అంతర్జాలంలోని అన్నిరకాల ముఖ్యమైన సమాచారాన్ని ఈ సైట్ లో నిక్షిప్తం చేసి, అందరికీ ఉపయోగపడే ఒక వేదికగా ఈ సైట్ ఉండాలనే ఉద్దేశ్యంతో ప్రారంభించడమైంది. ఏ సైట్ నుండి సమాచారం తీసుకున్నా వారి పేరుతోనే ఇందులో వుంచుతాను. సహృదయంతో సహకరించగలరు.
ఎవరికైనా అభ్యంతరముంటే వారి సైటుకు సంబంధించిన సమాచారం తొలగించడం జరుగుతుంది. - ధన్యవాదములతో...

Sunday, February 26, 2012

సాగునీటికి చెల్లుచీటీ!


ప్రజాశక్తి - హైదరాబాద్ బ్యూరో   Sat, 25 Feb 2012, IST

కేంద్ర ముసాయిదాలో కనపడని ప్రాధాన్యత
రానున్న రోజుల్లో వ్యవసాయం మరింత నిర్లక్ష్యం కానుందా? పారిశ్రామిక వేత్తలతో పోటీపడి రైతులు సాగుకోసం నీటిని కొనుగోలు చేయాల్సి వస్తుందా? అత్యంత కీలక రంగమైన వ్యవసాయానికి సాగునీటిని సరఫరా చేసే బాధ్యత నుండి ప్రభుత్వాలు తప్పుకో నున్నాయా? కేంద్ర ప్రభుత్వం తాజాగా ప్రకటించిన 'జాతీయ జల విధాన ముసాయిదా-2012'
చూస్తే ఈ అనుమానాలే కలుగుతున్నాయి. 'నీటివనరులను ఇక ఆర్థిక సరుకు(ఎకనామిక్ గుడ్)గా చూడాలి' అని స్పష్టంగా పేర్కొన్న ముసాయిదా సాగునీటి విషయంలో మౌనం వహించింది. సాధారణంగా నీటిసరఫరా ప్రాధాన్యతల్లో తాగునీటి తరువాత స్థానం వ్యవసాయానికి దక్కే విషయం తెలిసిందే! దశాబ్దం క్రితం కేంద్ర ప్రభుత్వం ప్రకటించిన నీటి విధానంలో ఇదే క్రమంలో ప్రాధాన్యతలను పేర్కొన్నారు. అంతకుముందూ ఇదే పద్ధతి పాటించారు. తాజాగా ప్రకటించిన ముసాయిదాలో ఈ ప్రాధాన్యతలు అదృశ్యమయ్యాయి. వాటికి బదులుగా నీటివినియోగాన్ని సేవారంగానికి ఎలా బదిలీ చేయాలి అన్న అంశానికి ప్రాధాన్యత లభించింది. దీంతో ఈ విషయం చర్చనీ యాంశంగా మారింది. ప్రపంచబ్యాంకు ఆదేశాల అమలు బాటన నడిచిన తాజా జల ముసాయిదాలో పబ్లిక్, ప్రయివేటు భాగస్వామ్యం(పిపిపి)కి పెద్దపీట వేయనున్నట్లు పేర్కొన్నారు.

నీరు సామాజిక వనరు కాదా...?
నీటిని ఇప్పటిదాకా సామాజిక వనరుగా భావిస్తున్న సంగతి తెలిసిందే. గతంలో రూపొందించిన నీటి విధానాల్లోనూ కేంద్ర ప్రభుత్వం ఇదే వైఖరిని అవలంబించింది. ప్రపంచబ్యాంకు కనుసన్నల్లో రూపొందించిన తాజా విధానంలో మాత్రం దానికి భిన్నమైన వైఖరి తీసుకుంది. 'ప్రజావసరాల కోసం ప్రభుత్వం నీటిని సామాజిక వనరుగానే భావిస్తోంది. అయితే, దీనిని 'ఆర్థిక సరుకుగా చూడాలి' అని పేర్కొంది. 'ఆర్థిక సరుకుగా చూడాలి' అన్న పదాన్ని అండర్లైన్ చేసి మరీ ముసాయిదాలో పేర్కొన్న కేంద్ర ప్రభుత్వం, ఆ తరువాత ముసాయిదానంతా అదే బాటన నడిపించింది. ప్రతి నీటిబొట్టుకూ విలువ కట్టాలని, నీటిని సరఫరా చేసే ప్రతిచోటా మీటర్లు ఏర్పాటుచేసి లెక్కలు తీయాలని పేర్కొంది. నీటి సరఫరాకయ్యే ఖర్చునూ వినియోగదారుల నుండి కచ్చితంగా రాబట్టాలని దిశా నిర్దేశం చేసింది. నీటి సరఫరా రంగం నుండి రాష్ట్ర ప్రభుత్వాలు తప్పుకోవాలని కూడా ముసాయిదాలో పేర్కొన్నారు. సేవలందించే సంస్థలుగా రాష్ట్ర ప్రభుత్వాలు ఇక కొనసాగడం సాధ్యంకాదన్న అభిప్రాయాన్ని వ్యక్తంచేసిన ముసాయిదా, భవిష్యత్తులో సౌకర్యాల కల్పన(ఫెసిలిటేటర్)కే పరిమితం కావాలని సూచించారు. నీటి సరఫరా రంగాలను ప్రయివేటు లేదా పౌర సంస్థలకు అప్పగించాలని పేర్కొంది. సాగునీటి రంగం విషయంలోనూ ఇదే రకమైన అభిప్రాయాన్ని వ్యక్తం చేసింది. అన్ని నీటిపారుదల ప్రాంతాల్లోనూ సాగునీటి సంఘాలను ఏర్పాటుచేయాలని, నీటి సరఫరా నిర్వహణ బాధ్యతలను వాటికే అప్పగించాలని పేర్కొంది. నీటి సరఫరా, నిర్వహణకు అవసరమయ్యే పూర్తి మొత్తాన్ని వసూలు చేసే బాధ్యత ఆ సంఘాలకే అప్పగించాలని సూచించింది. ఈ విషయంలో రాష్ట్ర ప్రభుత్వాలు జోక్యం చేసుకోవడం పూర్తిగా మానుకోవాలని ముసాయిదాలో స్పష్టం చేసిన కేంద్ర ప్రభుత్వం, పైకి మాత్రం దీనిని అమలుచేయడంపై రాష్ట్ర ప్రభుత్వాలను ఒత్తిడి చేయడంలేదని చెబుతోంది. 'ఈ విధానాన్ని అమలుచేస్తారా, లేదా అన్నది రాష్ట్ర ప్రభుత్వాల ఇష్టం' అని కేంద్ర ప్రభుత్వ జలవనరుల శాఖ విభాగానికి చెందిన ఒక ఉన్నతాధికారి చెప్పారు. ముసాయిదాను చర్చకు మాత్రమే పెట్టారని, భవిష్యత్తులో దీనిలో మార్పులు జరిగే అవకాశాలు లేకపోలేదని ఆయన అన్నారు.

పారిశ్రామిక రంగాల హర్షం
కేంద్ర ప్రభుత్వం ప్రకటించిన తాజా జల విధాన ముసాయిదాపై పారిశ్రామిక రంగాల నుండి హర్షం వ్యక్తమవుతుండడం విశేషం. ఫెడరేషన్ ఆఫ్ ఇండియన్ ఛాంబర్ ఆఫ్ కామర్స్(ఫిక్కి) నూతన విధానాన్ని స్వాగతించింది. 'ధర నిర్ణయించాలని భావించడం నీటి దుర్వినియోగాన్ని అరికడుతుంది. అన్ని రంగాల్లోనూ నీటి దుర్వినియోగాన్ని అరికట్టడంతోపాటు, మంచినీటిపై ఆధారపడడాన్ని తగ్గించేలా ఉంది' అని ఫిక్కి ఢిల్లీలో విడుదల చేసిన ప్రకటనలో పేర్కొంది.

No comments:

Post a Comment