ఇష్టానుసారం జోన్ల మార్పిడి
ప్రజోపయోగ ప్రాంతాలు నివాస ప్రాంతాలుగా మార్పు
అమాత్యుడి ఒత్తిడికి తలొగ్గిన అధికారులు
మాస్టర్‌ప్లాన్ ముసుగులో 'రియల్' దందా
పర్యావరణం, సామాజిక అవసరాలకు నష్టమంటున్న నిపుణులు
ఈనాడు - హైదరాబాద్
* ఈ సర్వేనంబరులో తమకున్న 42 ఎకరాల్ని నివాస ప్రాంతంగా మార్చాలంటూ ఇద్దరు వ్యక్తులు దరఖాస్తు చేశారు. అదే సమయంలో ఓ మంత్రినీ ఆశ్రయించారు. సదరు అమాత్యుడి నుంచి అధికారులకు సిఫారసులు అందాయి. అంతే.. 153, 156, 157 సర్వేనంబర్లను నివాస ప్రాంతంగా మార్చేశారు. 42 ఎకరాల్లో అత్యధిక భాగం ఈ మూడు సర్వేనంబర్లలో ఉంది.
* తుమ్మలూరుకు పక్కనే ఉన్న సిరిగిరిపురం (స.నం.77,79)లో ఆ ఇద్దరికి సుమారు నాలుగున్నర ఎకరాల భూమి ఉంది. దీన్ని తొలుత ప్రజా ఉపయోగ ప్రాంతం (సామాజిక అవసరాలు)గా గుర్తించారు.
* బృహత్ ప్రణాళిక ప్రకారం ఈ భూమిలో పాఠశాలలు, ప్రభుత్వ కార్యాలయాలు వంటి భవనాల నిర్మాణానికే అనుమతి. నివాస భవనాలకు అనుమతించరు.
* తమ భూమిని ఆ జోన్ నుంచి మార్చాలని వారు మంత్రిని ఆశ్రయించారు. అమాత్యుడి ఒత్తిళ్లతో అధికారులు సర్వేనం. 77ను నివాస ప్రాంతంగా మార్చేశారు.
* ఏకంగా ఒకటో రకం నివాస ప్రాంతం(ఆర్-1)గా మార్చడం గమనార్హం. ఆర్-1 జోన్‌లో.. ఎన్ని అంతస్తుల భవనాలైనా కట్టుకోవచ్చు.
* సర్వే నం. 79ని పెరిఅర్బన్ జోన్ (25 శాతం భూమిలో నివాస, వాణిజ్య భవనాలు కట్టుకోవచ్చు)గా మార్చారు.
* మరికొంత మందికి చెందిన భూముల విషయంలోనూ మంత్రి ఒత్తిళ్లు పనిచేసినట్లు సమాచారం. తుమ్మలూరు సర్వేనం. 247లోని ముగ్గురు వ్యక్తుల భూమిని నివాస ప్రాంతంగా మార్చాలంటూ మంత్రి అధికారులకు సిఫారసు చేశారు. ఇటీవల విడుదలైన ప్రణాళికలో ఆ సర్వేనంబరును నివాస ప్రాంతంగా గుర్తించడం గమనార్హం.
అడ్డగోలుగా భూవినియోగమార్పిడితో నివాసప్రాంతంగా మార్చడం వల్ల ఒకే చోట ఎక్కువ నిర్మాణాలతో పర్యావరణ సమస్యలు వస్తాయని నిపుణులు ఆందోళన వ్యక్తంచేస్తున్నారు. మరోవైపు ప్రజా ఉపయోగ ప్రాంతంగా గుర్తించిన ప్రాంతాల్ని నివాస ప్రాంతంగా మార్చడం వల్ల సామాజిక పరమైన అవసరాలకు ఇబ్బందులు వస్తాయంటున్నారు. ''చుట్టుపక్కల జనావాసాల దృష్టిలో పెట్టుకుని.. వారి విద్య, వైద్య, ఇతర అవసరాలకు ఉపయోగపడాల్సిన భూములను నివాస ప్రాంతంగా మారిస్తే.. భవిష్యత్తులో పాఠశాలలు, ఆసుపత్రుల వంటి భవనాల నిర్మాణానికి భూములు ఎక్కడ దొరుకుతాయి? సమీప ప్రజల సామాజిక అవసరాలు ఎలా తీరతాయి?'' అని ఓ నిపుణుడు ఆందోళన వ్యక్తం చేశారు.
ఇళ్ల మీదుగా రహదారులు
నాలుగ్గోడల మధ్య ముస్తాబు చేసిన ప్రణాళికలో.. కొన్ని చోట్ల ఉన్న రహదారులను విస్తరించకుండా వదిలేసి, వాటికి దగ్గర్లో కొత్తవి ప్రతిపాదించారు.. మరికొన్ని గ్రామాల్లో ఇళ్ల మీదుగానే భారీ రహదారుల్ని ప్రతిపాదించారు. విజయవాడ జాతీయ రహదారి నుంచి వరంగల్ రహదారి మధ్య ఉన్న పెద్దగూడెం, పల్లెగూడెం, ఏదులాబాద్ వంటి గ్రామాల్ని కలుపుతూ 100 అడుగుల రహదారులను ప్రతిపాదించారు. ఇది కార్యరూపం దాలిస్తే తమ గ్రామాల్లో పెద్ద సంఖ్యలో ఇళ్లు పోతాయంటూ అభ్యంతరాలు వ్యక్తం చేసినా.. ప్రజాప్రయోజనాన్ని పట్టించుకోకుండా యథాతధంగా తుదిప్రణాళికను విడుదల చేయడం గమనార్హం.
No comments:
Post a Comment