దాదాపు 15 వేల ఎకరాలను ప్రభుత్వం అప్పగించింది. జిల్లాలో సుమారు 30వేల మెగావాట్ల పైగా సామర్ధ్యం కల్గిన విద్యుత్ ప్లాంట్లకు అనుమతులు, ప్రతిపాదనలు వున్నాయి. విజయనగరం జిల్లాలో ఒకటి, ప్రకాశం జిల్లా నాగులుప్పలపాడు మండలంలో మరోటి, కృష్ణా జిల్లాలో ఒకటి ప్రతిపాదనలు వున్నాయి. వీటికి కారుచౌకగా ప్రభుత్వ, ప్రైవేటు భూములను ప్రభుత్వం ధారాదత్తం చేస్తున్నది. నిరసన తెలిపిన బాధితులపై నిర్భంధం ప్రయోగిస్తున్నది. హిందూజా సంస్థకు విశాఖ జిల్లాలో విద్యుత్ కేంద్రానికి 1123 ఎకరాలు తీసుకొని 19 సంవత్సరాలయినా,ఇప్పటికీ ప్లాంటు నిర్మాణం జరగలేదు. భూములను స్వాధీనం చేసుకోకుండా ఆ సంస్థకే అప్పగించాలని ప్రభుత్వం జూస్తున్నది.
ప్రభుత్వం విద్యుత్ సంస్కరణలను కొనసాగించినట్టయితే ప్రజా ఉద్యమాలను చేపట్టాల్సి వస్తుందని సిపిఎం తీర్మానం హెచ్చరించింది. దిగువ డిమాండ్లను అమలు జరపాలని కోరింది. పెంచిన విద్యుత్ చార్జీలను, యూజర్, సర్వీసు చార్జీలను తక్షణం ఉపసంహరించుకోవాలి. ప్రైవేటు విద్యుత్ సంస్థలు బయట అమ్ముకునే అవకాశాన్ని రద్దు జేయాలి. కెజి బేసిన్‌లోని రిలయన్స్, ఇతర సంస్థల గ్యాస్ ఉత్పత్తిని ముందుగా మన అవసరాలకు పూర్తిగా కేటాయించాలి. సబ్‌స్టేషన్‌లను ప్రయివేటు సంస్థలకు అప్పగించే ప్రయత్నాలను విరమించుకోవాలి. మర్చంట్‌పవర్ ప్లాంట్లను అనుమతులను రద్దు చేయాలి.భూములను స్వాధీనం చేసుకోవాలి. కొవ్వాడ అణుకర్మాగార నిర్మాణాన్ని నిలిపి వేయాలి. కోతలు లేకుండా వ్యవసాయానికి విద్యుత్ సరఫరా జేయాలి. పిపిఎ లలో ప్రత్యామ్నాయ ఇంధన క్లాజును తొలగించాలి. క్రొత్త విద్యుత్ ప్లాంట్‌లకు పిక్స్‌డ్ చార్జీలను చెల్లించే ప్రయత్నాలను విరమించుకోవాలి.
No comments:
Post a Comment