అంతర్జాలంలోని అన్నిరకాల ముఖ్యమైన సమాచారాన్ని ఈ సైట్ లో నిక్షిప్తం చేసి, అందరికీ ఉపయోగపడే ఒక వేదికగా ఈ సైట్ ఉండాలనే ఉద్దేశ్యంతో ప్రారంభించడమైంది. ఏ సైట్ నుండి సమాచారం తీసుకున్నా వారి పేరుతోనే ఇందులో వుంచుతాను. సహృదయంతో సహకరించగలరు.
ఎవరికైనా అభ్యంతరముంటే వారి సైటుకు సంబంధించిన సమాచారం తొలగించడం జరుగుతుంది. - ధన్యవాదములతో...

Friday, March 1, 2013

నగర జీవికి నిరాశే

ఆశలపై నీళ్లు...
కేంద్ర బడ్జెట్ మాయాజాలం
వేతనజీవుల ఆశ అడియాశే
వీకెండ్ జోష్‌కు కళ్లెం
బ్రాండెడ్ వస్తువులతో విలాసాలు ‘ఖరీదు’
లగ్జరీకి మధ్యతరగతి దూరం..దూరం

సాక్షి, సిటీబ్యూరో: అర్థం కాని అంకెలు.. గణాంకాల గారడి.. జనానికి బురిడీ.. అంతా చిదంబర రహస్యం. వేతన జీవుల, మధ్య తరగతి వాసుల ఆశలపై కేంద్ర బడ్జెట్ నీళ్లు చల్లింది. సిమెంటు, స్టీలు ధరలు పెరగడంతో సగటు జీవులకు సొంతింటి కల కల్లగానే మిగలనుంది. గృహ రుణాలపై ఒక శాతం వడ్డీ రాయితీ ఒకింత ఊరట. నగరంలో
అత్యధిక వినియోగం ఉండే సెల్‌ఫోన్లు, బ్రాండెడ్ దుస్తులపైనా పన్ను భారం మరింత పెంచడంతో యువత పెదవి విరుస్తోంది. లగ్జరీ కార్లు, విదేశీబైక్‌లపై అదనపు బాదుడు విలాసాలకు దూరం చేయనున్నాయి. పిల్లాపాపలతో కలిసి ఏసీ రెస్టారెంట్‌లో సుష్టుగా భోజనం చేయాలనుకునే వారి ఇంటి బడ్జెట్ ఇక తలకిందులు కానుంది.

రెస్టారెంట్లపై సేవాపన్ను వడ్డింపుతో నగరంలో పర్యాటక రంగానికి దెబ్బే. విదేశాల నుంచి దిగుమతి చేసుకునే సెట్‌టాప్ బాక్స్‌లపై అదనపు బాదుడుతో బుల్లితెర వినోదానికి గడ్డుకాలం రానుంది. నగరం చుట్టూ ఉన్న చిన్న, మధ్యతరహా పరిశ్రమలకు ప్రత్యేకించి ప్రోత్సాహమంటూ లేకపోవడం ఔత్సాహిక పారిశ్రామికవేత్తల్ని నిరుత్సాహపరిచింది. పాదరక్షలు, తోలు వస్తువులు, చేనేత, నూలు, కాటన్ వస్త్రాలపై పన్నుపోటు తగ్గించడం కాస్త ఊరట. కొత్తగా వచ్చే 800 బస్సులతో ప్రజా రవాణా కాస్త మెరుగుపడనుంది. నగరజీవిని ప్రధానంగా ప్రభావితం చేయనున్న ఆయా రంగాలపై కేంద్ర బడ్జెట్ ఎఫెక్ట్‌పై ‘సాక్షి’ ప్రత్యేక కథనం..

‘వెత’ మిగిలింది!
గ్రేటర్‌లోని దాదాపు 25 లక్షల మంది వేతనజీవులు ఆదాయ పన్ను పరిమితిని పెంపుపై ఆశలు పెట్టుకున్నారు. ఏటా రూ.2 లక్షల లోపు ఆదాయం ఉన్న వారికి గతేడాది లాగానే పన్ను మినహాయింపునిచ్చారు. రూ.2 లక్షల నుంచి రూ.5 లక్షలలోపు ఆదాయం గల వారికి రూ.2 వేల ట్యాక్స్‌క్రెడిట్ మాత్రమే దక్కనుంది. ఆపై వార్షికాదాయం గలవారికి నిరాశనే మిగిల్చింది.

ప్రజా రవాణా రయ్..రయ్
జేఎన్‌ఎన్‌యూఆర్‌ఎం పథకం కింద నగరానికి 800 బస్సులు రానున్నాయి. శివారు కాలనీలకు బస్సు సౌకర్యం మెరుగుపడనుంది. ప్రస్తుతం ఆర్టీసీగ్రేటర్ జోన్ పరిధిలో 3800 బస్సుల్లో 34 లక్షల మంది ప్రయాణికులు నిత్యం రాకపోకలు సాగిస్తున్నారు. అదనపు బస్సులతో లబ్ధి చేకూరినట్టే.

భోజనానికి వెళ్తే బేజారే
నగరంలో వీకెండ్ సంస్కృతి ఎక్కువ. వారాంతంలో కుటుంబంతో కలిసి రెస్టారెంట్‌కు వెళ్లి భోజనం చేసే వారు ఇక ఆలోచించాల్సిందే. ఏసీ రెస్టారెంట్లపై సేవా పన్ను వడ్డింపుతో గుండె గు‘బిల్లు’మననుంది. నలుగురు కుటుంబసభ్యులు కలిసి రెస్టారెంట్‌లో భోజనం చేసి రూ.వెయ్యి బిల్లు చేస్తే చెల్లించాల్సిన సేవా పన్ను రూ.240. దీంతో ఇంటి బడ్జెట్ తారుమారవడం ఖాయం.


ఇక వి‘నో’దమే..
మహానగరంలో ప్రస్తుతం 5 లక్షల ఇళ్లకు సెట్‌టాప్ బాక్సులున్నాయి. ఇటీవల కేబుల్ ఆపరేటర్లు వీటిని అమర్చుకోవాలని వినియోగదారులపై ఒత్తిడి పెంచుతున్నారు. బడ్జెట్‌లో సెట్‌టాప్ బాక్స్‌లపై దిగుమతి సుంకాన్ని 5 నుంచి 10 శాతానికి పెంచేయడంతో వినోదమూ ఖరీదు కానుంది. అపరిమిత ఛానళ్లను వీక్షించాలనుకునే వారికి నిరాశే. ప్రస్తుతం నగరంలో సెట్‌టాప్ బాక్స్ ధర రూ.1300. తాజాగా రూ.1500కు చేరుకోనుంది.

గృహ రుణంపై రాయితీతో ఊరట

అల్పాదాయ మధ్యాదాయ వర్గాల వారికి కాస్త ఉపశమనం.. గృహ రుణాలపై వడ్డీ రాయితీ పది నుంచి 9 శాతానికి తగ్గడం గుడ్డిలో మెల్ల. వేతన జీవులకు ఒక్క శాతం వడ్డీరాయితీ లభించడం ఒకింత ఊరట. తాజా బడ్జెట్ నేపథ్యంలో జాతీయ బ్యాంకుల వద్ద రుణాల కోసం బారులు తీరే వారి సంఖ్య అమాంతం పెరగనుంది.

సొంతిల్లు కల్ల
గ్రేటర్‌లో ఆస్తిపన్ను చెల్లించే జాబితాలో సుమారు 20 లక్షల గృహాలున్నాయి. మొత్తం జనాభాలో 20 శాతం మందికే సొంతిళ్లున్నాయి. తాజా బడ్జెట్‌లో సిమెంటు,స్టీలుపై పన్ను వడ్డింపులతో వీటి ధరలు చుక్కలను తాకనున్నాయి. ధరాభారంతో మధ్యతరగతికి సొంతింటి కల నెరవేరేలా కనిపించడంలేదు. ప్రస్తుతం సిమెంటు బస్తా ధర రూ.300. బడ్జెట్ తరవాత ఇది రూ.400కు చేరుకోనుంది. ఇక టన్ను స్టీలు ప్రస్తుతం రూ.30 నుంచి రూ.40 వేల వరకు ఉంది. ఇది రూ.55 వేలకు చేరొచ్చని నిర్మాణరంగ నిపుణులు అభిప్రాయపడుతున్నారు.

‘సెల్’చల్ ఇక కుదరదు
గ్రేటర్‌లో సుమారు 28.50 లక్షల సెల్‌ఫోన్ కనెక్షన్లున్నాయి. తాజాగా ఐ-ఫోన్, ట్యాబ్లెట్, ఆండ్రాయిడ్, స్మార్ట్ ఫోన్లు కొనాలనుకునే వారికి కళ్లెం పడినట్టే. రూ.2 వేలకు మించి ధర పలికే ఫోన్లపై ఎక్సైజ్ పన్ను 6 శాతం మేర పెంచడంతో స్మార్ట్‌ఫోన్ల ధరలు చుక్కలను తాకనున్నాయి. ఒక్కో ఫోనుపై సుమారు రూ.3 నుంచి రూ.5 వేల వరకు ధర పెరగొచ్చని అంచనా.

No comments:

Post a Comment