అంతర్జాలంలోని అన్నిరకాల ముఖ్యమైన సమాచారాన్ని ఈ సైట్ లో నిక్షిప్తం చేసి, అందరికీ ఉపయోగపడే ఒక వేదికగా ఈ సైట్ ఉండాలనే ఉద్దేశ్యంతో ప్రారంభించడమైంది. ఏ సైట్ నుండి సమాచారం తీసుకున్నా వారి పేరుతోనే ఇందులో వుంచుతాను. సహృదయంతో సహకరించగలరు.
ఎవరికైనా అభ్యంతరముంటే వారి సైటుకు సంబంధించిన సమాచారం తొలగించడం జరుగుతుంది. - ధన్యవాదములతో...

Sunday, February 26, 2012

రైతు కంట్లో కారం


ప్రజాశక్తి - కర్నూలు ప్రతినిధి   Mon, 20 Feb 2012,

గతేడాది క్వింటాలు మిర్చి ధర 14 వేలు
ప్రస్తుత కనిష్టం రూ.2,550; గరిష్టంగా రూ.3,800
తగ్గిన దిగుబడి.. పెరగని ధర
వినియోగదారులకు షాక్‌ షరా మామూలు!

గతేడాది సిరులు కురిపించిన మిరప ఈయేడు రైతుల కంట్లో కారం కొట్టింది. మిరప ధర భారీగా పతనమైంది. ఈ సాగుపై పెట్టిన పెట్టుబడులు చేతికొచ్చే పరిస్థితీ కనిపించడంలేదు. దీంతో అప్పు తీర్చే మార్గం లేక మిరప రైతులు
ఆత్మహత్య బాటపడుతున్నారు. కర్నూలు జిల్లాలో గతేడాది 25 వేల ఎకరాల్లో మిర్చి సాగయింది. మిరప దిగుబడి గణనీయంగా రావడంతోపాటు క్వింటాలు ధర రూ.14 వేలు పలికింది. దీంతో ఈయేడాది మరో 15 వేల ఎకరాల్లో (మొత్తం 45 వేల ఎకరాలు) సాగు పెరిగింది. అయితే ఈయేడు రైతులను వర్షాభావం వెన్నాడింది. బోరు బావులు, పంట కాలువలు, చెరువులు, ఇతర వర్షాధారం కింద సాగు చేసిన మిరప దిగుబడి గణనీయంగా తగ్గిపోయింది. దానితో పాటు ధర గరిష్టంగా రూ.3,800, కనిష్టంగా రూ.2,550కి తగ్గిపోయింది. అయితే వినియోగదారులు మార్కెట్లో మిర్చి కొనుగోలు చేయాల్సి వస్తే మాత్రం క్వింటాలు రూ.ఆరు వేల ధర పలుకుతోంది. ఇలా ధర పతనమవడంతో.. అప్పులపాలైన మిరప రైతులు ఆత్మహత్య చేసుకుంటున్నారు. ఈ నెలలోనే ఇప్పటివరకూ నలుగురు రైతులు బలవన్మరణం చెందారు. సాగుపై చేసిన అప్పు, దానిపై వడ్డీ తీర్చే దారి కానరాక గోనెగండ్ల మండలం వీరంపల్లిలో గొల్ల బీసన్న, అదే మండలం అల్వాలలో మల్లేష్‌ పురుగుమందు తాగి.. క్రిష్ణగిరి మండలం ఎరుకలి చెరువు రైతు జక్కలి నాగరాజు విద్యుత్తీగ పట్టుకొనీ.. అస్పరి మండలం మనుగుందకు చెందిన రైతు మహిళ అంజినమ్మ తమ జీవితాలను కడతేర్చుకున్నారు.

కర్నూలు వ్యవసాయ మార్కెట్‌లో మిరపను కొనేవారే కరువయ్యారు. కనిష్ట ధర రూ.2,550, గరిష్ట ధర రూ.ఐదు వేలు పలికింది. ఈనెల 15న వ్యాపారులు ఎక్కువ భాగం మిరపను రూ.3800 చొప్పునే కొనుగోలు చేశారు. గతేడాది క్వింటాలుకు రూ.10 వేల నుంచి రూ.14వేల దాకా అమ్మారు. గతేడాది ధరను దృష్టిలో పెట్టుకొని.. ఈసారి అప్పుల బారి నుంచి గట్టెక్కుతామనుకున్న మిర్చి రైతు ఆశలన్నీ కుప్పకూలిపోయాయి. అలా ప్రభుత్వం రైతు కంట్లో కారం కొట్టినట్లయింది. బోరు బావులు, పంట కాల్వలు ఇతర నీటి వనరుల కింద ఖరీఫ్‌లో 30 వేలు, రబీలో 15 వేల ఎకరాల్లో సాగు చేశారు. రబీలో 15 వేల ఎకరాల్లో సాగు చేశారు. ఇతర పంటలతో పోలిస్తే మిరప సాగుకు ఖర్చెక్కువ. ఎకరానికి సుమారు లక్ష రూపాయల వరకూ వ్యయమవుతుంది. ఎకరానికి 30 క్వింటాళ్లదాకా దిగుబడొచ్చే అవకాశముంది. దీంతో రైతులు పెట్టుబడులకు వెనుకాడక అప్పులు చేసి సాగు చేశారు. ఈ ఏడాది వర్షాభావానికితోడు నవంబరు, డిసెంబరు నెలల్లో భారీ విద్యుత్తు కోత మూలంగా నీరందక దిగుబడులపై ప్రతికూల ప్రభావాన్ని చూపాయి. దిగుబడి సగానికి పడిపోయింది. దిగుబడి తగ్గినప్పుడు సహజంగా మార్కెట్లో డిమాండు ఉంటుంది. తద్విరుద్ధంగా ధర కూడా పతనమైంది. మిరపకు క్వింటాలు రూ.10 వేలకు పైబడి ధర వస్తేనే గిట్టుబాటవుతుంది. అయితే రూ.ఐదు వేల లోపే ధర పలుకుతోంది. ప్రస్తుతం మార్కెట్టుకు రోజూ ఐదు లారీల దాకా మిరప పంట వస్తోంది. వ్యాపారులు మార్కెట్లో డిమాండ్‌ లేదని తక్కువ ధరకు అడుగుతుండడంతో అప్పుల వారికి ముఖం చూపించలేక రైతులు వచ్చిన ధరకు పంట అమ్ముకుంటున్నారు. ఇప్పటికైనా ప్రభుత్వం మిరప రైతులను ఆదుకునేందుకు..వారికి గిట్టుబాటయ్యే ధర ఇస్తే తప్ప గట్టెక్కని పరిస్థితి.

No comments:

Post a Comment