అంతర్జాలంలోని అన్నిరకాల ముఖ్యమైన సమాచారాన్ని ఈ సైట్ లో నిక్షిప్తం చేసి, అందరికీ ఉపయోగపడే ఒక వేదికగా ఈ సైట్ ఉండాలనే ఉద్దేశ్యంతో ప్రారంభించడమైంది. ఏ సైట్ నుండి సమాచారం తీసుకున్నా వారి పేరుతోనే ఇందులో వుంచుతాను. సహృదయంతో సహకరించగలరు.
ఎవరికైనా అభ్యంతరముంటే వారి సైటుకు సంబంధించిన సమాచారం తొలగించడం జరుగుతుంది. - ధన్యవాదములతో...

Thursday, March 28, 2013

బ్యాడ్‌ ఏప్రిల్‌

  • సగటు మనిషిపై భారాల సమ్మెట దెబ్బ
  • కొత్త ఆర్థిక సంవత్సర ఆగమన వేళ డీలా!
ఏప్రిల్‌ ఒకటి.. కొత్త ఆర్థిక సంవత్సర ప్రారంభ దినం.. ఎవరైనా కొత్త ఆర్థిక సంవత్సరంలో తన ఇంటి బడ్జెట్‌.. వస్తున్న ఆదాయానికి అనుగుణంగా ఉండాలని, ఉన్నంతలో కాస్త మిగుల్చుకోవాలని ఆశిస్తాడు. రానున్న ఏప్రిల్‌ ఒకటో తేదీ
మాత్రం ఈ భరోసాను సామాన్యుడికి కల్పించడం లేదు. సరికదా.. సగటు మనిషి కడుపుపై భరించలేని సమ్మెట దెబ్బ పడుతున్న రోజుగా నిలిచిపోనుంది. నిత్యజీవితంలో ఎంతో ముఖ్యమైన విద్యుత్‌, సూపర్‌ ఫాస్ట్‌ రైలు, తత్కాల్‌, రిజర్వేషన్‌ రద్దు ఛార్జీలు, వాహన బీమా ప్రీమియం, భూముల ప్రభుత్వ విలువలు ఏప్రిల్‌ ఒకటో తేదీ నుంచి భారీగా పెరగబోతున్నాయి. అంతేకాదు.. ఎరువుల సబ్సిడీలో కోత విధింపుకూ కేంద్ర ప్రభుత్వం పూనుకుంది. ఒకేసారి ఇన్ని భారాలను సామాన్య, మధ్యతరగతి ప్రజలు ఏప్రిల్‌ నుంచే మోయబోతున్నారు.

ఏప్రిల్‌ నుంచి కొత్త విద్యుత్‌ టారిఫ్‌ అమల్లోకి రాబోతోంది. అన్ని కేటగిరీలపైనా రూ. 12,723 కోట్ల భారాన్ని తలకెత్తుకోబోతున్నాం. పైగా మార్చికన్నా ఏప్రిల్‌లో దాదాపు రెట్టింపు సర్‌ఛార్జీ కూడా కట్టబోతున్నాం. ప్రస్తుతం రాష్ట్రంలో నెలకొన్న విద్యుత్‌ సంక్షోభంపై పెద్దఎత్తున ఉద్యమాలు కొనసాగుతున్నాయి. ఈ పరిస్థితుల్లో ప్రభుత్వం గృహ వినియోగ విద్యుత్‌ ఛార్జీలను కొంత తగ్గించే అవకాశముందని వినవస్తున్నా.. ముఖ్యమంత్రి శాసనసభలో మాట్లాడిన తీరు పరిశీలిస్తే.. ఆ ఆశ కూడా నిరాశగా మారే పరిస్థితి నెలకొంది.
ఇకపై వాహన యజమానులకు వాహన బీమా ప్రీమియం చుక్కలు చూపించనుంది. థర్డ్‌ పార్టీ రేట్లను 20 శాతం వరకూ పెంచుకోవడానికి ఐఆర్‌డిఏ అనుమతించడంతో వాహన బీమా ప్రీమియాలు పెరగనున్నాయి. ఐఆర్‌డిఏ నోటిఫికేషన్‌ ప్రకారం టాక్సీల థర్డ్‌ పార్టీ ప్రీమియం(వెయ్యి సిసి సామర్థ్యం వరకూ) రూ. 941కి చేరుతుంది. టూవీలర్స్‌కు(350సిసి మించనివి) ప్రీమియం రూ. 804కు పెరుగుతుంది. 40 వేల కిలోల సామర్థ్యాన్ని మించిన సరకు రవాణా వాహనాల వార్షిక ప్రీమియం ఇక రూ. 15,035 అవుతుంది. దీనికి నిరసనగా అదే తేదీ నుంచి ట్రాన్స్‌పోర్టు సమ్మె ప్రారంభం కానుంది. అదే జరిగితే రోజుకు రూ. 2,200 కోట్ల నష్టం ఖాయం. ఈ భారమంతా మళ్లీ సామాన్యుడి నెత్తిన పడక తప్పదు. ఏప్రిల్‌ ఒకటో తేదీ నుంచే సూపర్‌ఫాస్ట్‌ ఛార్జీలు రెండో తరగతి, స్లీపర్‌ తరగతిపై రూ. 10 చొప్పున, అన్ని తరగతులపై ఏసి రూ. 15 నుంచి రూ. 25 మేరకు పెరగనున్నాయి. తత్కాల్‌ ఛార్జీ, సెకండ్‌ క్లాస్‌ మూలధరపై 10 శాతం, ఏసి తరగతుల మూల టిక్కెట్ల ధరపై 30 శాతం పెరగనున్నాయి. రిజర్వేషన్‌ రద్దు ఛార్జీలు కూడా రూ. 10 నుంచి రూ. 50 దాకా పెరగనున్నాయి.
ఎరువుల సబ్సిడీలో కోత కూడా ఇదే నెలలో కేంద్రం విధించబోతోంది. డై అమోనియం పాస్పేట్‌(డిఏపి)పై (ఇప్పుడున్న సబ్సిడీ రూ.14,350లో) టన్నుకు రూ. 2 వేలు, మ్యూరియేట్‌ ఆఫ్‌ పొటాష్‌(ఎంఓపి)పై (ఇప్పుడున్న సబ్సిడీ రూ.14,400లో) టన్నుకు రూ. 2,700 సబ్సిడీ తగ్గించాలని నిర్ణయించనున్నారు. రాష్ట్రంలో భూములకు సర్కారీ విలువలు సుమారు 50 నుంచి 400 శాతం వరకూ ఏప్రిల్‌ ఒకటి నుంచే పెరగబోతున్నాయి. విలువల ప్రతిపాదనలను ప్రజల ముందు పెట్టి వారి అభ్యంతరాలను స్వీకరించిన తరువాతే ప్రభుత్వం నిర్ణయం తీసుకోవాల్సి ఉన్నా... క్షేత్రస్థాయిలో పరిశీలన చేయకుండానే ఆయా ప్రాంతాల్లో సబ్‌ రిజిస్ట్రేషన్‌ అధికారులు, డాక్యుమెంట్‌ రైటర్ల సూచనలు పరిగణనలోకి తీసుకుని విలువలను నిర్ధారించినట్లు తెలుస్తోంది. దీనివల్ల బహిరంగ విలువలకన్నా హెచ్చుగా వేసే అవకాశమూ లేకపోలేదు. ఇదే జరిగితే సామాన్యుడు సెంటు భూమి కొనుగోలు చేయడం దుర్లభం.

No comments:

Post a Comment