ప్రజాశక్తి ప్రతినిధి - నల్గొండ Mon, 20 Feb 2012, IST
3 లక్షల ఎకరాల ఆయకట్టుకు నీరందేదెన్నడో ?
చెడిపోయిన టన్నెల్ బోరింగ్ మిషన్
మరమ్మతులకే 6 మాసాలు
2010లోనే పూర్తి కావాల్సింది
2014 దాకా పెరిగిన గడువు
జలయజ్ఞం పనులు పడకేశాయి. ఎక్కడి పనులు అక్కడే ఆగిపోయాయి. ప్రభుత్వం ప్రాధాన్యతా క్రమంలో ప్రాజెక్టులు చేపట్టక పోవడంతో వేల కోట్ల రూపాయలు ఖర్చయ్యాయి.... కానీ..! ఒక్క ఎకరాకూ నీరందలేదు. పెరిగిన ధరల
ప్రకారం చెల్లింపులు చేయకుంటే పనుల్ని ఆపేస్తామని గుత్తేదార్లు మొండికేయడంతో నల్గొండ జిల్లాలో సాగునీటి ప్రాజెక్టుల కథ కంచికి చేరింది. సర్కార్ నిధులివ్వక...గుత్తేదార్లు సకాలంలో పనులు చేయక పోవడంతో జిల్లాలో భారీ ప్రాజెక్టులన్నీ పెండింగ్‌లోనే ఉండిపోయాయి. శ్రీశైలం ఎడమ గట్టు కాల్వ సొరంగ మార్గం (ఎస్‌ఎల్‌బిసి) పనులు ఆగిపోయాయి. కరువు పీడిత రైతుల ఆశలు ఆవిరయ్యాయి. ఈ ప్రాజెక్టు పనులు నిధుల్లేక కొంత... టన్నెల్ బోరింగ్ మిషన్(టిబిఎం) మరమ్మతుల పేర మరికొంత జాప్యం జరగడం, గడువు మీద గడువు పెంచుతూ పోతున్న పరిస్థితి...
శ్రీశైలం ఎడమ గట్టు కాల్వ సొరంగ మార్గం పనుల కోసం 2011-12 బడ్జెట్‌లో రూ.450 కోట్లు కేటాయించగా, 2012-13 బడ్జెట్‌లో రూ.450.18 కోట్లు కేటాయించారు. అంటే గతేడాది కంటే కేవలం రూ.18 లక్షలు మాత్రమే అదనంగా కేటాయించారు. బడ్జెట్‌లో కేటాయింపులు పెరగలేదు కానీ..! నిర్మాణ వ్యయం మాత్రం భారీగా పెరిగింది. నిర్మాణ వ్యయం పెరిగినందున పనులు చేయలేమని చెప్పి జై ప్రకాష్ అసోసియేషన్ సంస్థ గుత్తేదారు గతేడాదిలోనే పనులను ఆపేశాడు. మళ్లీ ఈ ఏడాది కూడా కేటాయింపులు పెంచలేదు. ఎఎంఆర్‌పి ప్రాజెక్టు మొత్తానికి కలిపి గతేడాది కేటాయించిన రూ.450 కోట్లలో సొరంగ మార్గం కోసం రూ.110 కోట్లు మాత్రమే కేటాయించారు. ఇందులో గుత్తేదారుకు చెల్లించాల్సిన పాత బకాయిల కింద రూ.70 కోట్లు, నిర్వాసితులకు నష్టపరిహారంగా మరో రూ.25 కోట్లు చెల్లించారు. అయితే టన్నెల్ బోరింగ్ మిషన్ (టిబిఎం) మెయిన్ బేరింగ్ చెడిపోవడంతో 2011 నవంబర్ నుంచి పనులు ఆపేశారు. టిబిఎం మరమ్మతుల కోసం అమెరికా వెళ్లాల్సి ఉంది. 2010లో వచ్చిన వరదలకు టిబిఎం పూర్తిగా చెడిపోవడంతో రూ.100 కోట్ల రుణం కావాలని గుత్తేదారు సంస్థ ప్రభుత్వాన్ని కోరింది. రుణం ఇచ్చేందుకు ప్రభుత్వం అంగీకరించింది. ప్రస్తుతం మళ్లీ మరమ్మతులు, పాత బాకాయిల కోసం సుమారు వందకోట్ల వరకు అవసరమవుతుందని కాంట్రాక్టు సంస్థ చెబుతోంది. ఈ ప్రాజెక్టు పనుల కోసం ఇప్పటి వరకూ రూ.3039.73 కోట్లు ఖర్చు చేశారు. అయితే నిర్మాణ గడువు వరకు పనులు చేసేందుకే అంచనా వ్యయం పెరిగిందని గుత్తేదారు సంస్థ పనుల్ని చేయడానికి నిరాకరించింది. ఇటీవల మరో 4 ఏళ్ల గడువు పెంచారు. ధరల పెరుగుదల వల్ల నిర్మాణ వ్యయం రూ.350 కోట్ల వరకు పెరిగిందని అధికారులు చెబుతున్నారు. కాంట్రాక్టు సంస్థ మాత్రం మరో రూ.500 కోట్లు అంచనా వ్యయం పెంచితే తప్ప పనులు చేయబోమని గతంలోనే ప్రభుత్వానికి చెప్పింది. ఈ బడ్జెట్‌లో ప్రభుత్వం కేటాయించిన సొమ్మంతా టిబిఎం మరమ్మతులు, నిర్వాసితులకు నష్టపరిహారం చెల్లింపులకే సరిపోతుంది. ఇక ఈ ఏడాది కాలంలో సొరంగం పనులు ఏవిధంగా ముందుకు సాగుతాయో సర్కారే చెపాల్పి ఉంది. కరువు ప్రాంతమైన నల్గొండ జిల్లాలో 3 లక్షల ఎకరాలకు సాగునీరు అందించే లక్ష్యంతో ఈ ప్రాజెక్టును రూ.2813 కోట్ల అంచనాతో 2005లో పనులు ప్రారం భించారు. 2010 నాటికే పనులు పూర్తి కావాల్సి ఉంది. కానీ ఇంతవరకూ పావొంతు కూడా పూర్తికాలేదు. దీంతో 2014 వరకూ ప్రాజెక్టు పనులు పూర్తి చేయాలని మరో సారి గడువు పెంచారు. రూ.1925 కోట్ల అంచ నాతో పనులు దక్కించుకున్న జై ప్రకాశ్ అసోసియేషన్ గుత్తే దారు సంస్థ పనుల్ని వేగవంతంగా చేయకపోవడం కూడా ప్రాజెక్టుకు గ్రహణం పట్టినట్లైంది. శ్రీశైలం డ్యాం నుండి టన్నెల్-1 ఇన్‌లెట్ నుంచి మహబూబ్‌నగర్ జిల్లా
మన్నెవారిపల్లి అవుట్‌లెట్ వరకూ 43.5కి.మీ. సొరంగం తవ్వాల్సి ఉంది. ఈ సొరంగాన్ని తవ్వేందుకు టన్నెల్ బోరింగ్ మిషన్(టిబిఎం)ను అమెరికా నుండి తెప్పించారు. ఇప్పటి వరకూ ఇన్‌లెట్ వద్ద టిబిఎంతో 2.20కి.మీ. వరకూ లైనింగ్‌తో సహా సొరంగాన్ని తవ్వారు. అవుట్‌లెట్ వద్ద టిబిఎంతో 10.58 కి.మీ మాత్రమే తొలిచారు. 7.25 వరకు టన్నెల్-2 పనుల్ని బ్లాస్టింగ్ పద్ధతిలో తొలిచారు. ఈ సొరంగం తొలిచే వరకూ బాగానే ఉన్నా లైనింగ్ పనులు ఆగిపోయాయి.
టిబిఎం మరమ్మతులు
సొరంగాన్ని తొలిచేందుకు జపాన్ టెక్నాలజీతో భారీ టన్నెల్ బోరింగ్ మిషన్ (టిబిఎం) తెప్పించారు. దానికి తరచూ మరమ్మతులు చేయాల్సి వస్తోంది. 2011చివరిలో టిబిఎం మెయిన్ బేరింగ్ చెడిపోయింది. పనులు ఆగిపోయాయి. టిబిఎం మరమ్మతులతో ఆరు మాసాల పాటు పనులు ఆగిపోనున్నాయి. రెండేళ్ల క్రితం కూడా కృష్ణా నది ఉప్పొంగి ప్రవహించడంతో సొరంగంలో వరద నీరు చేరింది. దీంతో సొరంగంలో ఉన్న టిబిఎం పూర్తిగా నీటిలో మునిగి పోయింది. దీంతో మరమ్మతులు చేసేందుకు రూ.100 కోట్లు కేటాయించారు. నిధులు కేటాయించడం... మరమ్మతులు చేయడం కోసం 8 నెలల సమయం పట్టింది. రోజుకు 23 మీటర్ల సొరంగాన్ని తొలిచేందుకు అవకాశం ఉన్నా 12-15 మీటర్లే తొలుస్తోంది. నెలకు కిలో మీటరు చొప్పున తొలిచినా మరో మూడేళ్లైనా సొరంగం తవ్వకం పూర్తయ్యే పరిస్థితులు కనిపించడం లేదు.
మొదలు కాని డిండి బ్యాలెన్సింగ్ రిజర్వాయర్
డిండి బ్యాలెన్సింగ్ రిజర్వాయర్ పనులు నిర్వహించే విషయంలో ప్రభుత్వం నిర్లక్ష్యంగా వ్యవహరిస్తోంది. 7.64 టిఎంసిల నీటి నిల్వ కోసం రూ.157.57 కోట్ల వ్యయంతో చేపట్టిన పనులు ఇప్పటికీ మొదలు కాలేదు. పనులు దక్కించుకున్న జివిఆర్, జివివి, విఎస్‌ఎం, జెవి జాయింట్ వెంచర్ గుత్తేదారు సంస్థకు పనులు అప్పగించి చేతులు దులుపుకున్నారు. మొబలైజేషన్ అడ్వాన్స్ కింద రూ.1.58 కోట్లు చెల్లించారు. 2009 ఫిబ్రవరిలో ఒప్పందం కుదుర్చుకున్నారు. 36 నెలల్లోనే ఈ పనులు పూర్తి చేయాల్సి ఉండగా ఇప్పటి వరకూ ప్రారంభించ లేదు. జలాశయం నిర్మాణ డిజైన్ తయారీలో తీవ్ర జాప్యం చేశారు.
సర్వే దశలోనే డిండి ఎత్తిపోతల పథకం
ఎస్‌ఎల్‌బిసి సొరంగం -1 బయట ముఖ ద్వారం దగ్గరున్న డిండి జలాశయం నుండి ప్రస్తుతం అమల్లో ఉన్న డిండి జలాశయం ఎత్తిపోతల ద్వారా 3 లక్షల ఎకరాలకు సాగునీరు అందించేందుకు ఈ పథకాన్ని ప్రతిపాదించారు. ఈ ప్రతిపాదన సర్వే దశలోనే ఉంది.
భూసేకరణ అంతంతే
ఈ ప్రాజెక్టు నిర్మాణం కోసం 32వేల 661 ఎకరాల భూమిని సేకరించాలని గుర్తించారు. ఇప్పటి వరకు 27వేల 635 ఎకరాల భూ సేకరణ కోసం స్పెషల్ డిప్యూటీ కలెక్టర్‌కు పంపారు. దీనిలో 292.25 ఎకరాల భూ సేకరణ పూర్తి చేశారు. 2011 నవంబర్ వరకు నిర్వాసితులకు రూ.292.25 కోట్లు చెల్లించారు. ఇందులో ప్రభుత్వ భూములే ఎక్కువగా ఉన్నాయి. వీటిని గిరిజనులు, పేదలు ఏళ్ల తరబడి సాగు చేసుకుంటున్నారు. వీరికి నష్టపరిహారం చెల్లించే విషయంలో కూడా నిర్లక్ష్యం చేస్తున్నారు.
No comments:
Post a Comment